18, ఆగస్టు 2010, బుధవారం

మితిమీరిన మీడియా ఉత్సాహం

సత్యం రామలింగరాజు ఆర్ధిక నేరాల ఆరోపణల ఉచ్చులో చిక్కుకుని అరెస్ట్ అయినప్పుడు


 – ఆ నాటి సత్యం సామ్రాజ్యానికి ‘షేర్ల’ రూపంలో పెట్టుబడులు పెట్టి ఆ తరవాత గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో - ఆరోజుల్లో నేను  రాసిన ఒక ఆర్టికిల్ – రాజు గారికి బెయిల్ దొరికిందని ఒక మిత్రుడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినప్పుడు గుర్తుకు వచ్చి దాన్ని పోస్ట్ చేస్తున్నాను. రాజు గారికీ నాకూ ఏవిధమయిన వ్యక్తిగత పరిచయం లేదన్న విషయం గమనంలో వుంచుకోవాల్సిందిగా మనవి – భండారు శ్రీనివాసరావు

మితిమీరిన మీడియా ఉత్సాహం








నిప్పులు చిమ్ము కుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు -

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేరాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరే!                     -శ్రీశ్రీ


ఒక మహావృక్షం కూకటి వేళ్లతో కూలిపోతున్న దారుణ దృశ్యం గతవారం విశ్వవ్యాప్తంగా ఆవిష్కృతమైంది.  శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్న లెక్కకు మిక్కిలి బుద్ధిజీవులు,  సమృద్ధిజీవులు, మాన్యులు, సామాన్యులు, లబ్ధిదారులు, ప్రారబ్ధదారులు ఆ విషాదాంతాన్ని మౌనంగా, జాలిగా, కసిగా, ఆగ్రహంగా, బరువెక్కిన గుండెలతో, చెమ్మగిల్లిన కళ్లతో గమనిస్తూ వచ్చారు. కొందరికిది కడుపుకోత. మరికొందరికి కడుపుమంట. కొందరిది వేదన. మరికొందరిది ఆవేదన.



ఏళ్ల తరబడి శిలా సదృశ్యంగా నిలబడి,  నిరంతర శ్రమతో,  నిర్విరామ కృషితో,  మొక్కవోని పట్టుదలతో-  ఆకాశం అంచులు తాకేలా నిర్మించుకున్న సువిశాల, సుందర సౌధం పునాదులు కళ్లెదుటే కదలిపోయాయి.


 `సత్యమైట్లు' గా -  సగర్వంగా చెప్పుకుంటూ, వర్తమాన సమాజంలో పరువుతో, పరపతితో నెగ్గుకొస్తున్న వేలాదిమంది యువతీ యువకుల కలలన్నీ వారి కనురెప్పల కిందే కరగిపోయాయి. నిన్నటివరకూ ఎదురులేని సత్యం. నేటికది  చెదిరిన స్వప్నం.

ఒక మెగా సంస్థ మహా పతనం గురించీ, దానికి కారణాలు గురించీ పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలతో, వార్తలతో, వార్తా కథనాలతో మీడియా రగిలించిన వేడి అంతా ఇంతా కాదు. సత్యం సంస్థ ఉత్థాన పతనాలకు కారకుడైన రామలింగరాజు కథ చంచల్‌గూడా జైలుకు చేరింది. ఈ పరిణామ క్రమాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఈ ఉదంతంలో దాగున్న మరో కోణాన్ని స్పృశించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఆర్ధిక నేరాలు మనదేశానికి కొత్తవేమీకాదు. నూతన ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇవి జరిగాయి. స్వతంత్ర భారతంలో స్వదేశీ నౌకా పరిశ్రమ ఆవిర్భావానికి, అభివృద్ధికీ ఆద్యుడూ, మూలకారకుడూ అయిన తెలుగుతేజం జయంతి షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థాపకుడు ధర్మతేజ చరిత్రే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

సత్యం రామలింగరాజును హర్షద్‌మెహతా, కృషి వెంకటేశ్వరరావు, కోలా కృష్ణమోహన్‌ వంటి వారితో ముడిపెట్టి వార్తాకథనాలు వెలువరించిన మీడియా అత్యుత్సాహం అర్థం చేసుకోలేని అధమస్థాయిలో ఉంది. సామాజిక సేవా కార్య కలాపాల విషయంలో కానీ, నిర్మాణాత్మక దక్షాదక్షతల విషయంలోకానీ, సిబ్బంది మంచి చెడులను కొసకంట కనిపెట్టి చూసేవిషయంలో కానీ -  రాజుకీ, వారికీ ఏమాత్రం సాపత్యం లేదు సరికదా నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆశ, అత్యాశ, దురాశల నడుమ ఉన్న అంతరాన్ని అర్ధం చేసుకోవడంలో విశ్లేషకులు విఫలమయ్యారు. ఆశ చచ్చినా, దురాశపుట్టినా ఆ మనిషి చచ్చిన వాడితో సమానమంటారు. పెంచి పెద్ద చేసిన సంస్థను కాపాడుకోవాలనే ఆత్రంతో, అత్యాశతో వేసిన అడుగు రామలింగరాజుదయితే, రెండో వర్గంవారిది దురాశతో కూడిన దుస్తర మనస్తత్వం.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఆ నేరాన్ని తమంతతాముగా, విచారణకు ముందే ఒప్పుకోవడం చాలా అరుదయిన విషయం. ఒక రకమైన విషవలయంలో చిక్కుకుపోయి మింగలేకా, కక్కలేకా డోలాయమానంలో కొట్టుకుంటుంటారు. అలాంటిది చేసిన దానికి, జరిగిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటూ, మరెవరి మీదా నెపం మోపకుండా, గరళం మింగిన శివుడిలా రామ `లింగ' రాజు జారీచేసిన `ఒప్పుకోలు' ప్రకటన ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. స్వయం నిర్మిత సువిశాల వ్యాపార సామ్రాజ్యం కళ్లెదుటే కుప్పకూలిపోతున్న స్థితిలో కూడా తన వద్ద పనిచేసే సిబ్బంది బాగోగులను గమనంలో ఉంచుకోవడం ఆయన స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం.


ఇక ఈ మొత్తం ఉదంతంలో రామలింగరాజుకూ, రాష్ట్రప్రభుత్వానికీ లంకెపెడుతూ వెలువడిన వార్తా కథనాలు పత్రికా విలువలకు తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. మితిమీరిన మీడియా ఉత్సాహం ఒక ప్రముఖ సంస్థ పతనాన్ని మరింత వేగిరం చేసింది. తప్పుదిద్దుకునే అవకాశాన్ని దూరం చేసింది.


 `బర్డు ఫ్లూ' వార్తలతో బెంబేలెత్తించి, లక్షలాది కోళ్ల సామూహిక సంహారానికి కారణమైన మీడియా, వేలాదిమంది సత్యం సిబ్బంది ప్రయోజనాలను కాపాడడానికి, తన సొంత ప్రయోజనాలను వదులుకోగలదని ఆశించడం అత్యాశే అవుతుంది.

అదే జరిగింది కూడా  

 ఇక వాటాదారులు విషయం అంటారా!
 మోసం చేసి డబ్బు సంపాదించాలనుకునే నేరగాళ్లకీ, జూదం ఆడి డబ్బు గడించాలనుకునే జూదగాళ్లకీ పెద్ద తేడాలేదు.

సత్యం షేరు ధర చుక్కల్లో ఉన్నప్పుడు ఆ వాటాలు కలిగిన బడాబాబులు ఎంతగా బడాయిలకు పోయారో అందరికీ తెలుసు. ఆడేది జూదం అయినప్పుడు ఆటుపోట్లకి కూడా సిద్ధంగా ఉండాలన్న విషయం కూడా వారు తెలుసుకోవాలి. లక్షలు కోల్పోయామని బాధపడేవారు లక్షణమైన సంస్థను తిరిగి ఎలా నిలబెట్టాలా అన్న విషయం ఆలోచించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది అదే. నేరాలు చేసిన వారిని విచారించి, నిర్ధారణ చేసే సంస్థలు వేరే ఉన్నాయి. కానీ, తెలుగు గడ్డపై పురుడుపోసుకుని, దిగంతాలకు ఒక వెలుగు వెలిగిన సంస్థ ఆరిపోకుండా చూసుకోవాలి. తమ తెలివితో, మేధస్సుతో ఒక మహా సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బంది భవితవ్యాన్ని కాపాడుకోవాలి. పుడమితల్లి నలుదిక్కులా తెలుగు వెలుగులను విస్తరించిన దీపం కొడిగట్టకుండా కనిపెట్టి చూడాలి. రాజకీయాలన్నవి ఆ పరిధికే పరిమితం కావాలి కానీ, తెలుగు యువత ఉజ్వల భవితకు రేచీకటిగా మారరాదు. ఆ దిశగా అడుగులు వేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.
 అంతేకానీ, ఎద్దుల పోట్లాటలో లేగదూడలు నలిగిపోకూడదు.

భండారు శ్రీనివాసరావు

NOTE:All the images in the blog are copy righted to the respective owners

6 కామెంట్‌లు:

Truely చెప్పారు...

మీ విశ్లేషణ నచ్చింది. satyam రామ లింగరాజు నిజంగా నే గొప్పవాడు . నిజానికి షేర్ value కోసం ప్రతి కంపెనీ ఇదే పని చేస్తుంది. తెలుగు వాళ్ళ కి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది సత్యం.
తెలుగు వాళ్ళ కంపెనీ అని ఎంతో గర్వం గా వుండేది. మీరు నమ్ముతారో లేదో Satyam employees కి మంచి పేరు ఉంది. రామ లింగరాజు ని arrest చేసిన కూడ చాలమంది clients satyam employees కి భరోసా ఇచ్చారు. ఇంత గొప్ప కంపెనీ ని mahindra చాల cheap గా 100 రూపాయలు విలువ చేసేదాన్ని 5 రూపాయలకి ఏదో land కబ్జా లాగ cheap గా కొట్టేసింది. ఇదివరకు CMC అనే సంస్తను కూడ TCS Cheap గా కొట్టేసింది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thank you.-bhandaru srinivasrao

అజ్ఞాత చెప్పారు...

అతను మహానుభావుడు , ప్రగతిశీలి, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట పెన్నిధి, గొప్ప దాత - ఇవన్నీ నిజమే కావచ్చు. మీరు అన్నట్టు అవకతవకలు కుంభకోణాలు చేశాను మొర్రో అని ఒప్పుకున్నా, శిక్షించబడకపోతే చట్టం ఎవరికోసం? సామాన్య మానవులకు మాత్రమేనా?
ధర్మపరుడైతే ఏమైతే అది కాని అని ఒప్పుకుని వుండక పోవాల్సింది. కార్పొరేట్ అవినీతి గరళాన్ని మింగి ఎవరిని కాచినట్టు? కుటిల కాంగ్రెస్ రాజకీయ నాయకులనా?

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

http://amtaryaanam.blogspot.com/2009/01/blog-post_17.html
===
I disagree with you.
W/R-Saikiran

అజ్ఞాత చెప్పారు...

డిస్ అగ్రీ ఐతే అయ్యారు. నేను రాను, ఎందుకంటే నేను మీలా 'పుడంగిని ' కాను. ఆ లింకులో పుడంగులకు మాత్రమే ప్రవేశం. శ్రీరాంకు వోట్లేసిన 2.5లక్షల మంది సంగీతంలో పుడంగులే మరి. :P

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks SNKR. this was written almost 18 months back. regards - bhandaru srinivasrao