15, మార్చి 2014, శనివారం

తిరుపతి వెళ్ళొద్దాం రండి - 6

తిరుపతి వెళ్ళొద్దాం రండి - 6
మహాద్వారం నుంచి దేవుడు వుండే గర్భగుడి  యెంత దూరంలో వుందో కాని  నాకుమాత్రం గడప దాటగానే కనిపించాడు.


మాకు ముందు సీనియర్ సిటిజన్లు, వికలాంగుల క్యూ నడుస్తోంది. ఎవరో నా చేయిపట్టుకుని లాగినట్టు అనిపించింది. చూద్దును కదా! చిన్న కుర్రాడు. ఎటో చూస్తూ నా చేయి పట్టుకున్నాడు. అతగాడి మరో చేతిని ఇంకో చేయి పట్టుకుని వుంది. ఆ కుర్రాడి తండ్రిలా వున్నాడు. కనుచూపు పుట్టుకతోనే పోగొట్టుకున్న వారిద్దరూ స్వామి దర్శనం కోసం వచ్చారు. కళ్ళు చమర్చాయి. పోనీలే టీడీడీ  చేయరాని పనులు ఎన్ని చేస్తున్నా ఇదో మంచి పని చేస్తోంది పరవాలేదు  అనిపించింది. ఆ తండ్రీ కొడుకులు మహాద్వారం నుంచి గుడిలో ప్రవేశించారు. వారికి ఈ అవకాశం అదృష్టం  కల్పించిన అధికారులు అభినందనీయులు.
వృద్ధులు ముందు వెళ్ళిపోయినట్టున్నారు.  ముందున్న  దృశ్యం కడు దయనీయంగా అనిపించింది. లోకంలో వున్న అంధులు, వికలాంగులు అంతా అక్కడే వున్నారా అన్నట్టుగా వుంది. కొందరు తడుముకుంటూ అడుగులు వేస్తుంటే, మరికొందరు కాళ్ళు లేని వాళ్లు పారాడుతూ వెడుతున్నారు. దయామయుడయిన దేవుడే వారిని ఆదుకోవాలి. అన్నీ వున్న జనం లేనిదానికోసం ఆరాటపడుతూ లేనిపోని వరాలు కోరుతూ వస్తుంటే, ఏవీ లేని  ఈ శాపగ్రస్తులు ఇలా దైవ కృప కోరుకుంటున్నారు. ఆ దేవుడి పేరుతొ అయినా దేవస్థానం వారు తమ ధార్మిక సంస్థల ద్వారా వారిని ఆదుకుంటే. వూహ బాగుంది. వాస్తవం కావడమే కష్టం. మనసున్నా అదికారులకు సమయం దొరకాలి  కదా!    (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: