18, మే 2013, శనివారం

హూష్ కాకి



వార్త : తెలంగాణా అంశం యూపీయే ఎజెండాలో లేదు – ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో
వ్యాఖ్య : శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు నేను రాసిన ఈ వ్యాసం      
“మాయాబజార్ సినిమాలో శ్రీ కృష్ణుడు బలరామాదులకు ప్రియదర్శిని పేటికను ప్రదర్శిస్తాడు. ఆ పెట్టె తెరచి చూసినవారికి వారి మనసులో ఏమి కోరుకుంటున్నారో అదే  అందులో  కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీ కృష్ణ  కమిటీ కూడా సరిగ్గా  అదే చేసింది. వివాదంతో సంబంధం వున్న వారందరికీ తాము కోరుకున్నవిధంగానే కమిటీ సిఫారసులు వున్నాయనే భ్రాంతి కలిగేలా  వేర్వేరు సూచనలకు రూపకల్పన చేసి జస్టిస్ శ్రీ కృష్ణ తన పేరుకు తగినట్టు కృష్ణలీలను ప్రదర్శించారు. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షుభిత పరిస్తితికి పరిష్కారంగా ఆరు ప్రత్యామ్నాయాలు సూచించి మరో సరికొత్త చర్చకు తెర తీసారు.
పది నెలల నిర్విరామ కృషి, ఆరువందల పైచిలుకు పేజీలు, రెండు సంపుటాలు, ఆరు సిఫారసులు స్తూలంగా ఇదీ శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్.  పైగా తాను చేసిన ఆరు సిఫార్సుల్లో  మొదటి మూడు   ఆచరణ సాధ్యం కావనీ, నాలుగోదానికి సర్వజనామోదం  కష్ట సాధ్యం అనీ  కమిటీ నివేదికలోనే  సన్నాయి  నొక్కులు నొక్కారు.
రాష్ట్రాన్ని ఇప్పుడున్న రూపంలోనే కొనసాగించాలని మొదటి సిఫారసులో పేర్కొంటూనే  దీనివల్ల తెలంగాణాలో భావోద్వేగాలు పెచ్చరిల్లగలవని, తద్వారా ఏర్పడగల అనిశ్చితిని  మావోయిస్టు ఉద్యమం తనకు అనుకూలంగా మార్చుకునే వీలుందని భాష్యం చెప్పి తాను చేసిన తొలి సూచనకు తానే ఇంటూ మార్క్ పెట్టింది.
రెండో సిఫారసు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణా వాదులు ససేమిరా వొప్పుకోరన్నది కూడా కమిటీ తన అభిప్రాయంగా పేర్కొన్నది.
పోతే, రాయల తెలంగాణా, కోస్తాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించాలన్నది  మూడో సూచన. అయితే దీన్ని రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారు అంగీకరించే  అవకాశం వుండదని కూడా కమిటీయే చెప్పింది.
హైదరాబాదు నగర పరిధిని బాగా విస్తరించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించి, రాష్ట్రాన్ని రెండుగా విభ జించాలనేది నాలుగో ప్రతిపాదన. కానీ, ఉభయ ప్రాంతాలలో ఏఒక్కరికీ ఇది ఆమోద యోగ్యం కాకపోవచ్చని కమిటీ సిఫారసుల సంఖ్యను రెండుకు కుదించే ప్రయత్నం చేసింది.
ఇక అయిదో సిఫారసు రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం. ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచీ తెలంగాణా ప్రాంతంలో పాతుకుపోయివున్న కొన్ని సహేతుక అసంతృప్తులను పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అసంబద్ధం కాదని ఓ పక్క  చెబుతూనే, దీనివల్ల  దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు ఊతం ఇచ్చినట్లయి, అంతర్గత భద్రతపై  ప్రతికూల ప్రభావం పడగల  ప్రమాదాన్ని ఎత్తిచూపింది. తప్పనిసరి అయితేనే విభజనకు శ్రీకారం చుట్టాలన్నది కూడా ఈ ప్రతిపాదనలోని కొస మెరుపు.
పోతే, క్రమంలో చివరిదేకానీ ప్రాధాన్యతా క్రమంలో చిన్నది కాదన్నట్టుగా ఆఖరి ఆరో ప్రతిపాదన చేస్తూ ఇదే తమ ప్రతిపాదనలు అన్నింటిలో అత్యుత్తమమైనదని కమిటీ తనకు తానుగానే ఒక  కితాబును దానికి  జత చేసింది. రాష్ట్రాన్నిఇప్పటి మాదిరిగా  సమైక్యంగానే వుంచి తెలంగాణా అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమయిన చర్యలు తీసుకోవాలన్నది ఆరో ప్రతిపాదన సారాంశం.
రాగల పరిణామాలను గురించి రాయబారం సీనులో అలనాటి  శ్రీ కృష్ణుడు కౌరవాదులను హెచ్చరించినట్టు ఇలనాటి కృష్ణుడు తన కమిటీ చేసిన ఆరు సిఫారసులను అమలు చేయడం వల్ల వొనగూరే ఫలితాలను, పరిణామాలను అంశాలవారీగా నివేదికలోనే తేటతెల్లం చేయడం జరిగింది. ఇంతకీ కృష్ణ కమిటీ ఏమి చెప్పినట్టు, ఏమి తేల్చినట్టు అనే ప్రశ్నలను అందరికీ వొదిలిపెట్టి – ‘సమైక్యమా? విభజనా?’ అన్న అంశం దగ్గరికే సమస్యను  తీసుకువచ్చి భూమి గుండ్రం గా వుందిఅన్న సామెతను నిజం చేసింది.
నివేదికను స్వీకరించిన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆరో తేదీ సమావేశానికి వచ్చిన పార్టీలకు నివేదిక ప్రతులను పంచిపెట్టి, బహిష్కరించిన పార్టీలకు స్పీడ్ పోస్ట్ లో పంపించి, ప్రభుత్వ వెబ్ సైట్ లో సయితం దాన్ని పెట్టి చేతులు కడిగేసుకున్నారు. నివేదికను ఆషామాషీగా కాకుండా క్షుణ్ణంగా చదవండి అని ఒక సలహా కూడా ఇచ్చారు. బాగా అధ్యయనం చేసాక మరోసారి కలుసుకుని మాట్లాడుకుందామని అందర్నీ ఆహ్వానించారు. ఈ మొత్తం ప్రక్రియను గమనించిన వారికి కేంద్ర ఆచి తూచి వ్యవహరిస్తున్నది అన్న భావన కలగడానికి బదులు ఏదో విధంగా వాయిదా మంత్రం పఠించడం మొదలు పెట్టిందన్న అనుమానమే ఎక్కువ కలుగుతోంది.   
ఇక రాష్ట్రంలో ఈ అంశంపై తలలు పట్టుకుంటున్న పార్టీలలో మెజారిటీ పార్టీలు, కృష్ణ కమిటీ రిపోర్ట్ రాగానే దానికి కట్టుబడి వుంటామని ఇంతవరకు చెబుతూ వచ్చాయి. కానీ నివేదికలో ఏదో ఒకటి తేల్చకుండా, ఇదమిద్ధంగా ఒకే ఒక  సిఫారసు  చేయకుండా వెసులుబాటు కల్పించడంతో తిరిగి అందరు పాత పల్లవినే అందుకుంటున్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల్లో రెండు  ప్రాంతాలకు చెందినవాళ్ళు అధిష్టానందే అంతిమ నిర్ణయం అంటూనే తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. విషయాన్ని ఇంకా నానుస్తూ పోవడం వల్ల ఇరు ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని  బాహాటంగా ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్, టీడీపీ లు ఎదుర్కుంటున్న ఇరకాట పరిస్తితిని వేర్పాటువాదులు వాటిపై వొత్తిడి పెంచడానికి వుపయోగించుకునే ప్రయత్నం మొదలయింది. ప్రత్యేక తెలంగాణా  అన్నది సాకారం కావడానికి ఉద్యమం యెంత వూపు తేగలిగినా అంతిమంగా రాజకీయ నిర్ణయం ద్వారానే అది  సాధ్యం అన్న ఎరుక వారికి లేకపోలేదు. అందుకే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన దరిమిలా ఉత్పన్నమయిన పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వారు మళ్ళీ నడుం బిగిస్తున్నారనేది తేటతెల్లం. ప్రస్తుత అసందిగ్ధ స్తితికి కాంగ్రెస్, టీడీపీ లను ప్రధాన బాధ్యులుగా చేసి ఆ పార్టీల లోని తెలంగాణా అనుకూలుర చేత  వారి అధినాయకత్వంపైనే  వొత్తిడి తీసుకు వచ్చేలా చేయడం ఇప్పుడు వారి వ్యూహంగా కానవస్తోంది. అనివార్యం అయితేనే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన సిఫారసు చేయాలని, అన్ని ప్రాంతాల నడుమ సయోధ్య సాధ్యమయితేనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని కమిటీ చేసిన సూచనను తెలంగాణావాదులు ఎంతమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నివేదిక ఈ రూపంలో రావడానికి సీమాంధ్ర వ్యాపార రాజకీయుల హస్తం వుందని  వారు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టడం మినహా తెలంగాణా కోరుకుంటున్నవారిని మరేదీ సంతృప్తి పరచలేదన్నది వారి నిశ్చితాభిప్రాయంగా కానవస్తోంది.
శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వల్ల అసలు సమస్య ఏమేరకు పరిష్కారం అవుతుందన్నది అనుమానాస్పదమే. కాకపొతే, అగ్రహారం పోయినా యాక్ట్ మొత్తం తెలిసివచ్చిందన్న సామెత చందాన రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలతో పాటు విద్య, వైద్యం, సేద్యం మొదలయిన అన్ని రంగాలలో ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిననాటినుంచి ఇంతవరకు  రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించిన వివరాలు ప్రాంతాల వారీగా ఈ నివేదికలో పొందుపరచి సమగ్రమయిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పదినెలల కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి, సమాజంలో విభిన్న వర్గాలవారిని కలుసుకుని సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలోని గణాంకాలు వాస్తవపరిస్తితులకు పూర్తిగా అద్దం పట్టేవిగా వుండక పోవచ్చుకానీ, మొత్తం మీద ఒక స్తూలమయిన అవగాహనకు చదువరులు రావడానికి వీలుగా ఈ నివేదిక ఉపకరించగలదని భావించవచ్చు. వివిధ ప్రాంతాలలో ప్రగతి గురించి, వెనుకబాటుతనం గురించి ప్రస్తుతం వున్న అపోహలు, అనుమానాలు కొంత మేరకయినా తొలగించుకోవడానికి ఈ నివేదిక దోహదం చేస్తుంది.
చివరిగా ఒక మాట. సమస్యకు స్పష్టమయిన  పరిష్కార మార్గం చూపకపోయినా, కమిటీ ఒక నిర్దిష్టమయిన సూచన మాత్రం  చేసింది. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తనకు ఇచ్చిన గడువును  ఏదో ఒక సాకు చూపి పొడిగించుకోకుండా, ఒక రోజు ముందుగానే  నివేదికను సమర్పించి నిబద్ధతను నిరూపించుకున్న  శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఈ సూచనను  సర్కారు పరిగణనలోకి తీసుకోవాలని ఆశిద్దాం.

కామెంట్‌లు లేవు: