4, మే 2013, శనివారం

ఆరోగ్యశ్రీ కధా కమామిషూ


కొత్త సంవత్సరంలో ఒక సాయంత్రం ముచ్చట్ల సమావేశం

కలిపింది 104,108 పధకాల రూపశిల్పి అయిన ఒక డాక్టరు గారు.

కలిసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి, ఆయనతో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మరో అధికారి. స్టేట్ బ్యాంకులో అత్యున్నత పదవిలో పనిచేసిన ఇంకో అధికారి.  108 లో  కీలక భూమిక పోషించిన ఒక వ్యక్తి,  గుంపులో గోవిందుడిగా నేను సరే. పేర్లు పేర్కొనక పోవడానికి కారణం వేరే ఏమీ లేదు, వారి గౌరవాన్ని మరింత పెంచడానికే. అందరూ అందరే. నీతికీ, నిజాయితీకి ప్రసిద్ధులు, నిబద్ధులు. అందుకే మచ్చ లేకుండా అంతంత పెద్ద అధికార కొలువులు  చేసి  ఉద్యోగ విరమణ అనతరం  గుండె మీద చేయివేసుకుని  హాయిగా నిద్ర పోగలుగుతున్నారు.   

ఈ మధ్య అంటే అంతగా కుదరడం లేదు కాని వీరితో సాయంకాలక్షేపాలు నాకు గతంలో మామూలే.

మాటల నడుమ ఆరోగ్యశ్రీ  ప్రస్తావన వచ్చింది.

మాటల్లో మాటగా తెలియవచ్చిన ఆరోగ్యశ్రీ  నేపధ్యం ఏమిటంటే –




ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం

ఉదయం వేళల్లో సీఎం సాధారణ ప్రజలను కలుసుకునే సమయం.

సీఎం ఒక్కొక్కర్నీ కలుసుకుంటూ, వారినుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ, వాటికి తగిన హామీలను ఇస్తూ, సంబంధిత పేషీ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖకు కొత్తగా ఒక అధికారి వచ్చారు. విషయ అవగాహన కోసం ఆయన కూడా ఆ సమయంలో ముఖ్యమంత్రి వెంట వున్నారు.

సీఎం ను స్వయంగా కలసి కష్ట సుఖాలను చెప్పుకోవడానికి వచ్చిన ఆ మహా జనంలో ఒక అమ్మాయి కూడా వుంది. అయితే వచ్చిన కష్టం ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి అమ్మది. అది కూడా మామూలు కష్టం కాదు. తీవ్రమయిన ఆరోగ్య సమస్య. మామూలు మనుషులే కాదు కలిగిన వారిని కుదేలు చేసే క్యాన్సర్. ఆవిడను   చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి కన్న కూతురు తీసుకువచ్చింది.

ముఖ్యమంత్రి అమ్మాయి చెప్పింది సావధానంగా విన్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. విషయం అర్ధం అయింది. ఏం చేసినా ఆవిడ బతికే అవకాశాలు శూన్యం.

కానీ మరోపక్క మా అమ్మ నాకు కావాలి. అనే ఆ అమ్మాయి విలాపం.

వైద్యం చేయిస్తాను. కానీ వ్యాధి ముదిరిపోయింది. ప్రయోజనం వుండకపోవచ్చు అన్నారు ముఖ్యమంత్రి.

ఆరు నెలలు బతికినా చాలు, నా కన్న తల్లి నా కళ్ళ ముందు వుంటే అదే పదివేలు అన్నదా అమ్మాయి.

చనిపోతుందని, ఇంకా ఎంతో కాలం బతకదనీ నాకూ తెలుసు. కానీ వైద్యం చేయించకుండా వుండలేము కదా! అంది కూడా.

ఆ మాటతో కంగుతిన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నారో యేమో! కాకపొతే,  ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఆయన ముఖమే చెబుతోంది. 

ఏం చేద్దాం అన్నట్టు అధికారులవైపు చూసారు, ఏదయినా చేసి తీరాలి అన్నట్టుగా.         

ఎవరికీ ఏం చేయాలో, ఏం జవాబు చెప్పాలో తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత సాయం చేసినా అది అరకొరే.

ఆ అమ్మాయిని మరునాడు రమ్మన్నారు. సీఎం  అధికారులతో మాట్లాడారు. ఇలాటి అభాగ్యులకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి ఒక పరిష్కారంతో రమ్మన్నారు.

అరకొర సాయాలతో అభాగ్యులకు ఒరిగేదేమీ వుండదు. డబ్బున్న వారికీ, అది లేని వారికీ కూడా జబ్బులు వస్తాయి. వున్నవారికీ, లేనివారికీ ఒకే రకంగా వైద్య సదుపాయం అందించే అవకాశం లేదా? ప్రభుత్వం ఏమీ చేయలేదా?

ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ఆరోగ్యశ్రీ

 

(08-01-2013)

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అయనకు అంతవరకూ పేదల కష్టాలే తెలియనట్టు, ముఖ్యమంత్రి అయ్యాక గౌతమ బుద్ధునిలా ప్రజల బాధలు చూసి చలించిపోయినట్టు బిల్డప్పు, కథ బాగా వుంది. జలయజ్ఞం, అవుటర్ రింగురోడ్డు వంపులు, ఇందిరమ్మ ఇళ్ళు, సెజ్‌లు, బ్రాహ్మణి స్టేలు, జగన్ బినామీ కంపెనీల వెనక అలా చలించిపోయి ప్రజాక్షేమం కోసం చేసినట్టు కథలు రాయించి మరీ ప్రచారం చేయాలి.

అజ్ఞాత చెప్పారు...

సిగ్గు ఎగ్గు కొద్దిగా ఐనా ఉండాలి మాష్టారు, మీ దృష్టిలో నీతి నిజాయితీ అంటే ఇదిగో ఇట్టా అబద్ధాలని ప్రచారం చెయ్యడమేగా గుడ్

అజ్ఞాత చెప్పారు...

These Comments are better than Post.

అజ్ఞాత చెప్పారు...

mundu vakyalu rasinayana digest chesukolekundadu papam eenadu/Abn lo edi raste ade correct anukuntunnadu ayya prajalaku thelusu evaru gauthama buddudo