చంద్రబాబు నాయుడు నవ్వుతారా?
ఇదేమీ లోగడ
టీవీల్లో ఎస్ఎంఎస్ ప్రశ్న కాదు. అందుకు
సందేహం అక్కరలేదు. ఆయన నవ్వుతారు. కాకపోతే నవ్వించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ
పైచిలుకు కాలంలో , 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ
పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్
రాదని మానేసారేమో కాని, ఆయనా నవ్వుతారు.
దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన
తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కబురు
పెట్టారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు 'ప్రాంతీయ
వార్తలు సమాప్తం' అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు
ఎదురుగా వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర పోలీసుల
హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు.
విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. 'నేనంటే ఎదురుగానే ఆఫీసు కనుక వెంటనే
వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే'
అనుకున్నా. ఈలోపల అప్పటి సీపీఆర్వో
విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు.
కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, 'సీఎం బయలుదేరి రావచ్చా'
అని. మొత్తం మీద కొంత కోరం
పూర్తయింది. చంద్రబాబు వచ్చేశారు. విలేకరులు పలుచగా వుండడం ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను ఆయన పక్కనే కూర్చుని. అవేమిటో చెప్పమని అడిగారు.
'నెంబర్ వన్.
ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడతాయా అన్నట్టుగా వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు
దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు
అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
వై ఎస్ ఆర్ చెప్పిన గానుగెద్దు కధ
2004 జులై 21 న
అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక కధ చెప్పారు.
“బాగా చదువుకున్న పండితుడు ఒకాయన నూనె గానుగ వద్దకు
వెళ్ళాడు. అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ ఎద్దు
మెడలోని గంటల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. పండితుడు గానుగ మనిషిని పేరు పెట్టి
పెద్దగా పిలిచాడు. ఆ పిలుపు విని అతడు బయటకు వచ్చాడు.
నూనె కొన్న తరువాత పండితుడు అడిగాడు.
‘ఎప్పుడు వచ్చినా నువ్వుండవు. గానుగ పని మాత్రం
నడుస్తూనే వుంటుంది. ఎలా’ అని.
‘ఎద్దు మెడలో గంట కట్టిందే అందుకోసం. గంట చప్పుడు
వినబడుతున్నదీ అంటే ఎద్దు తిరుగుతున్నట్టే లెక్క. తిరగడం మానేస్తే గంట చప్పుడు
వినబడదు. నేను ఏ పనిలో వున్నా బయటకు వచ్చి ఎద్దుకు మేత వేస్తాను. నీళ్ళు పెడతాను.
మళ్ళీ దాని పని మొదలు. నాపనిలో నేనుంటాను’ గానుగవాడు చెప్పాడు.
పండితుడు కదా! అనుమానాలు ఎక్కువ.
‘అలా అయితే ఎద్దు ఒకచోటనే నిలబడి తల ఊపుతుంటే గంటల
శబ్దం వినబడుతుంది. కాని పని సాగదు. అప్పుడెలా?’ అడిగాడు.
‘నా ఎద్దు అలా చేయదు’ అన్నాడు గానుగ మనిషి.
‘అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు?’ అని గుచ్చి అడిగాడు పండితుడు.
‘ఎందుకంటే, నా ఎద్దు మీలా చదువుకోలేదు కాబట్టి’
ఆ జవాబుతో పండితుడి కళ్ళు తెరిపిళ్ళు
పడ్డాయి.”
వై ఎస్ చెప్పిన ఈ కధతో శాసనసభలో అందరూ
పెద్దగా నవ్వారు.
’నేనమ్మా!
చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’
ఉమ్మడి
రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన
పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది.
ఒకరోజు పొద్దున్నే
విలేకరులు వెంటరాగా, ఒక ప్రత్యేక బస్సులో
బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి
ఆయన కంటపడింది. వెంటనే
సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు.
భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా!
చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన
అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన
తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.
కింది
ఫోటో:
చంద్రబాబు
నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తీసిన
ఫోటో. కర్టేసి: మిత్రుడు శ్రీ జయప్రసాద్, ఎండీ, మెట్రో టీవీ. ఆ రోజుల్లో బాబు గారి
ఆకస్మిక పర్యటనలు మీడియాకు మంచి ఆహారం. అలా ఒక రోజు ప్రత్యేక బస్సులో వెడుతుండగా
సీఎం మాతో (విలేకరులతో) ముచ్చటిస్తూ ఉన్నప్పటి దృశ్యం. ఆయన ఎదురుగా పొడుగు చేతుల
తెల్ల చొక్కా మనిషిని నేనే.
మొదటి
టరమ్ అని ఎందుకు గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే చంద్రబాబు కాళ్ళకు వున్న
చెప్పులు. బహుశా తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు ఆయన తన ఆహార్యం (ప్యాంటు, చొక్కా) ఏమీ మార్చుకోలేదు కానీ చెప్పుల నుంచి
బూట్లలోకి మారిపోయారు. నేను కొత్తగా మాస్కో రిటర్న్ కదా! బ్రాండెడ్ నైక్ షూస్ తో నేను.
(ఇంకా
వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి