30, మే 2013, గురువారం

సులభంగా చావాలంటే?




జీవితమే మధురమూ అని పాడుకోవడం సులభమే. కాని జీవించడం అంత వీజీ ఏమీ కాదు. అందుకని దాన్ని అర్ధం చేసుకోవాలనే అర్ధం పర్ధం లేని ఆలోచనలను వొదిలేసుకుని ఎంచక్కా జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టండి.

దానికి కొన్ని చిట్కాలున్నాయి. హాయిగా నవ్వుకోవడం. వీలయితే నవ్వించడం.

హాయిగా జీవించడం సరే ! సులభంగా జీవితాన్ని అంతం చేసుకునే నిఖార్సయిన పద్ధతులు ఏమయినా వున్నాయా గురువుగారూ!అని అడిగాడొక శిష్యులుంగారు.

మూడున్నాయి రాసుకోఅని మొదలు పెట్టాడు మూడొచ్చిన గురువులుంగారు.

మొట్టమొదటి పధ్ధతి. రోజూ పది పెట్టెలు సిగరెట్లు వూదేసేయ్. పదేళ్లు ముందుగానే గుటుక్కుమంటావ్.

రెండోది రోజూ క్రమం తప్పకుండా మందు కొట్టు. ముప్పయ్యేళ్ళు ముందుగానే టపా కట్టేస్తావ్.

ఇక ఆఖరు చిట్కా ఏమిటంటే కనుముక్కుతీరు చక్కగా వున్న అమ్మాయిని చూసి నిజాయితీగా ప్రేమించడం మొదలు పెట్టు. ముందుగా ఏం ఖర్మ. ప్రతిరోజూ చచ్చి బతుకుతుంటావ్.



26, మే 2013, ఆదివారం

పాఠకులు కావలెను




ఇది జరిగి నలభయ్ ఏళ్ళు కావస్తున్నది.
 పోలీసు సాక్షిగా ఉద్యోగ విజయాలు పేరిట తమ వృత్తి జీవితపు వ్యాపకాల జ్ఞాపకాలను ఆసక్తికరంగా రాసి గ్రంథస్తం చేసిన రిటైర్డ్ ఐపీయస్ అధికారి  రావులపాటి సీతారామారావు గారు,  తన ఉద్యోగ జీవితం తొలినాళ్ళలో విజయవాడకు రూరల్ డీఎస్పీ గా వచ్చారు. అప్పుడు నేను ఆంద్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా సీనియర్ పోలీసు అధికారి అయినా ప్రవృత్తి రీత్యా రచయిత కావడంవల్ల సాటి రచయితలను కలుసుకోవాలనే ఆసక్తి వుండేది. విజయవాడ రచయితలకూ, ప్రచురణకర్తలకూ పుట్టినిల్లు కావడం మూలాన ఈ చిరు కోరిక తీర్చుకోవడం కష్టమేమీకాలేదు. ఇలా చిన్నా పెద్దా రచయితలను కలుసుకునే చక్రభ్రమణంలో ఒకరోజు మాకు - అప్పటికే బాగా చేయి తిరిగిన బోలెడు పెద్ద నవలాకారుడు తారసపడ్డారు. ఉభయకుశలోపరిపరస్పర పరిచయాలనంతరం సీతారామారావు గారు- ఆంద్ర పత్రిక వారపత్రికలో రాసిన కొన్ని కధలు గురించి నేను ఆ రచయిత గారితో మాటవరసకు  ప్రస్తావించాను.
నేను ఇతరులు రాసిన కధలు చదవనండీఅని ఆయన కుండబద్దలుకొట్టినట్టు మొహం మీదే అనేశారు. అలా చదవడం వల్ల వారి రచనల ప్రభావంతో మనం రాసేవాటిలో క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం వుందిఅని ఒక ధర్మ సూక్ష్మం కూడా బోధించారు. తాను రాసినవి మాత్రమె తాను చదివే ఆ పెద్ద మనిషి ప్రబోధం వల్లనో ఏమో కానీ ఈ నడుమ చాలామంది  ఇతరులు రాసినవి ఏమాత్రం పట్టించుకోకుండా తామే రాసే పనిలో పడిపోతున్నట్టుగా  వుంది. బహుశా నేను కూడా ఆ అమాంబాపతు వాళ్ళల్లో ఒకడినేమో.   
ఇది జ్ఞాపకం రావడానికి ఒక నేపధ్యం వుంది. చదివేవాళ్ళు బొత్తిగా తగ్గిపోతున్నారని ఒక సంపాదక మిత్రుడు ఈ మధ్య మాటల సందర్భంలో అన్నారు. ఆయన ఆందోళన చెందడానికి వేరే కారణాలు వుండవచ్చు. ఇంతమంది ఇలా రెండు చేతుల్తో పుంఖానుపుంఖాలుగా రాసేస్తూ వాటిని ప్రచురణార్ధం పంపించేస్తూ (ఈరోజుల్లో పోస్ట్ ఖర్చుల బెడద కూడా లేదు నెట్లో రాసేసి క్లిక్ చేస్తే చాలు - బంతి ఎడిటర్ కోర్టులో పడేసి చేతులు దులిపేసుకోవచ్చు) మా ప్రాణాలు తోడే బదులు వీరిలో కొంతమందయినా చదివే సద్బుద్ధిని అలవరచుకుంటే తమ పత్రిక సర్క్యులేషన్ పెరగకపోతుందా అన్నది ఆయన బాధలోని మరోకోణం కావచ్చు.
ఇలా రాసేసి అలా పంపేసి నా కధ వచ్చేవారం వీక్లీలో అచ్చేస్తారాఅని వేధించుకు తినేవాళ్ళతోనే కాలం చెల్లిపోతోంది. ఇక మంచి కధల ఎంపికకు సమయం ఎక్కడ?’ అని కూడా సంపాదక మిత్రుడు బాధపడ్డాడు. నిజమే ఎవరి ఇబ్బందులు వారివి. పీత కష్టాలు పీతవి.
ఒక వర్ధమాన రచయిత అభిప్రాయం వేరేలావుంది. ఎన్నాళ్ళు ఇలా చదువుతూ గడుపుతాం గురూగారూ! ఆ మాత్రం మనం రాయలేమా అని ఓ మంచిరోజు చూసి కలం పట్టేసానుఅన్నాడతగాడు.
మనం రాసింది మనం చదువుకోవడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు, ఇక వేరేవారి రచనలు చదివే వ్యవధి ఎక్కడుంది మాస్టారూ!అని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చాడు. ఏ పత్రికలో రాస్తుంటాడని మరీ హైరాన పడకండి. స్వయంగా రాసినవాటిని సొంతంగా చదువుకోవడానికి స్వయానా ఒక బ్లాగు పెట్టుకున్నాడు. బ్లాగుల లోకంలో  రాసినవారికి రాసినంత చదివేవారికి చదివినంత.
ఓ పాతికేళ్ళ క్రితం రేడియోలో తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివేవారిని సెలక్ట్ చేయడానికి ఇంటర్వ్యూ లు జరిగాయి. ఇసక వేస్తె రాలనంతగా అభ్యర్ధులు హాజరయ్యారు. వారిలో చాలామంది లక్ష వొత్తుల నోమునోచుకోవాల్సినవారే వున్నారు. వొత్తులు పలకవు. వార్తలు చదవాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగిందని ఒక అమ్మాయిని అడిగితేరోజూ రేడియోలో వార్తలు వింటున్నాను, ఆ మాత్రం నువ్వూ చదవగలవులే చిన్నా అని మా నాన్న పట్టుబట్టి పంపించాడుఅన్నది ఆ చిన్నది. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు కదా.
దీనికి కొసమెరుపుగా ఆ రోజు న్యాయనిర్ణేతగా వచ్చిన ఒక పెద్దమనిషి ఆ అమ్మడు చదివిన న్యూస్ బులెటిన్ ను భద్రపరచమనిచెప్పాడు. అంతబాగా చదివిందాఅని అడిగితే – ‘కాదు. బులెటిన్ ఎలా చదవకూడదో భవిష్యత్ తరాల న్యూస్ రీడర్లకు తెలియచెప్పడానికి పనికివస్తుందని ఆయనగారు వాకృచ్చారు. (13-12-2010)


22, మే 2013, బుధవారం

రాజీవ్ గాంధీ ఈజ్ డెడ్



(మే ఇరవై ఒకటి రాజీవ్ గాంధీ వర్ధంతి)  
1991 మే 21 మధ్యాహ్నం మూడు గంటలు
              ఫోన్ మోగింది. ఆఫీసు డ్యూటీలో ఉన్న కొండా జగన్ మోహన్ వర్మ ( ఇప్పుడు కరాచీ లో పి టి ఐ ప్రతినిధిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా వాసి కె జె ఎమ్ వర్మ )  ఫోన్ చేశాడు. రిపోర్టర్స్ కొరత ఉంది కాబట్టి ఆఫ్ అయినా ఆఫీసుకు రావాలన్నది ఆ ఫోన్ సారాంశం. రాజీవ్ గాంధీ కార్యక్రమానికి హాజరయ్యే రిపోర్టర్ల కోసం తమిళనాడు కాంగ్రెస్ కమిటీ  ఏర్పాటు చేసిన వాహనం సరిగ్గా నాలుగ్గంటలకు పి టి ఐ ఆఫీసుకు వస్తుందని, నేను ఆ లోపు ఆఫీసుకు రావాలని చెప్పాడు. ఏజెన్సీ రిపోర్టర్స్ విషయంలో రాజకీయ పార్టీలు ప్రత్యేకమైన  శ్రద్ధ తీసుకోవటానికి కారణం వాళ్ళ ద్వారా అయితే దేశవ్యాప్తంగా అన్ని పత్రికలకూ వార్త అందుతుంది. ఇలాంటప్పుడు రిపోర్టర్స్ అందరికీ వాహనాలు ఏర్పాటు చేయటం మామూలే అయినా పి టి ఐ, యు ఎన్ ఐ వాళ్ళకు అదనంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. రోజూ ఒక రిపోర్టర్ ఆఫీసు డ్యూటీలో ఉండటం, ఫీల్డ్ లో ఉన్న రిపోర్టర్స్  చెప్పే వార్తలు రాసుకోవటం ఆనవాయితీ. ఆ రోజు సరిపడేంతమంది రిపోర్టర్స్ లేరు కాబట్టి వీక్లీ ఆఫ్ తీసుకున్న నన్ను పిలిపించటం తప్ప మార్గం లేదని వర్మకు అర్థమైనట్టుంది. బ్రహ్మచారినే కాబట్టి ఫోన్ చేసి రమ్మనగానే అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటానని వర్మకు తెలుసు.
           ఆఫీసుకు రావటం, టిఎన్ సిసి వాళ్ళ వాహనంలో ఐదు గంటలకల్లా రిపోర్టర్లు, కాంగ్రెస్ ప్రముఖులు మద్రాస్ మీనంబాక్కం విమానాశ్రయం చేరుకోవటం జరిగిపోయాయి. అప్పటికింకా రాజీవ్ విశాఖనుంచి బయల్దేరలేదు. ఆయన రావటం ఆలస్యమవుతుందని అక్కడికి చేరుకున్నాక గాని తెలియలేదు. అందరూ అక్కడే కూర్చొని వేచి చూస్తున్నారు. ఆయన రావటం కాన్సిల్ అయిందని చెప్పగానే బయల్దేరబోయాం. అంతలోనే ఆయన వస్తున్నారని చెప్పారు. అలా మరో గంటకు పైగా వేచి చూశాక రాజీవ్ విమానం దిగి నేరుగా విలేకరులున్న చోటుకే వచ్చి పత్రికాసమావేశంలో పాల్గొన్నారు. తెల్లటి కుర్తా పైజామా, లోటో షూస్ తో ఉన్న రాజీవ్ ను విలేకరులు చాలా దగ్గరగా చూశారు. తన శైలికి కాస్త భిన్నంగా రాజీవ్ బిజెపి మీద తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పుడే కాంగ్రెస్ లో చేరిన నటి జయచిత్ర ( చిల్లరకొట్టు చిట్టెమ్మ ఫేమ్ ) లాంటి వాళ్ళు వచ్చి ఆటోగ్రాఫ్ లు తీసుకున్న తరువాత రాజీవ్ గాంధీ కాన్వాయ్ శ్రీపెరంబుదూర్ వైపుబయలుదేరింది. ఆ కాన్వాయ్ లోనే రిపోర్టర్స్ వాహనాలూ ఉన్నాయి.
      పావుగంటకల్లా కాన్వాయ్ పోరూరు చేరుకుంది. అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు కాన్వాయ్ ని అడ్డుకొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సిందిగా రాజీవ్ ను కోరారు. ఆయనలా దిగి ఆ పనిలో ఉండగా నేను కారు దిగి దగ్గర్లో ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరికి పరుగెత్తికెళ్ళి రాజీవ్ విలేకరుల సమావేశం విశేషాలు కొంతమేరకు చెప్పా. వర్మ ఆ పాయింట్స్ ఆధారంగా మొదటి భాగం వార్త తయారుచేసి పంపి ఉంటాడు. ఇక్కడ కాన్వాయ్ బయలుదేరుతుండగా పరుగున వెళ్ళి కారెక్కా. మరికాసేపటికి పూనమల్లి చేరుకున్నప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆపారు. ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటై ఉందక్కడ. రాజీవ్ కారు దిగి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటుండగా మళ్ళీ నేను అక్కడున్నఒక  టెలిఫోన్ బూత్ నాశ్రయించి వర్మకు మరికొంత సమాచారం చెప్పా.. మళ్ళీ కాన్వాయ్ కదులుతుండగా బయల్దేరా.
     శ్రీపెరంబుదూర్  ఊరికి ఇంకా ఒకటిన్నరకిలోమీటర్ల దూరం ఉందనగా ఎడమవైపున ఒక విశాలమైన స్థలంలో రాజీవ్ బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. రాత్రి 10 గంటల సమయంలో వాహనాలన్నీ అక్కడికి చేరుకున్నాయి. రాజీవ్ దిగి నడక మొదలెట్టగానే రిపోర్టర్లం కూడా వాహనాలు దిగి ఆయన వెంట వెళ్ళేందుకు వేగంగా అడుగులేస్తున్నాం. సభావేదిక ముందు వరుసలో ప్రత్యేకంగా పత్రికలవాళ్ళకోసం సీట్లుంటాయిగాని ఒక్కోసారి ఇలాంటి రద్దీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వాటిని ఆక్రమించుకుంటారు. అందుకే సకాలంలో చేరుకోవటానికి రిపోర్టర్లు హడావిడి చేస్తుంటారు. అలా మేం ముందుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం గాని రాజీవ్ గాంధీనే ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపి దండలు వేస్తున్నట్టనిపించింది. అంతలోనే ఒక్కసారిగా భారీ విస్ఫోటం... అరుపులు, కేకలు.. అంతా అయోమయ వాతావరణం.. దట్టమైన పొగ.. దేహాలు మాంసం ముద్దలై కమిలిన వాసన.. ఏం జరిగిందో కూడా ఆలోచించుకునే సమయంలేక రిపోర్టర్లు కూడా జనంతోబాటే దాదాపు వందగజాలు వెనక్కు పరుగుతీశారు. ఐదు నిమిషాలు గడిచాక పొగ తగ్గి ఆ ప్రదేశాన్ని గుర్తించగలిగే పరిస్థితి రాగానే కాంగ్రెస్ నాయకులు మూపనార్, జయంతీ నటరాజన్ లాంటివాళ్ళు దగ్గరగా వెళ్ళి చూసి రాజీవ్ ను గుర్తుపట్టి  భోరున ఏడుస్తున్నారు. శారు.  రిపోర్టర్లం కూడా వెళ్ళి చూశాం. దాదాపు 20 మృతదేహాలు.. సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఛిద్రమై పడి ఉన్నరాజీవ్ మృతదేహం.. పేలుడు ఎలా జరిగిందన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఆ తీవ్రత కూడా చాలా భయంకరంగా ఉంది. అంతకు మించి మరేమీ తెలియదు.
              ఒక్కసారిగా రిపోర్టర్లలో కలకలం మొదలైంది. విధ్యుక్త ధర్మం గుర్తుకొచ్చింది. ఎవరికి వాళ్ళం ఈ దారుణఘటనను అఫీసులకు తెలియజేయాలన్న ఆతృత పెరిగింది. వెనక్కి తిరిగి చూస్తే జనమంతా హాహాకారాలు చేస్తూ శ్రీపెరంబుదూరు వైపు పరుగులు తీస్తూ కనిపించారు. కొన్ని వాహనాలు మద్రాసు నగరం వైపు వెళుతున్నాయి.  ఏం జరుగుతుందోనన్న భయం ఒకవైపు.. వీలైనంత త్వరగా ఇళ్ళకు చేరుకోవాలన్న తాపత్రయం మరోవైపు.  జనం ఆలోచనలు ఇలా ఉంటే, దగ్గర్లో ఉన్న శ్రీపెరంబుదూర్ వెళ్ళి అక్కడినుంచి ఫోన్ చేసి ఆఫీసులకు చెబుదామనేది జర్నలిస్టుల ఆలోచన. అక్కడ ఎంత వెదికినా మద్రాసు నుంచి మమ్మల్ని తీసుకు వచ్చిన వాహనాలు కనిపించలేదు. డ్రైవర్లు అప్పటికే భయంతో వాహనాలు తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. ఇక ఎంతమాత్రమూ  ఆలస్యం చేయకూడదని రిపోర్టర్లందరూ శ్రీ పెరుంబుదూర్ ఊరి వైపు పరుగందుకున్నారు.
           శ్రీపెరంబుదూర్ వెళ్ళటం వలన ప్రయోజనం ఉండదని నాకర్థమైంది. వీలైనంత త్వరగా మద్రాస్ వైపు వెళితే లోకల్ ఫోన్ దొరికే పూనమల్లి చేరగానే వార్త చెప్పవచ్చుననుకున్నా. అలా పరుగుతీస్తూ ఆ దారిన వెళ్ళే వాహనాలను లిఫ్ట్ అడిగినా దాదాపు పది నిమిషాలు ఫలితం కనిపించలేదు. కాసేపటికి ఒక వాహనం ఆగగానే బతిమాలి దాన్ని పట్టుకొని పూనమల్లి చేరుకున్నా. అక్కడే ఒక పెట్రోల్ బంక్ దగ్గరున్న టెలిఫోన్ బూత్ దగ్గరికి పరుగుతీసి ఆఫీస్ నెంబర్ డయల్ చేశా. ఫోనందుకున్న వర్మ ఏంటి రంగా, థర్డ్ పార్ట్ చెప్పటానికి ఇప్పుడు తీరిందా? అనడిగాడు. అప్పటికే అసహనంగా ఉన్న నేను, “ Varma, be serious. Rajiv Gandhi is dead“  అని చెప్పా. ఉలిక్కిపడ్డట్టున్నాడు, వర్మకు నోటమాటరాలేదు. “ Varma, are you able to hear me ? “  మరింత అసహనంగా అడిగా. ప్రతిక్షణమూ ఎంతో విలువైంది మరి.  కోలుకున్న వర్మ ఈ సారి నా గొంతు నిర్థారించుకోవాలనుకున్నాడు.  “ Are you Ranga?  What is the colour of your shirt ? “  అని అడిగాడు పిచ్చి కోపమొచ్చింది నాకు. అయినా సరే ఓపిగ్గా సమాధానమిచ్చి వార్త చెప్పా.  Varma, do what I say. Type only one sentence. Rajiv Gandhi is dead. “  అలా చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే అక్కడో ఆటో పట్టుకొని మద్రాస్ నగరంలోకి బయల్దేరా. వార్త నగరంలో పాకేకొద్దీ నా ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని గ్రహించి అలా హడావుడిగా వెళ్ళక  తప్పలేదు.
పి టి ఐ ఆఫీసు ( వర్మ )
పిటిఐ ఆఫీసులో ఆపరేటర్ ను అప్రమత్తం చేసి ఫ్లాష్ న్యూస్ టైప్ చేయమని చెప్పా. ఏజెన్సీ వార్తల్లో ఫ్లాష్ న్యూస్ అంటే కొన్ని స్టార్స్ వచ్చి ఆ తరువాత స్పేస్ ఎక్కువ ఇస్తూ వార్త టైప్ అవుతుంది. పైగా అలా టైప్ చేసినప్పుడు పత్రికాసంస్థల్లో ఉన్న టెలిప్రింటర్లలో ఒక ప్రత్యేకమైన శబ్దం వస్తుంది కాబట్టి అలర్ట్ అవుతారు. తీరా ఆ ఆపరేటర్ కు వాక్యం చెప్పగానే అతడి చేతులు వణికాయి. అప్పటిదాకా రాజీవ్ వార్త టైప్ చేసిన మనిషి ఒక్కసారిగా రాజీవ్ మరణవార్త టైప్ చేయాల్సి వచ్చేసరికి తీవ్రంగా కలతచెందాడు.  అతణ్ణి మెల్లగా కుర్చీలోనుంచి లేపి పక్కనే కూర్చోబెట్టి నేనే స్వయంగా టైప్ చేశా. క్షణాల్లో పి టి ఐ సర్వీసు ఉన్న ప్రతిచోటా టెలిప్రింటర్ మీద
                             F L A S H     F L A S H     F L A S H

                       R A J I V     G A N D H I      I S     D E A D
అని ప్రత్యక్షమైంది. పత్రికల కార్యాలయాల్లో ఒకటే అలజడి. అప్పటికే దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన పత్రికలు ప్రింటయిపోయి వ్యాన్లలో బయలుదేరాయి. సంపాదకులు అప్పటికప్పుడు ఆ మార్గంలో ఉన్న ఏజెంట్లను అప్రమత్తం చేసి వ్యాన్లను వెనక్కి పంపాల్సిందిగా ఆదేశించి తగిన ఏర్పాట్లు మొదలుపెట్టుకున్నారు. ఎక్కువ సమాచారమేమీ లేకపోయినా పతాకశీర్షికకు అంతకు ముందు విశాఖ ప్రసంగాన్ని, చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన అంశాలు, డిల్లీ లో సోనియా, పిల్లలు ఆ సమయంలో ఎక్కడున్నారనే విషయాలు జోడించి వార్త రూపొందించు కోవటానికి సిద్ధమయ్యారు.
మొదటి ఫ్లాష్ పంపిన ఐదు నిమిషాల్లోనే రంగా మళ్ళీ ఫోన్ చేశాడు. దారిలో ఆగి మాట్లాడాడు. శ్రీపెరుంబుదూరు బహిరంగ సభావేదిక వద్దకు వెళుతున్న సమయంలో జరిగిన భారీ విస్ఫోటంలో రాజీవ్ సహా20 మంది చనిపోయారు  అంటూ మరికాస్త వివరణ ఇచ్చాడు రంగరాజ్. అది కూడా టైప్ చేశా. ఆ రాత్రికి పత్రికలకు అందిన సమాచారం ఇది మాత్రమే.
* * * * *     
     అప్పుడు తమిళనాట రాష్ట్రపతిపాలన సాగుతోంది. రాజ్ భవన్ లో పిటిఐ టెలిప్రింటర్ మీద ఈ వార్త చూసిన సిబ్బంది వెంటనే గవర్నర్  భీష్మనారాయణ్ సింగ్ కు తెలియజేశారు. ఆయన డిజిపి కి ఫోన్ చేసి అడిగితే తనకూ పిటిఐ ద్వారానే తెలిసిందన్నాడు. ఇంతపెద్ద విషయం పోలీసులకు తెలియకుండా పి టి ఐ కి మాత్రమే తెలిసిందని చెప్పడానికి సిగ్గనిపించటం లేదా అని కోపంతో ఊగిపోయారాయన. ఆ తరువాత ఫోన్ కాల్ పి టి ఐ మేనేజర్ నారాయణస్వామి కి వెళ్ళింది. రాజ్ భవన్ నుంచి ఫోన్ వచ్చాక గాని ఆయన కూడా చూసుకోలేదు. ఇంట్లో ఉన్న టెలిప్రింటర్ లో వార్త చూశాడు. తనకూ పూర్తి వివరాలు తెలియవని సంజాయిషీ ఇచ్చుకుంటూ, ఆఫీసుకు ఫోన్ చేసి కనుక్కుంటానని మాత్రమే చెప్పగలిగాడాయన.  ఇలాంటి సున్నితమైన అంశాలను గవర్నర్ కు, పోలీసులకు చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు వేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందేమోనని కనీసం ఆలోచించరా మీరు అంటూ గవర్నర్  కోప్పడ్డారు. సహజంగానే చాలా నిదానస్తుడయిన  నారాయణ స్వామి బాగా కంగారు పడి వర్మకు ఫోన్ చేసి  ఏంటి వర్మా. మాటమాత్రమైనా చెప్పలేదని గవర్నర్ గారు కోప్పడుతున్నారు.. నాక్కూడా చెప్పనేలేదు అంటూ చిన్నబుచ్చుకున్నారాయన.  వార్త స్వయంగా మన రిపోర్టర్ నుంచి అందిన తరువాత ఆగాలనిపించలేదు. పైగా. వాళ్ళకు తెలియకపోతే వాళ్ళ ఇంటలిజెన్స్ అధికారుల వైఫల్యమే కదా.. మన విధి మనం నిర్వర్తించాం  అని వర్మ నచ్చజెప్పారాయనకు.  రిపోర్టర్స్ అందరినీ పిలిపించి గవర్నమెంట్ ఆస్పత్రికి, విమానాశ్రయానికి పోలీస్ కేంద్రకార్యాలయానికి పంపుతూ డ్యూటీస్ పంచానని చెప్పి ఆయనను చల్లబరచారు.
            మరోవైపు శ్రీపెరంబుదూర్ పరుగు తీసిన పోలీసులకు, విలేకరులకు ఫోన్ దొరకలేదు. ఉన్న ఒకే ఒక్క పోస్టాఫీసు ఫోన్ కోసం పోటీ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయం కాబట్టి అక్కడ పోలీసులదే పై చేయి అయింది. కానీ వాళ్ళు ట్రంకాల్ బుక్ చేసి విషయం చెప్పేలోపే పి టి ఐ వార్త అందింది. రిపోర్టర్లు ఫోన్ కోసం ఆ ఊళ్ళో ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరూ కనికరించలేదు. తెలిసిన వార్తను కూడా ఆఫీసుకు తెలియజేయలేని నిస్సహాయత. కానీ శ్రీపెరంబుదూర్ నుంచి ఆకాశవాణికి వార్తలు పంపే పార్ట్ టైమ్ రిపోర్టర్ కూడా ఈ వార్తను మద్రాస్ ఆకాశవాణి కేంద్రానికి తెలియజేసినా, వారు ఆ వార్తను ప్రసారం చేయటానికి సాహసించలేదు. పిటిఐ వార్తను ఉటంకిస్తూ బిబిసి ప్రసారం చేసిన వార్తవల్లనే అర్థరాత్రికల్లా దేశమంతటా ఈ వార్త తెలిసింది.
            ( 1994 లో దక్షిణ  భారత జర్నలిస్టుల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్    
           చిత్తూరు జిల్లా శాఖ సంయుక్తంగా తిరుపతిలో నిర్వహించిన మూడు రోజుల వర్క్ షాప్ లో రంగరాజ్,
           వర్మ చెప్పిన అనుభవం ఆధారంగా )
తెలుగు టీవీ ఇన్ఫో – తోట భావనారాయణ సౌజన్యంతో -----


