9, మే 2013, గురువారం

అమ్మ – మదర్స్ డే – భండారు శ్రీనివాసరావు




                                  
                   
         
(మా అమ్మగారు కీర్తిశేషులు భండారు వెంకట్రావమ్మ గారు)
  

 (In India, Mother's Day is observed every year on second sunday of May ie: 12-05-2013)

అమ్మ అన్న దేవత లేకపోతే-
ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు.
రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా  తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో రోజును ఇచ్చింది.
అదే,   మదర్స్ డే   మాతృమూర్తి దినోత్సవం.
దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.
అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే  అదీ రెండో ఆదివారం నాడే    ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.
తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.

సంవత్సరంలో ఒక రోజుని మదర్స్ డే గా గుర్తింపు సాధించడానికి  దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే  తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.


అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు  1890  లోనే తాను నివసిస్తున్న   గ్రాఫ్టన్ నగరం వొదిలి  ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే  ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి  చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకి  మదర్స్ డే గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూనింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి  అన్నా రీవేస్ జార్విస్ మరణానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదులాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం - కూతురు అన్నా జార్విస్ కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా ఆ తరవాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరాటం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.
ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని  వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు  రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో మదర్స్ డే అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత1914 లో  అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగివచ్చి  ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం  ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ మదర్స్ డేఉత్తర్వులో ఒక విశేషం వుంది.  మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్  ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే  ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమె గౌరవించుకునే రోజుగా  కాకుండా  అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా మదర్స్ డే ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో మదర్స్ డే రాసేటప్పుడు  ఏకవచనంలో అంటే తల్లి దినోత్సవంగా పేర్కొంటారు.
మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. మదర్స్ డే నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది  మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ -  జార్విస్ చేసిన  విజ్ఞప్తులన్నీ  తల్లి పాలను సయితం లాభాలకు అమ్ముకోవాలనే మార్కెట్ శక్తులఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్  పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే  1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన  పరిస్తితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో  ఆ తల్లి సమాధి చెంతనే అన్నా  జార్విస్ ని    ఖననం చేయడం ఒక్కటే ఆమెకు దక్కింది.

అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా  మదర్స్ డే జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.
మదర్స్ డే నాడు  తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా  ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి  ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే.     అలా కుదరని పక్షంలో  గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు  రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్తలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ
పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు.
మదర్స్ డే నాడు గుడికి వెళ్ళాల్సిన పనిలేదు. ఇంట్లో వెలిసివున్న మాతృదేవతకు నమస్కరించండి. ముక్కోటి దేవతలు మీ పూజలందుకుంటారు. ఇది సత్యం.


కామెంట్‌లు లేవు: