1, ఏప్రిల్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (132) – భండారు శ్రీనివాసరావు

 


ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్న శాఖకు నేను మంత్రిని . ఆ విషయం మరచిపోవద్దు శ్రీనివాస్!  మళ్ళీ ఒకసారి ఈ బదిలీ విషయంలో నా మీద ఒత్తిడి తెచ్చావంటే ఊరుకోను.  నిన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాను, అర్ధమయిందా”

“నన్ను సస్పెండ్ చెయ్యండి కానీ ఆయన్ని మాత్రం హైదరాబాదుకు వెయ్యండి. నాకంతే చాలు” అన్నాను స్థిరంగా, అప్పటి కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి మల్లికార్జున్ గారితో.

రేడియో, దూరదర్సన్ లలో ఉద్యోగాలు వివిధ రకాలుగా వుంటాయి. ఒక పట్టాన బయట వారికి అర్ధం కావు. ఉదాహరణకు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం తీసుకుంటే,  కింద నాలుగో తరగతి సిబ్బంది నుంచి పైన స్టేషన్ డైరెక్టర్ వరకు పరిపాలనా యంత్రాంగం కిందికి వస్తారు. అలాగే ఇంజినీరింగ్ విభాగం వాళ్ళు. వీళ్ళందరూ పెన్షన్ కు అర్హత వున్న పూర్తికాలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళకు రిక్రూట్ మెంట్ విధానం వుంటుంది. పే స్కేల్స్ వుంటాయి, ప్రమోషన్లు వుంటాయి, బదిలీలు కూడా వుంటాయి. దేశంలో ఎక్కడికయినా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

మరో కేటగిరీ స్టాఫ్ ఆర్టిస్ట్ సిబ్బంది. ఒక రకంగా చెప్పాలి అంటే కళాకారులు. గొప్ప మృదంగం కళాకారుడిని ఎంపిక చేసేటప్పుడు విద్యార్హతలు చూస్తే, సరయిన వ్యక్తి దొరకడం కష్టం. అంచేత ఆ రంగంలో నైపుణ్యం మాత్రమే చూస్తారు. వీరిని స్థానికంగా ఎంపిక చేస్తారు. మొదట్లో వీరి జీత భత్యాలు చాలా హీనంగా వుండేవి. ఎంత గొప్ప కళాకారుడు అయినా, సంగీత విద్వాంసుడు అయినా రెగ్యులర్ ప్రభుత్వ సిబ్బంది ఆజమాయిషీలో పనిచేయాల్సి వుంటుంది. రేడియో అనగానే తటాలున గుర్తుకువచ్చే సుప్రసిద్ధ కళాకారులు అందరూ ఈ కేటగిరీ వాళ్ళే. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రిగా వున్న రోజుల్లో శ్రీమతి ఇందిరా గాంధీ కొన్నాళ్ళు రేడియో మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ సమయంలో రేడియోలో పనిచేసే స్టాఫ్ ఆర్టిస్టులను ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తూ ఆదేశాలు ఇచ్చారు. సమానంగా పరిగణించమన్నారే కానీ ప్రభుత్వ ఉద్యోగులను చేయలేదు. దానితో వారికి పే స్కేల్స్ ఇచ్చారు. పెన్షన్ సదుపాయం కల్పించారు. కానీ ప్రమోషన్లు ఇవ్వడం జరగక పోవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే చేరిన హోదాలోనే రిటైర్ అవ్వాల్సి వుంటుంది. రేడియోలో  న్యూస్ చదివేవారుంటారు. వారు రిటైర్ అయ్యేవరకు అదే కొలువు. అలాగే అనౌన్సర్‌లు. ప్రయోక్తలు, కార్యక్రమాల రూపకర్తలు. వీళ్ళకు పే కమిషన్ సిఫారసుల ప్రకారం  జీతాలు పెరుగుతాయి, ఒక్కోసారి, వారిపై ఆజమాయిషీ చేసే వారికంటే కూడా ఎక్కువ వేతనాలు పొందుతారు. కానీ పెత్తనం చేసే అధికారం మాత్రం  వేరేవారిది.

1975 లో నేను హైదరాబాదులో ఆకాశవాణిలో అసిస్టెంట్ ఎడిటర్ , రిపోర్టింగ్ అనే పేరు కలిగిన ఉద్యోగంలో చేరినప్పుడు నాదీ ఇలాంటి స్టాఫ్ ఆర్టిస్ట్ ఉద్యోగమని తెలియదు. ముందు మూడేళ్ళకు కాంట్రాక్ మీద సంతకం చేయించుకుంటారు. తరువాత యాభయ్ ఎనిమిదేళ్లు వచ్చే వరకు ఉద్యోగంలో అదే పోస్టులో కొనసాగేవిధంగా,  దీర్ఘకాలిక కాంట్రాక్ట్ ఇస్తారు. (తరువాత ఈ గరిష్ట వయోపరిమితి అరవై ఏళ్ళు చేశారు). ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసే మాడపాటి సత్యవతి, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్నా దేవి, వసీంఅక్తర్ తో సహా మేమందరం ఈ స్టాఫ్ ఆర్టిస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులమే. అయితే, నేను మాస్కోలో వున్న సమయంలో నా సర్వీసుని ఐ. ఐ. ఎస్. లో విలీనం చేశారు. తిరిగివచ్చిన తర్వాత నాకీ సంగతి తెలిసింది.

నేను మాస్కోకి పోకమునుపు, హైదరాబాదులో పనిచేస్తున్న న్యూస్ రీడర్ డి. వెంకట్రామయ్యను ఢిల్లీకి బదిలీ చేశారు. ఢిల్లీ వాతావరణం ఆయనకు పడదు. బదిలీ వద్దు అనడానికి ఈ కారణం సరిపోదు. ఈ ఉద్యోగాలకు పత్రికా ప్రకటన ఇచ్చేటప్పుడు,  హైదరాబాదులో కేంద్రంలో పనిచేయడానికి న్యూస్ రీడర్ కావాలని ఇచ్చారు. పలానా చోట ఉద్యోగం అని తెలిసి దరకాస్తు పెట్టుకుని ఎంపిక అయ్యారు కనుక, ఈ ఒక్క పాయింటు పట్టుకుని నేనూ, వెంకట్రామయ్య గారు ఢిల్లీ వెళ్ళాము.

అప్పుడు రేడియో విభాగాన్ని మంత్రి డాక్టర్  మల్లికార్జున్ (పూర్తిపేరు మల్లికార్జున్ గౌడ్) చూస్తున్నారు. స్నేహశీలి. 1969 తెలంగాణా ఉద్యమంలో మల్లికార్జున్ గారిది కీలక పాత్ర. ఆరు పర్యాయాలు లోకసభకు, నాలుగు సార్లు మహబూబ్ నగర్ నుంచి, రెండు సార్లు మెదక్ నుంచి ఎన్నికయ్యారు.

గుబురు మీసాలతో గంభీరంగా కానవచ్చేవారు . ఇంటిపేరు ఎవరికీ తెలియదు. మీసాల మల్లికార్జున్ అనేవారు. ఆయనా ఏమీ అనుకునేవారు కాదు. కాంగ్రెస్ నాయకుడు సమరసింహారెడ్డి గారికి  చాలా సన్నిహితులు.  రాజకీయాల్లోకి విద్యార్థి నాయకుడిగా ప్రవేశించారు. ఫక్తు తెలంగాణా వాది. పీసీసీ అధ్యక్షుడిగా చేశారు.  మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికయింది కూడా తెలంగాణా ప్రజా  సమితి టిక్కెట్టు మీదనే.  తరచూ ఏవో ఉద్యమ వార్తలు తీసుకుని రేడియోకి వచ్చేవారు. అప్పటినుంచీ వెంకట్రామయ్యకు పరిచయం వుంది. మంత్రి అయినా, తలుపు తోసుకుని వెళ్ళగల చనువు ఆయనతో నాకు వుండేది. ఢిల్లీ వెళ్లి కలిస్తే, ఫైలు తెప్పించుకుని చూశారు.

‘ఢిల్లీ ఏమైనా అడివా! కొన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తే ఏమిటి ఇబ్బంది’ అనేశారు. కింద నుంచి ఎవరో సరైన సమాచారం ఇవ్వలేదని మాకు  అర్ధం అయింది. వివరంగా చెప్పి చూశాను. పని కాలేదు. కాదు అని కూడా బోధపడింది. అయినా పట్టు విడవకుండా  నిత్యం వెంటపడడంతో ఆయనకు విసుగెత్తి,  ‘సస్పెండ్ చేస్తాను జాగ్రత్త’  అనే వరకు పరిస్థితి వెళ్ళింది. ‘సస్పెండ్ చేయండి, కానీ వెంకట్రామయ్యను  హైదరాబాదు బదిలీ చేసి నన్ను ఏమైనా చేయండి’  అనడంతో ఆయన మెత్త పడ్డారు. మా వాదనలో ఏదో విషయం వుందని అర్ధం చేసుకున్నారు. వెంటనే జాయింట్ సెక్రెటరీని తన ఛాంబర్ కు పిలిపించారు. మా ముందే ఆయన్ని అడిగారు, వెంకట్రామయ్య గారిని  ముందు న్యూస్ రీడర్ గా సెలెక్ట్ చేసింది హైదరాబాదుకా, ఢిల్లీకా అని. ఆ అధికారి ఫైలు చూసి చెప్పారు, హైదరాబాదుకని. మంత్రి మల్లికార్జున్ వెంటనే గట్టి స్వరంతో చెప్పారు, వెంకట్రామయ్యను హైదరాబాదు బదిలీ చేస్తూ ఆర్డర్ ఇవ్వమని. మల్లికార్జున్ గారికి ధన్యవాదాలు చెప్పాము.

నా ఈ చరిత్ర తెలిసిన వారందరూ, ‘చూస్తుండండి శ్రీనివాసరావు కడప బదిలీ ఆర్డర్ చిటికెలో రద్దు చేయిస్తాడు’ అని.

కానీ నేను అలా చేయలేదు, అలా అని కడప బదిలీపై వెళ్ళలేదు.

కింది ఫోటో:



నాటి కేంద్ర మంత్రి  డాక్టర్ మల్లికార్జున్ ( గూగుల్ చిత్రం)

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: