15, మార్చి 2014, శనివారం

తిరుపతి వెడుతున్నారా? కళ్ళూ చెవులు మూసుకోండి!


వెంకన్న  దర్శనం చేసుకుందామని అనుకుంటున్నారా! అలాటి వారికి నా ఉచిత సలహా!
కళ్ళూ చెవులూ రెండూ మూసుకుని యాత్రకు బయలుదేరండి. అదెలా అని అడగకండి. అక్కడ కళ్ళు తెరిచారంటే ముడుపులతో మునిగితేలుతున్న సిబ్బందే మీకు కనిపిస్తారు. వీరిలో పెద్ద గద్దలు, పిల్లకాకులూ అందరూ వున్నారు. మినహాయింపు ఇచ్చే వాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అంతా కలిసి పగలంతా పోగేసుకున్న సొమ్మును రాత్రికి రాత్రే వాటాలు వేసుకుని పంచుకుంటారన్నది స్థానికులు బాహాటంగా చెప్పుకునే దేవ రహస్యం. యాత్రీకులు, భక్తులు (కావలనే వీరిని విడదీసి చెప్పాల్సి వస్తోంది. భక్తులందరూ యాత్రీకులు కావచ్చుకాని, యాత్రీకులందరూ భక్తులు కారు) కలసి ఆ దేవదేవుడికి చెల్లించుకునే ముడుపుల వివరాలు బహిర్గతం చేస్తారు కాని ఈ బలవంతపు, నిర్లజ్జపు వసూళ్లకు లెక్కాడొక్కా వుండవు. అయితే, ఓ అనధికార అంచనా ప్రకారం తిరుమల తిరుపతుల్లో హారతి కర్పూరం అయ్యే భక్తుల డబ్బు, ఇంచుమించుగా ఆ ఏడుకొండల వాడి ఆదాయం అంత వుండొచ్చట. చెవులు మూసుకుని వెళ్ళమని చెప్పింది ఇందుకే. ఇలాటి అప్రాచ్యపు విషయాలన్నీ ముందు చెవుల్లో పడి,ఆ పిదప మనసులో దూరి వున్న కాస్త మానసిక ప్రశాంతిని దూరం చేస్తాయి. మూసుకున్న చెవులను దర్శనం అయ్యేదాకా అలాగే వుంచండి. ఎందుకంటే, దేవుడి సన్నిధానంలో వుండాల్సిన ప్రశాంతత, నిశ్శబ్ద ఆధ్యాత్మిక వాతావరణం మచ్చుకు కూడా వుండవు. క్యూలోవెనుకవారు మీద పడుతుంటే, తమ ప్రమేయం ఏమీ లేకుండానే ముందుకు జరిగిపోతున్న జనాలను చేతులతో ముందుకు నెడుతూ 'ముందుకు జరగండి' అనే 'శ్రీ వారి సేవకుల' హెచ్చరికలే గర్భగుడిలో సైతం కర్ణ కఠోరంగా వినవస్తుంటాయి.(ఇక్కడ గర్భగుడి అనే పదం కేవలం దేవాలయం అనే అర్ధంలో మాత్రమే. సామాన్యులకు గర్భగుడిలో ప్రవేశం అందని మావే. అది 'పెట్టిపుట్టిన' పెద్దమనుషులకు మాత్రమే. మిగిలినవారికి 'లఘు' దర్శనం. 'మహా లఘు' దర్శనాలే. అసలీ పేర్లు పెట్టిన వారికి 'పద్మ శ్రీ' బిరుదులివ్వాలి.)

