రాయని నా డైరీలో ప్రతి పేజీలో ఆవిడే!
నాకే
విచిత్రం అనిపిస్తోంది, నా
జ్ఞాపక శక్తి చూసి. రాత్రి తిన్న కూర ఏమిటంటే బుర్ర తడుముకునే పరిస్తితి నాది. అలాంటిది ....
నాలుగు
నెలలనుంచి ప్రతి రోజూ రాస్తూవస్తూనే వున్నాను, బిగ్ జీరో పేరుతో నేను నడిచివచ్చిన
దారి గురించి. ఎందరో వ్యక్తులు, ఎన్నో సంఘటనలు. అర్హతను మించి ఎక్కిన మెట్లు, అర్హత వున్నా అందుకోలేని అందలాలు.
అన్నీ కలగలిపి చూసుకుంటే ప్లస్సులు, మైనసులు లెక్క తీస్తే మిగిలింది సున్నా. ఆరేళ్ల క్రితం మా ఆవిడ
మరణంతో అది గుండు సున్నా, బిగ్
జీరో అయింది. ఆమె నా పక్కన ఉక్కు స్తంభంలా నిలబడి వున్నప్పుడు నేనో పెద్ద అంకెలా
కనబడేవాడిని. జనాల దృష్టిలో హీరోగా కనబడేవాడిని. పోయిన తరవాత కానీ నా అసలు విలువ
ఏమిటన్నది నాకు తెలిసి రాలేదు. నా జీవితంలో ఆమె పాత్ర గురించి నాకు పూర్తిగా
తెలిసి రావడం కానీ, దానిని గురించి రాయడం కానీ ఆమె పోయిన తర్వాతనే
మొదలయింది. అదో విషాదం. ఆమె వెళ్ళిపోయిన
తర్వాత నాది దారీ తెన్నూ లేని జీవితం అయిపోయింది.
అంచేత ఆమె గురించి రాస్తున్న రాతలకు కూడా ఒక దారీ తెన్నూ లేదు. ఒక తీరున వుండవు. ఒక వరసలో వుండవు. నా మనసులాగే అల్లకల్లోలం.
పిచ్చి గీతలు. పిచ్చి రాతలు. చదువరులు
మన్నించాలి. పెద్దమనసు చేసుకోవాలి. ఇంతవరకు రాసినవి చదివి ‘మీరు జీరో కారు హీరో’నే
అని మెచ్చుకున్నవాళ్ళు, నేను బిగ్ జీరో
ఎందుకు అయ్యానో తెలుసుకోవడానికే ఈ రాతలు.
ఆ రాత్రి ఏం
జరిగింది?
2019 ఆగస్టు 17 రాత్రి పదిగంటలు.
ప్రతి రాత్రీ నిద్రపోవడానికి ముందు డబ్బూడుబ్బూ లేని ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం మా ఇంట్లో ఆనవాయితీ అయిపోయింది. పెద్ద పిల్లవాడు సందీప్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. రెండోవాడు సంతోష్, వాడి భార్య ఉద్యోగాల నిమిత్తం బెంగుళూరులో.
ఉదయం నుంచి రాత్రి
దాకా నేను ఏదో ఒక టీవీ చర్చల్లోన్నో,
ఫ్రెండ్స్ తోనో కాలక్షేపం చేస్తుంటే, తాను తన పూజలు, పునస్కారాలతో పొద్దు పుచ్చుతుండేది.
గత పదేళ్ళలో ఎన్ని
సినిమాలు చూశామో లెక్క గుర్తు లేదు కానీ గత రెండేళ్లలో చాలా సినిమాలు కలిసి చూశాము. బుక్
మై షో వంటి యాప్స్, ఓలా ఉబెర్ వంటి
రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో తరచుగా ధియేటర్లకి వెళ్ళడం అలవాటు అయింది.
మా ఆవిడ ఉదయం పూజకు అడ్డులేకుండా, నా సాయం
కాలక్షేపాలకు అడ్డం రాకుండా వుండే ఆట సమయాలు ఒక్కటే కండిషన్. సినిమా ఏమిటి
అన్నదానితో నిమిత్తం లేదు. పైనుంచి రెండు మూడు వరసల్లో టిక్కెట్లు దొరికితే చాలు.
బుక్ చేయడం, ఉబెర్ పిలవడం
సినిమాకి వెళ్ళిపోవడం. మళ్ళీ ఉబెర్ లో ఇంటికి. ఎక్కడా పర్స్ తీసే అవసరం లేదు. అంతా
ఆన్ లైన్. ఇంట్లో ఇద్దరమే. దాంతో చూసే సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రెండేళ్ల తర్వాత
ఇలా కలిసి సినిమాలకు వెళ్ళడం ఎలాగూ వీలుపడదని తెలియక అప్పుడే హడావుడిగా చాలా
సినిమాలు చూసేశాము. బహుశా పెళ్ళయిన తరవాత ఇన్నేళ్ళలో కూడా అన్ని సినిమాలు ఎప్పుడూ
చూసివుండం.
అప్పట్లో అదో తుత్తి.
ఆ దురదృష్టపు
రోజున తాను కార్డ్సు ఆడదామా అని అడగకపోవడం ఆశ్చర్యం అనిపించింది.
‘తలనొప్పిగావుంది
అమృతాంజనం కావాలంది. ఇంట్లో అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం నాది. తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి
పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్
తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన
తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు ఏదైనా
జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా
ఆయాసపడింది. బాత్ రూం కు పోతానంటే అడుగులు తడబడుతుంటే, నేనే తీసుకువెళ్లి,
తీసుకుని వచ్చాను. హాల్లో సోఫాలో పడుకుని ఆయాసపడుతోంది. చూడలేక అంబులెన్స్ కు ఫోన్
చేశాను.
48 ఏళ్ళ సంసార
జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే.
ఇంతలో అంబులెన్స్
వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. ఆ రాత్రి మేము ఆసుపత్రికి వెళ్లినట్టు
పొరుగు వాళ్లకు కూడా తెలియదు. మర్నాడు మేము కనబడకపోతే మా అన్నయ్య ఇంటికి వెళ్ళామనుకున్నారుట.
ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావు కబురు చల్లగా చెప్పారు, దారిలోనే
పోయిందని.
నిజంగా ఇలా కూడా
మనుషులు చనిపోతారా!
‘15 రోజుల్లో
ముగిసిన కధ’
2019 ఆగస్టు పదిహేడో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత, కార్డియాక్ అరెస్టుతో ఆకస్మికంగా నా భార్య నిర్మల చనిపోవడానికి ముందు, కేవలం రెండు వారాల లోపు వ్యవధానంలో అనేక వేడుకలు, వినోదాలు, శ్రావణ శుక్రవారం నోములు, పేరంటాలు, ముత్తయిదువులకు వాయినాలు, చుట్టాల ఇళ్ళు చుట్టబెట్టడాలు, ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు, హైదరాబాదులో ఇన్నేళ్ళుగా ఉంటున్నా ఎన్నడూ చూడని రామోజీ ఫిలిం సిటీలో ఒక రోజల్లా సరదా తిరుగుళ్ళు, ఒకటా రెండా, అలుపు లేకుండా తిరిగి ఆ అలసట తీర్చుకోవడానికా అన్నట్టు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది. హైదరాబాదులోని చుట్టాలు అందరూ విషయం తెలిసి తెల్లవారక ముందే ఆసుపత్రికి వచ్చారు. 1989 లో ఇదే ఆసుపత్రిలో మా ఆవిడకు మొదటిసారి గుండె ఆపరేషన్ జరిగింది. ముప్పయ్యేళ్ల తర్వాత అదే ఆసుపత్రిలో కన్నుమూయడం కాకతాళీయం.
కబురు తెలియగానే అమెరికా నుంచి మా పెద్దవాడు సందీప్, కోడలు భావన, మనుమరాళ్లు సఖి, శ్రిష్టి, బెంగుళూరు నుంచి చిన్నవాడు సంతోష్, కోడలు నిషా రెక్కలు కట్టుకుని హైదరాబాదులో వాలారు, మంచు పెట్టెలో ప్రశాంతంగా నిద్ర పోతున్న నా భార్యని చూసి భోరుమన్నారు. సంతోష్ కి నామీద చాలా కోపం వచ్చింది, అమ్మకు ఒంట్లో బాగా లేకపోతే ఎందుకు ఫోన్ చేయలేదని. అమ్మ నాకు అంత వ్యవధానం ఇవ్వలేదురా అని చెప్పలేని పరిస్థితి నాది.
మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకి ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు వచ్చారు. ఇద్దరు పిల్లలు శాస్త్రోక్తంగా ఆ క్రతువు ముగించారు. ఆమె కట్టెల్లో కాలిపోతుంటే, చూస్తూ కూర్చొన్నాను. నా కంటివెంట కారే కన్నీటితో వాటిని చల్లార్చడం అయ్యేపని కాదని తెలుసు.
‘ఈ జీవితానికి పని పూర్తయింది’
పెద్దల ఆశీశ్శులతో, ఆత్మీయుల ఆదరణతో, పిల్లల ప్రేమాభిమానాలతో కరోనా
నేపథ్యంలో సైతం మా ఆవిడ ఏడూడి, (సంవత్సరీకాలు) భగవంతుని దయతో నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల
క్రతువులో నేను నిమిత్తమాతృడిని. కొడుకులు, కోడళ్ళు
యావత్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు.
మొత్తం కార్యక్రమంలో అందరికీ కళ్ళ
నీళ్ళు తెప్పించింది మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి వ్యాఖ్య:
"మాకన్నా ఎంతో చిన్నదైన మా తమ్ముడి భార్యకు దండాలు పెట్టడం ఎంతో బాధ కలుగుతున్నది . ఏటా అమ్మ నాన్నల తద్దినాలకు వెళ్లి, అదే ఇంట్లో ఎన్ని సంవత్సరాలనుంచో దండాలు పెడుతూ ఉన్నాము .అదే ఇంట్లో ఈరోజు ఇలా చిన్న మనిషికి నమస్కరించి
రావడం
మనసును కలచి వేసింది .
“అమ్మ నాన్నల తద్దినాలు పెట్టినప్పుడు , తమ్ముడి భార్య నిర్మల సర్వం
తానుగా అన్ని ఏర్పాట్లు చేసి , పురో హితునితో మాట్లాడటం, వంటమనిషితో మాట్లాడటం ,
ధోవతులు తేవడం ,అందరికీ ఫోన్లు చేయడం , మడి కట్టుకొని అన్నీ ఏర్పాట్లు స్వయంగా, శ్రద్ధగా, నిష్ఠగా చూసుకొనేది .
“అటువంటిది ఆ ఇంట్లోనే ఆమె పిండాలకు
దణ్ణం పెట్టడం మా దురదృష్టం. మనం దేనినన్న జయించవచ్చు కానీ ,
విధిని మాత్రం జయించలేము. విధికి
తలవంచి రాజీ పడటం మాత్రమే మనం చేయగలిగింది.
“ఆమె పవిత్ర ఆత్మకు
శ్రద్దాంజలి . ఓం శాంతి శాంతి"
ఆ రోజు మా ఆవిడ గుణగణాలు గురించి,
మంచితనం గురించి మెట్టినింటివాళ్ళు చేసిన ప్రసంశలు విని ఆమె పుట్టింటివాళ్ళే
ఆశ్చర్యపోయారు.
‘అమ్మకు
ఏదిష్టం?’
కాలం
మన చేతిలో వుండదు. చూస్తూ ఉండగానే మా ఆవిడ రెండో ఆబ్దీకం వచ్చింది.
మూడు
కూరలు, మూడు పచ్చళ్ళు
జాబితా రాస్తున్నప్పుడు ఆమెకి ఇష్టం అయిన కూరో, స్వీటో చేయిస్తే బాగుంటుంది అని ఓ
సలహా.
ఆమెకి
ఏమిష్టం అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. నా ఇష్టాలే తన ఇష్టంగా బతికింది.
ఆమెకేది ఇష్టమో నేను తెలుసుకునే తీరిక, ఓపిక నాకు ఎక్కడిది?
‘అమ్మకు
నేనంటే ఇష్టం’ అని
మనసులో మాట చెప్పాలని అనిపించింది. కానీ గుండెలో మొదలయిన ఆ మాటను గొంతులోనే
నొక్కేసాను.
పనస పొట్టు
కూర, దబ్బకాయ
పులుసు, ఐస్ క్రీం.
ఇలా అనేక సూచనలు. వీటి మధ్య కర్ణపేయంగా వినబడింది ఓ మాట.
‘అర్ధరాత్రి
అయినా, అపరాత్రి
అయినా ఇంటికి వచ్చినవాళ్లు ఎంతమంది అని చూసుకోకుండా అప్పటికప్పుడు వంట చేసి
పెట్టడం ఆమెకు చాలా ఇష్టం’
ఈ మాట అందరికీ
నచ్చింది.
కొడుకు
సంతోష్, కోడలు నిషా ఈ
బాధ్యత నెత్తికి ఎత్తుకున్నారు.
మా
ఆవిడ క్రమం తప్పకుండా వెళ్ళే మా ఇంటి పక్కన వున్న ఓ దేవాలయాన్ని సంప్రదించారు.
డబ్బు చెల్లించి ఓ అయిదు వందల మందికి అన్న వితరణ ఏర్పాటు చేశారు.
కరోనా కాలంలో పిలవకుండా ఎవరు వస్తారని అనుకున్నాను. రెండు రోజుల ముందే ఆ గుడిలో
పలానా వ్యక్తి సంస్మరణలో అన్నదానం అని బోర్డు పెట్టారుట. మా చుట్టుపక్కల అపార్ట్
మెంట్లలో వుండే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఈ లొకాలిటీలో నన్ను తెలిసిన
వాళ్ళు అరుదు. ఆమెకి ఇంతమంది తెలుసా! ఇంతమందికి ఆమె తెలుసా! అన్న
సంగతి అప్పుడే తెలిసింది.
మా
రెండో అన్నయ్య భండారు రామచంద్రరావుగారు ఎనభయ్యో పడిలో కూడా, కరోనాని కూడా లెక్క చేయకుండా చనిపోయిన
మరదలి మీద, నా మీద ప్రేమాభిమానాలతో వచ్చి
నిలబడి వడ్డన చేశాడు. నాకది ఎంతో అపూర్వంగా అనిపించింది.
మనిషి
ఎలాటివాడు అన్నది అతడు చనిపోయిన తర్వాత తెలుస్తుంది అంటారు.
భార్యను
చూసి మొగుడు గర్వపడే అవకాశం నాకు ఇచ్చి వెళ్ళిపోయింది మా ఆవిడ.
కింది
ఫోటో :
(ఇంకావుంది)
2 కామెంట్‌లు:
🙏
హాస్పిటల్లో పడి, రోజుల తరబడి అవస్థ పడకుండా ఒక అరగంటలో దాటిపోయారు అనే అనాలేమో? గుండె నొప్పి వచ్చిన వారు చివర్లో బాత్ రూమ్ కు వెడ్తాననడం పరిస్థితి sink అవుతున్నట్లు సూచన అంటారు (మా తల్లి గారి మరణం ఆధారంగా చెబుతున్నాను). 🙏
ఓం శాంతి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి