10, అక్టోబర్ 2014, శుక్రవారం

'కైలాష్' శిఖర సమానుడు

స్వతంత్ర భారత దేశంలో సగటు పౌరుడికే హక్కులు లేవు. వున్నా అవి వున్నట్టు కూడా వారిలో అధిక సంఖ్యాకులకు తెలియదు. తెలిసినా ఆ హక్కులు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవాళ్ళు చాలా తక్కువ.
ఈ నేపధ్యంలో, పిల్లల హక్కులకోసం సుదీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న కైలాష్ సత్యార్ధి (60) అనే భారతీయుడికి ప్రపంచంలో అత్యంత ఉత్తమ పురస్కారంగా పరిగణిస్తున్న నోబెల్ శాంతి బహుమతి లభించింది. నిజానికి కైలాష్ సత్యార్ది అనే పేరు మొన్న శుక్రవారం వరకు దేశంలో అంతగా తెలిసిన పేరు కాదు. పదిహేడేళ్ళ పాకీస్తాన్ యువతి  మలాలా  యూసఫ్జాయ్ తో కలిపి నోబెల్ బహుమతి నిర్ణాయక బృందం 2014 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని కైలాష్ సత్యార్ధికి ప్రకటించడంతో ఆయన పేరు విశ్వవ్యాప్తంగా మారు మోగిపోయింది. మరో ఆసక్తికరమైన నేపధ్యం ఏమిటంటే  భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నప్పుడే, భారత్, పాకీస్తాన్ లకు చెందిన వీరిరువురికీ కలిపి నోబెల్ 'శాంతి' బహుమతి గురించిన ప్రకటన వెలువడడం.
వారిరువురికీ అభినందనలు   

అసందర్భం అయినా మనసులో మాట. బాలల హక్కులకోసం నిరంతరం శ్రమిస్తున్న కైలాష్ సత్యార్ధి కృషిని నోబెల్ బహుమతి నిర్ణాయక సంఘం గుర్తించే వరకు, స్వదేశంలో ఆయనకు సరయిన గుర్తింపు లేకపోవడం విచారకరం. భారత ప్రభుత్వం ఏటా ఇచ్చే 'పద్మ' అవార్డుల పరిశీలన దశకు కూడా ఏనాడూ కైలాష్ సత్యార్ధి పేరు చేరకపోవడం అనేది భారతీయులందరికీ  కలత కలిగించే విషయం.




(నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యర్తి)
  

3 కామెంట్‌లు:

SD చెప్పారు...

మాలాలా "పౌరుడు"?

ఆయన పేరు సత్యార్ధి గురువు గారు, ఖూనీ చేసి పారేసారు పేరునీ, అమ్మాయిని "పౌరుడు" అని పిలిచి. ఘోరం.

Saahitya Abhimaani చెప్పారు...

పౌరుడు అనే మాటకు స్త్రీ లింగం పౌరురాలు అనాలేమో. పౌరుడు అనటం మాత్రం తప్పనే నేనూ అనుకుంటున్నాను.

ఏమైనా శ్రీనివాసరావుగారూ వార్తా అందించినందుకు ధన్యవాదాలు. పాకిస్తాన్ లో ఒక చిన్న పిల్లకు, భారత దేశంలో చిన్నపిల్లల హక్కులకోసం పనిచేస్తున్న ఒక సంఘ సంస్కర్తకు కలిపి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం బాగున్నది. ప్రస్తుతానికి పాకిస్తాన్ భారత్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్నది కాబట్టి నోబెల్ కమిటీ ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఇలా ఈ రెండు దేశాల వారికి శాంతి బహుమతి ఇచ్చి ఉండి ఉంటుంది అని నేను అనుకోవటం లేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@DG and SIVARAMAPRASAD KAPPAGANTU - Thanks to both of you for enabling me to correct my mistake.Regards