తిరుమల దివ్య క్షేత్రాన్ని అనుదినం వేలాదిమంది సందర్శిస్తుంటారు. వారిలో అధిక సంఖ్యాకుల కోరిక ఒక్కటే. దేవుడ్ని లిప్తకాలం పాటయినా దర్శించి సేవించుకోవాలని. కొద్దిమంది మాత్రం కోరుకునేది వేరే. ఎలాటి ఇబ్బంది లేకుండా సుఖంగా వెళ్ళి కళ్ళారా దేవుడ్ని కావాల్సినంత సేపు చూసి హారతి తీసుకుని మళ్ళీ అంతే సుఖంగా కడుపులో చల్ల కదలకుండా తిరిగిరావాలని. వీలయితే మరోమారో, ముమ్మారో అదేవిధంగా దర్శనం చేసుకోవాలని. వారిలో చాలామందికి ఆ కోరికా తీరుతుంది. ఎందుకంటే ఆ మేరకు ముందుగానే ప్రయత్నం చేసుకువస్తారు కాబట్టి.

తిరుమలవాసుడి దర్శనానికి అనేక మార్గాలు వున్నాయి. సర్వదర్శనం. కాలిబాట భక్తుల దర్శనం, మూడువందల రూపాయల శీఘ్రదర్శనం. ఇవికాక కంకణ దర్శనం. వృద్ధులు, వికలాంగులకోసం మహాద్వార దర్శనం. ఇవే కాక చాలా వున్నాయి కాని పైకి చెప్పరు. సమాచార హక్కు చట్టం కూడా తమకు వర్తించదని చెప్పే అధికారులు వున్నారు కాబట్టి ఆ రహస్య దర్శనాలు గురించి మాట్లాడకపోవడమే మంచిది.
తిరుమల వెళ్ళి వచ్చిన వాళ్లకు ఒక్క విషయం మాత్రం అర్ధం అవుతుంది. అక్కడ ప్రతి ఏర్పాటు, ప్రతి సౌకర్యం భక్తుల కోణం నుంచి ఆలోచించి అమలుచేస్తున్న దాఖలా లేదు. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఎంతో మంచి పేరు, సమర్ధత కలిగిన అధికారులు ఎంతో మంది టీటీడీ ఈవోలుగా పనిచేశారు. చేస్తున్నారు కూడా. వీరిలో చాలామందితో నాకు వ్యక్తిగత పరిచయం వుంది. కొందరితో స్వేచ్చగా మాట్లాడే చనువు కూడా వుంది. వారి హయాంలో కూడా ఇదే వరస. ఎందుకో ఆ కుర్చీలో కూర్చున్న తరువాత వారి వరసే మారిపోతుంది. ఒకాయన అయితే ఏకంగా ఒక వ్యాఖ్య చేశారు. "ఇక్కడికి ప్రతిరోజూ కొన్ని వేల మంది వస్తుంటారు. వారిలో చాలామంది సిఫారసులతో వస్తారు. వారి కోరికలు తీర్చడమే గగనంగా వుంటే ఇక సామాన్యులను పట్టించుకునే తీరిక ఎక్కడ వుంటుంది. అయినా సామాన్య భక్తులకు ఇవన్నీ పట్టవు. వారికి ఏదో ఒకవిధంగా దర్శనం అయితే చాలు. తిట్టుకున్నా కొండ దిగగానే మరిచిపోతారు. ఇక మిగిలింది ఓ రెండు వేలమంది. వారిలో కూడా రోజూ రెండువందలమందిని కనిపెట్టి చూసుకుని వసతి, దర్శన ఏర్పాట్లు చక్కగా చూసుకుంటే చాలు. మమ్మల్ని అడిగేవాళ్ళు వుండరు."

గవర్నర్ శ్రీ నరసింహన్  వీఐపీ సిఫారసు లేఖలపై ఆక్షలు విధించడం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఇత్యాది కారణాల చేత తిరుమలలో రద్దీ తగ్గే అవకాశం, సామాన్య జనాలకు దైవ దర్శనం సులభంగా జరగగలదన్న ఆశాభావం జనాల్లో కలిగింది. దానికి తోడు టీవీల్లో 'తిరుమలలో రద్దీ ఓ మోస్తరు' అని స్క్రోలింగులు, తిరుపతిలో దిగగానే హోటళ్ళలో వేచి వుండే పని లేకుండా కాఫీ పలహారాలు చేయడానికి సీట్లు దొరకడం ఇవన్నీ ఆశల్ని మరింత చిగురింపచేసాయి. కానీ పైన కొండ మీద పరిస్థితులు షరా మామూలే! పైన తిరగడానికి అనువుగా వుంటుందని కింద నుంచి ప్రైవేటు టాక్సీ తీసుకు వెడితే అణువణువునా ఆంక్షలే. మొక్కుబళ్ళు తీర్చడానికి బయలుదేరితే ముందుకు పోవడానికి వీల్లేదని ట్రాఫిక్ పోలీసు చెయ్యి అడ్డం పెట్టాడు. ఓ యాభయ్ ఇవ్వండని మా డ్రైవర్ అడిగి తీసుకుని ఇవ్వడానికి వెడితే అతగాడు తన పక్కన వున్నవాడి వైపు సైగ చేసాడు. అతడి కలెక్షన్ ఏజెంటు చేతిలో డబ్బు పడగానే 'అడ్డం పెట్టిన పోలీసు చెయ్యి' మా కళ్ళ ముందే కిందికి దిగిపోయింది. తల నీలాలు ఇవ్వడానికి ఎస్వీ గెస్ట్ హౌస్ వద్దకు వెడితే, అక్కడ క్షురకులు ఖాళీగానే వున్నారు కాని కింద నుంచి టోకెన్ తెమ్మన్నారు. కారు లేకపోతే ఆ ఎండలో ఇంతే సంగతులు. అంతకుముందే డబ్బులు చేతిలో పడ్డాయి కాబట్టి పోలీసు కిమ్మనలేదు.

ముందే చెప్పినట్టు అందుబాటులో వున్న టెక్నాలజీని వాడుకుంటున్నారే కాని, యాత్రీకుల కోణం నుంచి కాదు. భక్తులు కొండ మీదకు రాగానే అన్నీ ఒకే గొడుగు కింద - పదే పదే పది చోట్లకు తిరగకుండా వున్న కంప్యూటర్ల వ్యవస్థను సమర్ధవంతంగా యెందుకు ఉపయోగించుకోరో అర్ధం కాదు. రూము ఖాళీ చేసి డిపాజిట్ డబ్బు తిరిగి తీసుకోవాలంటే రిఫండ్ రసీదు ఇచ్చే కౌంటర్ ఒకటయితే, డబ్బు తీసుకోవాల్సిన కౌంటర్ మరొకటి. రెండు చోట్లా క్యూలో నిలబడాలి. లడ్డూ టోకెన్ తీసుకునే కౌంటర్ ఒకటయితే, వాటికి కావాల్సిన సంచీ కొనాలంటే మరో కౌంటరు కు వెళ్ళాలి. మళ్ళీ క్యూలో నిలబడాలి. తోడు లేకుండా వెళ్ళే వృద్ధుల కష్టాలు చూస్తుంటే హృదయం ద్రవిస్తుంది. యాత్రీకులకు సేవ చేయడం కోసం ఉద్యోగులను నియమిస్తున్నారో, ఉద్యోగులను నియమించడం కోసం ఉద్యోగాలు సృష్టిస్తున్నారో అర్ధం కాదు. ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త మాల్తూసియన్ కొత్త ఉద్యోగాల సృష్టికి ఏనాడో ఒక సూత్రం చెప్పారు. " గొయ్యి తవ్వించు. ఆ గోతిని పూడ్పించు". అంటే ఏమిటన్నమాట. గొయ్యి తవ్విన వాడికి ఓ ఉపాధి. పూడ్చిన వాడికి మరో ఉపాధి.అలావుంది. టీడీడీ వ్యవహారం.

