బ్రేకింగ్ న్యూస్!
27, ఏప్రిల్ 2025, ఆదివారం
అయాం ఎ బిగ్ జీరో (151) – భండారు శ్రీనివాసరావు
26, ఏప్రిల్ 2025, శనివారం
అయాం ఎ బిగ్ జీరో (150 ) – భండారు శ్రీనివాసరావు
ఒక్కో ముఖ్యమంత్రిది ఒక్కో స్టైల్
1975 లో
నేను హైదరాబాదు ఆలిండియా రేడియో వార్తా విలేకరిగా చేరినప్పుడు ముఖ్యమంత్రి జలగం
వెంగళరావు. ఎమర్జెన్సీ టైం ముఖ్యమంత్రి అని పేరు. ఇంటాబయటా (ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో) ఆటుపోట్లు లేని రోజులు
కాబట్టి ఆయన పరిపాలన నల్లేరు మీది బండిలా సాగింది.
ఇప్పుడు
ముఖ్యమంత్రులను కలవడం
అంటే బ్రహ్మ ప్రళయం అంటుంటే వింటున్నాను. ఆ రోజుల్లో అలా సచివాలయంలో కలయ తిరుగుతూ
ముఖ్యమంత్రి ఛాంబర్ వైపు వెడితే, ప్రకాశరావు అనే ముఖ్యమంత్రి వ్యక్తిగత
కార్యదర్శి చిరునవ్వుతో పలకరించి, సీ ఎం ని కలుస్తారా అని అడిగేవారు.
‘అబ్బే
పనేమీ లేదండీ’ అంటుండగానే
ఆయన లోకయ్యా అని పిలిచేవారు. తెల్లటి దుస్తుల్లో వున్న సీ ఎం అటెండర్ లోకయ్య
ఛాంబర్ తలుపు తీసి లోపలకు వెళ్ళమనే వారు. వెంగళరావు గారు ఒక్కరే కుర్చీలో కూర్చుని
రొటీన్ ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ కనిపించేవారు.
‘శ్రీనివాసరావ్!
ఏమిటి విశేషాలు’ అని
పలకరిస్తూనే ‘ఇవన్నీ రొటీన్ ఫైల్స్, చిన్న ఇనీషియల్ వేస్తే, వీటి
పని అయిపోతుంది. ఇలాంటివే రోజూ డజన్ల కొద్దీ వస్తాయి. తీరిక చేసుకుని వీటిని
క్లియర్ చేస్తే పెండింగ్ వుండదు. సీరియస్ ఫైల్స్ ని ఎలాగూ జాగ్రత్తగా చదివి
పెట్టాలి. వీటిని ఆపకుండా చూసి, చూసినట్టు
ఒక ఇనీషియల్ వేసి పంపిస్తే, పెండింగ్
ఫైల్స్ చాలా తగ్గిపోతాయి’ అని
ఆయనే చెప్పారు, తను
పనిచేసే విధానాన్ని వివరిస్తూనే. ఆయనని చూడడానికి విజిటర్లు వచ్చినప్పుడు కూడా ఓ
పక్క వారితో మాట్లాడుతూనే మరోపక్క వెంగళరావు గారు చేసే పని ఇదే అని ఆ రోజుల్లో
విలేకరులందరికీ తెలిసిన విషయమే.
ఇక ఆయన
తర్వాత అంటే ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి గారిది మరో
స్టైల్. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు దౌరా వెళ్ళేటప్పుడు రైళ్ళలోనే ప్రయాణం చేసేవారు.
ఇప్పటిలా హెలికాప్టర్లు, ప్రత్యేక
విమానాలు ఉండేవి కావు. చెన్నారెడ్డి గారు విశాఖ రైల్లో వెడుతుంటే ఇలాంటి రొటీన్
ఫైల్స్ అన్నీ కట్టగట్టి ఆయన ప్రయాణం చేసే రైల్వే బోగీలోకి చేర్చేవారు. కదిలే రైలు
కాబట్టి విజిటర్ల గోల వుండదు. కాజీపీట దగ్గర ఆ జిల్లా అధికారులు ఓ జీపును సిద్ధంగా
ఉంచేవారు. అప్పటివరకు క్లియర్ చేసిన ఫైళ్ళని ఆ జీపులో అప్పటికప్పుడే హైదరాబాదు చేర్చేవారు.
అలాగే బెజవాడ దగ్గర. అవసరాన్ని బట్టి మరికొన్ని స్టేషన్ల దగ్గరా ఇలాంటి ఏర్పాట్లు
ఉండేవి. ముఖ్యమంత్రి రైల్లో సంతకాలు చేసిన ఫైళ్ళన్నీ మర్నాడు ఆఫీసు టైముకల్లా
హైదరాబాదు చేరేవి. ఇంత చేసినా ఆయన హయాములో పేరుకుపోయిన పెండింగ్ ఫైల్స్ సంఖ్య
ఎక్కువే అని చెప్పుకునేవారు.
చెన్నారెడ్డి
అనంతరం ముఖ్యమంత్రి టి. అంజయ్య. ఆయన సంతకం విచిత్రంగా వుండేది. ఇనీషియల్ వేసి ఫైల్
క్లియర్ చేసే సంతకం కాదు. ఒక్కో సంతకానికి కొంత వ్యవధానం తీసుకునేవారు. సమర్ద్దుడు,
సచ్చీలుడు అయిన సీనియర్ ఐ. ఏ. ఎస్.
అధికారి యూబీ రాఘవేంద్రరావు ముఖ్యమంత్రి కార్యదర్శి. అంచేత ఎలాంటి తభావతు రాకుండా
ఫైల్స్ క్లియర్ అయ్యేవి. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పార్టీలోని ఆయన రాజకీయ ప్రత్యర్థులు
పరిపాలనానుభవం లేని వాడిగా ప్రచారం చేసేవారు. అంచేత ముఖ్యమంత్రి కార్యాలయం వారు ఈ
ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఒక చిట్కా కనుక్కున్నారు. నలుగురితో సభ తీరి
వున్నప్పుడు, సీ ఎం చూసినట్టుగా,
ఇనీషియల్ వేసి పంపించే రొటీన్ ఫైళ్లను, ఆ సమయంలో ఆయన ముందు ఉంచేవారు. ఆయన చకాచకా
క్లియర్ చేస్తూ మధ్య మధ్య, ‘ఈ ఫైల్ ఏమిటి, ఇవ్వాళే సంతకం చేయాల్సినంత అర్జెంట్
ఏమిటి’ అని అధికారులను ప్రశ్నించేవారు. ఇది కళ్ళారా చూసిన ఆ నలుగురు బయటకు వెళ్లి, ఏమో అనుకున్నాం కానీ అంజయ్య గారు
ప్రతి ఫైలును జాగ్రత్తగా చూసిన తరువాతే సంతకం చేస్తారు అని మరో నలుగురితో
చెప్పేవారు. బయట వారు ఎవరూ లేనప్పుడు ముఖ్యమైన ఫైళ్లను ముందు పెట్టి, అందులోని మర్మాలను వివరించి చెప్పి ముఖ్యమంత్రి
ఆమోదం ముద్ర వేయించుకునే వారు. అందుకే ఏ ముఖ్యమంత్రికయినా మంచి పేరు రావాలి అంటే
సమర్ధులు,
స్వార్ధరహితులు అయిన మంచి అధికారులు తన పేషీలో వుండేలా చూసుకోవాలి.
మంత్రి
చెప్పిన భగవద్గీత
‘లాంగ్
లాంగ్ ఎగో, సో
లాంగ్ ఎగో, నో బడీ
కెన్ సే హౌ లాంగ్ ఎగో’ అని వెనక ఓ సినిమాలో డైలాగ్ వుంది.
అలాగే
రేడియో విలేకరిగా ఓ వెలుగు వెలుగుతున్న ఓ పాత భూతకాలంలో, ఘనత వహించిన ఓ ఎంపీ గారు నన్నొక పని
అడిగారు. తలచుకుంటే ఆయనకది చిటికలో పని. ఆయనకు పని పడింది రాష్ట్ర
ప్రభుత్వంలో ఒక ఉద్యోగి పని. ఆ ఉద్యోగికి జరూరుగా బదిలీ కావాలి. అదీ రాష్ట్రానికి
కడగొట్టున వున్న పొరుగు రాష్ట్రపు సరిహద్దు ప్రాంతానికి.
నాకది
చాలా చిన్న పని అనిపించింది. చూస్తూ చూస్తూ అంత దూరం బదిలీ కోరేవారు ఎవరుంటారు?
కాబట్టి అడగాలే
కాని ఎవరైనా చేస్తారు అని ఏకంగా ఆ సంబంధిత మంత్రి దగ్గరికే వెళ్లి చీటీ ఇచ్చాను.
ఆయనతో నాకు చాలా కాలంగా మంచి స్నేహమే వుంది. అడగక అడగక అడిగాను కాబట్టి
వెంటనే పని అవుతుంది అనుకున్నా.
నేరుగా
సచివాలయానికి వెళ్లి అడిగా.
‘ఈ
ఉద్యోగి నీకు తెలుసా!’ అని మంత్రి అడిగారు.
‘నాకు
అతడి ముక్కూ మొగం తెలియదు. కానీ మీ వంటి సన్నిహితుడే నన్ను ఈ ఫేవర్ అడిగారు.
అందుకనే వచ్చాను’
‘సరే!
నీ స్కూటర్ ఇక్కడే పెట్టు. రేపు తీసుకు పోదువు కానీ. ఈరోజు నాతో మా ఇంటికి రా. మళ్ళీ
నా కార్లో నిన్ను ఇంట్లో దింపుతాను’
ఆయన
కార్లోనే ఆయన ఇంటికి వెళ్లాను. మంత్రిగారు లోపలకి వెళ్లి తయారై వచ్చారు. ఇద్దరం
ఆయన పోర్టికో పైన వున్న బాల్కానీ వంటి దానిపై వేసిన కుర్చీల్లో కూర్చున్నాము.
అప్పుడు
ఆయన నాకు చేసిన పొలిటికల్ లాయల్టీ అనే భగవద్గీత ఇది.
‘శ్రీనివాస్.
నీకు అర్ధం కాదు కానీ మాకు లాయల్టీ చాలా ముఖ్యం. ఏదైనా పనిచేస్తే డబ్బు తీసుకుని
పనులు చేస్తామనే నింద మాపై వుంది. అది పూర్తిగా నిజం కాదు, అలాగని అబద్ధం కాదు. నువ్వు అడిగిన
బదిలీకి లక్షకు తక్కువ కాదు. నీకు అతడి ముక్కూ మొహం తెలియదు. ఇతడి గురించి
నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు
ఎంపీలు లెటర్లు ఇచ్చారు. ఎంక్వైరీ చేస్తే అతడు మంచి సంపాదనపరుడు అని
తెలిసింది. హైదరాబాదు నుంచి ఆదిలాబాదు జిల్లా చివరకి ఎవరూ బదిలీ కోరుకోరు.
బార్డర్ ఏరియాలో వారి సంపాదన రోజుకు వేలల్లో వుంటుంది. అదంతా వారికి దక్కదు.
కింద నుంచి పై దాకా పంపకాలు వుంటాయి. అంచేత మా ఎమ్మెల్యేలు చెప్పినా నేను
పట్టించుకోలేదు.
‘ఈ
సంగతులు ఏవీ నీకు తెలియదన్న సంగతి నాకు సాయంత్రమే అర్ధం అయింది. అందుకే
మాట్లాడడానికి ఇంటికి రమ్మన్నాను.
‘ఇప్పుడు
అసలు విషయం చెబుతా విను. అంతమంది చెప్పినా నేను చేయలేదు కదా! అందుకే నిన్ను
పట్టుకున్నాడు, అదీ
వేరే వారి ద్వారా. నువ్వు ఇన్నేళ్ళ పరిచయంలో ఎన్నడూ ఏదీ అడగలేదు. అందుకే ఆ ఫైల్
కూడా తీసుకువచ్చాను. నువ్వు నేను చెప్పిన దానికి అవును అంటే, అతడిని అతడు
అడిగిన చోటుకు బదిలీ చేస్తూ ఇప్పుడే ఇక్కడే సంతకం చేస్తాను. రేపే ఆర్డర్ ఇస్తాను.
కానీ ముందు ఒక మాట చెప్పు. నా మాట ఒకటి విను. రేపటి నుంచి అతగాడు అందరితో
చెబుతాడు. మంత్రి కాదన్నా నా పని నేను చేసుకోగలిగాను. ఆయన నాకో లెక్కా అన్నట్టు
తోటివారితో చెబుతాడు. డిపార్ట్ మెంటులో క్రమశిక్షణ దెబ్బతింటుంది. పోనీ నీకన్నా
లాయల్ గా ఉంటాడా అంటే అదీ లేదు. అతడెవరో కూడా నీకు తెలియదు. ఇప్పుడు చెప్పు
ఏం చేద్దాం’
నాకు
విషయం పూర్తిగా అర్ధం అయింది.
వెంటనే
చెప్పాను.
‘ముందా
ఫైల్ మీ ముందు నుంచి తీసేయండి. వేరే విషయాలు ఏవైనా మాట్లాడుకుందాం!’
కాసేపు
సాయంకాలక్షేపం చేసి ఆయన కారులో ఇంటికి చేరాను.
వచ్చిన
తర్వాత ఆయన అన్న ఒక మాట అర్ధం బోధ పడలేదు.
‘నీకైనా
లాయల్ గా ఉంటాడా!’
లాయల్
గా వుండడం అంటే ఏమిటి!
ఏమిటైతే
నాకెందుకు! నాకు అవసరం లేని వ్యవహారం.
కింది
ఫోటో:
(ఇంకావుంది)
25, ఏప్రిల్ 2025, శుక్రవారం
అయాం ఎ బిగ్ జీరో (149) – భండారు శ్రీనివాసరావు
పేరులో ‘నేముంది?'
ఒక
కధలో నాలుగు పాత్రలు వుంటే వాటికి పెట్టిన పేర్లు మరో కధలో పునరావృతం కాకుండా
చూసుకోవడం రచయితలకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్య. మరి అలాంటిది రామాయణ, మహాభారత, భాగవతాల వంటి ఇతిహాసాల్లో కానవచ్చే
కొన్ని వందల పేర్లను గమనిస్తే వ్యాస, వాల్మీకి వంటి వారు మహానుభావులు ఎలా
అయ్యారన్నది చిటికెలో అర్ధం అవుతుంది. ఒకరి పేరు మరొకరికి లేకుండా, రాకుండా వందమంది కౌరవులకు పేర్లు
వున్నాయి. సుగ్రీవుని కపిసేనలో వీరులకు సైతం పేర్లు వున్నాయి. రాక్షస
సైన్యంలోని వారికి పేర్లు వున్నాయి. విచిత్రం ఏమిటంటే వీరిలో ఎవ్వరికీ ఇంటి పేర్లు
లేవు. ఇవి లేకుండానే ప్రసిద్ధులు అయ్యారు. గుర్తింపు పొందారు.
ఈ
రోజుల్లో ఒకే పేరు కలిగినవారు వందలు వేలల్లో వుంటారు. ఒకే ఇంటి పేరు కలిగినవారు
కూడా చాలామంది వుంటారు. ఇంతమందిలో మనకు కావాల్సిన ఒక వ్యక్తిని గుర్తించాలి అంటే
అసలు పేరుకు ఇంటిపేరు జత కలిసినప్పుడే సులభం అవుతుంది. ఇంటి పేరుకు ఇంతటి పేరు,
ప్రాధాన్యత
రావడానికి ప్రధాన కారణం ఇదే.
ఈ
పేర్ల గోల ఎందుకంటారా! ఎందుకంటే అది నా సొంత గోలే కాబట్టి.
బెజవాడ
ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ప్రతి శుక్రవారం ఒక సినిమా విడుదల అయ్యేది. ఒక రోజు
ముందు ఆ సినిమా ఫ్రీవ్యూ (FREE VIEW) చూసి, మర్నాడు
దాని మీద ప్రీవ్యూ (PREVIEW) రాయడం
నాకు ఒప్పగించిన బాధ్యతల్లో ఒకటి. అలా రాసిన రివ్యూలకు ఏదైనా కలం పేరు పెట్టుకుంటే
బాగుంటుందని బాగా ఆలోచించి నా కలం పేరు, సినిమాలకు సంబంధించినది అని అర్ధం అయ్యేలా, ‘స్క్రీనివాస్’ అని పెట్టుకున్నాను.
అప్పుడు నండూరి వారు పిలిచి చెప్పారు. దాదాపు ఇదే పేరుతో మద్రాసులో మరో సినిమా
జర్నలిస్ట్ రాస్తుంటాడు, అంచేత
తికమక రాకుండా మీ ఇంటి పేరే పెట్టుకోండి అని సలహా చెప్పారు. అప్పటి నుంచి నేను
రాసే వాక్టూన్లకు, సినిమా,
పుస్తక
సమీక్షలకు భండారు అని నా ఇంటి పేరే పెట్టుకునేవాడిని. అలా ఆ అయిదేళ్ళ కాలంలో డజన్ల
కొద్దీ సినిమాలకు,
కొన్ని వందల
పుస్తకాలకు సమీక్షలు రాశాను.
అదేమిటో
నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు
అది దగ్గరి దారి కావచ్చు. శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు
శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా
ఎడ్వర్డ్ వన్, టు అని
తగిలించుకోవచ్చు.
హైదరాబాదు
ఆలిండియా రేడియోలో చేరిన తర్వాత ప్రాంతీయ వార్తలు, వారానికి రెండు పర్యాయాలు
వార్తావాహిని, వారానికోమారు
జీవన స్రవంతి ప్రత్యేక వార్తలు చదవడం వృత్తిలో అదనపు బాధ్యతలుగా మారాయి.
“ఆకాశవాణి,
జీవన స్రవంతి,
ప్రత్యేక
వార్తలు, చదువుతున్నది
భభండారు శ్రీనివాసరావు.....”
“ఇంటి
పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’
నలభయ్
ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.
ఇన్నేళ్ళుగా
పరిస్తితి ఏం మారినట్టు లేదు.
ఇంతకీ
నా ఘోష ఏమిటంటే నేను ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కదాచిత్ గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ
నా పేరును చిత్రవధ చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలు
రూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది.
కొండొకచో,
ఇందువల్ల
కొన్ని తలనొప్పులు కూడా తప్పడం లేదు. ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, వాళ్లకు తెలిసిన పిల్లవాడికి మా
ఇంజినీరింగ్ కాలేజీలో సీటు ఇప్పించమని అడిగాడు. ' నా కాలేజీ ఏమిటి అని అడిగితే,
' 'భలే వారే!
హైదరాబాద్ లో ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులు కనబడుతుంటే మీరు భలే జోకులు
వేస్తారే' అన్నాడు
భలేగా!
అప్పటినుంచి
రోడ్డు మీద వెళ్లే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు
పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద పెద్ద అక్షరాలతో ' బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్
కాలేజీ' అని
రాసుంది.
ఓసారి
ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి మర్నాడు పత్రికల్లో వచ్చింది.
నాపేరు
‘షరా మామూలే’. పైగా ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ మూర్తి గారు ఫొటోలో నా పక్కనే
వున్నారు.
బీ.ఎస్.రామకృష్ణ. జర్నలిస్ట్
సర్కిల్ లో బీ.ఎస్.ఆర్. అంటారు. ఫేస్ బుక్ లో బుద్ధవరపు రామకృష్ణ. మంచి జర్నలిస్టు.
మంచి రాయసకాడు. చక్కని ధారణశక్తి. నా కంటే వయసులో చిన్న అయినా, నేనూ జర్నలిస్టునే అయినా, అతనికి వున్న ఈ గొప్ప లక్షణాలు ఏవీ
నాలో లేవు. ఆ మధ్య ఫోన్ చేసి, ఫోన్లోనే ఓ
పెద్దగీత గీసి, ఇంటి
పేరు విషయంలో నేను
మధన పడుతున్న అంశాన్ని రబ్బరు పెట్టి చెరిపేసినట్టు చెరిపేసాడు.
‘ఇంద్రగంటి
హనుమచ్ఛాస్త్రి గారికే తప్పలేదు, ఈ ఇంటి
పేరు గొడవ ఇక
మనమెంత’ అంటూ ఎంత పెద్దగీత గీసి చూపెట్టాడో.
ఆంధ్రపత్రిక
పెట్టిన కాశీనాధుని నాగేశ్వరరావు గారు భారతి సాహిత్య మాసపత్రిక మొదలుపెట్టి రెండు
చేతులూ మోచేతుల
దాకా కాల్చుకున్నారు. మంచి సాహిత్య పత్రికని నడిపారనే మంచి పేరుతో పాటు భారీ
నష్టాలు కూడా ఆయన ఖాతాలో పడడానికి భారతి కూడా కారణమనేవారున్నారు. గొప్ప
సాహితీవేత్త అయిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు భారతి సాహిత్య మాస పత్రికకి
అడపాదడపా చక్కటి
వ్యాసాలు రాస్తుండేవారు. అయితే ఆయన ఇంటి పేరును ఎప్పుడూ ఇంద్రగంటి బదులు ఇంద్రకంటి
అని ప్రచురిస్తూ వుండేవారు. ఆయన ఇంటి పేరులో వున్నది ‘గంటి’ నా,
‘కంటి’ నా అని
విడమర్చి చెప్పడానికి ఆయన కుమారుడు, ప్రసిద్ధ రచయిత అయిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (గతంలో నేనూ శర్మగారు
ఆంధ్రజ్యోతిలో సమకాలీకులం) ఇప్పుడు లేరు. అయితే అలనాటి భారతి పత్రిక సంచికలు
కష్టపడి సేకరించానని రామకృష్ణ చెప్పాడు. చెబుతూ మరో మాట చెప్పాడు. మీ ఇంటి పేరు
భండారు లేక బండారు
ఇలా ఎలా రాసినా చింతించడం అనవసరం అంటూ గీతాబోధ చేశాడు.
ఇలాంటి
సమాచారాలు బోలెడు సేకరిస్తూ వస్తున్నానని, ఎప్పుడో సమగ్ర వ్యాసం రాస్తానని ఒక హామీ కూడా
ఇచ్చాడు.
అలాగే
నా మరో జర్నలిస్ట్ మిత్రుడు పాశం యాదగిరి.
పాశం
యాదగిరి కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఓ నడయాడే ఎన్ సైక్లోపీడియా. లోగడ జీ.
కృష్ణగారు మా
బోంట్లకి అనేకానేక సంగతులు చెబుతుండేవారు. ఇప్పుడు ఆయన లేని లోటును యాదగిరి
తీరుస్తున్నాడు.
నా
భండారు ఇంటిపేరు గొడవ చదివి, విని ఫోను
చేసాడు. యాదగిరి ఫోన్ చేశాడంటే రాసుకోవడానికి మంచి ముడి
సరుకు దొరికినట్టే.
ఆయన
చెప్పడం మొదలు పెట్టగానే నేను దాన్ని అక్షరరూపంలో పెట్టడం ఎల్లాగా అనే ఆలోచనలో
పడిపోయాను.
పుణే
నగరానికి ఓ యాభయ్ కిలోమీటర్ల దూరంలోని చిన్న పట్టణం జెజూరి. అక్కడ ఖండోబా గుడి
వుంది. ఏడో
శతాబ్దానికి చెందిన ఖండోబా అనే రాజు పేరిట ఈ దేవాలయం నిర్మించారు. మహాశివుడి
మహత్తు ఖండోబాలో వుందని అనేకుల విశ్వాసం. ఆయన్ని కుల దైవంగా
కొలుస్తారు. గుడిలోని ఖండోబా దేవుడికి నాలుగు హస్తాలు. ఒక చేతిలో పెద్ద భండారా (పసుపు)
పాత్ర వుంటుంది. దాని నిండా పసుపు పొడి. ఈ దేవతను భక్తులు పసుపుతో, ఉల్లిపాయలతో, ఇతర కూరగాయలతో పూజించడం ఆచారం.
కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు విధిగా ఈ గుడిని సందర్శించి, ఖండోబా దైవాన్ని పూజించి, పసుపు, కూరగాయలు ముడుపులుగా చెల్లించడం
ఆనవాయితీ. అలాగే
సంతానలేమితో బాధపడేవాళ్ళు కూడా ఖండోబాను పూజించి తమ మనసులోని కోరికను
వెల్లడిస్తారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో
అనేక చోట్ల ఖండోబా దేవాలయాలు వున్నాయి కాని, జెజూరి దేవాలయానికి పేరు ప్రఖ్యాతులు
ఎక్కువ. ఏటా ఆ
దేవాలయంలో భండారా ఉత్సవం జరుగుతుంది.
ఆ
రోజున ఆ దేవాలయ ప్రాంగణం పసుపుతో బంగారంలా మెరిసిపోతుంది. భక్తులు కూడా ఒకరిపై
ఒకరు పసుపు చల్లుకుంటారు.
ఏతావాతా
యాదగిరి చెప్పేది ఏమిటంటే మా ఇంటి పేరు పవిత్రమైన పసుపు వర్ణానికి గుర్తుగా
వచ్చిందని.
శుభం!
మంచిమాటే చెప్పాడు, ఎప్పటిలాగే.
కింది
ఫోటో:
ఒకసారి
ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీనియర్ పాత్రికేయులు ‘బండారు
శ్రీనివాస్’. చిత్రంలో సాక్షి ఈడీ రామచంద్ర మూర్తి, ఆర్వీ రామారావు, చక్రధర్, సీనియర్ పాత్రికేయులు శ్రీరామ
మూర్తిని సన్మానిస్తున్న వరదాచారి.
(ఇదీ ఆ
పత్రిక పెట్టిన ఫోటో క్యాప్షన్)
(ఇంకావుంది)
24, ఏప్రిల్ 2025, గురువారం
అయాం ఎ బిగ్ జీరో (148) – భండారు శ్రీనివాసరావు
వ్యాసుడు, కార్ల్ మార్క్స్ వాహ్వ్యాళి
మంచి రచయితలు చక్కని పాత్రికేయులు కాగలుగుతారా! మంచి
జర్నలిస్టులు చక్కని రచయితలు కాగలుగుతారా! రచయితలు అందరూ పాత్రికేయులు కాలేక
పోవచ్చు కానీ,
జర్నలిస్టులలో చాలామంది చక్కని రచనలు చేయగలుగుతారని ఒకప్పుడు చెప్పుకునే వారు.
ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా శకంలో ఇక ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారం లేకపోవచ్చు. ఈ
మాధ్యమాలలో పోస్టులు పెడుతున్న చాలామందికి జర్నలిజం నేపధ్యం లేకపోయినా సమకాలీన అంశాలపై సవివరమైన విశ్లేషణలు చేయగలుగుతున్నారు. రచనల మీద
రచయితలకు, జర్నలిజం మీద జర్నలిస్టులకు పరంపరగా వస్తున్న గుత్తాధిపత్యానికి గండి పడే
రోజులు దగ్గరలోనే వున్నాయని అనిపిస్తోంది. ఒకరకంగా మంచిదే.
ఎప్పుడో
చాలా ఏళ్ళ క్రితం ఓ ఆదివారం సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఉషశ్రీ గారి సంస్మరణ కార్యక్రమం
జరిగింది. మనసులో గట్టిగా వెళ్ళాలని అనుకున్నా, చివరికి వెళ్ళలేక పోయాను. తన కలంతో
‘కలంకారీ’ చేసే చమత్కార రచయిత శ్రీ రమణ గారిని కలవలేకపోయాను. మిత్రులు కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారిని అడిగి శ్రీరమణ
గారి కాంటాక్టు
నెంబరు తీసుకున్నాను. చాలా రోజులయింది, గుర్తు పడతారో లేదో అని ‘నేను, భండారు శ్రీనివాసరావును’ అని మెసేజ్
కూడా పెట్టాను.
మర్నాడు
ఉదయం ఫోను మోగింది. ఏదో కొత్త నెంబరు.
‘హలో!
నేను శ్రీ రమణను మాట్లాడుతున్నాను’
ఎంతో
సంతోషం అనిపించింది చాలా కాలం తర్వాత ఆయన గొంతు విని.
‘ఇదేమిటి,
సుబ్రహ్మణ్యం
మరో నెంబరు ఇచ్చాడే’ అన్నాను.
‘అదీ
నాదే! ఆఫీసు వాళ్ళు ఇచ్చింది. ఇది నా పర్సనల్’
అదీ
శ్రీ రమణ అంటే! పర్సనల్ కాల్స్ పర్సనల్ ఫోన్లో మాట్లాడాలి అనే నియమం పెట్టుకున్నారేమో తెలియదు.
చాలా
చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లేదు లేదు, ఆయన చెబుతూ పోయారు, నేను
వింటూ పోయాను. నండూరి రామమోహన రావు గారు, పురాణం సుబ్రమణ్య శర్మ, బాపూ రమణలు, ఇంద్రగంటి
శ్రీకాంత శర్మ, రావిశాస్త్రి ఎందరెందరో మహానుభావులు, వారందరి కబుర్లు కలబోసారు. నండూరి
రామమోహన రావు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా వున్నప్పుడు నేను ఆయన వద్ద అయిదేళ్ళు
పనిచేసాను. తరువాత ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చేసాను. ఆ
తర్వాతనే శ్రీ
రమణ గారు, నేను పనిచేసిన జ్యోతిలో చేరారు.
అంచేత ముకహపరిచయం లేదు.
ఉషశ్రీతో
కదా మొదలు పెట్టింది.
శ్రీ
రమణ గారు ఓ సంగతి చెప్పారు, మాటల
మధ్య.
ఉషశ్రీ
ఆధునిక భావాలు కలిగిన ఆధ్యాత్మికవేత్త. రామాయణ మహా భారతాలను కాచి వడబోసి వాటి
సారాంశాన్ని రేడియో శ్రోతలకు తనదయిన బాణీలో వినిపించేవారు. వాల్మీకి రామాయణం
మాదిరిగా ఉషశ్రీ రామాయణం అని చెప్పుకునేవారు.
శ్రీ
రాఘవాచార్య. విశాలాంధ్ర ఎడిటర్ గా చాలా కాలం పనిచేసారు. ఒక తరం జర్నలిస్టులకు
మార్గదర్శి. వామపక్ష భావజాలం నరనరాన నింపుకున్న వ్యక్తి. ఆరోగ్యం అంతగా సహకరించక
పోయినా ఉషశ్రీ మీది అభిమానంతో శ్రీ రాఘవాచార్య ఆ సమావేశానికి వచ్చారు. పత్రికల్లో చదివాను.
ఉత్తర
దక్షిణ ధ్రువాల వంటి భావజాలం కలిగిన వీరిరువురూ మంచి స్నేహితులు.
విజయవాడ
రోడ్ల మీద సరదాగా కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి, ‘వ్యాసుడు, కార్ల్ మార్క్స్’
చెట్టాపట్టాలేసుకుని వస్తున్నట్టు వుందని జనం అనుకునేవారట!
శ్రీ
రమణ చెప్పారు.
ఆయన
ఒక్కరే ఇటువంటి చక్కటి కబుర్లు చెప్పగలరు. ముందే చెప్పినట్టు మంచి రచనలు చేసే మంచి
జర్నలిస్టు శ్రీ రమణ. ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మిధునం. దాన్ని ప్రముఖ
నటుడు తనికెళ్ల భరణి గారు అదే పేరుతో
సినిమాగా తీశారు. ఆ పుస్తకాన్ని మొదటినుంచి చివరివరకు బాపూ తన చేతిరాతతో రాసి ముద్రించిన మిధునం నవలను శ్రీ
రమణ నాకు కానుకగా ఇచ్చారు.
శ్రీ
రమణ గారికి రెండు పేర్లు, అదనంగా మరో రెండు ఇంటి పేర్లు కూడా. పుట్టినప్పుడు
తలితండ్రులు పెట్టిన పేరు రాధాకృష్ణ. ఇంటి పేరు వంకమామిడి. కాలేజీ చదువులో
వున్నప్పుడు, మగసంతు లేని ఆయన తాతగారు ఆయన్ని దత్తత తీసుకున్నారు. ఆ విధంగా మరో
ఇంటి పేరు, అసలు
పేరు శ్రీ రమణ పరమయ్యాయి. ఆ పేరు కామరాజు
రామారావు. ఈ తికమక నుంచి బయటపడడానికి ఆయన తనకు తానుగా పెట్టుకున్న మూడో పేరే శ్రీ
రమణ. ఈ పేరే ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది. హాస్యాన్ని, పేరడీలను ఆదరించే తెలుగు చదువరుల
దురదృష్టం, 2023లో డెబ్బయ్యవ ఏట ఆయన కాలం చేశారు.
మంచి
పాఠకులు వున్నప్పుడే మంచి రచనలు వస్తాయి. ఇందుకు ఉదాహరణ దేవినేని మధుసూదన రావు
గారు. మాస్కో గురించి ఎప్పుడో దశాబ్దాల క్రితం నా బ్లాగులో నేను రాసుకున్న నా
పోస్టులు చదివి వారి శ్రీమతిని వెంటబెట్టుకుని మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన విషయం
నేనెప్పటికీ మరచిపోలేను. ఆయన పుస్తక ప్రియుడు. అంతే కాదు సొంత ఊరు అంటే ప్రాణం.
ఉద్యోగరీత్యా హైదరాబాదు లో ఉద్యోగం చేసినా, ఆ ఉద్యోగ పర్వం ముగిసిన వెంటనే
పల్లెకు పోదాం ఛలో ఛలో అంటూ, భార్యను తీసుకుని, ముచ్చటపడి కొనుక్కున్న ఇంటిని
వచ్చిన ధరకు అమ్మేసి పొలోమంటూ తమ స్వగ్రామానికి వెళ్ళిపోయారు. ఆయనలో నాకు నచ్చిన
విషయం ఇదే.
'పల్లెకు
పోదాం పదండి' అని
నేను 2005 లో
రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారు, వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు
మాత్రమే ఈ పని చేసి చూపించారు. హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తి కాగానే
వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,
పుస్తకాలతో
సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నామని మాటల మధ్యలో చెప్పారు. చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో బస్తీలకు
వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే
బస్తీలమీద ఇంత అనవసర భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని
నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో
ఎన్నో
అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.
కృష్ణాజిల్లా
తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదనరావు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో
జన్మించినప్పటికీ ఛార్టర్డ్ అక్కౌంటెన్సీ చదివారు. హైదరాబాద్‌లో 'ఎపి రేయాన్స్', 'విజయ ఎలక్ట్రికల్స్' తదితర కంపెనీల్లో పదేళ్లపాటు
ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్‌గానూ పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత, చిన్నతనంలో తన ఉన్నతికి దోహదపడిన అంశాలను ఈ
తరానికి అందించే కృషి ప్రారంభించారు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం, విలువలు పెంచే పుస్తకాలను పంపిణీ చేయడం.
‘'ప్రతి తెలుగు బాలుడూ నూరు పద్యాలు
నేర్చుకోవాలి. పద్యాల్లో ఉండే నీతి, విలువలు జీవితానికి ఉపయోగపడడమే కాక, అతడికి తెలుగు భాషా ప్రాచీన
ఔన్నత్యాన్ని తెలియజేసినవాళ్ళమవుతాం.’ అంటారు దేవినేని మధుసూదనరావు. ఊరికే
మాటలు చెప్పే రకం కాదు.
‘పుస్తకాలు కొని, వాటిని స్నేహితులతో పంచుకుంటున్నా.
నేనిచ్చిన పుస్తకాలను వారితో చదివింపజేయడం హాబీగా మార్చుకున్నా’ అని 2014లో ప్రజాశక్తి దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘2010లో మా అమ్మాయి పెళ్లి జరిగింది.
ఇక్కడో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టాను. 2010లో వెలువరించిన కథల సంకలనమొకటి
పెళ్లికొచ్చిన వారందరికీ పంపిణీ చేశాను. అందరూ సంతోషించారు.
‘2011లో విజయవాడలో నా స్నేహితుడు ఫణి
ప్రసాద్ షష్టి పూర్తి సందర్భంగా శ్రీరమణ రచించిన 'మిథునం' పుస్తకాన్ని అచ్చు వేయించి,
1500 కాపీలను
అక్కడికి వచ్చిన అతిథులందరికీ పంపిణీ చేశాను. 2012లో నా స్నేహితుడు 'శాంతా బయోటెక్' వరప్రసాద్‌రెడ్డి నూతన గృహప్రవేశం
సందర్భంగా ఐదారు కథలతో సంకలనం వేయించి, అక్కడకొచ్చిన అతిథులందరికీ ఇచ్చాను.
నా భార్య చెల్లెలి కుమార్తె పెళ్లి సందర్భంగా కూడా పెళ్లి, పిల్లలు, జీవితానికి సంబంధించిన ఐదు కథలతో
సంకలనం వేసి రెండు వేల కాపీలను పంచిపెట్టాను. దీనికి మంచి స్పందన వచ్చింది.
‘ఇక పిల్లలకు
పద్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో 2012 మార్చి నుంచి శతకాలు పంపిణీ చేయడం
ప్రారంభించాను. ఈ రెండేళ్లలో దాదాపు 45 వేల పుస్తకాలు ('పద్య పారిజాతాలు, బాలగేయాలు') పంచిపెట్టానని తన పుస్తక వితరణ
గురించి ఒకింత గర్వంగా చెప్పారు మధుసూదన రావు గారు ఆ ఇంటర్వ్యూలో.
పుస్తక
దాతా సుఖీభవ!
కింది ఫోటోలు:
(ఇంకావుంది)


