23, సెప్టెంబర్ 2010, గురువారం

కేబీ తిలక్ ఇకలేరు -భండారు శ్రీనివాసరావు

కేబీ తిలక్ ఇకలేరు    -భండారు శ్రీనివాసరావు
హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విమానాశ్రయానికి  బయలుదేరడానికి సిద్ధం అవుతున్న సమయంలో పిడుగులాటి దుర్వార్త తెలిసింది ‘తిలక్ గారు ఇక లేర'ని.

శ్రీ కేబీ తిలక్  
నిజానికి ఇది రాసే వ్యవధానం లేదు. కానీ ఆయనతో నాకున్న పరిచయం నన్ను వుండబట్టనివ్వడం లేదు. తెలుగు సినిమా పరిశ్రమకు కురువృద్ధుడయినా మా దగ్గర మాత్రం ఒక పిల్లవాడిలా వుండే వారు. తిలక్ గారు మా ఇళ్లకువచ్చి పోతుండేపోయేవారని చెబితే జనం ఒక పట్టాన నమ్మేవారు కాదు. జ్వాలా ‘తిలక్ జ్ఞాపకాలు’ రాస్తున్నప్పుడు తెలతెల వారుతూనే మార్నింగ్ వాక్ లాగా ఇంటికి వచ్చి కాఫీ తాగి తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని వెడుతుండడం నాకు తెలుసు. టీవీ చానళ్ళు రాకపూర్వమే – ఏరోజు వార్తలను ఆరోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ఒక చిరు ప్రయత్నంలో జ్వాలా,నేనూ, ఎమ్మెస్ శంకర్ ప్రధాన సూత్రదారులం. నాచేత నాలుగు ముక్కలు రాయించడానికి ఆయన ఎంతో ప్రయాసపడేవారు. ‘నీ వెంటబడి రాయించడం నా చేతకావట్లేదు. నీకంటే సినిమా రైటర్లే ఎంతో నయం’ అనేవారు. మా ముందు కూర్చున్నది ఎవరో కాదు - ఒకనాడు తన అద్భుత చిత్రాలతో తెలుగు చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన పెద్ద మనిషి అని తెలిసి కూడా మేము లైట్ తీసుకునేవాళ్ళం. అది మా అజ్ఞానం. మమ్మల్ని ఓపికగా భరించగలగడం ఆయన గొప్పతనం. వయస్సులో చాలా తేడా వున్నా – మాతో ఆయన చాలా పొద్దుపోయేదాకా గడిపేవారు. అహంకారం, అభిజాత్యం సుతరామూ లేని మనిషి. అంతటి పెద్ద మనిషితో, అంత పెద్ద మనసున్న ‘మహా మనీషి’ తో కొన్నేళ్లపాటు అతి సన్నిహితంగా మెలగగలిగిన నా జన్మ ధన్యమని భావిస్తూ ఆయనకు నిండు నివాళి ఘటిస్తున్నాను. – సియాటిల్ నుంచి శ్రీనివాసరావు
 

విన్నంతలో కన్నంతలో అమెరికా - 10 - భండారు శ్రీనివాసరావు

అమెరికన్ ఆతిధ్యం

మిసెస్ సూజన్ విల్సన్ బెల్ వ్యూ లోని ఒక పాఠశాలలో టీచరు. ఆవిడ భర్త మిస్టర్ గోర్డన్ - రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు. ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే ‘మరింబా’ అనే మరో సంగీత వాయిద్యం.

మరింబా వాయిస్తున్న  మిస్టర్ గోర్డన్ 

 శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఆ ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు. అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో కృత్రిమత్వం ఏమీ కనిపించలేదు. పైగా ఆ సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. ఇండియానుంచి, అదీ దక్షిణ భారతం నుంచి వచ్చిన శాకాహారులమని తెలిసి వంటకాలను తయారుచేసినట్టున్నారు. అందరం కలసి భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. అంతకు ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.

“ ఓ! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.”

మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.

అమెరికన్లు అనగానే విందుతో పాటు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.

అక్కడ గడిపిన కొద్ది గంటల సమయంలో ఒక విషయం గమనించాము. ఎక్కడా ఏ గదిలో టీవీ కనిపించలేదు. అడగడం బాగుండదని ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ, నేను రేడియోలో పనిచేశానని తెలుసుకున్నప్పుడు, మాటల సందర్భంలో చెప్పినట్టుగా తమ ఇంట్లో టీవీ వుండదని చెప్పారు. ‘టీవీ అనేది వినోదాత్మకంగా వుండాలి. వార్తల జోలికి పోకూడదు’ అని అభిప్రాయపడ్డారు. వార్తలకోసం తాము పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ రేడియో వింటామనీ, సంగీతంతోనే పొద్దుపుచ్చుతామనీ చెప్పారు. “మీడియా అంతా ఇప్పుడు ముక్కచెక్కలయింది. వాళ్లు సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ల సొంత అభిప్రాయాలు చెబుతున్నారు” అన్నారాయన. రెండు కార్లు వున్నప్పటికీ, రోజూ ఆఫీసుకు ఏడున్నర మైళ్ళు సైకిల్ పైనే వెడతానని మిస్టర్ గోర్డన్ చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.

చీటికీ మాటికీ చీకాకులు పడుతూ, పండంటి కాపురాలను పాడుచేసుకుంటారని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవడంలో అమెరికన్లు సిద్ధ హస్తులనీ – మన వైపు జనసామాన్యంలో వున్న అభిప్రాయంలో అంత వాస్తవం లేదని గోర్డన్ కుటుంబాన్ని చూసిన తరవాత అనిపించింది.

వెనక మేము మాస్కో వెళ్లి నప్పుడు – స్కూల్లో మా వాడిని వాళ్ల క్లాస్ మేట్ అడిగాడట – ‘మీ ఇంట్లో ఎన్ని ఏనుగులున్నాయ’ని. ఇండియాలో పులులు వీధుల్లో తిరుగుతుంటాయని, ఏనుగుల్ని ఇళ్ళల్లో పెంచుకుంటారనీ, పిల్లలు పాములతో ఆడుకుంటారనీ - ఇవీ ఆ దేశంలో మన దేశం పట్ల వున్న అభిప్రాయాలు. (22-09-2010)
 

22, సెప్టెంబర్ 2010, బుధవారం

విన్నంతలో కన్నంతలో - అమెరికా -9 – భండారు శ్రీనివాసరావు

కనిపించుటలేదు!

జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
సుజాతగారి బ్లాగులో (http://www.narasaraopet-bloggers.blogspot.com/) నరసారావుపేటలో అంతరించిపోతున్న గూడు రిక్షాల గురించి చదివాను.

నరసరావుపేట గూడు రిక్షా

ఒకానొక రోజుల్లో గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగావున్నారన్న విషయం ఆ బ్లాగు పై వచ్చిన ‘పలకరింపులు’ తెలియచేస్తున్నాయి. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.
ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునేవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?
అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరివారంలో చూసిన రెండు విశేషాలతో  పాతలోని మధురిమ మరోసారి అనుభవం లోకి వచ్చింది. పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడవాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో అర్ధం అయింది.

అగ్నికీలల్లో నాటి సియాటిల్ 

1889 లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలాభాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.
దాదాపు నూట యిరవై ఏళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాతవాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్తచేసి, పైన పలుంతస్తుల సుందర భవనాలను నిర్మించుకున్నారు.

వీటి కిందనే భద్రపరచిన  పాతజ్ఞాపకాలు 

 అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంటవుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు.

ఆ  కాలంనాటి  టాయిలెట్
  
 ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడగడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే – పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న మోజు అర్ధం చేసుకోవచ్చు.

అండర్ గ్రౌండ్  టూర్ లో ఒక దృశ్యం

అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసివేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను లాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగిల్చుకున్నారు.

నాటి రైల్వే స్టేషన్

 ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.

అలనాటి పాత బజారు

అంతరించి పోతున్న నరసారావుపేట గూడు రిక్షాలను గురించి చదివిన సమయంలోనే ఈ ప్రదేశాలకు వెళ్ళిరావడం కేవలం యాదృచ్చికం.
పోతే- గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న వస్తువుల జాబితా తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు – చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం. మొన్న జ్వాలనరసింహారావు ఏదో సందర్భంలో చెప్పాడు. ఈ మధ్య అవసరం పడి, ‘రేడియో కం టేప్ రికార్డర్’ కోసం హైదరాబాదంతా కారు టైర్లు అరిగేట్టు తిరిగాడట. రేడియోనా అదేమిటి అన్నట్టు అందరూ మొహం పెట్టారట.
ఇవి సరే! –
ఇవి కనబడకపోతే ఏదో సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రేమలూ, ఆప్యాయతలూ, అనురాగాలు, అనుబంధాలూ – వీటి సంగతేమిటి? అతివేగంగా అంతరించిపోతున్న వాటిలో వీటిదే ప్రధమ స్థానం.
వీటినెలా కాపాడుకునేటట్టు? కానరాకుండా పోతున్న వీటినెలా కనిపెట్టేటట్టు?
విచిత్రమేమిటంటే ఈ ప్రశ్నలకు జవాబు కూడా- “కనిపించుటలేదు”. (22-09-2010)
NOTE:All images in the blog are copyrighted to the respective owners

18, సెప్టెంబర్ 2010, శనివారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

ఏనుగు శీర్షాసనం వేయడం ఎప్పుడయినా చూసారా!

ఆయనతో పరిచయం ఎలాజరిగిందో గుర్తురావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా , స్తూల కాయానికి ఎక్కువగా వుండేవారు. పేరుమాత్రం కురచగా ప్రసాద్. వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువే. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ విషయాలు ఆయనకు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ సూత్రాలు ఆయనకు కరతలామలకం. భారత, భాగవత, రామాయణ గ్రంధాలన్నీ ఆపోసన పట్టిన వ్యక్తి. అష్టాదశపురాణాల్లో ఏ అంశంపైన అయినా తడుముకోకుండా తర్కించగలిగిన సామర్ధ్యం ఆయన సొంతం. సూర్యోదయం కాకముందే నిద్రలేచి, నిష్టగా అనుష్టానాలన్నీ పూర్తిచేసుకుని, ఇంటినుంచి బయటపడడం తరువాయి, ఆయన జీవన శైలి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.

ఎమర్జెన్సీ తరవాత జనతా సర్కారు ఇందిరాగాంధీపై పెట్టిన కేసుల్లో ఆమె తరపున వాదించిన లాయర్లలో తానొకడినని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. జ్వాలానరసింహారావుతో కలసి నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అందుకు దాఖలా అన్నట్టుగా అనేకమంది పెద్దలను పరిచయం చేసారు. పలువురితో అంతంత పరిచయాలు వున్న ఈ వ్యక్తి హైదరాబాదులో మాత్రం స్కూటరుపై తిరిగేవాడు. మాకు స్కూటరు కూడా లేకపోవడంవల్ల అప్పుడు మాకది సందేహించాల్సిన అంశంగా అనిపించేది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరుపై మా ఇంటికి వస్తుంటే, మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.

ఎక్కడ తిరుగుతున్నా త్రికాల సంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఒకరోజు న్యూఢిల్లీ లో కుతుబ్ మినార్ చూసివస్తూ, సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి, దారిపక్కన నీటి చెలమ వున్నచోట కారు ఆపించి, సంధ్యావందనం చేసివస్తుంటే, మాతో పాటు టాక్సీ డ్రయివర్ కూడా ఆశ్చర్యపోయాడు. జనాలని ఆకర్షించడం కోసం ఆయన అలా చేస్తున్నారేమోనన్న అనుమానం కలగకపోలేదు. కానీ పైకి వ్యక్తం చేసేంత చనువు లేక మిన్నకుండి పోయేవాళ్ళం.

అల్లా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి ఆ హోటల్లోని బుక్ స్టాల్లో పుస్తకాలు చూస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటున్నాము. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓ నియమం వుండేది. ఎంతమందిలోవున్నా సరే -  తెలుగులోనే మాట్లాడుకోవాలని.

అది కలసి వచ్చింది. ఒకాయన మా వైపు తిరిగి తెలుగువాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి “మీరు శ్రీనివాసరావు కదూ!” అన్నారు. ఆయన ఎవరో కాదు విజయవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నప్పుడు నా క్లాస్ మేట్. అప్పటికే బాగా పేరుతెచ్చుకున్న సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల. చదువుకునే రోజుల్లో పేరు జె వి డి ఎస్ శాస్త్రి.

అందరం కలసి ఆ హోటల్లోనే వున్న జంధ్యాల రూముకి వెళ్ళాము. వెళ్లీవెళ్ళగానే, మాతోవచ్చిన లాయరు గారు ఏమాత్రం మొహమాటపడకుండా, కొత్త చోటని సందేహించకుండా “ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా “ అని అడిగి జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలకు దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే, అక్కడవున్న తివాసీపై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్తమాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగినంత పనయింది. చిన్న తలతో, పెద్ద బొజ్జతో అంత లావు శరీరంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెరపోయినట్టు కనిపించారు. తర్వాత వారిద్దరిమధ్య చాలా సేపు కవి పండిత చర్చ సాగింది. అప్పటికే శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల - విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ వారిద్దరి నడుమ సాగిన సంభాషణ నిజానికి ఇద్దరు  పండిత శ్రేష్టులమధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకరినిమించి మరొకరు అక్షరలక్షలుచేసే విద్యను అమోఘంగా ప్రదర్శించారు.ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిల్లో కొన్నింటిని సప్తపదిలో జంధ్యాల పొందుపరిచినట్టున్నారు కూడా.

ఈ చర్చ సాగిన తీరుచూస్తున్న నాకు - చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒక్కరేనా అన్న అనుమానం కలిగింది. ఆ రోజుల్లో - మొత్తం కాలేజీకి ఆయనొక్కడే ‘కారున్న’ కుర్రకారు. ప్రిన్సిపాల్ కూడా రిక్షాలోవస్తుంటే, జంధ్యాల మాత్రం కారులో కాలేజీకి వచ్చేవాడు. ’సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ, వేస్తూ సరదాగా వుండేవాడు. అలాటి జంధ్యాలలోని మరో రూపాన్ని ఆరోజు చూడగలిగాను. అల్లాగే మావెంట వచ్చిన లాయరుగారు. ఆయనకువున్న విషయ పరిజ్ఞానాన్నికళ్ళారా చూసి, చెవులారా విన్నతరవాత, ఆయనపై నాకున్న దురభిప్రాయం దూదిపింజలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పిన అన్న సూక్తి బోధపడింది. మనం చెప్పిందే ఇతరులు వినాలనే ఆత్రంలో యెంత నష్టపోతున్నామో అర్ధం కావాలంటే యిలాటి సజ్జన సాంగత్యం ఎంతో అవసరం.

ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. (18-09-2010)

ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా! – భండారు శ్రీనివాసరావు

ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా! – భండారు శ్రీనివాసరావు

అందరి సంగతేమో కానీ దేవుడుతో నాకు కొన్ని పేచీలున్నాయి. నేను ఆయన్ని అడిగేవన్నీ చాలా అత్యల్ప స్వల్ప విషయాలని నా ధృఢనమ్మకం. ఆయన్నేమన్నా మణులడిగానా మాన్యాలడిగానా. పూర్వం కాలం రాక్షస భక్తుల మాదిరిగా కోరరాని వరాలేమన్నా  కోరానా!  లేదే!  ఏదో కొంచెం అహంకారం తగ్గించవయ్యా మగడా! అన్నాను.

పనిలో పనిగా, కాస్త  చేయి తీరిక చేసుకుని ఆ చేత్తోనే నా అజ్ఞానం కూడా కొంత తగ్గించమని మొక్కుకున్నాను. పట్టించుకున్న పాపాన పోతేగా! ఆయన లెక్కలు ఆయనకున్నట్టున్నాయి. దేవుడు కదా! కాళ్ళూ చేతుల మాదిరిగా తెలివితేటలు కూడా మనుషులకంటే  ఆయనగారికి ఎక్కువే కాబోలు.

అహంకారం తగ్గిస్తే తనకు ఇక బొత్తిగా పనివుండదన్న సందేహం వల్ల కావచ్చు. అజ్ఞానులు లేకపోతె తననిక నమ్మేవాళ్ళు కూడా వుండరన్న అనుమానం వల్ల కావచ్చు. మొత్తానికి ఏమయితేనేం దేవుడు నా గోడు పట్టించుకోలేదు. దానితో నా అహంకారం, అజ్ఞానం రెండూ ఒకటి నొకటి పెనవేసుకుని  - పాదు చేసి, నీరు పోసి పెంచిన పూలపొదలా నన్ను గట్టిగా అల్లుకుపోయాయి.

అలా అల్లుకుపోయిన ఆ రెండూ ఇప్పుడు ఈ బ్లాగులో మఠం వేసుక్కూర్చున్నాయి. వెనక్కి తిరిగి చూసుకోకుండా  ఎడాపెడా రాసేస్తున్న ఈ  బ్లాగు పోస్టింగుల్లో నక్కి నక్కి చూస్తున్నాయి.

అందువల్ల మీ అందరికీ నా మనవేమిటంటే –
అలాటి అజ్ఞానపు ఆలోచనలు, దురహంకార  ధోరణులూ ఈ రాతల్లో ఎక్కడయినా పంటికింద రాయిలా తగిలితే  పెద్దమనసు చేసుకుని 
 నా అజ్ఞానాన్ని మన్నించండి. నా అహంకారాన్ని క్షమించండి.
ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా!
(17-09-2010)

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

రేడియో రోజులు -7 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు -7            - భండారు శ్రీనివాసరావు

ఒకరు - సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.

గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం - ఎన్ టీ రామారావు గారి నాయకత్వంలో నడుస్తున్న రోజులాయె.

హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం - అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు గారు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు గారు అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేఖరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గ మధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలిపేరు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం - చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం - ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు కానీ ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది.

పైలట్ రాజీవ్

నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది.నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంట పట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్తిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే -

మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమవయిపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.
రాజీవ్ గాంధీ ఆయన కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు గారు, వెంగళరావు గారు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్(ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ ) - అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.

ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత - 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావు గారికి కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు - మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు గారు, వెంగళరావు గారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము- సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా.జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావుగారు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు గారు , సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్- అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.

అందరి ప్రాణాలు (అడవి) గాలిలో దీపాలు

అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా - రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా - నిబ్బరం కోల్పోకుండా - సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.

రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టు  గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి - అన్నం మెతుకులను పట్టి చూసి - ఆ పేదరాలి భుజంపై చేయి వేసి - సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిధి - దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో!
తర్వాత షరా మామూలే.- రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.
ఒక ప్రధాని-ఒక ముఖ్య మంత్రి- ఒక మాజీ ముఖ్య మంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి - మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

రేడియో రోజులు - 6 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 6   - భండారు శ్రీనివాసరావు

“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.

చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.

ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో – కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.

పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యెక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.

ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి కానీ, అంజయ్య గారు విషయాలను యెంత నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.

ఒకసారి కౌలాలంపూర్ లో తెలుగు మహాసభలు జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)
   

13, సెప్టెంబర్ 2010, సోమవారం

రేడియో రోజులు - 5 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 5  - భండారు శ్రీనివాసరావు

“నేను ఏది చెబితే అదే జీవో” అనే వారు 1978 లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు.

ఆయన వ్యవహారశైలి విలక్షణంగా వుండేది. తను అనుకున్నది నిమిషాలమీద కాదు క్షణాలలో జరిగిపోవాలని పట్టుబట్టేవారు. యెంత పెద్ద అధికారినయినా ఆయన లెక్కపెట్టేవారు కాదు. ఐ ఏ ఎస్ అధికారి అని కూడా చూడకుండా ‘ఎక్కడ దొరికారయ్యా చావల్ ఖరాబు గాళ్ళు’ అని ఫైళ్లు విసిరేయడం నేను చూసాను. ఆయన ఆఫీసులో వున్నారంటే చాలు – ఆ చాంబర్ అంతా ఒకరకమయిన నిశ్శబ్దం రాజ్యం చేసేది. అధికారులు, అనధికారులు యెంతటి వారయినా సైగలు - మహా అయితే - గుస గుసలు, అంతే కానీ మాట పెదవి దాటేదికాదు.

చెప్పినవెంటనే జరిగిపోవాలనే ఆయన నైజం నిఖార్సయిన అధికారులకు ఒక పట్టాన మింగుడు పడేదికాదు. “రూలు ప్రకారం కుదరదు సార్” అని మొహం మీద చెప్పే ధైర్యం వారికి వుండేది కాదు. ఎందుకంటే చెప్పిన పని కాదన్నవారినీ, చెయ్యనివారినీ ఆయన నలుగురిముందూ మొహమ్మీదే కడిగేసేవారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో దిట్ట అయిన చెన్నారెడ్డి గారికి అధికారులతో ఆడుకోవడం వెన్నతోపెట్టిన విద్య. పైగా ఫైళ్ళపై ఎండార్స్ మెంట్లు రాయడంలో ఆయనకు ఆయనే సాటి.

సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎస్. ఆర్. రామ్మూర్తి గారు ముఖ్యమంత్రి పేషీలో వుండేవారు. ఆయనకేమో అంతా రూలు ప్రకారం నడవాలి. రూలు పేరెత్తితే రూళ్లకర్ర పట్టుకుని హుంకరించే తత్వం చెన్నారెడ్డి గారిది. ‘ఎవరయ్యా ఈ రూల్స్ పెట్టింది. మనం పెట్టుకున్నవేగా, మార్చుకుంటే పోలా!’ అనే వారు.

‘అలా మార్చుకున్నప్పుడు మాకేమిటి అభ్యంతరం? కానీ, అప్పటిదాకా, ఇప్పుడున్న రూలే మాకు రూలు’ అన్నది రామ్మూర్తి గారి రూలు.

ఏమయితేనేం, కొన్నాళ్ళకి రామ్మూర్తి గారే సర్దుకున్నారు. అంటే రూల్స్ తో సమాధాన పడ్డారని కాదు. రెడ్డి గారి తత్వం అర్ధం చేసుకుని ఒక ఉపాయం కనుక్కున్నారన్న మాట. ముఖ్యమంత్రి గారు ఏదో పని చెప్పి చెయ్యమనగానే మరేదో రూలు చెప్పి కుదరదనే వారితో ఆయనగారికి కుదరదని తెలుసుకున్నారు. అందుకే, ఎప్పటికెయ్యదిప్రస్తుతమన్నట్టుగా – అప్పటికి ఒక్కసారి ‘యస్ సార్’ అంటే పోలా’ అనుకున్నట్టున్నారు. సంబంధిత ఫైలు మళ్లీ సీ ఏం పేషీకి వచ్చేసరికి ఎలాగూ కొంత వ్యవధి పడుతుంది. అప్పుడు నెమ్మదిగా చెబితే ఆయనే వింటారులే అని ఒక మధ్యే మార్గం కనుక్కున్నారు. అప్పటినినుంచి చెన్నారెడ్డి గారు ఏదయినా అడగ్గానే రామ్మూర్తి గారు వెంటనే ‘యస్ సర్’ (తప్పకుండా చేద్దాం సర్) అనేవారు. ఆ ఒక్క మాటతో చెన్నారెడ్డి గారు ఖుష్. ఫైల్ మళ్లీ పేషీకి వచ్చిన తరవాత సీ ఏం గారికి చూపించేటప్పుడు మాత్రం రూలు ప్రకారం ఆ పని చేయడం ఎలా కుదరదో వివరంగా చెప్పి- ‘నో సర్’ (కుదరదు సర్ ) అనేవారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆ ఆనుపానులన్నీ తెలిసిన రెడ్డిగారు కిమ్మనకుండా తలపంకించి వూరుకునేవారు.

ఇదంతా తెలిసిన వారు – ఆయన ఇంటి పేరు ‘యస్ ఆర్’ తో ముడిపెట్టి - ‘ఫైలు రాకముందు యస్ సర్ రామ్మూర్తి - వచ్చిన తరవాత నో సర్ రామ్మూర్తి’ అని సరదాగా అనుకునే వారు. రేడియో రిపోర్టర్ గా ముఖ్యమంత్రి కార్యాలయంలో చనువుగా తిరిగే నాకు ఇలాటి విషయాలు అప్పుడప్పుడు చెవిలో పడేవి. (12-09-2010)
 

11, సెప్టెంబర్ 2010, శనివారం

రేడియో రోజులు – 4 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు – 4   -  భండారు శ్రీనివాసరావు


రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి.

ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్.  చైర్మన్ లైన్లోకి వచ్చారు.  ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో - ఇంకా ఎవరెవరు వస్తున్నారని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే – నిర్మలా వసంత్, విజయకుమార్ – వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన. అప్పుడు లైట్ వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక - మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు.

ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు.

ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే - రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఎప్పుడో డిల్లీలో వున్నప్పుడు మినహా తప్పకుండా వారి కార్యక్రమాన్ని వింటూవుంటానని చెప్పేవారు. రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో – ఇలాటి వారుచెప్పే మాటలే

ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని అనుకుంటాను.

ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమేకదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేదికాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే కాదు, వారి కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు.

అలాగే కార్మికుల కార్యక్రమం. ఆ కార్యక్రమం రూపొందించే తీరుకు ముగ్ధులై,  కార్మికులు కాని వారు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు. బాలల పత్రిక ‘చందమామ’ ను చదవడానికి పిల్లల కంటే పెద్దవాళ్ళే ఎక్కువ మక్కువపడినట్టుగా. అందులో రాంబాబుగా డి. వెంకట్రామయ్య గారు, చిన్నక్కగా శ్రీమతి వి.రతన్ ప్రసాద్ గారు, ఏకాంబరంగా వట్టెం సత్యనారాయణ గారు ఆ రోజుల్లో స్టార్ డం సంపాదించుకున్న రేడియో కళాకారులు. స్కూళ్ళు, కాలేజీల్లో జరిగే వార్షికోత్సవాలకు వీరిని ముఖ్య అతిధులుగా పిలిచి సన్మానించేవారు. వెంకట్రామయ్యగారు తరువాతి కాలంలో న్యూస్ రీడర్ గా మారారు. రిటైర్ అయ్యేంతవరకూ అదే ఉద్యోగం.

ఈ రేడియో కళాకారులవి గొర్రె తోక జీతాలు. ఎదుగూ బొదుగూ లేదు. ప్రమోషన్లు లేవు. ఎక్కడ చేరారో అక్కడే రిటైర్ అయ్యేవాళ్ళు. అయినా మనసుపెట్టి పనిచేసేవారు. వారికిది వృత్తి కాదు. ప్రవృత్తి. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారిలో ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు, కవులూ, రచయితలూ వుండేవారు. స్టేషన్ డైరెక్టర్లు కూడా వీరికి ఎంతో మర్యాద ఇచ్చేవారు. నేను చేరకముందు – శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్తానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, గోపీచంద్, బుచ్చిబాబు, నాయని సుబ్బారావు,  న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య), బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, రావూరి భరద్వాజ, శంకరమంచి సత్యం, నండూరి విఠల్ వంటి దిగ్గజాలు హైదరాబాద్ రేడియో కేంద్రంలో పనిచేశారు. వీరుకాక, భాస్కరభట్ల కృష్ణారావు, శారదా శ్రీనివాసన్, తిరుమలశెట్టి శ్రీరాములు, వింజమూరి సీతాదేవి, మాడపాటి సత్యవతి, జ్యోత్స్నా ఇలియాస్, ఇందిరా బెనర్జీ ఒకరా ఇద్దరా ఇందరు తమ స్వరాలతో హైదరాబాద్ రేడియో కేంద్రానికి  అజరామర కీర్తిని సముపార్జించి పెట్టారు. నాకు తెలిసి వీళ్ళల్లో ఎవ్వరూ కూడా నెలకు అయిదారువందలకు మించి జీతాలు తీసుకున్నవారులేరు. ఇందిరాగాంధీ ప్రధాని కావడానికి పూర్వం సమాచార ప్రసార శాఖల మంత్రిగా వున్నప్పుడు రేడియోలో పనిచేసే స్టాఫ్ ఆర్టిస్టుల స్తితిగతులు అర్ధంచేసుకుని, వారికి కేంద్ర ప్రభత్వ ఉద్యోగులతో సమానంగా ( పే స్కేల్స్) జీత భత్యాలు లభించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రమోషన్లు ఇతర సౌకర్యాలు కూడా వర్తింపచేశారు. నేను చేరినప్పుడు నాదీ స్టాఫ్ ఆర్టిస్టు ఉద్యోగమే. నాకు ముందు రేడియో రిపోర్టర్ గా పనిచేసిన తురగా కృష్ణమోహన రావుగారు జగమెరిగిన హాస్య రచయిత. ఆంద్ర పత్రిక వీక్లీలో ‘ప్రవీణ్’ అనే కలం పేరుతొ ‘రాజధాని కబుర్లు’ అనే శీర్షిక నడిపేవారు. హైదరాబాదు విశేషాలను వారం వారం తనదయిన ప్రత్యెక శైలిలో రాసేవారు. ఆ రోజుల్లో నేనాయనకు పరమ వీర అభిమానిని.

1974 అక్టోబర్ రెండో తేదీన కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని రైల్వే అధికారులు కొంతమంది విలేకరులను హైదరాబాదు నుంచి ఆ రైలులో తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లుచేశారు. ముఖ్యమంత్రి వెంగళరావు గారు జెండా వూపి రైలును బయలుదేరదీసారు. అప్పటివరకూ ప్లాటుఫారం పైనే నిలబడి వున్న విలేకరులు, కదిలిన రైలు కొద్దిదూరం వెళ్లి ఆగుతుందని, అప్పుడు ఎక్కవచ్చని అనుకున్నారు. కానీ అది ఆగకుండా వెళ్ళిపోయింది. విలేకరుల లగేజీ మాత్రం రైల్లో వుండిపోయింది. అధికారులు వారికోసం అప్పటికప్పుడు ఒక వ్యాన్ ఏర్పాటుచేశారు. కానీ, దురదృష్టం. నకిరేకల్ సమీపంలో ఆ వ్యాన్ చెట్టుకు డీ కొట్టింది. చనిపోయిన వారిలో కృష్ణమోహన రావుగారున్నారు. ఆంధ్రదేశం గర్వించదగిన ఒక గొప్ప రచయితను ఆ రోడ్డుప్రమాదం పొట్టనపెట్టుకుంది. (10-09-2010)

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వినాయక చవితి శుభాకాంక్షలు








" వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభనిర్విఘ్నమ్ కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.."

వినాయక చవితి శుభాకాంక్షలు

నిర్మలాదేవి-భండారు శ్రీనివాసరావు

CAMP:SEATTLE(U.S.A.) 





రేడియో రోజులు- ౩ - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు- ౩    - భండారు శ్రీనివాసరావు


నేను 1975 లో పుట్టి 1985 లో చనిపోయాను.

అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..

రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి. సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు  'ఆ ఖాళీ పేజీలు’ ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.

అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.

వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు..

వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.

రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - ‘మంచిది వెళ్ళిరండి” అనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.

వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.

బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ – ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు.  చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (09-09-2010)

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

రేడియో రోజులు - 2 -భండారు శ్రీనివాసరావు

వాసరావు

రేడియో రోజులు - 2 -భండారు శ్రీనివాసరావు

ఉద్యోగం చేసేవాడికి డ్రెస్ కోడ్ వుండాలనేది మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి నిశ్చితాభిప్రాయం. అంటే యూనిఫారం అని కాదు. హుందాగా వుండే దుస్తులు వేసుకుంటే అవతలవారికి మనపట్ల సరయిన అభిప్రాయం కలుగుతుందని ఆయన ఉద్దేశ్యం. అయితే, ‘రేపటి మనిషి’ గా నాకు నేను కితాబు ఇచ్చుకునే నాకు మాత్రం వేసుకునే దుస్తులమీద అంత పట్టింపులు ఏమీ లేవు. ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు న్యూస్ పేపర్ నమూనాలో ప్రింట్స్ వున్న చొక్కాలు వేసుకుని తిరిగేవాడిని. రేడియోలో చేరిన తరవాత మా అన్నయ్య పట్టుబట్టి నా వేష ధారణలో కొంత మార్పు తీసుకురాగలిగారు. ఒకరోజు ఏదోపనిమీద రేడియో స్టేషనుకు వచ్చిన అయన మా న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధరావు గారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటె ఆయన -  రంగురంగుల బొమ్మల బుష్కోటు(బుష్ ష ర్ట్)వేసుకుని  ఆఫీసులో కనిపించారు. చూడడానికి చిన్న ఆకారమయినా - రంగనాధరావు గారిది నిజమయిన రేడియో స్వరం. ఆయన వార్తలని ఈ నాటికీ గుర్తుచేసుకునేవారు వున్నారు.

“ఆకాశవాణి – తెలుగులో వార్తలు చదువుతున్నది – పన్యాల రంగనాధరావు –డిల్లీ నుంచి ప్రసారమవుతున్న ఈ వార్తలను హైదరాబాద్, విజయవాడ, మద్రాసు రేడియో కేంద్రాలు రిలే చేస్తున్నాయి.” అంటూ ఆ వార్తలు మొదలయ్యే తీరు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అలాగే, జగ్గయ్యగారు వార్తలు చదివితే ఆయన కంఠం కంచులామోగేదని వినడమే కానీ ఎన్నడు ఆ వార్తలు వినలేదు. వార్తలు వినే వయసు వచ్చేసరికే బహుశా ఆయన సినిమా రంగానికి వెళ్ళిపోయివుంటారు.

హైదరాబాద్ లో రేడియోలో చేరిన కొత్తల్లో ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేసరికి రంగనాధరావు గారు ఏదో పనిచేసుకుంటూ కనిపించారు. ఏం పని మీద వచ్చావన్నట్టు నా వైపు చూసారు. నా  మొహంలో రంగులు మారడం చూసి – “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది? రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులు చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి- తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు. “ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడేషన్ కార్డు తీసుకుని ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్ పాసు తీసుకున్న తరవాతే –మిగిలిన ఏ పనులయినా! – తెలిసిందా” అన్నారు. తెలియకపోవడానికి ఏముంది. కానీ ఇలాటి పై అధికారులు కూడా వుంటారా అన్నదే అంతవరకూ తెలియని విషయం.

ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు నార్ల గారితో నాకు ఇలాటి అనుభవం ఇంకో రూపంలో ఎదురయింది. ఆయనకు చండశాసనుడనే పేరు. పెద్దవాళ్ళకే ఆయన గారితో మాట్లాడాలంటే కాళ్ళల్లో వొణుకు. జ్యోతిలో చేరిన నాలుగు నెలలకే నాకు రెండు రోజులు సెలవు కావాల్సివచ్చింది. ధైర్యం కూడదీసుకుని వెళ్లాను. ఏకళన వున్నారో ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే సంతకం పెట్టి ఆ రోజు సంపాదకీయం రాసే పనిలో మునిగిపోయారు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ఒక కొలిక్కి వస్తున్నరోజులవి. నిజానికి ఎవరికీ సెలవు ఇచ్చే పరిస్తితి లేదు. అందరం రాత్రీ పగలూ అనకుండా పనిచేస్తుండేవాళ్ళం. నేను చేసే సబ్ ఎడిటర్ పనికి తోడు, యుద్ధ రంగంలో భారత సైన్యం కదలికలను సూచించే మ్యాపులను  తయారుచేసే పని  కూడా  చూస్తుండేవాడిని.

సరే. సెలవునుంచి వచ్చిన తరవాత వెళ్లి నార్లగారిని కలిసాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చిన సంగతి చెప్పాను. అప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి. “ఆదర్శాలు అంటూ ఏదేదో రాస్తూ వుంటాము. కానీ కుర్రాడివి నువ్వు చేసి చూపెట్టావు. పో! మళ్ళీ సెలవు ఇస్తాను పో! భార్యతో  హాయిగా ఊళ్ళు  తిరిగి నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా! పో!” అన్నారు ఆయన స్టయిల్లోనే కరుగ్గా.

“నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కుదారుణాఖండలశస్త్రతుల్యము” అని వూరికే అన్నారా! (06-09-2010)

6, సెప్టెంబర్ 2010, సోమవారం

రివైండ్ (పదహారో భాగం) - 2010



విన్నంతలో కన్నంతలో అమెరికా 
కుక్క ఒక్కటే ధర్మరాజు వెంట కడదాకా వెంటవుండి స్వర్గానికి వెళ్ళిందని ఇతిహాసం. అది ఎంతవరకు నిజమన్నది పక్కనపెడితే అమెరికా మాత్రం కుక్కలపాలిటి స్వర్గమనే చెప్పాలి. ‘ఛీ! ఏం బతుకు కుక్కబతుకు’ అని బాధపడే సీను అమెరికాలో లేదు. ఎందుకంటె ఈ దేశంలో కుక్కలది కుక్క బతుకు యెంత మాత్రం కాదు.ఒక రకంగా చూస్తె మనుషులే వాటి వైభోగం చూసి అసూయపడాల్సిన పరిస్తితి. అక్కడివారికి తెలుగు పాటలు వచ్చుంటే –‘పుడితే కుక్కయి పుట్టాలిరా!’ అని పాడుకుంటూ వుండేవారు.

శునక వైభోగం

కారణాలు తెలియవుకాని, అమెరికన్లకు కుక్కలంటే ప్రాణం. చాలామంది కుక్కల్ని సొంత పిల్లలకంటే ప్రేమగా పెంచుకుంటారు. వాటికి పెట్టే పేర్లు కూడా అలాగే వుంటాయి. ఒకాయన తన కుక్కకు ‘సర్’ (అంటే తెలుగులో “అయ్యగారు”) అని పేరుపెట్టుకుని కుక్క పట్ల తన భయభక్తులను చాటుకున్నాడు. ఆఫీసర్ మీద కోపంతో కుక్కకు అలా పేరుపెట్టి అక్కసు తీర్చుకున్నాడని గిట్టనివాళ్లంటారు.
ఇక్కడ కుక్కల పెంపకం చూస్తె తల తిరిగిపోతుంది.

వీటి కోసం -

 
నేనేం తక్కువ?

ప్రత్యేకమయిన సోపులు, షాంపూలు, వొంటి నూనెలు, దువ్వెనలు, హెయిర్ డ్రయర్లు, బాతు టబ్బులు, టవల్స్, పక్కబట్టలు, చలి దుస్తులు, చలవ అద్దాలు, రెడీమేడ్ ఫుడ్స్, బిస్కెట్లు (కుక్క బిస్కెట్లు అంటే అంటే వాటిని పెంచేవారికి ఎక్కడలేని కోపం ముంచుకొస్తుంది) ఆటవస్తువులు, గోళ్ళు కట్ చేసే కత్తెరలు, జుట్టు కత్తిరించే సెలూన్లు, వొళ్ళు వెచ్చపడితే చూపించడానికి క్లినిక్కులు, మందులు రాసిస్తే కొనుక్కోవడానికి విడిగా దుకాణాలు, కాలో చెయ్యో విరిగితే అందుకోసం ప్రత్యేకంగా డాక్టర్లు, ఆపరేషన్లు చేయాల్సివస్తే ప్రత్యెక ఆసుపత్రులు, వీటికోసం మళ్ళీ విడిగా ఇన్స్యూరెన్సులు ఒకటారెండా ఈ జాబితా చాంతాడంత వుంటుంది.

బస చేయడానికి స్టార్ హోటళ్లు

కుటుంబంతో వేరేవూళ్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు –వెంట వచ్చే పెంపుడు కుక్కలకోసం విడిగా ‘కుక్కల హోటళ్ళ’లో అకామడేషన్ బుక్ చేస్తారు. ఈ కుక్కల హోటళ్ళు ఆయా కుక్కల స్తాయికి తగినట్టుగా వుంటాయి. బాగా పెట్టిపుట్టిన కుక్కలు ఫైవ్ స్టార్ వసతులువున్న విడిదుల్లో మకాం చేస్తాయి. అక్కడ వుండే వసతులు అపూర్వం. అందుకోసం వసూలు చేసే చార్జీలు కూడా అనూహ్యం.

ఇలా నిద్రపుచ్చితే కాపలా కాసేది ఎవరట? 

ఇక, వూళ్ళో వున్నప్పుడు, ఉదయం సాయంత్రాలు పిల్లల్ని తీసుకువెళ్ళినట్టు – వెంటబెట్టుకుని వాహ్యాళికి తీసుకువెడతారు. ముందు తోకాడించుకుంటూ కుక్కగారు. వెనక చేతిలో ఒక ప్లాస్టిక్ సంచీతో యజమానిగారు.

ప్రేమంటే ఇదేరా!

దారిలో ఎక్కడయినా కుక్కగారికి కాలకృత్యాలు తీర్చుకోవాలని ముచ్చట వేస్తె ఏమీ మొహమాటపడకుండా- ఇతరేతర దేశాల్లోని తన సోదర కుక్కలమాదిరిగానే బహిరంగ ప్రదేశాల్లోనే బహిరంగంగా ఆ పని పూర్తి చేస్తుంది. దాని వెనుకే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చే యజమాని గారు తక్షణం చేతికి పని చెప్పి- శునకం విసర్జించిన ‘పదార్ధాన్ని’ చేతిసంచీలోకి ఎంతో జాగ్రత్తగా సేకరించి, వాహ్యాళి కార్యక్రమాన్ని యధావిధిగా - ప్రకటనల అనంతరం టీవీ సీరియల్ లాగా కొనసాగిస్తారు. అటువంటి అపూర్వ సందర్భాలలో భార్య కూడా వెంట వున్నా - సాధారణంగా భర్తగారే భక్తిప్రపతులతో ఈ పవిత్ర భాద్యతను నిర్వహిస్తూవుంటారు. పార్కుల్లో కూడా ఇదే దృశ్యం. పిల్లల్ని కన్నతల్లి ఓపక్క ఆడిస్తుంటే – మరో పక్క, కుక్కగారి పెంపుడు తండ్రి శునక సేవనంలో తరిస్తుంటాడు.

ఇవన్నీ చూసిన తరువాత ఎవరయినా ఒక విషయం ఒప్పుకోకతప్పదు.

ఏమాత్రం సిగ్గుపడకుండా , మొహమాటపడకుండా, నలుగురూ చూస్తున్నారన్న భేషజాలు లేకుండా ‘పసి పిల్లల విషయంలో కన్నతల్లులు చూపే ఆప్యాయత మాదిరిగా’ కానవచ్చే వారి ప్రవర్తన – కుక్కలపట్ల వారికున్న ప్రేమాభిమానాల్లో ఏమాత్రం కల్తీ లేదన్న స్వచ్చమయిన నిజాన్ని వెల్లడి చేస్తుంది.

దారి చూపే శునకమా!
సాధారణంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, మాల్స్ లో కుక్కలకు ప్రవేశం వుండదు. అయినా కొన్ని చోట్ల ఇవి దర్సనం ఇచ్చాయి. వాకబు చేస్తే తెలిసినదేమిటంటే – అవి గైడ్ డాగ్స్. దృష్టి లేని వారికి దోవచూపేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు అవి.

.....నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్

 చిన్నపిల్లలని అమ్మవొడి వంటి సెంటర్లలో వొదిలి వేసి - అమ్మానాన్నా ఉద్యోగాలకు వెళ్లినట్టు ఇక్కడ కుక్కపిల్లలు కనిపెట్టిచూసుకోవడానికి డే కేర్ సెంటర్లు  వున్నాయి.వాటి ఆలనా పాలనా చూసుకోవడమే కాకుండా వాటికి చక్కని శిక్షణ కూడా ఇస్తారు. పసి కూనల్ని అలా పంపించలేనివాళ్ళు ఏకంగా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంట్లోనే శిక్షణ ఇప్పిస్తారు. వాళ్ళు వారానికొకసారి వచ్చి ‘ఇంటికి తెలిసినవారు వచ్చినప్పుడు ఎలా మెలగాలి? పక్కింటి కుక్కతో ఎలా మెసలాలి?’ అనే విషయాలపై శిక్షణ ఇస్తారు. చీటికీ మాటికీ భౌ భౌ అంటూ మొరిగి గోలచేయకుండా మామంచి కుక్కలా ఎలా వొదిగి వుండాలో దగ్గరుండి నేర్పుతారు. కుక్కలకు మంచి నడవడిక బోధించడానికి మార్కెట్లో రకరకాల పుస్తకాలు లెక్కలేనన్ని దొరుకుతాయి. ఇవి కాక కుక్కలకు పెట్టాల్సిన ఆహారం ఎలాతయారు చేయాలి అనే అంశాలపై టీవీల్లో ప్రత్యెక కార్యక్రమాలు సరేసరి.

NOTE:All images in the blog are copyrighted to respecive owners  


4, సెప్టెంబర్ 2010, శనివారం

రసరమ్య పుస్తకం - భండారు శ్రీనివాసరావు

రసరమ్య పుస్తకం - భండారు శ్రీనివాసరావు 


చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ- పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే మిగిలిపోతే పాతసంగతులు గుర్తుచేసుకునే చాన్సు వుండదు. ఒకవేళ గుర్తుచేసుకున్నా విన్న జనం మొహానే నవ్వుతారు. కానీ, చిన్నతనంలో ఏ తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ, సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే – చిన్నప్పటి చిల్లర జీవితానికి ‘ గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకుంటే అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా - రివ్యూ లు రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. కాకపొతే - ఈ మధ్య వీటిని కూడా “రాయించి, వేయించు కోవాల్సి” వస్తోందని కొందరు గిట్టనివాళ్ళంటున్నారు. అందుకే ఇలాటి ఆత్మకధలు లేదా జీవిత కధలూ లేదా బయోగ్రఫీలూ, ఆటోబయోగ్రఫీలు –అనబడే- కొద్దోగొప్పో ఇచ్చి రాయించుకునే ‘జీవిత చరిత్రల’కు ఈ రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా ముచ్చటబడే రసకందాయఘట్టాలు మచ్చుకయినా కనిపించవు కాబట్టీ , అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ – పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు కాదు కాబట్టీ – వాటి జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే – అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో రసరమ్య ఘట్టాలు’ వుండే వుంటాయి. లేకపోయినా ‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర అంశాలను తమ కల్పనాచాతుర్యంతో సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతే కాదు ఆ సన్నివేశాలకు తగిన మసాలాను దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ రకమైన ముఖ్యాంశాలను గ్రంధ ప్రచురణకు ముందుగానే – ఆకర్షణీయమయిన ప్రమోలుగా రూపొందించి – పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు.

అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు ఇటీవల మనవైపు కూడా విస్తరిస్తున్నాయి.

టోనీ బ్లెయిర్ - ప్రయాణం

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ - తన జీవితం లోని కొన్ని ఘట్టాలతో “ప్రయాణం” పేరుతొ ఒక పుస్తకం రాసారు. ముందు చెప్పిన విధంగానే అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని ‘సన్’ పత్రిక ప్రారంభించింది. ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ అందులోని ఒక ఆసక్తికరమయిన విషయాన్ని బయట పెట్టింది.

టోనీ బ్లేర్ మహాశయులవారు- బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో – ఒక ఫ్రెంచ్ యువతితో ప్రేమలో పడ్డారుట. ఆమెపై మరులుపెంచుకున్న టోనీకి ఆ వ్యామోహంనుంచి బయటపడడం ఒక పట్టాన సాధ్యం కాలేదుట.

“ఆలోచించడం మానుకో ఆనందించడం నేర్చుకో’ అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ పడుచువాడు- భవిష్యత్తులో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి కాగలడని ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.

‘సన్’ పత్రిక లో వచ్చిన ఈ ‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం - మొత్తానికి ఈ ట్రిక్ పనిచేసింది.

ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం హాటు కేకుల్లా ఎగరేసుకుపోయారుట. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని ప్రేమ పురాణం  కాబట్టి పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ పుస్తకాన్ని ఫ్రెంచిలో భాషలో సయితం ప్రచురించారు.

పుస్తక విక్రయాలను పెంచుకునే ప్రచారంలో భాగంగా టోనీ బ్లేర్ అమెరికన్ టెలివిజన్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రిన్సెస్ డయానాను ఆకాశానికి ఎత్తేసారు. అంతటి అందగత్తె ఈ భూప్రపంచంలో మరొకరు కానరారు అని కానరాని లోకాలకు తరలిపోయిన డయానాను వేనోళ్ళ పొగిడారు.

ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా- – యిరవై నాలుగు పౌండ్లు మీవి కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది. (03-09-2010)
NOTE: All images in the blog are copy righted to respective owners

2, సెప్టెంబర్ 2010, గురువారం

రేడియో రోజులు -1 -భండారు శ్రీనివాసరావు

2004 జనవరి చివరి వారం లో ఒక రోజు.

ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నుంచి అప్పుడే ఇంటికి చేరాను, మా ఆవిడను అమెరికాలోనే వొదిలేసి.

శ్రీ దేవులపల్లి అమర్


పేపర్లు వచ్చే సమయం కాలేదు కనుక టీవీ స్విచ్ ఆన్ చేసాను. హఠాత్తుగా టీవీ తెరపై వార్తలు చదువుతూ అమర్ కనిపించాడు. నాకు తెలిసినంతవరకు అతడికి ప్రింట్ మీడియా తప్ప విజువల్ మీడియాలో పనిచేసిన అనుభవం లేదు. అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒకసారి రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివే కాజువల్ న్యూస్ రీడర్ పోస్ట్ కోసం వచ్చాడు. అదీ మా రిక్వెస్ట్ మీదనే. జర్నలిస్టులు అయితే భాష మీద పట్టు వుంటుందనిమా వాళ్ళు వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. నిజానికి ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదు. వార్తలు చదివేవాళ్ళు సెలవుపెట్టినప్పుడు వీళ్ళని బుక్ చేసి ఆ రోజు వార్తలు చదివిస్తారు. అప్పట్లో రేడియోకు వున్న గ్లామర్ మూలాన చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఆసక్తి చూపేవారు. కాజువల్ న్యూస్ రీడర్ని సెలక్ట్ చేయడానికి చిన్న పరీక్ష వుండేది. ఇంగ్లీష్ నుంచి వార్తలను తెలుగులోకి అనువాదం చేయడం, ఒక నమూనా న్యూస్ బులెటిన్ చదివించి రికార్డ్ చేయడం అన్నమాట. వార్తాపత్రికల్లో పుష్కలంగా అనుభవం వున్న అమర్ కు అనువాదం కొట్టిన పిండి. అందువల్ల ఆ మెట్టును ఇట్టే దాటి బులెటిన్ చదివే ఘట్టానికి చేరుకున్నాడు. అది దాటితే సెలక్షన్ అయిపోయినట్టే. అయితే, అమర్ వాయిస్ లో తెలంగాణా స్లాంగ్ వుంది అని కామెంట్ చేసాడు అప్పటి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు. అతడు ఆంద్ర ప్రాంతం వాడయినా ప్రాంతీయ విద్వేషాలు లేని మనిషి. రేడియో బులెటిన్ తయారు చేయడం పట్ల ఆయనకు కొన్ని నిర్దిష్ట మయిన ఆలోచనలు వున్నాయి. అన్ని ప్రాంతాలవారు వింటారు కాబట్టి ఎలాటి రీజినల్ స్లాంగ్ లేకుండా వార్తలు చదవాలన్నది కేంద్ర ప్రభుత్వ అధికారిగా అతగాడి ఉద్దేశ్యం. కానీ ఈ సంగతి తెలిసిన అమర్ నిర్ద్వందంగా ఆ సెలెక్షన్ ప్రాసెస్ ను కాదని వెళ్ళిపోయాడు. అంతవరకూ నాకు అమర్ తో వున్న పరిచయం అంతంత మాత్రమె అని చెప్పాలి. అది కూడా ప్రెస్ క్లబ్ కే పరిమితం. కాకపొతే తరవాతి రోజుల్లో మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నా విషయం వొదిలి పెడితే, అమర్ స్వతహాగా స్నేహ శీలి. అందరితో చాలా కలుపుగోలుగా మెలిగే తత్వం అమర్ సొంతం.


అప్పుడే అమెరికా నుంచి వచ్చిన నాకు అమర్ టీవీ తెరపై కనబడడం యెంత ఆశ్చర్యాన్ని కలిగించిందో, అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం మరో సంగతి గమనించిన తరవాత కలిగింది. అమెరికాలో ఇరవై నాలుగుగంటల న్యూస్ చానళ్ళకు అలవాటు పడి రావడం చేత ఆ సమయంలో వార్తలు ఎందుకు వస్తున్నాయో అన్న అనుమానం ముందు కలగలేదు. వేళ కాని వేళలో ఈ వార్తలు ఏమిటి అన్న సందేహం పొటమరించిన తరవాత నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. ఇదేమిటి ఇది ఇండియాలో సాధ్యమా అనిపించింది. ముప్పయ్యేళ్ళుగా రేడియోలో పనిచేస్తున్న నాకు ఈ పరిణామం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒకే ఒక మూసలో పోసినట్టుగా కాకుండా నాలుగు కోణాలనుంచి జనం సమాచారం తెలుసుకునే వీలు కలిగినందుకు ఒక మీడియా మనిషిగా ఆ నాడు సంతోషించాను. వెంటనే బయటకు వెళ్లి పబ్లిక్ కాల్ బూత్ నుంచి అమెరికాకు ఫోను చేసి నేను క్షేమంగా చేరిన సమాచారంతో పాటు, నేను దేశంలో లేని అయిదు మాసాల్లో సంభవించిన ఈ అద్భుతమయిన మార్పుని గురించి కూడా మా వాళ్లకు గొప్పగా వివరించాను.

ఆ రోజు టీవీలో చూసిన అమర్ ఎవరో కాదు తదనంతర కాలంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన దేవులపల్లి అమర్. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు. ఆ తెలతెలవారే సమయంలో నేను చూసిన ఆ న్యూస్ చానల్ టీవీ -9.

తెలుగు మీడియాను మలుపుతిప్పిన శ్రీ రవిప్రకాష్

ముందు అడుగు మోపినవాడే మునుముందుకు పోగలుగుతాడని ఆనతి కాలంలోనే నిరూపించిన వ్యక్తి ఆ ఛానల్ సీయీఓ శ్రీ రవి ప్రకాష్. అప్పటికే జెమినీ టీవీలో నిర్వహించిన కార్యక్రమాలు ఆయనకు ఎంతో పేరుతొ పాటు అసంఖ్యాకమయిన అభిమానులను సమకూర్చిపెట్టాయి. టీవీ ఇంటర్వ్యూ లు అంటే ఇలాగే వుండాలని అనుకున్నవాళ్ళలో నేను కూడా వున్నాను.

తరవాత జైపాల్ రెడ్డి గారు మా మంత్రిగా వున్నప్పుడు – ఆకాశవాణి , దూరదర్శన్ లను ప్రభుత్వ పెత్తనం నుంచి తప్పించి ప్రసార భారతిని ఏర్పాటు చేసినప్పుడు కూడా మరింత ముచ్చట పడ్డాను. పలురకాల న్యూస్ చానల్స్ చూసే అవకాశం జనాలకు వుండాలన్నది నా ప్రగాఢమయిన కోరిక. అప్పటికే సోవియట్ యూనియన్ లో పరిస్తితి చూసివచ్చిన అనుభవం వుండడం వల్ల అలాటి మార్పును నేను మనసారా కోరుకున్నాను. అయితే, చాలాసంవత్సరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియాలో పని చేయడం వల్లనో ఏమో వార్తలను వార్తలుగా మాత్ర మే ఇవ్వాలనే సిద్దాంతానికి అలవాటు పడ్డాను. వ్యాఖ్యను మరోరకంగా వీక్షకులకు అందచేయాలి తప్ప వార్తలో మిళితం చేసి ఏది వార్తో ఏది వ్యాఖ్యో తెలియకుండా వారిని గందరగోళపరిచే హక్కు వార్తా పత్రికలకు కానీ, మీడియాకు కానీ వుండకూడదన్నది నా నిశ్చితాభిప్రాయం.

తెలుగు మీడియాపై 'ఏపీ మీడియా' కామెంట్

 వార్తలను ఎలాటి అంటూ సొంటూ లేకుండా అందించి , సంచలనం కోసం ఇచ్చే వ్యాఖ్యలను మరోరకంగా ఇవ్వడం వల్ల ‘వార్తలపట్ల జనాలకు వుండాల్సిన నమ్మకం చెదరకుండా వుంటుంద’ని భావించే వారిలో నేనొకడిని. ఒక్కసారి కనుక మనం ఇచ్చే వార్తలపట్ల జనాలకు అపనమ్మకం కలిగిందంటే చాలు ఆతరవాత మనం ఏది చెప్పినా ఆ ఛానల్ అలానే చెబుతుందని జనంలో ఒక చెరపలేని అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఒకనాడు రేడియో, దూరదర్శన్ వార్తలకు ఇదే గతి పట్టింది. నిజాలు చెప్పినా నిర్ధారణ చేసుకోవడానికి బీబీసీ వినేవారు.

టీవీ –9 సాధించిన అపూర్వ విజయం పుణ్యమా అని తెలుగునాట మీడియా బూమ్ మొదలయింది. అనేక న్యూస్ చానళ్ళు రంగ ప్రవేశం చేసాయి. పెట్టుబడులు ప్రవహించాయి. తెలుగు మీడియాకు కనీవినీ ఎరుగని హంగులు సమకూరాయి.

జగన్నాధ రధం లాటి ఓబీ వ్యాన్

ఒకప్పుడు దూరదర్శన్ ఓబీ వ్యాన్ (ప్రత్యక్ష ప్రసారాలకోసం వుపయోగించేది) బయటకు తీయాలంటే బ్రహ్మ ప్రళయం. సందులు గొందుల్లో మలుపులు తిరగలేని పెద్ద ట్రక్కులాటి భారీ వాహనం. ఇరవై మంది సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందస్తు అనుమతుల జంఝాటం.

ఇప్పుడో, ఒక చిన్న వ్యాన్ లోనే ఈ పరికరాలని అమర్చుకోగల సాంకేతిక సామర్ధ్యం పెరిగింది. చిన్న సంఘటనకు కూడా వెంటనే స్పందించి టీవీ ఛానళ్ల వారు, వీటిని తక్షణం పంపి ప్రత్యక్ష ప్రసారాలు చేయగలుగుతున్నారు.

పోటీ వున్న చోట ప్రతిభ పెరిగే అవకాశం వుంది. అలాగే ప్రమాణాలు పడిపోయే ప్రమాదం కూడా వుంది. మీడియాలో వస్తున్న పరిణామాలు ఆనందంతోపాటు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. నాకే కాదు, ఈ రంగానికి సంబంధించిన చాలామందికి.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు గారు  అనేవాడు. ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసు భవనం ఎక్కి చూస్తె కళ్ళు తిరిగే ట్రాఫిక్కు. ఈ కార్లు, లారీలు, ఆటోలను దాటుకుని వెళ్ళగలమా అని భయం వేస్తుంది. వాటి నడుమ పోతూ వుంటే మాత్రం ఎలాటి జంకూ కలగదు. బహుశా – ఈ ఆందోళనలు కూడా అలాగే తొలగిపోయి ఆనందమే మిగలాలని కోరుకుందాం. ఆశ పడడం మన దేశం మనకిచ్చిన జన్మ హక్కు. (02-09-2010)

NOTE: All images in the blog are copyrighted to respective owners

విన్నంతలో కన్నంతలో - అమెరికా - 7 - భండారు శ్రీనివాసరావు

 కలల లోకంలో కాసేపు -

“పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాం” అని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపు’ కోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ‘ఏమి జీవితమూ దుర్భరమూ ‘ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు – తరవాత్తరవాత – తత్వం మార్చుకుని - “కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండు” అనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. ఇప్పుడు ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది.

బెల్ వ్యూ వుడ్ రిడ్జ్ ప్రాధమిక పాఠశాల

 ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!’ అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.

మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ – ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొ’ పల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.

ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్” ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి.

ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం ‘స్కూలు డిస్ట్రిక్టుల’ను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ‘ఇన్నోవేషన్ ఫండ్’ నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది.ఈ ఏడాది వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు – బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం – అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.

వుడ్ రిడ్జ్ మరో  దృశ్యం

ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి.

పలకా బలపాలు లేవు - టచ్ స్క్రీన్లు, కంప్యూటర్లే

 బ్లాకు బోర్డులు, చాక్ పీసులకు బదులు ‘టచ్ స్క్రీన్ కంప్యూటర్లతో‘ పాఠాలు బోధించే విధానం ప్రాధమిక తరగతి నుంచే ప్రారంభం కావడం మరో విశేషం. పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు దండిగా వుండడం వల్ల ‘బతకలేక బడి పంతులు’ అనే నానుడుకి దూరంగావుంటూ, తమ విద్యార్ధులతో ప్రేమపూర్వకంగా మసలుకుంటూ - ‘గురు సాక్షాత్ పరబ్రహ్మ’ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ స్కూలులో పిల్లలకు నడవడిక నేర్పే పద్ధతులు దగ్గరనుంచి గమనించిన తరవాత వారి అదృష్టాన్ని గురించి మరో సారి అసూయపడాల్సి వచ్చింది. తోటి విద్యార్ధులతో మాట్లాడడం నుంచి సభ్య సమాజంలో మెలగడం వరకు – చిన్ననాటినుంచే ఇస్తున్న తర్పీదు చూడముచ్చటగా వుంది. తమకున్న పరిమితుల్లోనే సమాజానికి ఎలా సేవ చేయవచ్చన్నది ఆచరణలో బోధిస్తారు.

చదువంటే ఆటా పాటా

 స్కూలు మొదలయ్యేటప్పుడు, తిరిగి వొదిలేటప్పుడు టీచర్లు, కొందరు ఎంపిక చేసిన విద్యార్ధులు స్కూలు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తారు. అలాగే పేరెంట్స్ తోడు లేకుండా స్కూలు బస్సుల్లో ఒంటరిగా వచ్చే పిల్లలను జాగ్రత్తగా దింపుకుని వారి వారి తరగతి గదులకు చేరుస్తారు. బస్సునుంచి దిగుతున్నప్పుడే పిల్లల పేర్లను రిజిస్టర్ లో రాసుకుంటారు. ఈ బస్సులకూ, మధ్యాహ్న భోజనానికీ ఎలాటి చార్జీ వుండదు.

ట్రాఫిక్ కంట్రోల్

 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్ధులు పై తరగతికి మారుతున్నప్పుడు పాత సహాధ్యాయుల ఫోటోలు, వారి వివరాలతో కూడిన ఒక చిన్న ఆల్బం ఇస్తారు. వారిలో కొందరు సొంత కారణాలపై వేరే స్కూలుకు మారినప్పటికీ, వారి జ్ఞాపకాలు భద్రంగా వుంచుకునేందుకు ఈ ఆల్బంలు పనికివస్తాయి. తరగతి గదిలో ఏటిపొడుగునా విద్యార్ధులు సృజనాత్మకతను రంగరించి చేసిన పనులను, అంటే గీసిన బొమ్మలు, వేసిన చిత్రాలు, తీసిన ఫోటోలు, రాసిన కధలు, వ్యాసాలు అన్నింటినీ జాగ్రత్తగా భద్ర పరచి ఒక చక్కని ఫోల్డర్ రూపంలో ఏడాది చివరిలో అప్పగిస్తారు. తలిదండ్రులతో తరచుగా సమావేశాలు జరిపి వారి పిల్లల పురోగతిని గురించి వివరిస్తారు.

పెద్దయ్యాక ఇక ఆడుకునేదేముంటుంది?

హైదరాబాదులో వేలకొద్దీ ఫీజుల రూపంలో దండుకునే అనేక విద్యా సంస్తలు కొన్నింటిలో ఇదేమాదిరి విధానాలు,వసతులు వుండవచ్చు. కానీ ఇంతవరకు ముచ్చటించుకున్నది ఏదో కార్పొరేటు స్కూలు గురించి కాదు. అమెరికాలో ఒక సర్కారు బడిని గురించి మాత్రమె. ఈ వాస్తవం గమనంలో వుంచుకుంటే – ఈ స్కూలుని చూసి ఎందుకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందో అర్ధం అవుతుంది.

ఇండోర్ స్టేడియం

కలాం గారు  కోరుకున్నట్టు – మనందరం ఒక కల కనాలి. కనడమే  కాదు దాన్ని  నిజం చేసుకోవాలి.

సహజ కాంతితో పాఠశాల  


ఇలాటి స్కూళ్ళు గ్రామ గ్రామానికీ రావాలన్నదే ఆ కల. పైసా ఖర్చు లేకుండా,పేదా గొప్పా తారతమ్యం లేకుండా -  పిల్లలందరికీ ‘ఇలాటి చిన్నతనం’ వారి  సొంతం కావాలి.

భావి భారతం ‘భద్ర భారతం’ కావాలంటే, భావి తరం ‘మేధావి భారతం’ కావాలంటే – చదువు నేర్చుకోవడం అన్న ఒక్క ‘హక్కు’ ఇచ్చి వూరుకుంటే సరిపోదు- ఇంత ఆనందంగా, హాయిగా, ఆడుతూ, పాడుతూ చదువుకోగల ‘సర్కారు స్కూళ్ళు’ - చదువుకుందామనుకునే ప్రతి ఒక్కరికీ హక్కు భుక్తం కావాలి.

అయితే-

వీటన్నిటినీ ఆచరణలోకి తీసుకురావాలంటే కొన్నింటికి తప్పనిసరిగా డబ్బు కావాలి. అది ఎప్పుడూ కొరతే. మరికొన్నింటికి కేవలం చిత్త శుద్ధి వుంటే చాలు .కానీ, ఇప్పుడు బాగా కొరతగా వున్నది దీనికే. టీవీ చర్చల్లో తప్ప ఎక్కడా వినబడని ఈ "చిత్తశుద్ధి" అంత తేలిగ్గా దొరుకుతుందా?

NOTE: All images in the blog are copyrighted to the respective owners.

1, సెప్టెంబర్ 2010, బుధవారం

My experiences in America - 1 – Bhandaru Srinivasarao

My experiences in America - 1   – Bhandaru Srinivasarao


It was a bright and sunny morning when we left Seattle to spend some time on the Oregon coast. We took the Interstate #5 and traffic was light on account of it being a week day. I have seen the Pacific Ocean a while ago when I visited the US back in 2003. It was in sunny California and I longed to see the ocean once more.

The trip was uneventful until we approached the coastline. The entire scenery transformed in front of our eyes. On one side is the largest ocean in the World. On the other side is a road that meanders along the coast offering scenic vistas everywhere we look. As the road races along with coast, the vast ocean played hide and seek with us. It took almost six hours from Seattle to reach the Depoe Bay resort in Oregon State.

Bird's eye view of  Depoe Bay


The vacation home which was booked online is a sprawling mansion with five bed rooms, self contained kitchen etc. There was no one at the vacation home to greet us. Based on the instructions given to us, we searched for a lock box near the garage, entered a code number and lo behold – we had the keys. We parked the car in the garage and were pleasantly surprised to see how homely the house was. It was neat and tidy. The kitchen was well stocked and the bedrooms were spacious with plenty of linens to spare.

A home away from home

 We had a pleasant surprise with the jetted tub on the upper floor patio. After spending two hours in the hot tub, we were relieved of the travel strain. It was a memorable experience to sit in the gushing waters as the warm water jets gently massaged the sore muscles. Renewed and replenished, we set off for a quick walk to the Depoe Bay viewpoint which was one block away from our vacation home.


I have studied in my childhood that the Pacific is the most peaceful among all oceans. But I was amused when I saw a notice board warning – “Don’t cross this line. There is every possibility of sudden waves engulfing the shore”. I was told that authorities are putting up such caution signs in the back drop of tsunamis which devastated South East Asia in 2004.

A whale figurine

There were other coastal cities nearby – Florence, Newport and Lincoln City. We went round all these areas during our stay. We spent a lot of time in the Oregon state aquarium. The underwater aquarium featured sharks, dolphins and other exotic sea animals and we enjoyed watching them at close distance.

Real One

 The special affect at the aquarium was the giant anaconda – a beautiful 12 foot anaconda that was, thankfully in an unbreakable glass enclosure.


At Lincoln City, we came across another surprise. Good things come in small packages is a cliché we heard a lot of times. And it proved true when we saw the World’s shortest river. It was amusing to watch World’s shortest river joining the world’s largest ocean that is Pacific. The river’s length is just 440 feet and it originates in a small forest across the road adjoining the ocean.

Small and Big meeting together

 Another interesting observation worth noting is that we can actually witness the differences in temperatures between the river and the ocean. The river was shallow and warm while the ocean was deep and cold.

We then headed down the coast to go visit Cannon Beach near the city of Seaside. The beach is famous for the Haystack rock that is a big rock close to the coast. Generally the rock is surrounded by sea waters. We got lucky since due to the low tides, the waters around the rock receded enough for us to walk right to its base. The Haystack rock is used as a preservation point for seagulls and other sea birds. We could see hundreds of birds perched on the rock.

Haystack rock



There were hundreds of tourists on the beach enjoying the beach with their families. Children were busy either flying kites or making sand castles. After spending some time on the beach and taking some pictures, we commenced our journey back to Seattle.

NOTE: All images in the blog are copyrighted to the respective owners.