ఒకప్పుడు బెజవాడలో ఎండాకాలం అంటే నూట పది డిగ్రీలు దాటాలి. ఆరోజుల్లో హైదరాబాదులో నూరు డిగ్రీలకే జనం ఆవిర్లు కక్కేవాళ్ళు. అలాగే తిరుపతి రద్దీ ఓ మోస్తరు అంటే అక్కడికి వారికినిజంగా ఓ మోస్తరే కాని బయట నుంచి వచ్చిన యాత్రీకులకి మాత్రం చాలా రద్దీ అనిపిస్తుంది. 'మూడువందలు పెట్టి స్పెషల్ క్యూలో నిలబడ్డారంటే యెంత ఓ రెండుగంటల్లో దివ్యంగా దర్శనం అయిపోతుంది. పొద్దున్న వెళ్ళిన వాళ్లు గంటలోనే తిరిగొచ్చామన్నారు." ఇలా గెస్ట్ హౌస్ లో వాళ్లు చెప్పిన మాట విని క్యూలో చేరాము. అంతే! కాసేపు త్వరగా వెడుతున్నట్టే అనుపించింది. కాని అది కాసేపే. తరువాత క్యూ నిలిపేశారు. ఎంతసేపో చెప్పేవాళ్ళు వుండరు. ప్రతిచోటా 'అత్యవసర పరిస్తితి ఏర్పడితే కింది టోల్ ఫ్రీ నెంబరుకు ఫోను చేయండి' అని బోర్డులు పెట్టారు. సెల్ ఫోన్లు మాత్రం అనుమతించేది లేదన్నారు. దేవస్థానం వాళ్ళయినా అక్కడక్కడా బీ ఎస్ ఎన్ ఎల్ ఫోన్లు ఏర్పాటు చేశారా అదీ లేదు. మరి ఆ బోర్డులు యెందుకు? బహుశా బోర్డులు రాసే కాంట్రాక్టర్ల కోసం కావచ్చు. పక్కనే వీ ఐ పీ పాసులు వున్నవాళ్ళు వేచి వుండే విశాలమైన హాళ్ళు అనేకం ఖాళీగా వున్నాయి. ఆ సమయంలో వాళ్లు వుండరు. కానీ, సామాన్య భక్తులు మాత్రం ఇరుకయిన సందులాంటి త్రోవ ద్వారానే వెళ్ళాల్సి వుంటుంది. అందులో వెళ్ళేవాళ్ళు 'భయంకరమైన బందిపోట్లు' అన్నట్టుగా ఇరువైపులా ఇనుప తీగెల తెరలు. దోవలో మళ్ళీ మెట్లు. ఎగుడు దిగుడుగా వున్న చోట వేసిన చెక్క పలకలు జర్రున జారే విధంగా వున్నాయి. ఒకావిడ మా కళ్ళముందే జారి పడింది. నిజమైన భక్తురాలేమో తుంటి విరగలేదు. అమెరికా వంటి దేశాల్లో జారుడు ప్రదేశం వుంటే హెచ్చరికగా బోర్డు పెడతారు. ఇక్కడ మాత్రం భక్తుల్ని వాళ్ల మానానికి వాళ్ళను వొదిలేశారు. అలాటి చోట్ల 'ఇంకా ఇంత సమయం మీరు వేచి వుండాల్సి వుంటుంది' అని లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తుంటే ఏదో ఒక సమాచారం తెలిసిందని వూరట చెందుతారు. టీటీడీ వంటి సంస్తకు ఈ ఖర్చు ఓ లెక్క కాదు. కానీ అక్కడ ఆ పరిస్తితి కనిపించలేదు.
మధ్య మధ్య అక్కడక్కడ గేట్లు తెరుచుకుంటాయి. కొందరు మధ్యలో క్యూలో ప్రవేశిస్తారు. వారు ఉద్యోగులో తెలవదు. పలుకుబడి వున్న భక్తులో తెలవదు. అక్కడక్కడ కానవచ్చే టీటీడీ సిబ్బందికి భక్తులు మనుషుల్లా కనిపించరు. అడిగిన దానికి జవాబు చెప్ప రు.
ఆ మధ్యాన్నం జేఈవొ తిరుమలలో కొన్ని గెస్ట్ హౌసుల్లో ఆకస్మిక తనిఖీ చేసి టాయిలెట్ల దగ్గర నుంచి అన్నీ చూసివెళ్ళినట్టు మరునాడు ఉదయం పేపర్లో వచ్చింది. అలాటి అధికారులు పనిలోపనిగా వారానికి ఒకసారో రెండుసార్లో తామెవరో తెలియకుండా క్యూ లైన్లలో వెళ్ళి చూస్తే భక్తులు అనుభవిస్తున్న ఇబ్బందులను కళ్ళారా గమనించడానికి వీలుంటుంది. కాని పెద్దల టాయిలెట్ల వంటి ప్రాధాన్య అంశాలను పక్కనబెట్టి ఇంత చిన్న విషయాలను పట్టించుకునే తీరిక వారికి యెలా వుంటుంది. వాళ్ల ఇబ్బందులను కూడా భక్తులు కాస్త అర్ధం చేసుకోవాలి.

ఎట్టకేలకు క్యూ కదిలింది. కదిలింది అనుకునే లోపు మళ్ళీ ఆగింది. ఆగి కదిలింది. కదిలి ఆగింది. అర్ధం అయింది ఏమిటంటే కదిలే వ్యవధానం కన్నా ఆగే సమయం ఎక్కువని. అల్లా కదిలి కదిలి ఆగి ఆగి చివరాఖరు ఘట్టానికి చేరింది. ఆడవాళ్ళని మగవాళ్ళనీ విడదీసి స్త్రీల హ్యాండ్ బ్యాగుల్నీ, మగవాళ్ళ మనీపర్సుల్నీ స్కానింగ్ యంత్రాల ద్వారా పరిశీలించి - ఇక మహాద్వారం పది అడుగుల దూరంలో వున్నదనగా గేటు వేసేశారు. 'ఎందుక'ని అడిగితె 'సీనియర్ సిటిజన్ల క్యూ వొదిలారు' అని జవాబు. 'ఎంతసేపు' అంటే 'ఓ గంట' అని జవాబు వస్తుండగానే కొంత దూరం నుంచి ఓ సీనియర్ కానిస్టేబు 'గంట కాదు ఓ పావుగంట' అని అరిచినట్టు చెప్పి, 'గంట అంటే మరీ డీలా పడతారు' అని చిన్నగా హితబోధ చేసాడు జూనియర్ కనిస్టీస్తీబుకు. 'ఔను కదా మల్లా!' అన్నాడు జూ.క.
మాకు పరిస్తితి అర్ధం అయింది. ఈసారి వెయిట్ చేయాల్సిన టైం తెలిసింది. అసలు జరిగింది కొంత వుంది. సరిగ్గా మహాద్వారం వైపు వెళ్లేముందు, ఆడవాళ్ళు పిల్లలతో ఒక కుటుంబం వస్తే మేమే దారి తొలిగి వారికి దారి ఇచ్చాము.ఇంతలో మాదారి మూసుకుపోయింది. 'యేది దారి' అని అడిగితె 'ఇవన్నీ పైవాడు యెలా అనుకుంటే అలా జరుగుతాయి' అన్నాడు జూ.క. మా వెనుకవాళ్లకు మేము దారి ఇచ్చామని, అదే సమయంలో గేటు వేశారని నచ్చచెప్పే ప్రయత్నం చేసాము. జూ.క. కి అవి నచ్చిన ఫలితంగా మూసుకున్న గేట్లు తెరుచుకున్నాయి. జూ.క. చెప్పినట్టు 'పైవాడు' కూడా గమనించాడు అన్నమాట. (అతడి పేరూ నా పేరే. శ్రీనివాసరావు)
ఆవిధంగా క్యూ లైన్ లో చేరిన మూడుగంటల తరువాత 'మహాద్వారం' నుంచి కాలు గుడిలో పెట్టాము.
ఇంతకీ టీడీడీ వారికి చెప్పేదేమిటంటే ఈరోజు మూడుగంటలు. ఇంకో రోజు నాలుగు అయిదు గంటలు పట్టొచ్చు. వారిలో ఎవరయినా ఇలా మూడు నాలుగు గంటలు ఏకబిగిన నిలబడి వుండగలరా! అసలెప్పుడన్నా ఈరకమైన పరిస్తితులను స్వయంగా గమనించారా! అలా చేసిన రోజు భక్తుల కోణం నుంచి సమస్యలను పరిశీలించి పరిష్కరించే వీలు దొరుకుతుంది. 

మహాద్వారం నుంచి దేవుడు వుండే గర్భగుడి యెంత దూరంలో వుందో కాని నాకుమాత్రం గడప దాటగానే కనిపించాడు.
మాకు ముందు సీనియర్ సిటిజన్లు, వికలాంగుల క్యూ నడుస్తోంది. ఎవరో నా చేయిపట్టుకుని లాగినట్టు అనిపించింది. చూద్దును కదా! చిన్న కుర్రాడు. ఎటో చూస్తూ నా చేయి పట్టుకున్నాడు. అతగాడి మరో చేతిని ఇంకో చేయి పట్టుకుని వుంది. ఆ కుర్రాడి తండ్రిలా వున్నాడు. కనుచూపు పుట్టుకతోనే పోగొట్టుకున్న వారిద్దరూ స్వామి దర్శనం కోసం వచ్చారు. కళ్ళు చమర్చాయి. పోనీలే టీడీడీ చేయరాని పనులు ఎన్ని చేస్తున్నా ఇదో మంచి పని చేస్తోంది పరవాలేదు అనిపించింది. ఆ తండ్రీ కొడుకులు మహాద్వారం నుంచి గుడిలో ప్రవేశించారు. వారికి ఈ అవకాశం అదృష్టం కల్పించిన అధికారులు అభినందనీయులు.

వృద్ధులు ముందు వెళ్ళిపోయినట్టున్నారు. ముందున్న దృశ్యం కడు దయనీయంగా అనిపించింది. లోకంలో వున్న అంధులు, వికలాంగులు అంతా అక్కడే వున్నారా అన్నట్టుగా వుంది. కొందరు తడుముకుంటూ అడుగులు వేస్తుంటే, మరికొందరు కాళ్ళు లేని వాళ్లు పారాడుతూ వెడుతున్నారు. దయామయుడయిన దేవుడే వారిని ఆదుకోవాలి. అన్నీ వున్న జనం లేనిదానికోసం ఆరాటపడుతూ లేనిపోని వరాలు కోరుతూ వస్తుంటే, ఏవీ లేని ఈ శాపగ్రస్తులు ఇలా దైవ కృప కోరుకుంటున్నారు. ఆ దేవుడి పేరుతొ అయినా దేవస్థానం వారు తమ ధార్మిక సంస్థల ద్వారా వారిని ఆదుకుంటే. వూహ బాగుంది. వాస్తవం కావడమే కష్టం. మనసున్నా అదికారులకు సమయం దొరకాలి కదా!

వృద్ధులు వికలాంగులతో కలిసి మహా లఘు దర్శనం చేసుకున్న తరువాత మరునాడు వృద్ధుల కోటాలో దర్శనం చేసుకోవాలన్న అభిలాష కలిగింది. పది గంటలకు క్యూ లైన్ తెరుస్తారు. రెండు గంటలముందు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సీనియర్ల వయస్సు అరవై అయిదు వుండాలని, ధృవపత్రం తెచ్చుకోవాలని నిబంధన. దాన్ని పాటిస్తూ ఉదయం ఎనిమిది లోపలే అక్కడికి చేరుకున్నాము. మహాద్వారానికి ఎదురుగా వున్న విశాల ప్రాంగణంలో ఓ పక్కగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు అది. వృద్ధులు, వికలాంగుల విషయంలో టీటీడీ తీసుకుంటున్న శ్రద్ధ చూసి మురిసిముక్కచెక్కలై గంటలు కూడా గడవలేదు. ఇప్పుడు అక్కడి దృశ్యం చూసిన తరువాత వాళ్ళంటే ఇంత చులకనా అనిపించింది. కోట్లకు పడగెత్తిన దేవస్థానానికి కొన్ని కనీస సదుపాయాలు, అంటే వాళ్లు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడం అలవికి మించిన భారం కూడా కాదు. అన్ని గంటలసేపు వారిని నిలబెట్టి వుంచడంలో హేతుబద్ధత శూన్యం. దేవస్థానం వారి నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఆ దృశ్యం కానవచ్చింది. ఇది ఎక్కడో మారుమూలన లేదు. ఉన్నతాధికారులు ఎల్లప్పుడు సంచరించే మహాద్వారానికి కూతవేటు దూరంలో వుంది.
అప్పటికే షెడ్డు నిండిపోయి క్యూ లైను బయట చాలా దూరానికి వచ్చింది. క్యూ నెమ్మదిగా కదులుతూ వచ్చి మేము షెడ్లో ప్రవేశించేసరికి గంటన్నర గడిచింది. అంతసేపూ, ఆ తరువాత కూడా నిలువు జీతాలే. పేరుకు కొన్ని కుర్చీలు వున్నాయి కాని అవి నిండిపోయివున్నాయి.ధృవపత్ర పరిశీలన అనంతరం ఫోటో తీసి ఓ పాసు చేతిలో పెట్టారు. తాగినవారికి పాలు ఇచ్చారు. ఇరవై రూపాయలు తీసుకుని లైన్లో వుండగానే రెండు లడ్లు తీసుకునే టోకెన్ ఇచ్చారు. కొంతమంది పత్రాలు సరిగ్గా లేవని బయటకు పంపేశారు. ఈ పని క్యూ లైన్ మొదట్లోనే చేసివుంటే వారికి ఎంతో శ్రమ తప్పి వుండేది. కానీ శ్రమ పెట్టడమే ఏకైక ధ్యేయంగా పనిచేస్తున్న వాళ్ళాయే. కిందటి సారి వచ్చినప్పుడు ఓ ఉన్నతాధికారి మాటలమధ్య చెప్పారు. 'కొండకువచ్చేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వున్న వసతులు పరిమితం. ఇలా కొన్ని అగచాట్లు పెడితే వాళ్ళను రాకుండా చేయొచ్చు(ట).' ఇలా వుంటాయి అధికారుల ఆలోచనలు.

మహాద్వారం దాటేదాకా వైతరణిని గుర్తుకు తెచ్చారు. ఆ తరువాత తొందరగా సాగినా ఆరోజు కూడా మహాలఘు దర్శనమే.
బయటకు వచ్చిన తరువాత వృద్ధుల వికలాంగుల అసలు కష్టాలు మొదలవుతాయి. అధికారులు, వీ ఐ పీ లను తీసుకువచ్చి మళ్ళీ తీసుకుపోయే వాహనాలు గుడి దరిదాపులదాకా వస్తాయి. కానీ భక్తులు మాత్రం పాదరక్షలతో మాడ వీధులలో తిరుగాడరాదు. తప్పుపట్టేదేమీ లేదు. కానీ అక్కడ పరచిన బండలనండి, ఇంకోటి అనండి వాటిమీద నడుస్తుంటే అరికాలిమంట నెత్తికెక్కుతుంది. పాలకమండలి సభ్యులు, అధికారులు ఒక్కటంటే ఒక్కసారి చెప్పులు లేకుండా గుడి చుట్టూ తిరిగివస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అయినా పిల్లి శాపాలకు ఉట్లు రాలవు కదా!

చిన్న తోక ముక్క: 
వెళ్ళిన రోజు సాయంత్రం వరాహ స్వామి గుడికి వెడితే 'తెప్పోత్సవం' అంగరంగ వైభోగంగా రంగురంగుల దీపాలతో జరుగుతోంది. విద్యుత్ దీప శోభితమైన నావలో స్వామివారు ఊరేగుతూ వస్తున్నారు. ఇది దగ్గర నుంచి చూడడానికి టిక్కెట్టు కూడా పెట్టారట. ఇంతలో పక్కనుంచి ఒకాయన అదిగో 'బాపిరాజు' అన్నాడు. చూస్తే దూరంగా పడవలో చాలామంది కూర్చునివున్నారు. ధర్మ సందేహాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ వాళ్లు తీర్చారు. వాళ్లు దగ్గర్లో ఏర్పాటుచేసిన పెద్ద టీవీ తెరపై మీసాలు దువ్వుకుంటూ బాపిరాజు కానవచ్చారు. అర్చకులు హారతి అందిస్తున్నారు. ఇంతకీ తెప్పోత్సవంలో వూరేగుతున్నది స్వామి వారా! పాలక మండలి వారా! అన్నీ తెలిసిన ఆగమ పండితులే చెప్పాలి.
(
సమాప్తం)


5 కామెంట్‌లు:

voleti చెప్పారు...

సామాన్య భక్తుల దుస్థితిని కళ్ళకి కట్టినట్టు రాసారు.. అందుకే నేను ఒక పథకం ప్రవేశ పెట్టాను.. మా వూర్లో తిరుపతి లాగే నిలువెత్తున వున్న విగ్రహాలు గల వెంకన్న ఆలయాలు మూడు వున్నాయి మాకు దగ్గర్లో... బుద్ది పుట్టినప్పుడు ఆ గుడులకు కుటుంబ సమేతంగా వెళ్తాము.. హాపీ.కాని ఇక్కడ కూడా శనివారాల్లో అనేక నియమనిబంధనలు..మూసిన తలుపులు ఎప్పుడు తెరుస్తారో తెలియని స్థితి..ఆలయ కమిటీ వారి ఆధిపత్యం మొదలగునవి కనిపిస్తూ వుంటాయి..కళ్ళు, చెవులు మూసుకోవడము తప్ప ఏమీ చెయ్యలేము..పైగా వాళ్ళు భక్తులకి ఏదో సేవ చేస్తున్నట్టు ఫోజు పెడతారే దానికి ఒళ్ళుమండుతుంది.. కుహనా మేధావులు ఈ ఆధిపత్యాన్ని ఖండించరు కానీ అప్పుడెప్పుడో వేల సంవత్సరాలు క్రితం జరిగిన వాటికి పుంఖాను పుంఖాలుగా రచనలు చేసి జన జాగృతి చేసినట్టు ఫోజు పెడతారు.. అందుకే ఈ దేశం, ఈ రాష్ట్రం ఇలా తగలడింది.. ధన్యవాదాలు..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@voleti - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

hari.S.babu చెప్పారు...

గోవింద నామాలు మాత్రమే వినపడాల్సిన చోట "జై జగన్" అనే అప్రాచ్యపు కూతల్ని సహిస్తున్నపూదే, జగన్ అనే దున్నపోతు చెప్పు లేసుకుని పచార్లు చేస్తుంటే వాడి చెప్పులు మోసుకుంటూ తిరుగుతున్నప్పుడే అనుకున్నా ఇక తిరుపతి వెళ్ళఖ్ఖర్లేదని?!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Hari babu Suraneni - మీ ఆవేదన సహేతుకమైనదే కావచ్చు. కానీ దయచేసి కొన్ని పదాలను ఉపయోగించేటప్పుడు కొంత సంయమనం పాటిస్తే ఆ ధర్మాగ్రహానికి కొంత శోభ చేకూరుతుంది. ఇది నా సలహా మాత్రమే.

Unknown చెప్పారు...

అందుకేనండీ...నేను మా స్వగృహంలో మా అమ్మగారికోసం నిలువెత్తు స్వామిని నిలుపుకొన్నాను...నాకు మా తల్లిదండ్రులు ఆశీర్వాదం చాలనుకొన్నాను