21, మే 2013, మంగళవారం

భండారు బఠానీలు



‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?’  అనేది చిన్నప్పుడు స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని సమాధానం.
ప్రశ్న అడిగిన లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం,  దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.
తమదగ్గర  చదువుకునే పిల్లల్లో ఐ.ఏ.ఎస్. లు ఎంతమంది అవుతారన్నది వారికొచ్చిన  డౌటేహం కావచ్చు. వాళ్ళల్లో రాజకీయనాయకులు, జర్నలిస్టులు కొంతమంది అయినా కాకపోతారా అనే నమ్మకం కావచ్చు. అందుకే కాబోలు,  పిల్లలకు   వక్తృత్వపోటీలు పెట్టి, ‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’ – ‘అణ్వస్త్రాలు అవసరమా? కాదా?’ అని అనుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా చెప్పించేవారు. అప్పుడర్ధంయ్యేది కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చలు చూస్తుంటే నెమ్మది నెమ్మదిగా తత్వం బోధపడుతోంది.
‘నరం లేని నాలుక ఏవిదంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం, నిన్న ఏం చెప్పాం’ అన్న దానితో నిమిత్తం లేకుండా ఈరోజు చెప్పిందే ఫైనల్ అన్న పద్ధతిలో  బల్లగుద్ది వాదిస్తున్న విధం చూస్తుంటే రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం   కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు.
‘మా నాన్నవల్ల ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టడం నామతం కాదు,  అభిమతం కాదు, కాదెంతమాత్రం కానే  కాదం’టూ ఎక్కడలేని ధర్మపన్నాలు  వల్లించి ఆ తరువాత అనతికాలంలోనే  పోటీ పార్టీ పెట్టి సొంతపార్టీకి చిల్లి పెడుతున్న విధం చూస్తుంటే-  రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడే స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకులను పంచెలూడతీసి తరిమికొడతాం!’ అంటూ పొడుగుపాటి డైలాగులు అలవోకగా జనం మీదకు వొదులుతూ, పార్టీ పెట్టిన  తొమ్మిదిమాసాల్లోనే అధికార పీఠం ఎక్కిన  ఎన్టీయార్ రికార్డుని బద్దలుకొట్టేసి,   రాజ్యాధికారంలోకి వద్దామనుకున్న కలలు కాస్తా   పార్టీ పారాణి ఆరకముందే కల్లలైపోవడంతో, ఇక  విధిలేక  ఆ కాంగ్రెస్ పంచనే చేరి, కేంద్రమంత్రి పదవిలో విదేశాల్లో  సేదతీరుతూ, తీరిగ్గా  సోనియా భజన చేస్తున్న వైఖరి చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్సార్ చనిపోయినప్పుడు, పట్టు చీరెల అంచులతో, ఖాదీ ఉత్తరీయాలతో కళ్ళు వొత్తుకుంటూ బుల్లితెరలమీద బారులుతీరి ‘అంతటి నాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇకముందు పుట్టడు’ అంటూ విలపించిన ఆయన  మంత్రివర్గ సహచరులే  ఇప్పుడు పల్లవి మార్చి ‘అవినీతిలో వైఎస్ ను మించినవాడు లేడం’టూ వైనవైనాలుగా శాపనార్ధాలు పెడుతున్న వైనం గమనిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘తుది శ్వాస విడిచేవరకు తాత స్థాపించిన పార్టీలోనే వుంటానంటూ, ప్రత్యర్ధి పార్టీల ఫ్లేక్సీల్లో అభిమానుల పేరుతొ తన ఫోటోలు పెడుతుంటే మిన్నకుండిపోయి ముసిముసి నవ్వులు నవ్వడం చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘అల్లుడా రమ్మని పిల్లనిచ్చిన  మామ పిలిచి పార్టీ అందలం ఎక్కిస్తే, పార్టీని బతికించే నెపంతో పార్టీ సంస్తాపకుడి అంతాన్నే కళ్ళారాచూసి, ఇప్పడు మళ్ళీ పార్టీ పునరుద్దానానికి ఆ కీర్తిశేషుడి పేరునే వాడుకుంటూ, దానిపై పేటెంటు రైటు తమదే అంటూ వాడవాడలా  వూరేగుతున్న విపరీతాన్ని చూస్తున్నప్పుడు - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
పార్టీలు, వ్యక్తుల భజనకోసం పెట్టిన టీవీ చానళ్ళలో పనిచేస్తూ, జీతాలకోసమో, హోదాలకోసమో వేరే చానళ్ళలో చేరి  పొగిడిన నోళ్లతోనే తెగుడుతున్న విధానాలను పరికిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
ఇలాటి  చద్మ వేషధారుల, ఆషాఢభూతుల లీలలు చూపించి, వారి అసలు రూపాలను, స్వరూపాలను చూపించే విధంగా ఏ టీవీ వారయినా పుణ్యం కట్టుకుని, ‘అప్పుడు – ఇప్పుడు’ అనే కార్యక్రమం ప్రసారం చేస్తే యెంత బాగుంటుందో ! 

18, మే 2013, శనివారం

హూష్ కాకి



వార్త : తెలంగాణా అంశం యూపీయే ఎజెండాలో లేదు – ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో
వ్యాఖ్య : శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు నేను రాసిన ఈ వ్యాసం      
“మాయాబజార్ సినిమాలో శ్రీ కృష్ణుడు బలరామాదులకు ప్రియదర్శిని పేటికను ప్రదర్శిస్తాడు. ఆ పెట్టె తెరచి చూసినవారికి వారి మనసులో ఏమి కోరుకుంటున్నారో అదే  అందులో  కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీ కృష్ణ  కమిటీ కూడా సరిగ్గా  అదే చేసింది. వివాదంతో సంబంధం వున్న వారందరికీ తాము కోరుకున్నవిధంగానే కమిటీ సిఫారసులు వున్నాయనే భ్రాంతి కలిగేలా  వేర్వేరు సూచనలకు రూపకల్పన చేసి జస్టిస్ శ్రీ కృష్ణ తన పేరుకు తగినట్టు కృష్ణలీలను ప్రదర్శించారు. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షుభిత పరిస్తితికి పరిష్కారంగా ఆరు ప్రత్యామ్నాయాలు సూచించి మరో సరికొత్త చర్చకు తెర తీసారు.
పది నెలల నిర్విరామ కృషి, ఆరువందల పైచిలుకు పేజీలు, రెండు సంపుటాలు, ఆరు సిఫారసులు స్తూలంగా ఇదీ శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్.  పైగా తాను చేసిన ఆరు సిఫార్సుల్లో  మొదటి మూడు   ఆచరణ సాధ్యం కావనీ, నాలుగోదానికి సర్వజనామోదం  కష్ట సాధ్యం అనీ  కమిటీ నివేదికలోనే  సన్నాయి  నొక్కులు నొక్కారు.
రాష్ట్రాన్ని ఇప్పుడున్న రూపంలోనే కొనసాగించాలని మొదటి సిఫారసులో పేర్కొంటూనే  దీనివల్ల తెలంగాణాలో భావోద్వేగాలు పెచ్చరిల్లగలవని, తద్వారా ఏర్పడగల అనిశ్చితిని  మావోయిస్టు ఉద్యమం తనకు అనుకూలంగా మార్చుకునే వీలుందని భాష్యం చెప్పి తాను చేసిన తొలి సూచనకు తానే ఇంటూ మార్క్ పెట్టింది.
రెండో సిఫారసు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణా వాదులు ససేమిరా వొప్పుకోరన్నది కూడా కమిటీ తన అభిప్రాయంగా పేర్కొన్నది.
పోతే, రాయల తెలంగాణా, కోస్తాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించాలన్నది  మూడో సూచన. అయితే దీన్ని రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారు అంగీకరించే  అవకాశం వుండదని కూడా కమిటీయే చెప్పింది.
హైదరాబాదు నగర పరిధిని బాగా విస్తరించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించి, రాష్ట్రాన్ని రెండుగా విభ జించాలనేది నాలుగో ప్రతిపాదన. కానీ, ఉభయ ప్రాంతాలలో ఏఒక్కరికీ ఇది ఆమోద యోగ్యం కాకపోవచ్చని కమిటీ సిఫారసుల సంఖ్యను రెండుకు కుదించే ప్రయత్నం చేసింది.
ఇక అయిదో సిఫారసు రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం. ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచీ తెలంగాణా ప్రాంతంలో పాతుకుపోయివున్న కొన్ని సహేతుక అసంతృప్తులను పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అసంబద్ధం కాదని ఓ పక్క  చెబుతూనే, దీనివల్ల  దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు ఊతం ఇచ్చినట్లయి, అంతర్గత భద్రతపై  ప్రతికూల ప్రభావం పడగల  ప్రమాదాన్ని ఎత్తిచూపింది. తప్పనిసరి అయితేనే విభజనకు శ్రీకారం చుట్టాలన్నది కూడా ఈ ప్రతిపాదనలోని కొస మెరుపు.
పోతే, క్రమంలో చివరిదేకానీ ప్రాధాన్యతా క్రమంలో చిన్నది కాదన్నట్టుగా ఆఖరి ఆరో ప్రతిపాదన చేస్తూ ఇదే తమ ప్రతిపాదనలు అన్నింటిలో అత్యుత్తమమైనదని కమిటీ తనకు తానుగానే ఒక  కితాబును దానికి  జత చేసింది. రాష్ట్రాన్నిఇప్పటి మాదిరిగా  సమైక్యంగానే వుంచి తెలంగాణా అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమయిన చర్యలు తీసుకోవాలన్నది ఆరో ప్రతిపాదన సారాంశం.
రాగల పరిణామాలను గురించి రాయబారం సీనులో అలనాటి  శ్రీ కృష్ణుడు కౌరవాదులను హెచ్చరించినట్టు ఇలనాటి కృష్ణుడు తన కమిటీ చేసిన ఆరు సిఫారసులను అమలు చేయడం వల్ల వొనగూరే ఫలితాలను, పరిణామాలను అంశాలవారీగా నివేదికలోనే తేటతెల్లం చేయడం జరిగింది. ఇంతకీ కృష్ణ కమిటీ ఏమి చెప్పినట్టు, ఏమి తేల్చినట్టు అనే ప్రశ్నలను అందరికీ వొదిలిపెట్టి – ‘సమైక్యమా? విభజనా?’ అన్న అంశం దగ్గరికే సమస్యను  తీసుకువచ్చి భూమి గుండ్రం గా వుందిఅన్న సామెతను నిజం చేసింది.
నివేదికను స్వీకరించిన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆరో తేదీ సమావేశానికి వచ్చిన పార్టీలకు నివేదిక ప్రతులను పంచిపెట్టి, బహిష్కరించిన పార్టీలకు స్పీడ్ పోస్ట్ లో పంపించి, ప్రభుత్వ వెబ్ సైట్ లో సయితం దాన్ని పెట్టి చేతులు కడిగేసుకున్నారు. నివేదికను ఆషామాషీగా కాకుండా క్షుణ్ణంగా చదవండి అని ఒక సలహా కూడా ఇచ్చారు. బాగా అధ్యయనం చేసాక మరోసారి కలుసుకుని మాట్లాడుకుందామని అందర్నీ ఆహ్వానించారు. ఈ మొత్తం ప్రక్రియను గమనించిన వారికి కేంద్ర ఆచి తూచి వ్యవహరిస్తున్నది అన్న భావన కలగడానికి బదులు ఏదో విధంగా వాయిదా మంత్రం పఠించడం మొదలు పెట్టిందన్న అనుమానమే ఎక్కువ కలుగుతోంది.   
ఇక రాష్ట్రంలో ఈ అంశంపై తలలు పట్టుకుంటున్న పార్టీలలో మెజారిటీ పార్టీలు, కృష్ణ కమిటీ రిపోర్ట్ రాగానే దానికి కట్టుబడి వుంటామని ఇంతవరకు చెబుతూ వచ్చాయి. కానీ నివేదికలో ఏదో ఒకటి తేల్చకుండా, ఇదమిద్ధంగా ఒకే ఒక  సిఫారసు  చేయకుండా వెసులుబాటు కల్పించడంతో తిరిగి అందరు పాత పల్లవినే అందుకుంటున్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల్లో రెండు  ప్రాంతాలకు చెందినవాళ్ళు అధిష్టానందే అంతిమ నిర్ణయం అంటూనే తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. విషయాన్ని ఇంకా నానుస్తూ పోవడం వల్ల ఇరు ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని  బాహాటంగా ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్, టీడీపీ లు ఎదుర్కుంటున్న ఇరకాట పరిస్తితిని వేర్పాటువాదులు వాటిపై వొత్తిడి పెంచడానికి వుపయోగించుకునే ప్రయత్నం మొదలయింది. ప్రత్యేక తెలంగాణా  అన్నది సాకారం కావడానికి ఉద్యమం యెంత వూపు తేగలిగినా అంతిమంగా రాజకీయ నిర్ణయం ద్వారానే అది  సాధ్యం అన్న ఎరుక వారికి లేకపోలేదు. అందుకే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన దరిమిలా ఉత్పన్నమయిన పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వారు మళ్ళీ నడుం బిగిస్తున్నారనేది తేటతెల్లం. ప్రస్తుత అసందిగ్ధ స్తితికి కాంగ్రెస్, టీడీపీ లను ప్రధాన బాధ్యులుగా చేసి ఆ పార్టీల లోని తెలంగాణా అనుకూలుర చేత  వారి అధినాయకత్వంపైనే  వొత్తిడి తీసుకు వచ్చేలా చేయడం ఇప్పుడు వారి వ్యూహంగా కానవస్తోంది. అనివార్యం అయితేనే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన సిఫారసు చేయాలని, అన్ని ప్రాంతాల నడుమ సయోధ్య సాధ్యమయితేనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని కమిటీ చేసిన సూచనను తెలంగాణావాదులు ఎంతమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నివేదిక ఈ రూపంలో రావడానికి సీమాంధ్ర వ్యాపార రాజకీయుల హస్తం వుందని  వారు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టడం మినహా తెలంగాణా కోరుకుంటున్నవారిని మరేదీ సంతృప్తి పరచలేదన్నది వారి నిశ్చితాభిప్రాయంగా కానవస్తోంది.
శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వల్ల అసలు సమస్య ఏమేరకు పరిష్కారం అవుతుందన్నది అనుమానాస్పదమే. కాకపొతే, అగ్రహారం పోయినా యాక్ట్ మొత్తం తెలిసివచ్చిందన్న సామెత చందాన రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలతో పాటు విద్య, వైద్యం, సేద్యం మొదలయిన అన్ని రంగాలలో ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిననాటినుంచి ఇంతవరకు  రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించిన వివరాలు ప్రాంతాల వారీగా ఈ నివేదికలో పొందుపరచి సమగ్రమయిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పదినెలల కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి, సమాజంలో విభిన్న వర్గాలవారిని కలుసుకుని సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలోని గణాంకాలు వాస్తవపరిస్తితులకు పూర్తిగా అద్దం పట్టేవిగా వుండక పోవచ్చుకానీ, మొత్తం మీద ఒక స్తూలమయిన అవగాహనకు చదువరులు రావడానికి వీలుగా ఈ నివేదిక ఉపకరించగలదని భావించవచ్చు. వివిధ ప్రాంతాలలో ప్రగతి గురించి, వెనుకబాటుతనం గురించి ప్రస్తుతం వున్న అపోహలు, అనుమానాలు కొంత మేరకయినా తొలగించుకోవడానికి ఈ నివేదిక దోహదం చేస్తుంది.
చివరిగా ఒక మాట. సమస్యకు స్పష్టమయిన  పరిష్కార మార్గం చూపకపోయినా, కమిటీ ఒక నిర్దిష్టమయిన సూచన మాత్రం  చేసింది. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తనకు ఇచ్చిన గడువును  ఏదో ఒక సాకు చూపి పొడిగించుకోకుండా, ఒక రోజు ముందుగానే  నివేదికను సమర్పించి నిబద్ధతను నిరూపించుకున్న  శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఈ సూచనను  సర్కారు పరిగణనలోకి తీసుకోవాలని ఆశిద్దాం.