ఇది జరిగి నలభయ్ ఏళ్ళు కావస్తున్నది.
పోలీసు సాక్షిగా ఉద్యోగ విజయాలు పేరిట తమ వృత్తి జీవితపు వ్యాపకాల జ్ఞాపకాలను ఆసక్తికరంగా రాసి గ్రంథస్తం చేసిన రిటైర్డ్ ఐపీయస్ అధికారి రావులపాటి సీతారామారావు గారు, తన ఉద్యోగ జీవితం తొలినాళ్ళలో విజయవాడకు రూరల్ డీఎస్పీ గా వచ్చారు. అప్పుడు నేను ఆంద్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా సీనియర్ పోలీసు అధికారి అయినా ప్రవృత్తి రీత్యా రచయిత కావడంవల్ల సాటి రచయితలను కలుసుకోవాలనే ఆసక్తి వుండేది. విజయవాడ రచయితలకూ, ప్రచురణకర్తలకూ పుట్టినిల్లు కావడం మూలాన ఈ చిరు కోరిక తీర్చుకోవడం కష్టమేమీకాలేదు. ఇలా చిన్నా పెద్దా రచయితలను కలుసుకునే చక్రభ్రమణంలో ఒకరోజు మాకు - అప్పటికే బాగా చేయి తిరిగిన బోలెడు పెద్ద నవలాకారుడు తారసపడ్డారు. ఉభయకుశలోపరి - పరస్పర పరిచయాలనంతరం సీతారామారావు గారు- ఆంద్ర పత్రిక వారపత్రికలో రాసిన కొన్ని కధలు గురించి నేను ఆ రచయిత గారితో మాటవరసకు ప్రస్తావించాను.
‘నేను ఇతరులు రాసిన కధలు చదవనండీ” అని ఆయన కుండబద్దలుకొట్టినట్టు మొహం మీదే అనేశారు. ‘అలా చదవడం వల్ల వారి రచనల ప్రభావంతో మనం రాసేవాటిలో క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం వుంది’ అని ఒక ధర్మ సూక్ష్మం కూడా బోధించారు. తాను రాసినవి మాత్రమె తాను చదివే ఆ పెద్ద మనిషి ప్రబోధం వల్లనో ఏమో కానీ ఈ నడుమ చాలామంది ఇతరులు రాసినవి ఏమాత్రం పట్టించుకోకుండా తామే రాసే పనిలో పడిపోతున్నట్టుగా వుంది. బహుశా నేను కూడా ఆ అమాంబాపతు వాళ్ళల్లో ఒకడినేమో.
ఇది జ్ఞాపకం రావడానికి ఒక నేపధ్యం వుంది. చదివేవాళ్ళు బొత్తిగా తగ్గిపోతున్నారని ఒక సంపాదక మిత్రుడు ఈ మధ్య మాటల సందర్భంలో అన్నారు. ఆయన ఆందోళన చెందడానికి వేరే కారణాలు వుండవచ్చు. ఇంతమంది ఇలా రెండు చేతుల్తో పుంఖానుపుంఖాలుగా రాసేస్తూ వాటిని ప్రచురణార్ధం పంపించేస్తూ (ఈరోజుల్లో పోస్ట్ ఖర్చుల బెడద కూడా లేదు – నెట్లో రాసేసి క్లిక్ చేస్తే చాలు - బంతి ఎడిటర్ కోర్టులో పడేసి చేతులు దులిపేసుకోవచ్చు) మా ప్రాణాలు తోడే బదులు వీరిలో కొంతమందయినా చదివే సద్బుద్ధిని అలవరచుకుంటే తమ పత్రిక సర్క్యులేషన్ పెరగకపోతుందా అన్నది ఆయన బాధలోని మరోకోణం కావచ్చు.
‘ఇలా రాసేసి అలా పంపేసి నా కధ వచ్చేవారం వీక్లీలో అచ్చేస్తారా’ అని వేధించుకు తినేవాళ్ళతోనే కాలం చెల్లిపోతోంది. ఇక మంచి కధల ఎంపికకు సమయం ఎక్కడ?’ అని కూడా సంపాదక మిత్రుడు బాధపడ్డాడు. నిజమే ఎవరి ఇబ్బందులు వారివి. పీత కష్టాలు పీతవి.
ఒక వర్ధమాన రచయిత అభిప్రాయం వేరేలావుంది. “ఎన్నాళ్ళు ఇలా చదువుతూ గడుపుతాం గురూగారూ! ఆ మాత్రం మనం రాయలేమా అని ఓ మంచిరోజు చూసి కలం పట్టేసాను” అన్నాడతగాడు.
“మనం రాసింది మనం చదువుకోవడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు, ఇక వేరేవారి రచనలు చదివే వ్యవధి ఎక్కడుంది మాస్టారూ!” అని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చాడు. ఏ పత్రికలో రాస్తుంటాడని మరీ హైరాన పడకండి. స్వయంగా రాసినవాటిని సొంతంగా చదువుకోవడానికి స్వయానా ఒక బ్లాగు పెట్టుకున్నాడు. బ్లాగుల లోకంలో రాసినవారికి రాసినంత – చదివేవారికి చదివినంత.
ఓ పాతికేళ్ళ క్రితం రేడియోలో తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివేవారిని సెలక్ట్ చేయడానికి ఇంటర్వ్యూ లు జరిగాయి. ఇసక వేస్తె రాలనంతగా అభ్యర్ధులు హాజరయ్యారు. వారిలో చాలామంది ‘లక్ష వొత్తుల నోము’ నోచుకోవాల్సినవారే వున్నారు. వొత్తులు పలకవు. ‘వార్తలు చదవాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగిందని ఒక అమ్మాయిని అడిగితే ‘ రోజూ రేడియోలో వార్తలు వింటున్నాను, ఆ మాత్రం నువ్వూ చదవగలవులే చిన్నా అని మా నాన్న పట్టుబట్టి పంపించాడు’ అన్నది ఆ చిన్నది. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు కదా.
దీనికి కొసమెరుపుగా ఆ రోజు న్యాయనిర్ణేతగా వచ్చిన ఒక పెద్దమనిషి – ఆ అమ్మడు చదివిన ‘న్యూస్ బులెటిన్ ను భద్రపరచమని’ చెప్పాడు. ‘అంతబాగా చదివిందా’ అని అడిగితే – ‘కాదు. బులెటిన్ ఎలా చదవకూడదో భవిష్యత్ తరాల న్యూస్ రీడర్లకు తెలియచెప్పడానికి పనికివస్తుంద’ని ఆయనగారు వాకృచ్చారు. (13-12-2010)
1 కామెంట్:
ఊరికే ఎందుకు చదవాలి బహుమతులు ఇస్తే చదువుతాం ...బాగున్నా లేకపోయినా బ్రహ్మరధం పడతాం
కామెంట్‌ను పోస్ట్ చేయండి