6, మార్చి 2014, గురువారం

ఓటర్ల మేనిఫెస్టో


‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం చంపుకుంటారు.’ – విల్ రోగర్స్
ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక ఉచిత వరాలతో కూడిన ఎన్నో వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి – ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు ముందు ఓ తప్పనిసరి తతంగంగా తయారయింది. కాకపొతే, ఎన్నికల తరువాత మాత్రం మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
‘మీరిలా వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్ నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో. ఇలా ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ‘ఓటర్ల మేనిఫెస్టో’.

1. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి. (మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ‘ఉచిత’ హామీలను యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పాలి.)
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి.
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా రోఖోలు నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలి)
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. ‘త్వంశు౦ఠ అంటే త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత వినోదపు పన్ను’ రాబట్టాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.
గమనిక: ఇవి కేవలం తొలి ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని మనవి

కామెంట్‌లు లేవు: