11, మే 2013, శనివారం

కిం కర్తవ్యం ? రాష్ట్రంలో రాజకీయ పార్టీల మీమాంస - భండారు శ్రీనివాసరావు



వై.ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం  ఇప్పట్లో  లేదని తేలిపోయింది. అంతేకాదు,  ఇంకెంతకాలం జెయిల్లో వుండాల్సి వస్తుందో ఇతమిద్ధంగా చెప్పలేని పరిస్తితి కూడా ప్రస్తుతం ఏర్పడింది.  నాలుగు నెలలే కాదు అవసరమయితే మళ్ళీ గడువు పెంచమని న్యాయస్థానాన్ని కోరతాం అని సీబీఐ లాయరు చెప్పిన  నేపధ్యంలో ఆ పార్టీ అధ్యతన భవిష్యత్తు గురించి ఆ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇతర ప్రత్యర్ధి పార్టీల్లో కూడా చర్చ మొదలయింది.
జాతీయ పార్టీల సంగతి వేరు కాని ప్రాంతీయ పార్టీలకు నాయకుడి అవసరం ఎక్కువ. పార్టీని నమ్ముకున్నవారికి పార్టీ అధినాయకుడు అందుబాటులో వుండడం అన్నది ఆ పార్టీకి కలసి వచ్చే అంశం. పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి  జైల్లో  వుంటున్నప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ ప్రబలడం సహజం. నిరాశ నిరాసక్తతగా మారి  నిస్పృహగా పరిణమించితే అది పార్టీ బలహీన పడడానికి దోహదం చేస్తుంది. ఇటీవలికాలంలో తారాజువ్వలా ఎదిగివచ్చిన వై.ఎస్.ఆర్. పార్టీని అడ్డుకోవడం,  అదుపుచేయడం ఎలాగో  చేతకాక తలలు పట్టుకుంటున్న మిగిలిన పార్టీలకు జగన్  మరికొంతకాలం, అదికూడా  ఎంతకాలం అన్నది తెలియనంతకాలం జైలు నాలుగు గోడల  నడుమే  వుండిపోవడం  కొంతవరకు  కలసివచ్చే విషయం. కనీసం మరో కొన్ని మాసాలపాటు జగన్ కు జైలు జీవితం తప్పదన్న  సంకేతాల దరిమిలా దొరికిన రాజకీయ ‘అవకాశాన్ని’ పూర్తిగా వాడుకోవడానికే ఇటు కాంగ్రెస్ అటు తెలుగుదేశం సంసిద్ధం అయినట్టే  కనబడుతోంది. జగన్ పై  ఎక్కుబెట్టిన అవినీతి ఆరోపణలను జనం యెందుకు పట్టించుకోవడం లేదని మధన పడుతున్న ఆ పార్టీలకు జగన్ జైల్లో వున్నప్పుడే పరిస్తితులను తమకు అనుకూలంగా చక్కదిద్దుకోవడం  ఒక తప్పనిసరి రాజకీయ అవసరంగా మారింది.  జనం ముందు నమ్మకపోయినా కాలం గడుస్తున్నకొద్దీ, అతడిపై పెట్టిన అవినీతి ఆరోపణల కేసు వివరాలు ఒక్కొక్కటిగా బయటపడేకొద్దీ ప్రజలు కొంతమేరకయినా మనసు మార్చుకునే  అవకాశం వుంటుందన్నది  కాంగ్రెస్ వ్యూహకర్తల్లో కొందరి ఉద్దేశ్యం. ఈ లోగా జారిన కాలును కూడదీసుకుని రకరకాల ఆకర్షక పధకాల ద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేయవచ్చన్నది కూడా వారి వ్యూహంలో భాగంగా తోస్తోంది. పార్టీ శ్రేణులను కట్టడి చేయడానికి, ప్రజలను ఆకట్టుకోవడానికీ ఇతర పార్టీల వద్ద లేనిదీ, తమవద్ద మాత్రమే వున్నదీ ఏమిటో వారికి తెలియనిది కాదు. ‘అధికారం’ అనే ఒకే ఒక బ్రహ్మాస్త్రంతో అటు పార్టీ కార్యకర్తలను, ఇటు జనాలను దగ్గర చేసుకోవచ్చని, ప్రజలకు మళ్ళీ దగ్గర కావచ్చనీ ఆలోచిస్తున్నట్టుగా  తోస్తోంది. చేతిలో అధికారం లేకుండా వుత్త చేతులతో  ఎవరు జనాలదగ్గరకు పోయి ఏవి చెప్పినా అవి కల్లబొల్లి మాటలే అని, ఏదేదో  చేస్తామని ఎవరు ఏదయినా  మాట ఇచ్చినా అది నెరవేర్చలేని  శుష్క వాగ్దానమే అనీ,   అధికారం చేతిలో వున్న తమ పార్టీ మాత్రమే ఏం చెప్పినా వెంటనే చేయగలుగుతుందని  అంటూ జనంలోకి  వెడితే ప్రజలు తమని మాత్రమే నమ్ముతారని వారి నమ్మకం. ఒక రకంగా ఇది నిజం కూడా. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తమ విమర్శలతో ఎండగట్టగలవు కానీ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపలేవు. అలాగే పార్టీ కార్యకర్తలను, కింది స్తాయి నాయకులను కట్టడి చేయడానికీ, ఆకట్టుకోవడానికీ  పాలక పక్షానికి వున్న వెసులుబాటు, వనరులు  ప్రతిపక్షాలవద్ద వుండవు.
కాంగ్రెస్ వ్యూహకర్తల ఎత్తుగడలు ఇలావుంటే  పార్టీలో  నాయకుల కీచులాటలు ముదిరి పాకాన పడుతూ వుండడం ఆ పార్టీ కి వున్న పెద్ద మైనస్ పాయింటు. పార్టీ అధికారంలో వుండాలని, మరో మాటు  అధికారంలోకి రావాలని   ఆ పార్టీలో అంతా  కోరుకుంటారు కాని ఎటొచ్చీ ఆ అధికారం తమ ‘చేతిలో’ మాత్రమే  వుండాలని  కాంగ్రెస్ లో  ప్రతి ఒక్క నాయకుడు మరింత గట్టిగా కోరుకుంటాడు. తమకు దక్కని అధికారం పార్టీలో తమ ప్రత్యర్ధికి కూడా దక్కకూడదని  అనుకోవడం కూడా ఆ పార్టీలో  పరిపాటే. మూడోసారి వరసగా  ప్రభుత్వంలోకి రావడం  అంత సులభం కాదని కూడా తెలుసు కాబట్టి  ఎన్నికల్లో  తమ వ్యక్తిగత  గెలుపుకోసం ఏమయినా  కష్టపడతారేమో  కాని మొత్తం పార్టీని గట్టెక్కించడానికి తమకున్న స్తోమతను, సంపదను  ఖర్చు చేసే నాయకులు  కాంగ్రెస్ లో తక్కువమంది వుంటారు. ఒకవేళ  పార్టీ గెలిచినా అధికార  పగ్గాలు తమ చేతికే వస్తాయన్న నమ్మకం కాంగ్రెస్ లో ఏ ఒక్క నాయకుడికీ లేకపోవడమే ఈ నిర్లిప్తతకు కారణం.  మొత్తం పార్టీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను భుజాలకెత్తుకోవడానికి సిద్ధంగా వుండరు. ఎందుకొచ్చిన  కంచి గరుడ సేవ అని మిన్నకుండిపోతారు. అయితే గియితే, ఎదోరకంగా పార్టీ  గెలిస్తే అప్పుడు ఢిల్లీ వెళ్లి తేల్చుకోవచ్చు అంతే  కాని ఇప్పటినుంచి అనవసర లాయలాస ఎందుకనే తత్వం వారిది. ఈ నేపధ్యం వల్లనే, సరయిన నాయకత్వం కొరత కారణంగానే,  వరసగా రెండోసారి గెలిపించినా  తమకు దూరం కావడం మినహా దగ్గరయ్యే కనీస ప్రయత్నం కూడా ఆ పార్టీ చేయడం లేదన్న అభిప్రాయం జనాల్లో వుంది. ఈ ప్రభుత్వ  వ్యతిరేక వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ, వై.ఎస్.ఆర్. పార్టీలు ఓ పక్క పోటీ పడుతూనే మరో పక్క ఒకరిపై ఒకరు  కత్తులు దూసుకుంటున్నారు. ఇది కూడా  ఒక రకంగా కాంగ్రెస్ కు కలసి వచ్చే అంశమే. కానీ, దాన్ని వాడుకునే తీరిక, ఓపిక ఆ పార్టీ నాయకులకు లేవు. తమలో తాము కుమ్ములాడుకుంటూ అసలే  బలహీనంగా వున్న పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చే పనితోనే వారికి సరిపోతోంది.            

పోతే, తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరోరకం. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొనివున్న పరిస్థితుల్లో  టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చున్నా గెలిచి తీరాలి. వాతావరణం అంత అనుకూలంగా వుంది.  పాలక పక్షంపై నానాటికీ పెరిగిపోతున్న వ్యతిరేకతను అడ్డం  పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గి , తిరిగి  అధికారంలోకి రావడం అనేది తెలుగుదేశం పార్టీకి నల్లేరు మీది నడక కావాల్సిన పరిస్తితి.  కానీ, దురదృష్టం ఏమిటంటే టీడీపీకి దక్కాల్సిన ఈ బంగారు అవకాశాన్ని  కాస్తా కొత్తగా పుట్టుకొచ్చిన వై.ఎస్.ఆర్. పార్టీ ఎగరేసుకుని పోతుంటే నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవాల్సిన దుస్తితిలో ఆ పార్టీ కూరుకుపోతోంది.   2009  అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కూడా తెలుగుదేశం పార్టీది ఇదే అనుభవం.  అప్పటి ఎన్నికల్లో ‘విజయం ఖాయం, అడుగు దూరంలో అధికారం’ అని   టీడీపీ పెంచుకున్న ఆశలపై  ఆ రోజుల్లో కొత్తగా పుట్టుకొచ్చిన  ప్రజారాజ్యం పార్టీ  నీళ్ళు చల్లింది.  తను గెలవకపోగా తమ గెలుపుకు ఆ పార్టీ గండి కొట్టిందన్న అభిప్రాయంతో వున్న  తెలుగు దేశం పార్టీకి, ఇప్పుడు మళ్ళీ  జగన్ రూపంలో అదే పరిస్తితి ఎదురవుతోంది. ఈ నిజం జీర్ణించుకున్నారు  కాబట్టే టీడీపీ నాయకులకు ఇప్పుడు జగనే  ప్రధాన ప్రత్యర్ధిగా కనిపిస్తున్నాడు.
2014 అసెంబ్లీ  ఎన్నికలకు ఏడాది పైచిలుకు వ్యవధానం మాత్రమే మిగిలి వుంది. మీనమేషాలు లెక్కించే వీలుసాళ్లు  ఇప్పుడు ఏపార్టీకి లేవు. అందరికీ ఎన్నికల పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కొందరు రాజకీయ పండితులు వూహించేదే నిజమయితే ఎన్నికల ఘంటారావం అనుకున్నదానికన్నా  ముందే వినబడే అవకాశం వుంది. అంటే ఎలాచూసినా అన్ని పార్టీలకి గడువు దగ్గర పడిందనే చెప్పాలి. అందుకే యాత్రల  పేరుతొ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసాయి. ఈ విషయంలో టీడీపీ కొంత ముందుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేసి ఓ రికార్డు నెలకొల్పారు. జనం మధ్యనే వుండడానికి  అలవాటుపడిన జగన్ మోహన రెడ్డికి  జైలు నుంచి బయటపడే సావకాశం ఇప్పట్లో లేదని తేలిపోవడంతో వై.ఎస్.ఆర్. పార్టీ నేతలు కూడా వై.ఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిలను  ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతొ    పాదయాత్రకు రంగంలోకి దింపి నడిపిస్తున్నారు..
చంద్రబాబు నాయుడు తన వయసుకు పొసగని  భారమయిన  బాధ్యతను మీదికెత్తుకుంటే, వై.ఎస్.ఆర్. పార్టీ తరపున ఆ పార్టీలో ఎటువంటి వ్యవస్తాగతమయిన హోదాలేని షర్మిల తలకు మించిన భారాన్ని తలకెత్తుకుంది. ఈ యాత్రల్లో ఓ రెండువారాలు ముందున్న చంద్రబాబునాయుడు దానికి తగ్గట్టుగానే కొంత మైలేజీ  సంపాదించుకున్నారు. యాత్రకు ముందు తలెత్తిన  సందేహాలను పటాపంచలు చేస్తూ బాబు పాద యాత్రకు ప్రజలనుంచి వచ్చిన మంచి స్పందన ఆ పార్టీ నాయక శ్రేణులకు కొత్త వూపిరి పోసింది. ఈ రెండు పాదయాత్రలు ఒకదానికొకటి పోటీగా మారి ఎన్నికల వాతావరణాన్ని ముందే తెచ్చిపెట్టాయి.
ఈసారి ఎవరితోనూ జట్టు కట్టేదిలేదని, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు తేల్చి చెప్పారు. కానీ ఇతర పార్టీల నుంచి వలసలకు మాత్రం అడ్డుచెప్పక పోగా తనదయిన శైలిలో పచ్చజెండా చూపుతూనే వున్నారు. ఆయన ఎప్పుడు యే ఎత్తు వేస్తారో ఆ పార్టీలోవారికే తెలవదు. వాళ్లకు తెలిసిందల్లా తెలంగాణా వాదం బలంగా వున్నంతకాలం అదే శ్రీరామ రక్షగా కాపాడుతుందని మాత్రమే.       
కాకపొతే కర్నాటక ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని పాదుకొల్పాయి. ఫలితం  చూసి సంబరపడుతున్నారు కాని అక్కడ బీజేపీ వోటమికి ప్రభుత్వ వ్యతిరేకత బాగా దోహదపడ్డ సంగతి   మరచిపోతున్నారు. ఇక్కడ అంతా సజావుగా వుందని మురిసిపోతున్నారు. కర్నాటక ఫలితాలే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పునరావృతం అవుతాయన్న భ్రమలనుంచి బయట పడలేకపోతున్నారు. అంతా తమ ‘చేతిలో’ వుందని నమ్ముతూ, వరస కుంభకోణాల  వెలుగుల్లో యూపీయే సర్కారుకు అంటుకున్న మసి, మరకలు మరింత స్పష్టంగా జనం చూస్తున్నారన్న విషయాన్ని మాత్రం  గమనించడం లేదు. మరక మంచిదే అనే టీవీ ప్రకటన వాళ్లకిప్పుడు మార్గదర్శి. (11-05-2013)

కామెంట్‌లు లేవు: