(Published by 'SURYA' telugu daily in its edit page on 01-02-2015,Sunday)
హైదరాబాదులో నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ వొడ్డున వున్న సచివాలయాన్ని ఎర్రగడ్డ ప్రాంతంలోని చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణానికి తరలించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరి కార్యాలయాలు, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ విభాగాల ప్రధానాధికారుల కార్యాలయాలు మొత్తం అన్నింటినీ ఒకే చోట నిర్మిస్తే, ప్రజలకు అనేక వ్యయ ప్రయాసలు తగ్గిపోతాయన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్న గురువారం సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్టు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయం గురించి ఇప్పటికే మీడియాలో కధనాలు వస్తున్నందువల్ల ఇదేమంత సంచలన నిర్ణయం కాదు. అలాగే అందుకు చూపిన కారణాన్ని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయన వెల్లడించిన మరో ప్రధాన కారణం మాత్రం సంచలనాత్మకమైనదే. సందేహం లేదు.
నిజాం కాలంలో నిర్మితమయిన ప్రస్తుత సచివాలయం వాస్తు రీత్యా అనుకూలం అయినది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయం. నిజానికి ఇది ఒక కారణం అయినా అధికార పదవుల్లో వున్నవాళ్ళు తమ వ్యక్తిగత నమ్మకాలను బహిరంగంగా వొప్పుకోరు, ఇలాటి వాటిని గురించి బయటకు చెప్పుకోరు. కానీ కేసీఆర్ వ్యవహార శైలే వేరు. భయంకరమైన వాస్తు దోషం వున్నందువల్ల ప్రస్తుత సచివాలయాన్ని అక్కడినుంచి మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఎలాటి భేషజాలకు పోకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సచివాలయం తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న విపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి వాస్తు నమ్మకాలు మరింత పదును పెట్టాయి. దీనితో అసలు విషయం వెనక్కిపోయి 'నాయకులూ, నమ్మకాలూ' అనే కొత్త చర్చ మొదలయింది.
ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ గురించి ఒక మాట చెబుతారు. చేయి చాపుకునే హక్కు ఎవరికయినా వుంటుంది. కానీ ఆ చాపిన చేయి పక్కవాడి ముక్కుకు తాకనంతవరకే ఆ స్వేచ్ఛ. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది పక్కవారికి ఇబ్బంది కలిగించకూడదనేది ఇందులోని అంతరార్ధం. దీన్నే కాస్త అటూ ఇటూ మార్చి, వాస్తు, జ్యోతిష్యం వంటి కొన్ని వ్యక్తిగత విశ్వాసాలకు కూడా అన్వయింపచేయొచ్చు. ప్రజాజీవితంలో వున్నంత మాత్రాన వ్యక్తిగత విశ్వాసాలకు నీళ్ళు వొదులుకోవాల్సిన అవసరం లేకపోయినా వాటికోసం ప్రభుత్వ ఖజానాలోని ప్రజా ధనాన్ని ఖర్చుచేయడం సమంజసం అనిపించుకోదు. వాస్తు అనేది వ్యక్తిగతం. మీకున్న నమ్మకాలనుబట్టి, మీ సొంత వనరులతో ఏం చేసుకున్నా ఎవ్వరు అభ్యంతర పెట్టాల్సిన అవసరం వుండదు. కానీ వాటికోసం ప్రభుత్వ నిధులను వెచ్చించాలని చూసినప్పుడే విమర్శలు ఎదురవుతాయి. వీటికి జవాబు చెప్పడం కొన్ని సందర్భాలలో తలకు మించిన పని అవుతుంది.
రాజకీయ నాయకులు అనేకమందికి ఇటువంటి నమ్మకాలు వుండడం ఇటీవలి కాలంలో బాహాటంగానే చూస్తున్నాం. ప్రతిదానికీ వాస్తు చూడడం, ప్రతి పనికీ ముహూర్తాలు అనడం ఒక ఆనవాయితీగా మారుతోంది. ప్రమాణ స్వీకారాలకు ముహూర్తాలు సరే, క్యాబినెట్ సమావేశాలు సయితం ముహూర్తాల ప్రకారం మొదలుపెట్టడం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. పేర్లు ప్రస్తావించడం అనవసరం కానీ, గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు కూడా వాస్తు నమ్మకంతో అనేక నిర్మాణాలు చేశారు. కొన్ని కట్టడాలు పడగొట్టారు. సచివాలయం, అసెంబ్లీ ప్రధాన ప్రవేశ మార్గాలను మార్చారు. తమకు పనికొచ్చే వాస్తుకు అనుగుణంగా తమ కార్యాలయాల్లో, అధికారిక నివాస భవనాల్లో ప్రభుత్వ ఖర్చుతో పలుమార్పులు చేశారు. కానీ వారెవ్వరూ వాస్తు నమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తపరచకపోవడం వల్ల వారి చర్యలు మీడియాలో అంతగా వివాదాస్పదం కాలేదు.
'వాస్తు హేతుబద్ధమా, జ్యోతిష్యం శాస్త్రీయమా' అనే మీమాంస కాదు ఇప్పుడు చర్చనీయాంశం. ఎవరి నమ్మకాలు వారివి. ఒకరి నమ్మకం మరొకరికి మూఢ నమ్మకంగా కానవస్తుంది. వ్యక్తిగా ఎవరు ఎలాటి నమ్మకాలు పాటించినా అది పూర్తిగా వారి వ్యక్తిగతం. కానీ ప్రజాజీవితంలో వున్నప్పుడు అర్ధాలు మారిపోతాయి. భాష్యాలు వేరుగా వుంటాయి. అది గమనంలో పెట్టుకుని వ్యవహరిస్తే ఆత్మ రక్షణలో పడే ప్రమాదాలు తగ్గిపోతాయి.
ఇక పోతే ఈ నమ్మకాలకు సంబంధించి కొన్ని సరికొత్త పాత సంగతులు:
ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అధికారిక నివాస భవనం వుండాలనే ఉద్దేశ్యంతో గతంలో బేగం పేటలోని ప్రభుత్వ అతిధి భవనాన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి హయాములో ఆయన పేరు కలిసివచ్చేలా 'ఆనంద నిలయం' పేరుతొ ఏర్పాటు చేశారు. విజయ భాస్కరరెడ్డి మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే భవనంలో వుండేవారు. డాక్టర్ చెన్నారెడ్డి తార్నకాలోని తన సొంత ఇంట్లో వుంటూ ముఖ్యమంత్రి హోదాకు తగినట్టు సౌకర్యాలను, తన వాస్తు విశ్వాసాలకు సరిపడేలా మార్పులనూ చేయించారు. అంజయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు బరఖత్ పురాలోని ఆయన ఇల్లు చాలా చిన్నది కావడం వల్ల గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ని అనేక వాస్తు మార్పులతో 'జయప్రజా భవనం'గా తయారు చేశారు. ఆయన అర్ధంతరంగా పదవి దిగిపోయేవరకు అందులోనే వుండి, ఇరుకిరుకు గదులున్న తన చిన్న ఇంటిలోనే చనిపోయేవరకు రోజులు గడిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు కూడా ఈ విశ్వాసాలు జాస్తి. సినిమారంగం నుంచి వచ్చిన వ్యక్తి కావడం వల్ల వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన చంద్రబాబు నాయుడుకి వాస్తు పట్ల మొదట్లో అంతగా పట్టింపు వున్న దాఖలాలు లేవు. కాకపొతే రెండు పర్యాయాలు అధికారానికి దూరం అయిన తరువాత ఆయనలో కూడా ఈ నమ్మకాలు పెరిగాయని చెబుతారు. గుంభన పాటించే తత్వం కాబట్టి ఈ నమ్మకాల విషయంలో ఆయన వ్యవహార శైలి పెద్దగా వార్తలకు ఎక్కలేదు. కొత్త రాజధాని విషయంలో, సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విషయంలో చంద్రబాబు వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ, పెద్దగా చర్చనీయాంశం కాలేదు.
రాజకీయ నాయకులే కాదు ఉన్నతాధికారుల్లో సయితం వాస్తుకు తగ్గట్టు నడుచుకునేవారు పెక్కుమంది వున్నారు. వారి కార్యాలయాలను, అధికారిక నివాస భవనాలను ఎటువంటి భేషజం లేకుండా హాయిగా ప్రభుత్వ ఖర్చుతో మార్పులు చేసుకున్నారు. కాబట్టే ఈ విషయంలో చంద్రశేఖర రావు నిర్ణయాన్ని రాజకీయంగా ప్రశ్నించగలుగుతున్నారు కానీ గట్టిగా నిలదీయలేకపోతున్నారు.
నమ్మకాలు అనండి, మూఢ నమ్మకాలు అనండి ఇప్పుడివి సమాజంలో చాలా విస్తృతంగా అనేక రంగాలలో అల్లుకుపోయాయి. అధికారం, డబ్బు ముడిపడివున్న రాజకీయ, చలనచిత్ర, వ్యాపార రంగాల్లో వీటి ఉనికి మరింత ప్రస్పుటంగా కానవస్తుంది. శాస్త్రీయ పరిశోధనా రంగాల్లో ప్రకాశిస్తున్న అనేకమంది కూడా వీటికి అతీతులు కారన్నది జగద్విదితం. కేవలం నిరక్ష్యరాస్యుల్లో మాత్రమే ఈ మూఢ నమ్మకాలు ఎక్కువ అనే వాదాలు ఇటువంటివారివల్ల పూర్వపక్షం అవుతున్నాయి. నాటి జన గణన ప్రకారం మన దేశ జనాభాలో నిరక్షరాస్యుల శాతం డెబ్బయి నాలుగు. కానీ వాస్తు, జ్యోతిష్యం వంటి నమ్మకాలు వున్నవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ. అంటే ఏమన్నమాట. చదువుకూ నమ్మకాలకూ ముడి పెట్టి మాట్లాడడం అంత సమంజసం కాదని.
ఈ నమ్మకాలకు సంబంధించి అనేక రసవత్తర విషయాలు చరిత్రలో చోటుచేసుకున్నాయి.
1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.
1962 జనవరిలో కొందరు భారతీయ జ్యోతిష్కులు అదే ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రపంచ ప్రళయం సంభవిస్తుందని జోస్యం చెప్పారు. ఆ ప్రచారానికి భీతిల్లి కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి కొండలు గుట్టలు ఎక్కి తలదాచుకున్నారు. సిక్కిం మహారాజు తన పెళ్లి వాయిదా వేసుకున్నారు. వ్యాపారాలు మందగించాయి. ఇదంతా చూసి నెహ్రూ, 'నవ్వుకోవడం మినహా చేసేదేమీ లేదు' అని వ్యాఖ్యానించారు. 1984 మార్చిలో ప్రపంచ యుద్ధం వస్తుందని 1981 లోనే అనేకమంది జ్యోతిష్కులు భవిష్యత్ వాణి వినిపించారు. 1995 లో విలయం వాటిల్లి 70-80 శాతం జనం తుడిచి పెట్టుకుపోతారని జ్యోతిష్యం చెప్పిన వాళ్లు వున్నారు. ఇవేవీ నిజం కాలేదు.
1981 జూన్ లో ఒక జ్యోతిష్కుడు ఒక అడుగు ముందుకు వేసి అదే ఏడు సెప్టెంబర్ లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురవుతారని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, ఆ తరువాత కొద్దిరోజుల్లోనే శ్రీమతి గాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని కూడా చంపేస్తారని ఆయన చెప్పారు. ఆ దరిమిలా హెచ్ ఎన్ బహుగుణ ప్రధాని అవుతారని కూడా ఆయన ముక్తాయింపు ఇచ్చారు. ఆయన జ్యోతిష్యం అప్పుడు నిజం కాలేదు కానీ, ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకు ఇందిరా, రాజీవ్ లు ఇద్దరూ హత్యకు గురయ్యారు. కానీ ముందే కూసిన ఆ 'కోయిల'ను మాత్రం పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
'పనిచేసే ఆఫీసుల్లో మూఢనమ్మకాలు' అనే అంశంపై 2012 లో ఒక సర్వే చేశారు. ఎనిమిది నగరాల్లో సుమారు ఎనిమిదివందల కంపెనీల్లో పనిచేసే సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరికి తెలిసింది ఏమిటంటే వారిలో అరవై ఒక్క శాతం మందికి వాస్తులో విశ్వాసం వుందన్నవాస్తవం.
అందుకే అన్నారు, 'మొక్కితే సాయి, తొక్కితే రాయి' అని.
అంతా నమ్మకంలోనే వుంది. నమ్మితే అది నమ్మకం, నమ్మకపోతే అది మూఢ నమ్మకం.
(31-01-2015)
NOTE: Courtesy Image Owner