11, ఏప్రిల్ 2025, శుక్రవారం

ఎర్రటి ఎండలో పుట్టింటికి ప్రయాణం – భండారు శ్రీనివాసరావు

  

75  ఏళ్ళక్రితం నాటిన మొక్క ఈనాడు ఒక మహావృక్షంగా తయారయింది. ఆ శీతలతరుచ్ఛాయలో మూడు దశాబ్దాలకు పైగా సేదతీరినవాడిని. మహామహులు తచ్చాడిన ఆ ప్రదేశంలో నేను సైతం అంటూ, 1975 లో ప్రవేశించి ఆడుతూ పాడుతూ హాయిగా ఉద్యోగం చేసిన వాడిని.  

నేను పనిచేసిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 75 వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది ఈ నెల ఏప్రిల్ పదిహేనున.

వార్తావిభాగంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. చేరిన చోటనే రిటైర్ కావాలన్న నా అభిలాష నెరవేరకుండానే చివరాఖరి సంవత్సరంలో నన్ను హైదరాబాదు  దూరదర్సన్ వార్తవిభాగానికి బదిలీ చేశారు. అదొక్కటే అసంతృప్తి.  అన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న హైదరాబాదు ఆకాశవాణి కేంద్రానికి డెబ్బయ్ అయిదేళ్ళ పండుగ అంటే అందులో పనిచేసిన వారికి పుట్టింటి పండుగే. మరీ ముఖ్యంగా నాకు.

రేడియో పట్ల నా అనురాగం తెలిసిన వాళ్ళు కనుక,  నాలుగు ముక్కలు మాట్లాడాలని వారినుంచి  పిలుపు. వాళ్ళు పంపిన కారులోనే ఎగురుకుంటూ వెళ్లాను. రికార్డింగు జరిగింది కాసేపే. ఎక్కువ సమయం, నేను పనిచేసిన రోజుల్లో వున్న తోటి సహోద్యోగులతో, నేను రిటైర్ అయిన తర్వాత చేరిన వారితో మాటా  ముచ్చట్లతో గడిచింది. నిజానికి ముప్పయి ఏళ్ళ పైచిలుకు కాలంలో నేను చేసింది కూడా ఇదే. అసలు ఆఫీసుకు రావడమే గగనం. వచ్చాడో ఆయన చుట్టూ అందరూ, అందరి మధ్యా ఆయన అనే పేరొకటి.

ఇరవై ఏళ్ళ క్రితం నాకు తెలిసిన ఉద్యోగులు  కూడా, మీసం లేని నన్ను  గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా అప్పుడు న్యూస్ యూనిట్ లో మాతో పనిచేసి ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ వద్ద పీ ఎస్ గా  పనిచేస్తున్న మా న్యూస్  యూనిట్ చిట్టి చెల్లెలు శైలజ ఆనందానికి అంతులేదు. మా ఆవిడని అమ్మా అని పిలిచేది. శైలజ లాంటి ఆడపిల్ల వుంటే ఇంట్లో దీపం అక్కరలేదు అనేది మా ఆవిడ.

ఇక రేడియో గురించి నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది? వార్తకు ప్రాణం విశ్వసనీయత. అదే ఇన్నేళ్ళుగా రేడియో వార్తల్ని బతికిస్తోంది. అప్పటికి ఎవరం ఉంటామో ఉండమో తెలియదు కానీ ఇదే రేడియో కేంద్రం నూరేళ్ళ పండుగ జరుపుకోవడం తథ్యం.

నిజానికి నేను చేసింది చాలా చిన్న ఉద్యోగం. 

అయినప్పటికీ, ఆలిండియా రేడియో హైదరాబాదు కంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్,  హెడ్ ఆఫ్ ఆఫీస్  బి. హరి సింగ్, కేంద్రం ప్రోగ్రాం హెడ్, ఎస్. రమేశ్ సుంకసారి, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం.ఎస్. మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ న్యూస్ సురేశ్ ధర్మపురి, న్యూస్ కరస్పాండెంట్  లక్ష్మి తమ హోదాలను పక్కనబెట్టి  బయట వరకు వచ్చి ఆదరంగా వీడ్కోలు చెప్పారు. వారి  గొప్ప మనసుకు మనసారా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని కారెక్కాను. 

పుట్టింటిని మరిచిపోవచ్చేమో కానీ,  పుట్టిల్లు ఎన్నటికీ మరవదు. 

తోకటపా: డ్రైవర్ చిన్నా దోవలో నాతో అనేక ముచ్చట్లు చెప్పాడు. నేను రేడియోలో చేరినప్పటికి అతడు పుట్టనే లేదట. పెరిగి పెద్దయినప్పుడు రేడియోలో  నా గొంతు వినేవాడట. అలా నన్ను గుర్తు పట్టాను అన్నాడు. మాటల మధ్యలో అడిగి నా వయసు తెలుసుకున్నాడు. 

'చూసారా! మన రేడియో స్టేషన్ కన్నా వయసులో మీరే నాలుగేళ్ళు పెద్ద' అనడం నవ్వు తెప్పించింది.

థాంక్స్ చిన్నా!

కింది ఫోటోలు ఆలిండియా రేడియోలో తీసినవి.












(11-04-2025)

కామెంట్‌లు లేవు: