1, మార్చి 2014, శనివారం

పాతికేళ్ళనాటి మాస్కో - 6


'జీవితమే ఉచితమూ..'
మాస్కో గురించిన మరపురాని అనుభవం మాకు మంచినీళ్ళతో మొదలయింది.1987 లో మాస్కో బయలుదేరినప్పుడు హైదరాబాద్ లో మంచినీళ్ళకు బాగా కటకటగా వుండేది. తెల్లవారుఝామున ఎప్పుడో ఒక గంటసేపు నల్లాల్లో నీళ్ళు వొదిలేవాళ్ళు. అదీ రెండురోజులకోమారు. తాగే నీళ్ళనూ వాడే నీళ్ళను పరమపొదుపుగా వాడుకునేవాళ్ళం. అలాటి పరిస్తితుల్లో మాస్కో వెళ్ళిన మాకు రాత్రీ పగలూ అని లేకుండా కొళాయిల్లో నీళ్ళు రావడం చూసి మతి పోయింది. బాతురూముల్లో, వంటింటిలో ఎక్కడ చూసినా మంచినీళ్ళ పంపులే. ఒకటి తిప్పితే ఫ్రిజ్ వాటర్ లాంటి చల్లటి, శుభ్రమయిన మంచినీళ్ళు. మరోదాంట్లో పొగలుగక్కే వేడినీళ్ళు. ఈ ఏర్పాటు ఏటిపోడుగునా అందుబాటులో ఉండడమే కాదు, పూర్తిగా ఉచితం కూడా. మాస్కో జీవితంలో మేము ఎన్నో ఉచితాలు రుచి చూసాము. అసలక్కడ- 'జీవితమే ఉచితమూ.. ' అని పాడుకోవచ్చు అని మిత్రులకు ఉత్తరాల్లో రాసేవాడిని.


(విందులు - వినోదాలు) 


పోతే, మాస్కో విషయాలు ముచ్చటించుకునేటప్పుడు మరచిపోకుండా చెప్పుకోవాల్సింది అక్కడి కరెంటు గురించి. మేము అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య అంటే అక్కడివారికి తెలియదు. వంటింట్లో వాడే గ్యాస్ కూడా పైపుల్లో సరఫరా అయ్యేది. సిలిండర్ అయిపోతే ఎట్లారా అన్న బెంగ లేదు. పైగా కరెంటు, నీళ్ళు, గ్యాస్, ఫోన్ అన్నీ ఉచితం. ఇంటి సంగతి సరేసరి. అంత పెద్ద అపార్ట్ మెంటుకు చెల్లించాల్సిన నెల కిరాయి పది రూబుళ్ళు దాటదు.   జీతం మాత్రం అటూ ఇటూగా వెయ్యి రూబుళ్ళు.


( స్త్రీబాలవృద్ధులదే అక్కడ అసలు హవా - అదేమిటో ఇంకో మారు)

కామెంట్‌లు లేవు: