27, మార్చి 2016, ఆదివారం

తెలుగు నాటకం


(ఈరోజు – మార్చి, 27,  ప్రపంచ రంగస్థల దినోత్సవం)

అప్పటికి ఇప్పటికి  తెలుగులో పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి  వారు  ఈ  రెండూ విడివిడిగా రాశారుపాండవోద్యోగం, పాండవ విజయం అని.  ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని  పద్యాలు జోడించి ‘కురుక్షేత్రం’గా ప్రచారంలోకి తీసుకు వచ్చారు.  ఎన్ని వేలసార్లోవేలేమిటి లక్షసార్లు  అని కూడా చెప్పొచ్చు  ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా  వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈ నాటకం ఉపాధి కల్పించింది.  పేరు తెచ్చి పెట్టింది.
బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర’చిలకమర్తి వారి ‘గయోపాఖ్యానం’ కూడా ప్రసిద్ధి పొందినవే.
తర్వాత వచ్చినవి  కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘చింతామణి’తాండ్ర సుబ్రహ్మణ్యం గారి ‘రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి ‘బాల నాగమ్మ’.  మిగతావన్నీ  చెదురుమదురుగా ఆడేవి,  ‘పాదుకా  పట్టాభిషేకం’ వంటివన్న మాట.
బెజవాడ గాంధీ నగరంలో హనుమంతరాయ గ్రంధాలయం వుంది. పేరుకు గ్రంధాలయంకానీ, అక్కడి రంగస్థలం నాటకాలకు ప్రసిద్ధి. అనేక నాటక సమాజాలకు అది ఆటపట్టు. జేవీడీఎస్ శాస్త్రి 'జంధ్యాల' గా ప్రసిద్ధులు  కాకపూర్వం, ఎస్సారార్ కాలేజీ విద్యార్ధిగా వున్నప్పుడు రాసిన నాటకం ' సంధ్యారాగంలో శంఖారావం' ఇక్కడే ప్రదర్శనలు ఇచ్చింది. అదే కాలేజీలో ఆయనతో కలిసి చదువుకున్న నేనూ  ఆ రిహార్సల్స్ కు వెళ్ళేవాడిని. 
పౌరాణిక నాటకాలకు నిజానికి పెద్ద పెద్ద సెట్టింగులూ  అవీ వుండాలి.  కానీపద్యం రాగం  ముఖ్యం కావడంతో హంగులను  ఎవరూ పట్టించుకొనేవారు కాదు. గుంటూరు అరండల్ పేటలో గుళ్ళపల్లి ఆదిశేషయ్య అని వొకాయన నాటకానికి కావాల్సిన డ్రెస్సులు, తెరలు సప్లయి  చేస్తూవుండేవాడు. అన్ని ప్రాంతాలకి, అన్ని నాటక సమాజాలకి ఈయనే దిక్కు. అలాగే బెజవాడ  గవర్నరుపేటలో జైహింద్ లాడ్జ్, జైహింద్ ప్రెస్ ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసేవారందరికి ఇదే స్థావరం. ఇక్కడ నుంచే నాటకాలు, నటులను  బుక్ చేసుకొనేవారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇక్కడే ప్రింట్ చేసేవారు. ‘జైహింద్’ సుబ్బయ్యగారు వీటన్నిటికి కంట్రాక్టర్.
స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా  మంచి  మైకు సెట్టు.  మైకు  బాగా లేకపోతే  జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు.  వెనక వైపు  ఓ  తెరా, ముందు మరో  తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను  కప్పీ మీద  లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన  ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో  ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి  కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే  ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి  పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది.  ఆయన కూర్చోడానికి  ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా   ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో  ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది.  ఆ మధ్యన ఓ  అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు.  సమాధానం ఏమి వచ్చిందో  గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే  తెలిస్తే చెప్పండి.  రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత,  ‘శ్రీకృష్ణ పరమాత్మకీ  జై!’ అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు.  ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకునిమరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ  పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి  వెళ్లి  జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు  కనపడుతూనే వుండేది.  బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో  ‘రామకృష్ణ మైక్  సర్వీసు’ అని వుండేది.  ఆయన దగ్గర మంచి మైకులు  ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు.  బాగా  లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా.  కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.
బెజవాడలో  ఇప్పటి నవరంగ్ థియేటర్ని   1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు.  యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు.  దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే  గాంధీ  నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు.  అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం  పైన వున్నచిన్న  హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక  మర్నాడు ఆదివారం పడుకోవచ్చని  కాబోలు. (27-03-2016)

(విషయ సేకరణలో సహకరించిన ఆర్వీవీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు) 

26, మార్చి 2016, శనివారం

ఆదివారం ఆటవిడుపు


సూటిగా......సుతిమెత్తగా.......

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 27-03-2016, SUNDAY)

జిడ్డు సీరియల్ మాదిరిగా సాగుతున్న రాజకీయాలు గురించి కాకుండా ఆదివారం ఆటవిడుపుగా వాటికి దూరంగా జరిగి కొన్ని పాత ముచ్చట్లు చెప్పుకుంటే బాగుంటుందనిపించింది. సూటిగా.....పరవాలేదు కానీ మరీ అంత సుతిమెత్తగా చెప్పడం అవసరమా అన్న ఒక మిత్రుడి ప్రశ్న కూడా ఈ వారం ఈ మార్పుకి దోహదం చేసింది. 


1981 బ్యాచ్ కి చెందిన  ఐ.పి.ఎస్. అధికారి జేవీ రాముడికి నిఖార్సయిన పోలీసు అధికారి అనే మంచి పేరుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఆయన్ని పోలీసు డైరెక్టర్ జనరల్ గా  నియమించినప్పుడు అందరూ భేషయిన నిర్ణయం అని మెచ్చుకున్నారు.
ఆ జేవీ రాముడు మొన్నీమధ్య  ఒక మాట అన్నారు. పత్రికావిలేకరులు రాసే వార్తలకు వారే జవాబుదారి అన్నది దాని సారాంశం. మంచిమాట సెలవిచ్చారు. అంతేకాదు విలేకరులు రాసే వార్తలకు  తగిన ఆధారాలు కూడా వుండి తీరాలని ఆయన  పేర్కొన్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది. నిజమే, నిరాధారమైన వార్తలు రాయడం పత్రికల వారికి కూడా తగని పని. అయితే ఆయన మరో అడుగు ముందుకు వేసి, అటువంటి వార్తలు రాసే విలేకరులపై కేసులు పెడతామని హెచ్చరించినట్టు కూడా పత్రికల్లో వచ్చింది. ఇలా అనడం తగదని  జర్నలిష్టు సంఘాలు వెంటనే ఖండించాయి. అదికాదు విషయం. డీజీపీ  హెచ్చరికకు  భయపడో, లేదా దాన్ని అడ్డు పెట్టుకునో విలేకరులు తమకు ఆ రహస్య సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఆ వార్తతో పాటు రాయడం మొదలు పెడితే మొదటికే మోసం. ఎందుకంటే మీడియాలో వచ్చే అనేక ఊహాగానాలకు ఉప్పు అందించేది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఈ వార్త చదవగానే  రేడియోలో పనిచేస్తున్న రోజులనాటి ఓ పాత సంగతి గుర్తుకు వచ్చింది.
ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ‘ఎవరది’ అని జడ్జి గారు అడుగుతున్నారు. ‘రేడియో నుంచి’ అనగానే లైన్లోకి వచ్చారు. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం అని తెలుసు’.  ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి  అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన వార్తలను  ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం విలేకరిగా  నా విధి. అది నేను పాటించాను.  తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.
ఇలా  ఉండేవి ఆ రోజులు. నిజంగా  ఆ రోజులే వేరు.
ఇది కూడా ఇప్పటి సంగతి కాదు. ఆరోజుల్లో రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి. 


ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్.  చైర్మన్ లైన్లోకి వచ్చారు.  ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో – ‘ఇంకా ఎవరెవరు వస్తున్నార’ని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ, మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే – నిర్మలా వసంత్, విజయకుమార్ – వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన. అప్పుడు లైటు  వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక - మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు. 
ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ కురువృద్ధుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు. 
ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే - రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఒకసారి ఢిల్లీలో సత్యనారాయణ రావు గారిని వారి ఇంట్లోనే కలిసాను. ఆయన పక్కనే చిన్న ట్రాన్సిస్టర్  రేడియో తన దారిన తాను ప్రోగ్రాములు వినిపిస్తోంది. అది చూసి ఒక రేడియో మనిషిగా ఎంతో సంతోషం పడ్డాను. ‘రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి’ అని హేళనగా మాట్లాడుకునే రోజులవి.  నిజానికి  ఇలాటి వారు చెప్పే మాటలే ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని ఇప్పటికీ  అనుకుంటుంటాను. 
ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమేకదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేదికాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే కాదు, వారి కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు.
అలాగే మరో సంగతి.


రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన  వీ.వీ. శాస్త్రి (వేమూరి విశ్వనాధ శాస్త్రి) చెప్పిన ఆసక్తికర ఉదంతం ఇది.
ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు  జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి  కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన పూనికపై  వీ.వీ. శాస్త్రి వెళ్లి   మీనన్ ను కలుసుకుని  రేడియో కేంద్రానికి ఆహ్వానించారు. నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఆరోజు  రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు కొన్ని చెప్పారు.
మీనన్ గారు  ఆరోజు చెప్పిన విషయాల్లో  ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది  కావడం వల్ల శాస్త్రి గారికి బాగా  గుర్తుండిపోయింది.
“ భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
‘ ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.’
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.
నెహ్రూ సంగతి చెప్పక్కర లేదు.


రేడియోకి సంబంధించినదే  మరో ముచ్చట.  రావూరి భరద్వాజ అంటే చాలు పరిచయం చేయాల్సిన అవసరం లేని మనిషి. ఆయన రేడియోలో పనిచేసే రోజుల్లో నేనూ అక్కడే విలేకరిగా వున్నాను. రేడియో మీడియం ని అంతగా ఆపోసన పట్టిన వ్యక్తి మరొకరు నాకు తారసపడలేదు.  రేడియో శ్రవణ మాధ్యమం కాబట్టి అందుకు తగ్గట్టుగా,   మాట్లాడుతున్నట్టు అనిపించే విధంగా  రాయడంలో ఆయనకు ఆయనే సాటి. 
" భరద్వాజ  గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది.  మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు భరద్వాజ గారు. 
"ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?” ఇదీ  రెంటాల గారి ప్రశ్న.
భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన  సమాధానం ఇది.
"కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశం  ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)

ఉపశృతి: జీవితంలో కొన్ని విషయాలు ఎల్లకాలం గుర్తు పెట్టుకునేవి వుంటాయి. మరికొన్ని వెంటనే మరచిపోవాల్సినవీ వుంటాయి. ఎప్పుడో చదివిన సంగతి ఒకటి గుర్తుకొస్తోంది. ఒక ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే వారిని ఒక ప్రశ్న అడిగేవాడట, మిమ్మల్ని ఎవరయినా యెట్లా గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారని. ఇప్పుడు జవాబు చెప్పకపోతే ఇబ్బంది లేదు, ముప్పై నలభయ్ ఏళ్ళ తరువాత కూడా జవాబు చెప్పలేకపోతే మీ జీవితం సార్ధకం కాలేదని అర్ధం అని ఆయనే ముక్తాయింపు ఇచ్చేవాడు. ఒక అర్ధర్ కాటన్ ను, ఒక సి.పీ,బ్రౌన్ ను, ఒక వీరేశలింగాన్ని, ఒక గురజాడను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము ? అనేది ఆయన మనసులోని మాట.     


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner             



25, మార్చి 2016, శుక్రవారం

బొటనవేలి కధ


చదువు రానివాళ్ళని, సంతకం చేయడం తెలియనివాళ్ళని అంగుష్టమాత్రులని సంస్కృతంలో, నిశానీగాళ్ళని సంకర భాషలో, వేలిముద్రగాళ్ళని అచ్చ తెలుగులో ఎద్దేవా చేస్తుంటారు. కాని వారికి తెలియంది ఒకటుంది. వేలెడు బొటనవేలే కదా అనుకోకండి దానికి కూడా బోలెడు చరిత్ర వుంది సుమా!
ఒక్కసారి అరచేయి ఎలావుంటుందో, అందులో వేళ్ళ అమరిక ఎలా వుంటుందో గమనించండి. చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు పక్కపక్కన వుంటే ఒక్క బొటనవేలు ఒక్కటే విడిగా వుంటుంది. ఆ ఒక్కటి లేదనుకోండి ఇంతోటి నాగరీకం ఉండేదే కాదు. మనుషులందరూ పాత రాతియుగంలోనే ఉండిపోయేవారు. బొటనవేలు ప్రాశస్త్యం తెలిసిన వాడు కనుకనే ద్రోణాచార్యుడు ఆ వేలిని గురుదక్షిణగా ఇమ్మంటాడు తన శిష్యుడు కాని ఏకలవ్యుడిని. ప్రియ శిష్యుడు అర్జునుడికి పోటీ అతడొక్కడే అని గ్రహించిన ద్రోణుడు బొటనవేలును గురుదక్షిణగా కోరి ఏకలవ్యుడిని శాశ్వితంగా  విలువిద్యకు దూరం చేసినట్టు పురాణ కధనం.



నిజమే. మనిషికి బొటనవేలు అనేది లేకపోతే చేతికి పట్టు చిక్కదు. దేన్నీ పట్టుకోలేదు. పట్టుకోలేకపోతే ఇన్నిన్ని విద్యలు అతగాడికి అలవడేవి కావు. ఒక చేత్తో రాతిని పట్టుకుని మరో రాతితో దాన్ని కొట్టి నిప్పు రాజేసిన విధానమే  ఆదిమజాతి మనుషుల జీవితాలనే  సమూలంగా మార్చివేసింది. మొత్తం నరజాతి చరిత్రనే పెద్ద మలుపు  తిప్పింది. ఆయుధం పట్టాలన్నా, అన్నం తినాలన్నా, అసలు ఏపని చేత్తో చేయలన్నా బొటనవేలే కీలకం. మనిషి చేతికి  ఆ బొటనవేలే లేకపోతే మానవుడు ఇప్పటికీ ఆదిమ మానవుడి మాదిరిగానే మిగిలిపోయి ఉండేవాడని సూతుడు సౌనకాది మునులకు చెప్పగా వారిలో ఒకండు ఆ విషయాన్ని భవదీయుడితో పంచుకోవడం జరిగింది.

NOTE : COURTESY IMAGE OWNER

మూడు పెగ్గులు -ఆరు హగ్గులు


'ప్రతిరోజూ నియమం తప్పకుండా రెండో మూడో పెగ్గులు లాగించడమే  నా ఆరోగ్య రహస్యం' అన్నాడొక శతాయుష్కుడు.
తాగుబోతుల లెక్కలు వేరు. జగ్గుల లెక్కలో సీసాలకు సీసాలు పట్టించేవాళ్లు కూడా 'నేను తాగేది చాలా తక్కువ. మహా అయితే ఒకటో రెండో..' అంటుంటారు నాలుగో పెగ్గు పట్టిస్తూ.
ఈ పెగ్గులు సరే! తాగిమాట్లాడే మాటలు. మరి హగ్గులు అంటున్నారు, అవేమిటి?
ఈ హగ్గులు ఇంగ్లీషు హగ్గులు. అంటే కౌగలింతలు అన్నమాట.
ఆడామగా హాయిగా మరో ధ్యాస లేకుండా గట్టిగా కావిలించుకుంటే, అదీ రోజుకు మూడు నాలుగు సార్లు, ఇక ఆ జంటకు ఆయుస్సు అమాంతం పెరిగిపోతుందని హగ్గారావుల ఉవాచ. దీనికి మద్దతుగా వాళ్లు అనేక శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను ఉదహరిస్తున్నారు. అవి వింటుంటే కౌగలింతల్లో తేలిపోతున్నట్టుగా వుంటుంది.
సాధారణంగా ఓ జంట ఎంతసేపు కౌగలించుకుంటుంది అన్న పరిశోధనలతో మొదలు పెట్టి ఈ శాస్త్ర కారులు తేల్చినదేమిటంటే -
ఉత్తుత్తి కౌగలింతలు మూడు సెకన్లలో ముగిసిపోతాయి.
అదే ఇరవై సెకన్లు గాట్టిగా కావిలించుకుంటే దానివల్ల కలిగే మేళ్ళు అంతా ఇంతా కాదని అంటున్నారు. ఈరకం కౌగలింతలు శరీరం మీదా, మనస్సు మీదా కూడా ఏకకాలంలో సానుకూల ప్రభావం చూపుతాయన్నది వారి అభిప్రాయం.
ఎలాటి భేషజాలు లేకుండా, నిజాయితీతో అవతల వ్యక్తిని దగ్గరకు తీసుకుని కౌగలించుకోవడం వల్ల శరీరంలో "oxytocin" అనే నోరు తిరగని ఓ హార్మోను తయారవుతుందట. దీనికి వాళ్లు 'లవ్ హార్మోను' అని పేరు కూడా పెట్టేసారు. ఈ హార్మోను పుణ్యమా అని శారీరకంగా, మానసికంగా ఎంతో మంచి జరుగుతుందట. శరీరం గాల్లో తేలిపోతున్న విధంగా తేలిక పడుతుందట. మానసిక ఆందోళనలు వగయిరా మంత్రం వేసినట్టు మాయం అయిపోతాయిట. లేనిపోని భయాలు ఏమైన వుంటే కౌగలింతలు కలిగించే హాయిలో కనుమరుగయిపోతాయిట.
మనం కోరుకున్న అబ్బాయో, అమ్మాయో మన బాహుబంధాల్లో వున్నట్టయితే ఇక అన్ని రకాల భవబంధాలు హుష్ కాకి. ప్రేమ బంధం ఒక్కటే శాశ్వితం.
కేవలం కౌగలింతల దగ్గరే ఈ పరిశోధకులు ఆగిపోలేదు. పసి పాపను ఉయ్యాల్లో ఊపుతున్నప్పుడు, పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు, జీవిత భాగస్వామితో కాలు చేయీ కలిపి నృత్యం చేస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆత్మీయులతో కరచాలనం చేస్తున్నప్పుడు సయితం 'లవ్ హార్మోను' లావాలా తన్నుకువస్తుందట. పైగా ఇదంతా టోటల్ గా ఫ్రీ. ముఫ్థ్, ఉచితం. ఇంకా యెందుకు ఆలశ్యం. అనుమానంగా  వుంటే  మన ఒబామా గారు తాజాగా బ్యూనస్ ఎయిర్స్ లో ఆయన గౌరవార్ధం ఇచ్చిన విందులో వేసిన చిందులు చూడండి. కౌగలించుకుందాం రండి.

గట్టిగా అనకండి. ఏ తెలుగు నిర్మాతో విన్నాడంటే ఏకంగా ఈ పేరు పెట్టి ఓ సినిమా చుట్టేసి మనమీద ఒదిలేసే ప్రమాదం వుంది.     

23, మార్చి 2016, బుధవారం

ఆలస్యంగా తీసుకున్న మంచి నిర్ణయం

సూటిగా.....సుతిమెత్తగా......

“కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల
 కొద్దిసేపు  ట్రాఫిక్ సిగ్నల్స్  పనిచేయడం మానేశాయి. దాంతో  ఎవరి హడావిడిలో వాళ్ళు  పోవడంతో  నది రోడ్డు మీద  వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. వున్న కొద్దిమంది ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ  తన  పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ  కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.”
జయప్రకాశ్ నారాయణ్ తన సంస్థను రాజకీయ పార్టీగా మార్చిన కొన్నాళ్ళ తరువాత  నేను ఆయనకు  మెయిల్ ద్వారా  తెలియచెప్పుకున్న అభిప్రాయం ఇది.
ఆయన తాను అనుకున్న పద్దతిలోనే ముందుకు పోయారు. రాజకీయాల రంగూ రూపూ మారుద్దామన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయనకూ కొద్దో గొప్పో ఈ రంగు అంటుకుందనే చెప్పాలి. మొత్తం మీద  తొందరగానే తత్వం బోధపడినట్టు వుంది. కొద్దిగా ఆలస్యం అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు. లోక్ సత్తా ఇకపై ఎన్నికల్లో పోటీచేయదని ప్రకటించారు. సంతోషం.   
ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి  కాస్తంత  ఉదాత్తమైన  పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల  పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక  రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.  
అధికారంలో ఉన్నవాళ్ళకి తాము చేసే ప్రతిపనీ మంచిగానే కనిపిస్తుంది. సమాజ శ్రేయస్సుకోసం తాము అహరహం కష్టపడుతున్నా విమర్శలు చేయడం తగదన్న భావన పాలకులది. గతంలో ఆ పనుల్లోని లోటుపాట్లను  పరిపాలనలో పాలకులకు తోడ్పడే అధికారులు ఎత్తిచూపి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించేవారు. ఇప్పటికాలంలో అలాటి అధికారులూ లేరు.  అధవా, ఏ అధికారి అయినా కల్పించుకుని చెప్పబోయినా చెవినబెట్టే పాలకులూ లేరు. చెబితే విననప్పుడు చెప్పడం దండగ అనుకునే వాళ్ళు కొందరయితే, పైవారికి హితవు కాని మాటలు చెప్పి లేని తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం ఎందుకని సర్దుకుపోయే వారు మరికొందరు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట  వేదవాక్యం. మాటకు ఎదురు చెబితే, నలుగురి ఎదుటా  ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో  కొలువుతీరి కూర్చునేవారు.  తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి  తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో  నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి  వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు.  చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు  ఒక పని చెప్పీ చెప్పగానే,  వెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు. అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా  ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను  ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు.  ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు. 
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఈ నాటి పాలకులకు ఎదురు చెబితే తట్టుకునే సహనం తక్కువయిపోతోంది. పాలకులే కాదు అధికార గణం సయితం ఇదే తంతు. అందరికీ మెచ్చుకోళ్ళే కావాలి తప్ప విచక్షణతో కూడిన విమర్శ పనికిరాకుండా పోతోంది. 'ఎవరు ఎందుకు చెబుతున్నారు, అలా ఎందుకు చెబుతున్నారు' అని ప్రశ్నలు వేసుకుని సరయిన సమాధానాలు రాబట్టుకోగలిగితే పాలనాసూక్ష్మాలు బోధపడతాయి. టీవీ చర్చల్లో కూడా ఇదే తంతు. తమకు అనుకూలంగా ఒక్క మాట చెప్పకపోయినా అక్కడికక్కడే అసహనం ప్రదర్శిస్తున్నారు. పార్టీల ప్రతినిధులే కాదు, చూసే ప్రేక్షకుల తీరూ అలానే వుంది. వారి మనసులో వున్న భావానికి అనుగుణంగా ఎదుటివాళ్ళు మాట్లాడితీరాలనే పట్టుదల ఒక్కటే కనిపిస్తోంది. దాంతో ఒక్క రోజు భాగోతానికి మూతి మీసాల సామెత గుర్తుచేసుకుంటూ  చెప్పతగ్గ మాటలు, చెప్పాలని అనుకున్న మాటలు చెప్పకుండానే సర్డుకోవాల్సివస్తోంది. విలేకరుల సమావేశాల్లో కూడా నాయకుల అసహన ప్రదర్శన ఈ రీతిలోనే సాగుతోంది. దానితో పరిస్తితుల మీదా, పరిణామాల మీదా, అవసరమైన పరిష్కారాల మీదా సరయిన సలహాలు, సూచనలు పొందగలిగే అవకాశాన్ని రాజకీయ నాయకులు కోల్పోతున్నారు. అధవా ఎవరికయినా అవకాశం వచ్చినా ఏలికల మనసు తెలుసుకునే పెదవి విప్పుతున్నారు.      
నిజమే. రాజకీయ నాయకులకు వారి ఇబ్బందులు వారికి వుంటాయి. వారి రాజకీయ అనివార్యతలు వారివి. కాదనలేము. 'పీత బాధలు పీతవి' అన్నట్టు వారి ఇక్కట్లు వారివి. అధికారం అన్న ఓ దండం చేతిలో వున్న కారణంగా మెడలో పడే దండలు, జనాలు పెట్టే దండాలు  మినహాయిస్తే వారి జీవితాలు కూడా పూలపానుపులు కావు. దీన్ని రుజువుచేసుకోవడానికి సచివాలయానికి వెడితే చాలు. మంత్రి దర్శనం కోసం అప్పటిదాకా పడిగాపులు పడ్డ జనం ఆయన కనబడగానే మీదపడిపోతారు. అదే ఒక చిన్న అధికారి ఆఫీసులోకి కూడా చొరవగా జొరబడలేరు. మంత్రులు, ఎమ్మెల్యేల కార్లలోకి నెట్టుకుదూరిపోయే చోటా నాయకులు అన్ని చోట్లా కనిపిస్తారు. అదే అధికారులు కనిపిస్తే  ఆమడ దూరంలో ఆగిపోతారు. అందుకే ముప్పయ్యేళ్ళ క్రితమే అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు అనుచరుల తాకిడి తట్టుకోలేక, తొడతొక్కిడి భరించలేక అంబాసిడర్  కారులో డ్రైవర్ పక్కన  ముందు సీటుకు మారిపోయారు.
అసలు విషయానికి వస్తే '
పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా  దాని వెనుక ఏదో పైకి కనిపించని  రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది.
ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా  రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో  కొట్టి పారేస్తుంది.
చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.
ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం  ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి  కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.
కారణం ఒక్కటే. 'రాజకీయం'.                   
ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా  ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి  విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు  ఒకనాడు వున్న మంచి గుర్తింపు మసకబారి పోతోంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న లోక్ సత్తా జయప్రకాశ్ నిర్ణయం వల్ల ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మృగ్యంగా వున్న ఒక మధ్యవర్తి లోటు తీరితే మంచిదే.  ఎందుకంటే బరులు గీసుకుని  మొండిగా వ్యవహరిస్తున్న నాయకులకు సర్దిచెప్పేవాళ్ళ అవసరం మునుపటికంటే ఇప్పుడు ఎక్కువగా వుంది. కానీ, రాజకీయం చేసివచ్చిన వ్యక్తి మంచి చెప్పబోయినా వినేవాళ్ళు ఉంటారా అనేదే సందేహం. 
ఏదిఏమైనా ప్రస్తుతం వున్నవాతావరణం మారితీరాలి. సమస్యలతో  సంబంధం వున్న ప్రతి ఒక్కరూ  ఒక మెట్టు దిగాలి. బెట్టు వీడి  ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి.
ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.
సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.
ఉపశ్రుతి : టీవీ ప్రకటనల్లో ‘మరక’ మంచిదేమో కానీ రాజకీయాల్లో కాదు.
(23-03-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్

(తమ పార్టీ లోక్ సత్తా ఇక ఎన్నికల్లో పోటీ చేయదని జయప్రకాష్ నారాయణ్ ప్రకటన చదివిన తరవాత)

ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి కాస్తంత ఉదాత్తమైన పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.
నిజమైన ప్రజాసంఘాలకీ, రాజకీయ నేపధ్యం కలిగిన ప్రజా సంఘాలకీ హస్తిమశకాంతరం తేడా వుంది. కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల కొద్దిసేపు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం మానేశాయి. దాంతో ఎవరి హడావిడిలో వాళ్ళు పోవడం వల్ల వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ తన పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.
ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిర్ణయం, లోక్ సత్తాకు అంటుకున్న ఈ 'మకిలి' ని తొలగించగలిగితే మంచిదే!