2, ఏప్రిల్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (133) – భండారు శ్రీనివాసరావు

 నా కడప బదిలీ రద్దు కావడంలో జరిగిన ఆలస్యానికి కారణం, వేరే ఎవరో కాదు  నేనే.

నేను పైవాళ్ళని అడిగింది ఒక్కటే, విజయలక్ష్మిని మళ్ళీ బయటకు పంపకుండా, నాకు హైదరాబాదు ఆలిండియా రేడియోలో  పోస్టింగు ఇవ్వమని. అదెలా అన్నారు. అలాగే కావాలి అన్నాను నేను.

(నేను షరతులు పెట్టడం ఏమిటో!  తలచుకుంటే, ఇప్పటికీ  విచిత్రం అనిపిస్తుంది)

‘హైదరాబాదు రేడియోలో పోస్టు ఖాళీ లేదు, అలా కుదరదు’ అని వాళ్ళ వాదన.  ‘పోనీ అయితే దూరదర్సన్ లో వేస్తాము  వెళ్ళండి అన్నారు.

‘అక్కడ నాకు గాలి ఆడదు. రేడియోలో అయితే స్వతంత్రంగా పని చేసుకోగలుగుతాను’ అనేది నా నమ్మకం.

ఆ విధంగా ఓ నెల రోజులు సెలవులో వెళ్లాను. చివరికి వాళ్ళు నా కోసం,  కడప ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ పోస్టుని హైదరాబాదు ఆలిండియా రేడియోకి మార్చి, తద్వారా ఒక ఖాళీని సృష్టించి అందులో నన్ను అసిస్టెంట్ ఎడిటర్ (న్యూస్)  గా వేశారు.

అప్పుడు అంటే ఇన్ని తిప్పలు పడ్డాను, పెట్టాను. కానీ ఇప్పుడు పోస్టులు, ఖాళీలతో నిమిత్తం లేకుండా బదిలీలు చేసేస్తున్నారు. పోస్టింగులు ఇచ్చేస్తున్నారు.  గత పాతికేళ్లలో నేను గమనించిన మార్పు ఇది. మరి అప్పటి నిబంధనలే ఇప్పుడూ వున్నాయి.  సమయానుకూలంగా మారడం వీటికీ వర్తిస్తుంది కాబోలు.  

నిజానికి,  నా స్థానంలో వచ్చిన పవని విజయలక్ష్మి చాలా గొప్ప ప్రతిభాశాలి. తిరుపతి పద్మావతి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్.  న్యూస్ రిపోర్టర్ ఉద్యోగం అంటేనే వేళాపాళా వుండదు. అయినా పోటీపడి వార్తలు ఇచ్చేది. తన ప్రతిభతో, పని తీరుతో, మాట మంచితనంతో అనతికాలంలోనే నేనొకడిని వున్నాను అని ఇంటాబయటా జనం మరిచిపోయేలా చేసింది. ఆలిండియా రేడియో అంటే పవని విజయలక్ష్మి అనే పేరు త్వరలోనే తెచ్చుకుంది. ఇందుకోసం చాలా కష్టపడి పనిచేసేది.

నేను సెలవులో వున్నా కూడా కాలక్షేపం కోసం రేడియోకి, సచివాలయం ప్రెస్ మీట్లకు వెళ్ళే వాడిని.  అందరూ నన్ను గుర్తుపట్టేవారే  కనుక ఇబ్బంది వుండేది కాదు. కాకపోతే తనే,  రేడియోకి  రిపోర్ట్ చేసేది.  రేడియో విలేకరిగా విజయలక్ష్మికి  దేశ వ్యాప్తంగా విస్తృతమైన పేరు  తెచ్చిన  విషాద సందర్భం ఒకటుంది. ఆ రోజు నాకు బాగా గుర్తు. జనవరి పద్దెనిమిది, 1996.

అంతకు ముందు  రోజు సాయంత్రం నేను, నా జర్నలిస్ట్  మిత్రుడు ఎం ఎస్ శంకర్ ఇద్దరం రైల్లో తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాము. తెలతెలవారుతుండగా  రైలు రేణిగుంట స్టేషన్ లోకి ప్రవేశిస్తోంది. పక్క బెర్తులో పడుకున్న  అప్పటి మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు ముద్దు కృష్ణమ నాయుడు, శంకర్ ఇంకా నిద్రలోనే వున్నారు. రైల్లో రాత్రంతా ముద్దు కృష్ణమ నాయుడు గారితో కబుర్లతోతే సరిపోయింది.  ‘దర్శనానికి ఎవరికయినా చెప్పనా’ అని అడిగారు. ‘వద్దండి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాము’ అన్నాము.

ఒకసారి ప్రెస్ మీట్ లో బి.హెచ్.ఇ.ఎల్. వాళ్ళు ఇచ్చిన సిగరెట్ పెట్టే సైజు బుల్లి  ట్రాన్సిస్టర్ రేడియో నా దగ్గర హమేషా వుండేది. దాన్ని ఆన్ చేశాను. ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి.

“హియర్ ఈజ్  ఎ ఫ్లాష్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు  ఈజ్ నో  మోర్. ఎకార్దింగ్ టు అవర్ హైదరాబాద్ కరస్పాండెంట్ పవని విజయలక్ష్మి..”

షాక్! కాసేపు మెదడు మొద్దుబారింది. అంతకు ముందు రోజే విలేకరులతో మాట్లాడారు.  ఎక్కడా ఆయనలో అనారోగ్య ఛాయలు కనిపించలేదు. ఇదేమిటి? ఎలా జరిగింది?  నిజమా కాదా ! వార్త వచ్చింది ఢిల్లీ నేషనల్ బులెటిన్ లో. కాబట్టి నమ్మకపోవడానికి ఆస్కారం లేదు.  విజయలక్ష్మిని అడిగి నిర్ధారణ చేసుకోవడానికి ఈ రోజుల్లో మాదిరిగా  మొబైల్ ఫోన్లు లేవు. శంకర్ ని ముద్దు కృష్ణమ నాయుడు గారిని లేపుతుండగానే రైలు రేణిగుంటలో ఆగింది. గభాలున దిగి పేపరు కొన్నాను.  అందులో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ తప్పిస్తే వేరే విషయం లేదు. ప్లాట్ ఫారం కూడా మామూలుగానే వుంది. ఇంకా ఎవరికీ విషయం తెలిసినట్టు లేదు. అంటే పత్రికల ఎడిషన్ టైం తర్వాత జరిగి వుంటుంది.  విషయం వినగానే నాయుడు గారు గుండెలు బాదుకుంటూ ‘నేను అనాథను అయిపోయాను అని బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. ఇది గమనించి ఆయన గన్ మెన్ పరిగెత్తుకు వచ్చాడు.

భారంగా రైలు దిగి కొండ మీదకు వెళ్ళాము. ఎవరికీ విషయం తెలియదు కనుక అక్కడ కూడా ప్రశాంతంగానే వుంది. ఏర్పాట్లతో వెళ్ళాము కనుక దర్శనం త్వరగానే ముగిగిసింది. బయటకు వచ్చేసరికి వాతావరణంలో పెనుమార్పు. తిరుమలలో అంగళ్లు, హోటళ్ళు మూసేస్తున్నారు. వచ్చిన టాక్సీలోనే వెంటనే  కిందికి వెళ్ళాము.  శంకర్ మూడు నాలుగు అవుట్ స్టేషన్  ఇంగ్లీష్ పత్రికలకి వార్తలు పంపుతుంటాడు. కొండ దిగే సరికి తిరుపతి నిర్మానుష్యం. పత్రికలు స్పెషల్ ఎడిషన్లు వేసినట్టున్నాయి. ప్రతి కూడలిలో ఎన్టీఆర్ ఫోటో, విషాద సూచకంగా నల్ల జెండాలు. తిరుపతి మొత్తం టోటల్ బంద్. ఆఖరికి బండి దుకాణాలు కూడా లేవు. ఇన్ఫర్మేషన్ సెంటర్ కి వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ సుభాష్ గౌడ్ అధికారి. తలుపులు మూసి పని చేసుకుంటున్నారు. శంకర్ అక్కడే టైప్ రైటర్ మీద నాలుగు విభిన్న వార్తలు టైప్ చేశాడు. వాటిని ఫాక్స్ చేయడానికి సుభాష్ గౌడ్ ఒక మనిషిని తోడిస్తే, పెద్ద పోస్టాఫీసుకు వెళ్ళాము. అది మూసేసి వుంది. తలుపు గట్టిగా తడితే ఎవరో తలుపు ఓరగా తీసి, ఏం కావాలంటే, హైదరాబాదు నుంచి వచ్చిన జర్నలిష్టులం, ఎన్టీఆర్  వార్త ఇవ్వాలి అని చెబితే లోపలకు రానిచ్చాడు. అక్కడ పని పూర్తి చేసుకున్నతర్వాత  సుభాష్ గౌడ్  తాలూకు మనిషి ఒక చిన్న రెస్టారెంటుకు తీసుకువెళ్ళాడు. షట్టర్లు వేసి వున్నాయి. వెనుక నుంచి దొంగదోవన లోపలకు తీసుకు వెళ్ళాడు. ‘భోజనం లేదు. ఒక్క ప్లేటు సాంబార్ రైస్ మాత్రం ఇస్తాను, ఇద్దరూ సర్దుకోండి’ అన్నాడు. అదే మహాప్రసాదం అనుకుని తినేసి బయట పడ్డాము. సాయంత్రం హైదరాబాదు రైల్లో రిజర్వేషన్ వుంది కాబట్టి ఎక్కాము. రైలంతా ఖాళీ. దారి మధ్యలో ఎక్కడైనా ఆపేస్తారేమో అనుకున్నాము కానీ మొత్తం మీద ఇళ్లకు చేరాము. ఇంటికి రాగానే ఎన్టీఆర్ చనిపోయిన వార్త తెలుసు కదా అంటూ, ఎదురొచ్చిన మా ఆవిడ,  ‘నిన్నంతా మీ కోసం తెగ ఫోన్లు.  నిన్న తెల్లవారుఝామున్నే రోశయ్య గారు చేశారు. మీరు తిరుపతి వెళ్ళారు అని చెప్పా. బహుశా ఇందుకోసమే అనుకుంటా’ అంది.

మొత్తానికి ఈ వార్తతో  విజయలక్ష్మి పేరు మీడియా సర్కిల్స్ లో, రాజకీయ వర్గాల్లో మారుమోగింది. నన్ను గురువుగారు అనేది. శిష్యులు తమను మించి ఎదగడం ఏ గురువుకు అయినా ఆనందమే కదా!  హాట్స్ ఆఫ్ విజయలక్ష్మి! అని మనసులో అనుకున్నాను. ఫోన్ చేసి చెప్పాను.

తరువాత కొన్నేళ్ళకు,  విజయలక్ష్మి భర్త  బాలాజీ  ఉద్యోగరీత్యా  అమెరికా వెడుతుంటే, ఆయనతో పాటు వెళ్లి అక్కడే సెటిల్ అయింది. కడప నుంచి తెచ్చి హైదరాబాదు రేడియోలో నా కోసం  నాటిన ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ పోస్టు  మళ్ళీ కడపకు వెళ్ళిపోయింది. నేను హైదరాబాదులో ఉండిపోయాను. కడపకు బదిలీ చేసిన పోస్టులో ఒక్క రోజు కూడా పనిచేయకుండానే పని గడిచిపోయింది. ఇన్నేళ్ళ సర్వీసులో జరిగింది ఒకే ఒక బదిలీ. దాని చరిత్ర అలా ముగిసింది.

ఉద్యోగంలో చేరిన ఊళ్లోనే రిటైర్ అయ్యే అవకాశం అనాలో,  రికార్డు అనాలో అది నాకు మిగిలింది.   

కింది ఫోటో:

FACEBOOK, WHATSAPP లతో ఒక ప్రయోజనం వుంది అని ఈ రోజే తెలిసింది. నా పోస్టు చూసిన ఒక అజ్ఞాత మిత్రుడు పవని విజయలక్ష్మి ప్రసక్తి గమనించి,  ఎప్పటిదో ఒక పాత ఫోటో పంపారు. వారికి కృతజ్ఞతలు.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, పవని విజయలక్ష్మి, నేను. ఈ ఫోటోలో ముఖ్యమంత్రికి చూపిస్తున్న పత్రికావార్తకో కధ వుంది. అది తర్వాత. లక్ష రూపాయల డిక్రీ సంగతి కూడా.



(ఇంకా వుంది)

   

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ ఉద్యోగ ప్రస్థానంలో ఏదో అదృశ్య శక్తి మీకు దన్నుగా నిలిచినట్లుంది 🙂.

Zilebi చెప్పారు...

అవును పూర్వ జన్మలో శ్రీకృష్ణదేవరాయల కొలువులో కీలక పాత్రధారి.