18, అక్టోబర్ 2014, శనివారం

ఈరోజు అంజయ్యగారి వర్ధంతి - ఒక జ్ఞాపకం

ఆంధ్ర ప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే – రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానంతిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కానిఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అందిముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగంఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా  అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
పోతే! పైకి చెప్పకపోయినా ఇది చదివే వారికి ఓ  సందేహం తొలుస్తుండవచ్చు. ఇదంతా మీకెలా తెలుసనీ. మీలో కొందరికి తెలియని విషయం ఏమిటంటేఆ రోజుల్లో నేను  రేడియో రిపోర్టర్ గా వుండేవాడిని. కారణం చెప్పలేను కాని ఆయనకు నేనంటే అవ్యాజానురాగం. నేను కాసేపు దగ్గర్లో కనబడకపోతే చాలు  అంజయ్య గారికి క్షణం తోచేది కాదు. శ్రీనివాస్ ఏడీ’ అని సొంత సిబ్బందిని ఆరా తీయడం ఆయనకు అలవాటు. అంచేత ఆరోజు నేను కూడా అంజయ్య గారి వెంటే వున్నాను. అదన్న మాట. (18-10-2014)

(అంజయ్య గారు - నేనూ - నా రేడియో టేప్ రికార్డర్ )

1 కామెంట్‌:

Saahitya Abhimaani చెప్పారు...

శ్రీనివాస రావుగారూ మీ పాత జ్ఞాపకం అంజయ్య గారి వర్ధంతి సందర్భంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

అంత ప్రేమగా అంజయ్య గారి ఇంటికి వచ్చిన రాజీవ్ గాంధీ గారు మరి కొద్ది నెలల్లోనే ఆయన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా విమానాశ్రయంలో ఎందుకు తిట్టి ఉంటారు అన్న సంశయం కలుగుతున్నది. అలా అంజయ్య గారిని మరీ పబ్లిక్ గా తిట్టిపోయ్యటమే కదా, ఎన్ టి ఆర్ కు, వరంలా లభించి, తెలుగుదేశం పెట్టిన కొత్తల్లో. ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బాగా వాడుకోవటానికి, అద్భుతంగా పనికి వచ్చిన సంఘటన. రాజీవ్ ఇలా పొంతన లేకుండా ఎందుకు వ్యవహరించి ఉంటారు!