25, ఏప్రిల్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (149) – భండారు శ్రీనివాసరావు

 పేరులో ‘నేముంది?'

ఒక కధలో నాలుగు పాత్రలు వుంటే వాటికి పెట్టిన పేర్లు మరో కధలో పునరావృతం కాకుండా చూసుకోవడం రచయితలకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్య. మరి అలాంటిది రామాయణ, మహాభారత, భాగవతాల వంటి ఇతిహాసాల్లో కానవచ్చే కొన్ని వందల పేర్లను గమనిస్తే వ్యాస, వాల్మీకి వంటి వారు మహానుభావులు ఎలా అయ్యారన్నది చిటికెలో అర్ధం అవుతుంది. ఒకరి పేరు మరొకరికి లేకుండా, రాకుండా వందమంది కౌరవులకు పేర్లు వున్నాయి. సుగ్రీవుని కపిసేనలో వీరులకు సైతం పేర్లు వున్నాయి. రాక్షస సైన్యంలోని వారికి పేర్లు వున్నాయి. విచిత్రం ఏమిటంటే వీరిలో ఎవ్వరికీ ఇంటి పేర్లు లేవు. ఇవి లేకుండానే ప్రసిద్ధులు అయ్యారు. గుర్తింపు పొందారు.

ఈ రోజుల్లో ఒకే పేరు కలిగినవారు వందలు వేలల్లో వుంటారు. ఒకే ఇంటి పేరు కలిగినవారు కూడా చాలామంది వుంటారు. ఇంతమందిలో మనకు కావాల్సిన ఒక వ్యక్తిని గుర్తించాలి అంటే అసలు పేరుకు ఇంటిపేరు జత కలిసినప్పుడే సులభం అవుతుంది. ఇంటి పేరుకు ఇంతటి పేరు, ప్రాధాన్యత రావడానికి ప్రధాన కారణం ఇదే.

ఈ పేర్ల గోల ఎందుకంటారా! ఎందుకంటే అది నా సొంత గోలే కాబట్టి.

బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ప్రతి శుక్రవారం ఒక సినిమా విడుదల అయ్యేది. ఒక రోజు ముందు ఆ సినిమా ఫ్రీవ్యూ (FREE VIEW) చూసి, మర్నాడు దాని మీద ప్రీవ్యూ (PREVIEW) రాయడం నాకు ఒప్పగించిన బాధ్యతల్లో ఒకటి. అలా రాసిన రివ్యూలకు ఏదైనా కలం పేరు పెట్టుకుంటే బాగుంటుందని బాగా ఆలోచించి నా కలం పేరు, సినిమాలకు సంబంధించినది అని అర్ధం అయ్యేలా, ‘స్క్రీనివాస్’ అని పెట్టుకున్నాను. అప్పుడు నండూరి వారు పిలిచి చెప్పారు. దాదాపు ఇదే పేరుతో మద్రాసులో మరో సినిమా జర్నలిస్ట్ రాస్తుంటాడు, అంచేత తికమక రాకుండా మీ ఇంటి పేరే పెట్టుకోండి అని సలహా చెప్పారు. అప్పటి నుంచి నేను రాసే వాక్టూన్లకు, సినిమా, పుస్తక సమీక్షలకు భండారు అని నా ఇంటి పేరే పెట్టుకునేవాడిని. అలా ఆ అయిదేళ్ళ కాలంలో డజన్ల కొద్దీ సినిమాలకు, కొన్ని వందల పుస్తకాలకు సమీక్షలు రాశాను.

అదేమిటో నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు అది దగ్గరి దారి కావచ్చు. శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా ఎడ్వర్డ్ వన్, టు అని తగిలించుకోవచ్చు.

హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరిన తర్వాత ప్రాంతీయ వార్తలు, వారానికి రెండు పర్యాయాలు వార్తావాహిని, వారానికోమారు జీవన స్రవంతి ప్రత్యేక వార్తలు చదవడం వృత్తిలో అదనపు బాధ్యతలుగా మారాయి.

