1, అక్టోబర్ 2014, బుధవారం

రాజు గారికి కోపం వచ్చిందా!


రాజు గారికి కోపం రావచ్చు కాని, నాకు బాగా తెలిసిన ఈ రాజు గారికి కోపం వచ్చే అవకాశం బొత్తిగా లేదు.
ఈరోజు పత్రికల్లో ఈ రాజు గారికి అంటే నాకు తెలిసిన రాజుగారు, కేంద్ర మంత్రి శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి కోపం వచ్చినట్టు వార్తలు చదివి (గుంటూరు గోల) ఓ పట్టాన నమ్మలేకపోయాను.


కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగుదేశం పార్టీలో  శిఖర సమానులు. అధికారాలు, హోదాలు ఆయనకు పుట్టుకతో అబ్బినవే కనుక వాటిని అడ్డం పెట్టుకుని విర్రవీగాల్సిన అవసరం లేని ఏకైక రాజకీయ నాయకుడు ఆయన. అందుకే, ముఖ్యమంత్రి తరువాత రెండో స్థానంగా అందరూ పరిగణించే ఆర్ధిక శాఖ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు రెండూ నిర్వహించిన సమయంలో కూడా  ఆయన తన తీరు మార్చుకోలేదు. హైదరాబాదులో వుంటే మాత్రం ఠంచనుగా సచివాలయానికి వచ్చి కూర్చునేవారు. ఎప్పుడన్నా సెక్రెటేరియేట్ బీట్లో తిరుగుతూ అటు తొంగి చూస్తె ఆయన చాంబర్ ఖాళీగా కనిపించేది.  చిన్న చిన్న శాఖలు చూసే మంత్రుల పేషీలు కూడా కూడా వచ్చిపోయే సందర్శకులతో కిటకిటలాడుతుండేవి. రూలు ప్రకారం తప్ప పైరవీలు చెల్లవు అనే పేరు పడడం వల్లనేమో  రాజుగారి ఆఫీసులో  జన సందోహం చాలా తక్కువ. ఆయన ప్రైవేట్ సెక్రెటరీ కమ్  ఓ.యస్.డీ,,  బీ ఎన్ కుమార్ గారు నన్ను  చూడగానే, చిరునవ్వుతో, 'లోపలకు వెళ్ళండి పరవాలేదు' అనేవారు. తలుపులు తీసేవాళ్ళు, చీటీలు పట్టుకుని ఇచ్చేవాళ్ళు లేని వ్యవహారం కనుక,  తలుపు తోసుకుని  లోపలకు వెళ్ళేవాడిని.  విశాలమైన మేజాబల్ల వెనుక కుర్చీలో కూర్చుని, సిగరెట్ తాగుతూ,  ఇంగ్లీష్ పుస్తకం ఏదో ఒకటి చదువుతూ, రాజుగారు దర్శనం ఇచ్చేవారు.  రేడియో విలేకరిని కాబట్టి, సంచలన వార్తల అవసరం ఏమాత్రం లేనివాడ్ని కాబట్టి ఆయన  నన్ను చూడగానే, హాయిగా ఇంగ్లీష్ లో పలకరిస్తూ, కూర్చోబెట్టి రకరకాల విషయాలు చర్చించేవారు. రాజకీయాలను మినహాయిస్తే మిగిలిన విషయాల్లో ఆయన పరిజ్ఞానం  అమోఘం. కాసేపు అవీ ఇవీ మాట్లాడి సెలవు తీసుకుని వచ్చేసేవాడిని. వార్త దొరకలేదన్న చింత లేని మనిషిని కదా!    
నా జర్నలిష్టు మిత్రుడు ఎం.యస్. శంకర్ ఆ రోజుల్లో బీబీసీ తెలుగు వార్తలకు తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసాడు. అతడు రికార్డు చేసి బీబీసీకి పంపాల్సిన స్టూడియో రాజభవన్ రోడ్డులో వుండేది. రాజుగారి ఇంటర్వ్యూ అడిగితె ఆయన ఔనడం, మేము ఆర్చుకుని తీర్చుకుని మినిస్టర్స్ కాలనీలోని (ఇప్పటి సీ ఎం క్యాంప్ కార్యాలయం వున్నచోటుకు కూతవేటు దూరంలో) వున్న ఆయన ఇంటికి శంకర్ స్కూటర్ పై వెళ్ళాము. ఆయన్ని తీసుకుని స్టూడియోకి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ, మంత్రిగారు సాయంత్రం ఇంటికి రాగానే డ్రైవర్ ని ఉంచుకోకుండా పంపించేస్తారు అన్న సంగతి మాకు తెలవదు. ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తుండగానే రాజుగారు బయటకు వచ్చి కారు తీసి మమ్మల్ని ఎక్కమని చెప్పి 'ఎక్కడకు వెళ్ళాలి' అని అడిగేసరికి మాకు మతి పోయినంత పనయింది. ఆయనే స్వయంగా డ్రైవ్  చేసుకుంటూ తీసుకువెళ్ళడం, రికార్డింగు పని పూర్తిచేసుకోవడం అన్నీ  సక్రమంగా జరిగిపోయాయి. ఆరోజుల్లో మా ముగ్గురినీ కలిపి వుంచిన బంధం ఒకటి వుంది. అందరం ఒకే బ్రాండ్ సిగరెట్ తాగేవాళ్ళం. తరువాత నేను మానేసాను. శంకర్ మానేసినట్టు చెబుతున్నాడు. రాజు గారిని కలవక దశాబ్దం దాటింది. ఆయన సంగతి తెలవదు. మానేస్తారన్న నమ్మకం నాకయితే లేదు. ఎన్టీ రామారావు గారంతటి వారు కూడా ఈ విషయంలో రాజుగారికి కొంత మినహాయింపు ఇచ్చారని ఆరోజుల్లో చెప్పుకునేవారు.  

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అవును , నిజాయితీ ముక్కుసూటితనం లో ఈయనకి సాటిరారు , విజయనగరం లో అందరు ఇదే చెప్తారు .
బొత్స సత్యనారాయణ ఎంత సంపాదించినా ఈయనకి ఉన్న పేరు లో పిసరంత కూడా లేదు అతనకి .

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అజ్ఞాత గారూ, అదేం పోలికండీ బాబూ.

అజ్ఞాత చెప్పారు...

ఆ ఇద్దరు ఉత్తరాంధ్ర కి చెందిన వారు కదా .. అందుకే

Jai Gottimukkala చెప్పారు...

వారి సోదరులు ఆనంద గజపతి రాజు గారి గురించి చదివి/విని చాలా ఏళ్లయింది. భండారు వారికి తెలిస్తే చెప్పగలరు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkla - వారి సోదరులు ఆనందగజపతి రాజు గారు, అసలు వీరిద్దరి నాన్నగారు పీవీజీ రాజుగారు కూడా తెలుసు కానీ, అశోక్ గజపతి రాజుగారితో ఉన్నంత పరిచయం లేదు.