ఆకాశవాణి, జీవన స్రవంతి, ప్రత్యేక వార్తలు, చదువుతున్నది భభండారు శ్రీనివాసరావు.....”

ఇంటి పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’

నలభయ్ ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.

ఇన్నేళ్ళుగా పరిస్తితి ఏం మారినట్టు లేదు.

ఇంతకీ నా ఘోష ఏమిటంటే నేను ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కదాచిత్ గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ నా పేరును చిత్రవధ చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలు రూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది.

కొండొకచో, ఇందువల్ల కొన్ని తలనొప్పులు కూడా తప్పడం లేదు. ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, వాళ్లకు తెలిసిన పిల్లవాడికి మా ఇంజినీరింగ్ కాలేజీలో సీటు ఇప్పించమని అడిగాడు. ' నా కాలేజీ ఏమిటి అని అడిగితే, ' 'భలే వారే! హైదరాబాద్ లో ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులు కనబడుతుంటే మీరు భలే జోకులు వేస్తారే' అన్నాడు భలేగా!

అప్పటినుంచి రోడ్డు మీద వెళ్లే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద పెద్ద అక్షరాలతో ' బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కాలేజీ' అని రాసుంది.

ఓసారి ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి మర్నాడు పత్రికల్లో వచ్చింది.

నాపేరు ‘షరా మామూలే’. పైగా ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ మూర్తి గారు ఫొటోలో నా పక్కనే వున్నారు.

బీ.ఎస్.రామకృష్ణ. జర్నలిస్ట్ సర్కిల్ లో బీ.ఎస్.ఆర్. అంటారు. ఫేస్ బుక్ లో బుద్ధవరపు రామకృష్ణ. మంచి జర్నలిస్టు. మంచి రాయసకాడు. చక్కని ధారణశక్తి. నా కంటే వయసులో చిన్న అయినా, నేనూ జర్నలిస్టునే అయినా, అతనికి వున్న ఈ గొప్ప లక్షణాలు ఏవీ నాలో లేవు. ఆ మధ్య ఫోన్ చేసి, ఫోన్లోనే ఓ పెద్దగీత గీసి, ఇంటి పేరు విషయంలో నేను మధన పడుతున్న అంశాన్ని రబ్బరు పెట్టి చెరిపేసినట్టు చెరిపేసాడు.

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారికే తప్పలేదు, ఈ ఇంటి పేరు గొడవ ఇక మనమెంత’ అంటూ ఎంత పెద్దగీత గీసి చూపెట్టాడో.

ఆంధ్రపత్రిక పెట్టిన కాశీనాధుని నాగేశ్వరరావు గారు భారతి సాహిత్య మాసపత్రిక మొదలుపెట్టి రెండు చేతులూ మోచేతుల దాకా కాల్చుకున్నారు. మంచి సాహిత్య పత్రికని నడిపారనే మంచి పేరుతో పాటు భారీ నష్టాలు కూడా ఆయన ఖాతాలో పడడానికి భారతి కూడా కారణమనేవారున్నారు. గొప్ప సాహితీవేత్త అయిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు భారతి సాహిత్య మాస పత్రికకి అడపాదడపా చక్కటి వ్యాసాలు రాస్తుండేవారు. అయితే ఆయన ఇంటి పేరును ఎప్పుడూ ఇంద్రగంటి బదులు ఇంద్రకంటి అని ప్రచురిస్తూ వుండేవారు. ఆయన ఇంటి పేరులో వున్నది ‘గంటి’ నా, ‘కంటి’ నా అని విడమర్చి చెప్పడానికి ఆయన కుమారుడు, ప్రసిద్ధ రచయిత అయిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (గతంలో నేనూ శర్మగారు ఆంధ్రజ్యోతిలో సమకాలీకులం) ఇప్పుడు లేరు. అయితే అలనాటి భారతి పత్రిక సంచికలు కష్టపడి సేకరించానని రామకృష్ణ చెప్పాడు. చెబుతూ మరో మాట చెప్పాడు. మీ ఇంటి పేరు భండారు లేక బండారు ఇలా ఎలా రాసినా చింతించడం అనవసరం అంటూ గీతాబోధ చేశాడు.

ఇలాంటి సమాచారాలు బోలెడు సేకరిస్తూ వస్తున్నానని, ఎప్పుడో సమగ్ర వ్యాసం రాస్తానని ఒక హామీ కూడా ఇచ్చాడు.

అలాగే నా మరో జర్నలిస్ట్ మిత్రుడు పాశం యాదగిరి.

పాశం యాదగిరి కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఓ నడయాడే ఎన్ సైక్లోపీడియా. లోగడ జీ. కృష్ణగారు మా బోంట్లకి అనేకానేక సంగతులు చెబుతుండేవారు. ఇప్పుడు ఆయన లేని లోటును యాదగిరి తీరుస్తున్నాడు.

నా భండారు ఇంటిపేరు గొడవ చదివి, విని ఫోను చేసాడు. యాదగిరి ఫోన్ చేశాడంటే రాసుకోవడానికి మంచి ముడి సరుకు దొరికినట్టే.

ఆయన చెప్పడం మొదలు పెట్టగానే నేను దాన్ని అక్షరరూపంలో పెట్టడం ఎల్లాగా అనే ఆలోచనలో పడిపోయాను.

పుణే నగరానికి ఓ యాభయ్ కిలోమీటర్ల దూరంలోని చిన్న పట్టణం జెజూరి. అక్కడ ఖండోబా గుడి వుంది. ఏడో శతాబ్దానికి చెందిన ఖండోబా అనే రాజు పేరిట ఈ దేవాలయం నిర్మించారు. మహాశివుడి మహత్తు ఖండోబాలో వుందని అనేకుల విశ్వాసం. ఆయన్ని కుల దైవంగా కొలుస్తారు. గుడిలోని ఖండోబా దేవుడికి నాలుగు హస్తాలు. ఒక చేతిలో పెద్ద భండారా (పసుపు) పాత్ర వుంటుంది. దాని నిండా పసుపు పొడి. ఈ దేవతను భక్తులు పసుపుతో, ఉల్లిపాయలతో, ఇతర కూరగాయలతో పూజించడం ఆచారం. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు విధిగా ఈ గుడిని సందర్శించి, ఖండోబా దైవాన్ని పూజించి, పసుపు, కూరగాయలు ముడుపులుగా చెల్లించడం ఆనవాయితీ. అలాగే సంతానలేమితో బాధపడేవాళ్ళు కూడా ఖండోబాను పూజించి తమ మనసులోని కోరికను వెల్లడిస్తారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో అనేక చోట్ల ఖండోబా దేవాలయాలు వున్నాయి కాని, జెజూరి దేవాలయానికి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ. ఏటా ఆ దేవాలయంలో భండారా ఉత్సవం జరుగుతుంది.

ఆ రోజున ఆ దేవాలయ ప్రాంగణం పసుపుతో బంగారంలా మెరిసిపోతుంది. భక్తులు కూడా ఒకరిపై ఒకరు పసుపు చల్లుకుంటారు.

ఏతావాతా యాదగిరి చెప్పేది ఏమిటంటే మా ఇంటి పేరు పవిత్రమైన పసుపు వర్ణానికి గుర్తుగా వచ్చిందని.

శుభం! మంచిమాటే చెప్పాడు, ఎప్పటిలాగే.

కింది ఫోటో:



ఒకసారి ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీనియర్ పాత్రికేయులు ‘బండారు శ్రీనివాస్’. చిత్రంలో సాక్షి ఈడీ రామచంద్ర మూర్తి, ఆర్వీ రామారావు, చక్రధర్, సీనియర్ పాత్రికేయులు శ్రీరామ మూర్తిని సన్మానిస్తున్న వరదాచారి.

(ఇదీ ఆ పత్రిక పెట్టిన ఫోటో క్యాప్షన్)

(ఇంకావుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మీ పూర్తి పేరు తో లింకెడ్ ఇన్ లో 10+ profiles వున్నాయి :)

చిత్రవధ - ఛిద్రవాత :)