12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ఎర్ర సముద్రం ఎండిపోయింది.- అరుణ్ సాగర్ ఇక లేరు


(మిత్రులు శ్రీ అరుణ్ సాగర్ అకాల మృతిపై ఈ ఉదయం టీవీ – 5 తో,  ఫోన్ ఇన్ లో పంచుకున్న భావవీచిక)
“అరుణ్ సాగర్ ఇక లేరు అనే దుర్వార్తతో ఈ రోజు తెల్లవారింది.
“మనిషి అనేవాడు ఒక లోకంలో జీవిస్తాడు. అదేమిటో అరుణ్ చిన్న వయస్సులోనే అనేక లోకాల్లో సంచరించి అంతలోనే హడావిడిగా కనుమరుగై పోయాడు. అతడిది ఒక లోకం కాదు, పత్రికాలోకం, కవితాలోకం, రచయితల లోకం  ఇలా అన్నిట్లో తన ముద్ర స్పష్టంగా పడేసుకుని తన దోవన తాను నిశ్శబ్దంగా నిష్క్రమించాడు.
“నిన్న కనిపించిన మనిషి ఈరోజు కనిపించకపోవడం సహజం. కానీ ఇక ఎప్పుడూ కనిపించడు అనే భావనే అతి  దుర్భరం.
“ఈ మధ్యనే టీవీ -  5  నిర్వహించిన ఒక పెద్ద చర్చాకార్యక్రమంలో ఆయన్ని కలిసాను. కొద్ది రోజుల్లో జరగబోయేది తెలిసినా ఏమీ తెలియనట్టు హాయిగా నవ్వుతూ మాట్లాడాడు. ఆయన రాసిన ‘మ్యూజిక్ డైస్’ పుస్తకాన్ని సంతకం చేసి మరీ కానుకగా ఇచ్చాడు. ఇచ్చిన పుస్తకం ఎదురుగా వుంది. ఇచ్చిన  అరుణ్ సాగర్ లేడు. మరణం ఇంత దుస్తరంగా మనుషుల్ని విడదీస్తుంది కాబోలు.
“బాగా మాట్లాడగలం అనే పేరున్నవాళ్ళు  కూడా నోరు తెరిచి నాలుగు మాటలు చెప్పలేని సందర్భం ఇది.
“మనుషుల్ని తప్ప  ఆత్మల్ని నమ్మని అరుణ్  సాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడం విడ్డూరంగానే వుంటుంది. అయినా తప్పని సందర్భం.’ 


(ఒక కార్యక్రమంలో అరుణ్ సాగర్, నేనూ)


(మ్యూజిక్ డైస్ పుస్తకంపై అరుణ్  సాగర్  ఆటోగ్రాఫ్)




11, ఫిబ్రవరి 2016, గురువారం

ఆయారాం గయారాం


‘జనత పార్టీ’  ప్రయోగం విఫలం అయిన తర్వాత, 1980 లో ఇందిరాగాంధీ తిరిగి కేంద్రంలో  అధికారంలోకి రాగానే, ఆనాటి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్  రాత్రికి  రాత్రే పార్టీ మార్చి, ‘సహేంద్ర తక్షకాయస్వాహా’ మాదిరిగా తన కేబినేట్ మంత్రులు, తన  పార్టీ  ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయిన సందర్భంలో, నాటి మరాఠా రాజకీయ నాయకుడు ఎస్.బీ. చవాన్ ‘రాజకీయ కప్పదాట్లకు కొత్తగా చేసిన నామకరణమే ఈ  ‘ఆయారాం గయారాం’. అప్పటినుంచి ఈ రాజకీయ విష సంస్కృతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొత్త రెమ్మలు తొడుగుతూనే వస్తోంది. 
ఈ అభివృద్ధి రేటు పెరుగుదల చూసి దేశంలో రాజకీయ పార్టీలు అదిరిపోతున్నాయి. కోడి మనదే, కోడిని ఉంచిన గంప మనదే అనే ధైర్యం పోతోంది. గంప గంప లాగానే వుంది. కోళ్ళు మాత్రం మాయం అవుతున్నాయి. అందుకే కాబోలు పార్టీ టిక్కెట్టు మీద గెలిచిన వాళ్ళు తమ కట్టు దాటిపోకుండా అనేక ఎత్తులు వేస్తున్నాయి. ‘ఆయారాం గయారాం’ బెడద తప్పించుకోవడానికి మేఘాలయ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, ‘యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ’   ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదే ‘నయా రాం’.



దీనికింద పార్టీ టిక్కెట్టు ఇచ్చేముందే అభ్యర్ధులతో, ఇండియన్ కాంట్రాక్ట్ ఆక్ట్ కింద  బాండు మీద సంతకం చేయించుకుంటారు, అయిదేళ్ళ వరకు పార్టీ ఒదిలి వెళ్ళమని. కానీ రాజకీయాల్లో స్కాచి వడబొసిన ధిగ్గనాధీరులు, యేరు దాటగానే బోడి మల్లయ్య’ అనడం నేర్చిన వాళ్ళు ఈ  బండ్లు, సంతకాలు లెక్కపెడతారనుకోవడం అమాయకం. 1972 లో అస్సాం నుంచి విడిపడి ఏర్పడ్డ మేఘాలయ రాష్ట్రంలో గత నలభయ్ ఏళ్ళ కాలంలో అక్షరాలా ఇరవై నాలుగు ప్రభుత్వాలు ‘ఆయారాం గయారాం’ సంస్కృతి కారణంగా మారాయి. రెండు సార్లు రాష్ట్రపతి పాలన అదనం.
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి ఈ కబుర్లు.   
ఈ రాజకీయ కప్పదాట్లు అనేవి మన దేశానికీ, మన ప్రాంతాలకు  మాత్రమే పరిమితం కాదు. అనేక దేశాల్లో ఈ సంస్కృతి రెక్కలు విప్పుకుని విస్తరిస్తోంది. ఉదాహరణకు  నైజీరియా. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికల మాటేమో కానీ రాజకీయ నాయకుల  పార్టీ మార్పిళ్లు మాత్రం చాలా వేగంగా పెద్దఎత్తున సాగుతున్నాయి. లేబర్ పార్టీ అభ్యర్ధిగా గెలిచి గవర్నర్ అయిన ఒలుసేగం మిమికో  గాలివాటం చూసుకుని ఆ పార్టీకి  రాం  రాం చెప్పేసారు. 2009 ఫిబ్రవరిలో ఆయన ఆండో స్టేట్  గవర్నర్ అయి,  తిరిగి  2012 అక్టోబర్ లో సయితం అయన అదే లేబర్ పార్టీ టిక్కెట్టు పై మళ్ళీ గెలిచి మళ్ళీ  గవర్నర్ కాగలిగారు. ఆ రాష్ట్రానికి  ఇలా రెండోసారి వరుసగా గవర్నర్ అయిన వారు ఎవ్వరూ లేరు. లేబర్ పార్టీ పుణ్యమా అని అలాటి రికార్డు అయన సొంతం అయింది.  కానీ మిమికో ఈసారి, రెండేళ్ళు తిరక్కముందే  రూటు మార్చి పాలకపక్షం పీపుల్స్  డెమోక్రటిక్ పార్టీలో  దూరిపోయి తన అదృష్టాన్ని మరో రకంగా పరీక్షించుకునే పనిలోపడ్డారు. ఇలా పార్టీ మార్చిన మిమికో మహాశయులను పీ.డీ.పీ. కూడా సగౌరవంగా పార్టీలోకి స్వీకరించి ఇటువంటి విషయాల్లో తనకెలాంటి భేషజాలు లేవని రుజువు చేసుకుంది.
'పిల్లి  తను  చనిపోయేలోగా ఏడు (గండాలు) చావులు తప్పించుకుంటుంది' అని ఓ  ఆంగ్లసూక్తి.  అనంబ్రా రాష్ట్ర మాజీ గవర్నర్  డాక్టర్ పీటర్ ఓబీ ఈ సామెతకు సరిగ్గా అతికినట్టు  సరిపోతారు. ఈయన గారు అధికారంలో వున్న రోజుల్లో ఆ అధికారాన్ని దుర్వినియోగం  చేయడం ఎల్లా అనే ఒక్క దానిమీదనే దృష్టి పెడతారని, వేరే ధ్యాసలు ఏవీ  పెట్టుకోరని ఆయనకో పేరుందని అంటారు. అనడం ఏమిటి ఆయనపై ఇలాటివి చాలా కేసులు వున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడల్లా పదవి పోగొట్టుకోవడం,  మళ్ళీ  కోర్టు నుంచి ఉపశమన ఉత్తర్వులు తెచ్చుకుని తిరిగి పదవి పొందడం ఆయనకు అలవాటుగా మారింది. అదేమి  చిత్రమో తెలియదు కానీ ప్రతిసారీ కోర్టు రూలింగులు ఆయనగారికి అనుకూలంగానే వచ్చేవి. అందుకే పిల్లి ఏడు  గండాలు తప్పించుకున్నట్టు ఆయనకూడా ప్రతిసారీ వొడ్డున పడగలుతున్నారు. అన్ని తెలివితేటలు ఉండబట్టే ఈ సారి ఎన్నికలకు ఏడాది ముందే ఆయన ముందు చూపుతో పాలకపక్షం పీడీపీలో చేరిపోయారు. అంతా ఇలా అధికారపక్షం  వైపు దూకుతుంటే పాలక పక్షానికి  చెందిన  నాయకుడు, ప్రస్తుత  పార్లమెంటు స్పీకర్ అయిన అమిను తంబువాల్, ఈ మధ్యనే తన సొంత పార్టీ పీడీపీ ని వొదిలి పెట్టి ప్రతిపక్షం ఏపీసీ లో చేరి  నిరుడు జరిగిన ఎన్నికల్లో గెలిచి  సోకోటో రాష్ట్ర  గవర్నర్ కాగలిగారు. 
అంటే గోడలు దూకడం వల్ల కూడా ప్రయోజనం లేకపోలేదన్న మాట. అయితే ఈ సూత్రం అన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు. గోడ దూకి మోకాళ్ళు విరగగొట్టుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లో కనిపిస్తారు. వారి విషయం మరోసారి. NOTE
ఉపశృతి:
పార్టీ వాళ్ళు సొంత పార్టీ ఒదిలి బయటకు పరిగెడుతున్నా పార్టీ అధినాయకులు మాత్రం మొక్కుబడిగా చేసే వ్యాఖ్య ఒకటుంది.’ ఇలా ఎందరు పోయినా  మా పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు’
నిజమే వారికోసమే  సినారె పాట రాసివుంటారు.   
“ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి”

NOTE: Cartoon Courtesy "TIMES OF INDIA"




10, ఫిబ్రవరి 2016, బుధవారం

“కంట నిదుర రాకపోతే....... పడ్డావనుకొ ప్రేమలో.....”


..అని ఒక పాత సినిమా పాట వుంది.
ఎవరయినా ఒక పార్టీ నాయకుడు టీవీ చర్చల్లో పాల్గొంటూ, తనలో కొన ఊపిరి మిగిలి వున్నంతవరకు తనకు రాజకీయ జీవితం ఇచ్చిన సొంత పార్టీలోనే కొనసాగుతానంటూనో,
లేదా
ఎదుటి పక్షం గురించి హీనాతిహీనంగా మాట్లాడుతూ గొంతు చించుకుంటున్నాడంటే  దానికి ఒక్కటే అర్ధం.
ఊపిరి ఉండగానే యెదుటి పార్టీలోకి యెగిరి దూకడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని.
కత్తులు దూసిన పార్టీలోకే  చల్లగా జారుకుంటున్నాడని.

ఇది అది అని కాకుండా అందరికీ, అన్ని పార్టీలకీ  వర్తించే సార్వజనిక రాజకీయ సూత్రం ఇది.

   

మరణశిక్షలకు క్షమాభిక్ష

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-02-2016, THURSDAY)

సూటిగా....సుతిమెత్తగా.....

నేరస్తులకు న్యాయస్థానాలు విధించే శిక్షల్లో ఒకటయిన  మరణశిక్షకు చెల్లుచీటీ రాయాలనే అంశం మరోమారు తెర మీదకు వచ్చింది. శిక్షగా అయినా సరే ఒక మనిషి ఉసురు తీసే హక్కు చట్టానికి కూడా వుండకూడదని వాదించే వాళ్ళు దేశదేశాల్లో వున్నారు. వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. పంటికి పన్ను, కంటికి కన్ను అనే వాదన కూడా  అనాదిగా వినబడుతోంది. దారుణమైన నేరాలు చేసేవాళ్ళకు మానవత్వం పేరుతొ మరణశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వడం మానవత్వానికే మాయని మచ్చ అని నమ్మే వాళ్లకు కూడా కొదవలేదు. అందుకే ఈ ఉభయ వర్గాలు తమ వాదనే సరియినదన్న నమ్మకంతో ఎదుటి పక్షం వాదనను పూర్వ పక్షం చేసే ప్రయత్నాలు కూడా కొత్తకాదు.
జాతీయ న్యాయకమిషన్  కొన్ని కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో ఉరి శిక్షలను రద్దు చేయాలనేది కూడా వుంది. ఈ విధానానికి స్వస్తి చెప్పాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉగ్రవాద సంబంధమైన కేసులు మినహా మిగిలిన సందర్భాల్లో మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని కమిషన్ కోరింది. అత్యంత అరుదయిన కేసుల్లోను ఉరిశిక్ష రద్దు చేయాలన్నది కమిషన్ అభిప్రాయం. ఉరిశిక్ష అనేది రాజ్యాంగపరంగా చూసినప్పుడు నిలబడదని స్పష్టం చేసింది.  ఉరిశిక్ష రద్దు విషయంలో ప్రస్తుతం వున్న  విచక్షణాధికారాలు వినియోగిస్తున్న తీరు సరిగా లేదన్నది కమిషన్ అభిప్రాయంగా వుంది. మరణ దండన విధించిన కేసుల్లో ఏదైనా న్యాయ పరమైన తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దే రక్షణ కవచంగా పొందుపరచిన రాజ్యాంగ అధికరణాలు సరిగా అమలు కావడం లేదని కూడా పేర్కొన్నది.
ఈ సిఫారసుపై మోడీ సర్కారు సానుకూలంగా వున్నట్టు సమాచారం. ఈ అంశంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరుతూ కేంద్రం లేఖలు రాసింది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు మరణశిక్షల రద్దుకు అంగీకారం తెలిపితే ఇక దేశంలో మరణ శిక్ష విధించడం, దాన్ని అమలు పరచడం అనే ప్రక్రియ  గత కాలపు ముచ్చటగా మారిపోతుంది.
ఇప్పటికే నూట నలభయ్ దేశాల్లో మరణ శిక్షను రద్దు చేసారు. మన దేశంతో సహా యాభయ్ అయిదు దేశాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ శిక్ష  అమల్లో వుంది.
న్యాయ కమిషన్ నివేదిక ప్రకారం చైనాలో మరణశిక్షల సంఖ్య హెచ్చు. అయితే, క్రూరాతి క్రూరంగా ఈ శిక్షలను అమలుచేసే విషయం తీసుకుంటే సౌదీఅరేబియా అగ్రస్థానంలో వుంది. నిరుడు ఒక్క ఏడాది కాలంలోనే అ దేశంలో వందకు పైగా నేరస్తులు  శిరచ్చేదానికి గురయ్యారు. ఈ  విషయంలో పాకీస్తాన్ కూడా తక్కువ తిన్నది లేదు.
చందమామ కధల్లో రాజుకి  ఆగ్రహం వస్తే చాలు, ఎవడి తలనైనా సరే ఖండించి దాన్ని కోటగుమ్మానికి వేలాడదీయమని భటులకు ఆజ్ఞలు జారీచేయడం అన్నది అందరికీ ఎరుకే.  మనదేశంలో రికార్డుల కెక్కిన  ఉరిశిక్ష మొట్టమొదటగా  వందేళ్ళ క్రితం అమలు జరిగింది. దేశం బ్రిటిష్ వలస పాలనలో వున్నప్పుడు 1898 లో తొలిసారి ఈ శిక్షను అమలుచేసారు. ఎవరు ఏమిటి అన్న వివరాలు లభ్యం కావడం లేదు.  దరిమిలా, భారత  స్వాతంత్రోద్యమ కాలంలో విప్లవ బావుటా ఎగురవేసిన  స్వతంత్రసమర యోధులు సుఖ్ దేవ్ , రాజ్ గురులను  ఆనాటి బ్రిటిష్ సర్కారు ఉరితీసింది. దీనితో దేశ వ్యాప్త నిరసనలతోపాటు ఉరిశిక్షను రద్దు చేయాలనే ఉద్యమాలు కూడా ఊపిరి పోసుకున్నాయి. అనేక భాషల్లో ఈ ప్రచారానికి దన్నుగా సినిమాలు కూడా తీసారు. నవలల విషయం చెప్పక్కర లేదు. యండమూరి వీరేంద్ర నాథ్ ఈ ఇతివృత్తంతో రాసిన ‘అభిలాష’ నవల, దాని ఆధారంగా నిర్మించిన చలనచిత్రం పొందిన జనాదరణ తెలుగునాట సర్వజన విదితమే.         
ఈ మరణ శిక్షలకు కూడా చాలా చరిత్ర వుంది.
క్రీస్తుకు పూర్వం పద్దెనిమిదో శతాబ్దం నాటికే బాబిలోన్ లో మరణ శిక్షలు నేర శిక్షాస్మృతిలో భాగంగా వున్నాయి.   ఇరవై అయిదు నేరాలకు సంబంధించి మరణ శిక్ష విధించేందుకు నాటి  పాలకులు శాసనాలు చేసారు. అంతకు ముందు ఏడో శతాబ్దంలో  ఏ నేరం చేసినా ముద్దాయికి మరణ దండన విధించే ఆచారం వుండేది. ఈ శిక్షలను అమలు చేసే తీరు కూడా విభిన్నంగా వుండేది. శిక్షపడిన పడిన వారిని నీళ్ళల్లో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేవాళ్ళు. సిలువవేసే వాళ్ళు. చనిపోయేంతవరకు కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు. నిలువునా కాల్చి చంపేవారు. శిరచ్చేదం చేసేవాళ్ళు.
పన్నెండో శతాబ్దం నాటికి బ్రిటన్ దేశంలో  నేరస్తులను ఉరికంబం ఎక్కించే పద్దతి అమల్లోకి వచ్చింది. పదమూడో శతాబ్దం కల్లా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. బ్రిటిష్ సింహాసనం ఎక్కిన ‘విలియం ది కాంక్వరర్’ యుద్ధ సమయాల్లో తప్ప ఏ నేరానికీ మరణ శిక్ష విధించరాదని ఆదేశించారు. మూడు శతాబ్దాల తరువాత బ్రిటిష్ సింహాసనం అధిరోహించిన ఎనిమిదో హెన్రీ ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికాడు. ఆయన హయాములో డెబ్బయి రెండు వేలమంది ఉరికంబం ఎక్కారు.   
మరణ శిక్షల పరంపర తరువాత కూడా బ్రిటన్ లో కొనసాగింది. పెద్ద నేరాలు చేసిన వాళ్ళకే కాకుండా దొంగతనం చేసినందుకు, అనుమతి లేకుండా చెట్లు నరికినందుకు కూడా ఉరిశిక్షలు వేయడం మొదలయింది. తదనంతర కాలంలో బ్రిటన్ లో న్యాయ సంస్కరణలు చోటుచేసుకున్నాయి  ఉరిశిక్ష విధించే నేరాల సంఖ్యను పరిమితం చేసారు.
మరణ శిక్షల విషయంలో అమెరికాకి కూడా బ్రిటన్ ఆదర్శం అయింది. ఆ దేశానికి వలస వెళ్ళిన బ్రిటిష్ వాళ్ళు ‘మరణ దండన’ ప్రక్రియని తమతో పాటు అక్కడికి తీసుకు వెళ్ళారు. అమెరికాలో మొట్టమొదటి ఉరిశిక్ష 1608 లో అమలయింది. స్పెయిన్ కు గూఢచారిగా పనిచేస్తున్నాడు అనే  నేరం మీద కెప్టెన్ జార్జ్ కెండాల్ ని విచారించి ఉరితీసారు. 1612 లో వర్జీనియా గవర్నర్ సర్ థామస్ డెల్, ఒక అడుగు ముందుకు వేసి,  ద్రాక్షపళ్ళు, కోళ్ళు దొంగిలించడం అనే చిన్న చిన్న నేరాలకు కూడా మరణ దండన విధించిన సందర్భాలు వున్నాయి.
ఇక మన దేశం విషయానికి వస్తే,   
ఏదైనా నేరంలో ఉరిశిక్ష పడ్డప్పుడు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పొందడం ద్వారా దాన్ని రద్దు చేసుకోవడానికి కూడా వెసులుబాటు వుంది. అయితే ఇటువంటి  విచక్షణాధికారాలు కేవలం బాగా కలిగిన వారికే తప్ప బడుగుబలహీన వర్గాలకు ఒరిగేది ఏమీ వుండదన్న వాదన కూడా వుంది. ఉరిశిక్ష నుంచి క్షమాభిక్ష పొందిన వారిలో అత్యధికులు రాజకీయ పలుకుబళ్ళతో ప్రాణాలు దక్కించుకోగలిగారని, ఉరికంబం ఎక్కుతున్న వారిలో ఎక్కువమంది దళిత, మైనారిటీ, బలహీన వర్గాలకు చెందినవారేనని వారు గణాంకాలు ఉదహరిస్తున్నారు. ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన వారికే ‘క్షమాభిక్ష’ వెసులుబాటు లభిస్తోందని వారి ఆరోపణ.
చట్టం ముందు అందరు సమానులే అని అంటుంటారు. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు అనే సమసమాజ  సిద్ధాంతం  ప్రవచించిన పూర్వపు సోవియట్ యూనియన్ లో వాస్తవ పరిస్తితిని గమనించిన జార్జి ఆర్వెల్, ‘అక్కడ అందరు సమానులే, కాకపొతే కొందరు ఎక్కువ సమానులు’ అని ఎద్దేవా చేసాడు. కాబట్టి, చట్టమే కాదు, న్యాయం అమలు జరిగే తీరు కూడా అందరి విషయంలో కూడా ఒకే విధంగా వుండాలి. అప్పుడే అది న్యాయం అనిపించుకుంటుంది.  (10-02-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595   

8, ఫిబ్రవరి 2016, సోమవారం

బాబుగారి అసలు ఆస్తి


పాతికేళ్ళ క్రితం ఉద్యోగ రీత్యా ఓ అయిదేళ్ళ పాటు మాస్కోలో వున్న నాలుగు కుటుంబాల వాళ్ళం నిన్న ఆదివారం కలుసుకున్నాం. మేము మాస్కో వెళ్ళే నాటికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తోంది. తిరిగొచ్చేనాటికి కాంగ్రెస్ పాలన. నేను మాస్కో రేడియోలో పనిచేస్తే మిగిలిన ముగ్గురు ఇండియన్ ఎంబసీలో ఉన్నతోద్యోగులు. వారికీ, వారి కుటుంబాలకి తెలుగుదేశం అన్నా, చంద్రబాబునాయుడు అన్నా విపరీతమైన అభిమానం. ఆ అయిదేళ్ళ కాలంలో ఎప్పుడు కలుసుకున్నా వాళ్ళ నోటి నుంచి బాబుగారి గురించిన ప్రశంసావాక్యాలే. 1989 లో ఆ పార్టీ ఓడిపోయినప్పుడు, రేడియో వాడిని కనుక, ఆ రోజుల్లో ఇంత సమాచార విస్పోటనం లేదు కనుక, ఆ వార్తను వారికి ముందుగా చెబితే,   ఇంటిల్లిపాదీ బాధపడడం నాకు తెలుసు.  వాళ్ళ అభిమానం చూసి, ‘ఎన్నారైలకి ఓటు హక్కు ఇస్తే బాబు గారే రాష్ట్రానికి శాశ్విత ముఖ్యమంత్రి’ అని నేను సరదాగా జోక్ చేసేవాడిని.   మధ్యలో ఒకసారి మాస్కో నుంచి వచ్చినప్పుడు నేనే స్వయంగా ఈ మాట ఆయన చెవినవేసాను. నవ్వి ఊరుకున్నారు.
గత ఇరవై ఐదేళ్ళలో బాబు గారి వెంట ఆనాడు వున్న అనేకులు, పార్టీ  ప్రముఖులు, ముఖ్యంగా ఆయన నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందినవాళ్ళు  మొహం చాటేశారు. వాళ్ళెవళ్ళు అన్నది అందరికీ  తెలిసిందే.
కానీ మాస్కో బ్యాచ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బాబు గారంటే అదే ఆప్యాయత, అదే ఆదరణ.

ఆయన గుర్తింపుతో నిమిత్తం లేని అభిమానం వారిది. ఇది నాకెలా తెలుసంటే, హైదరాబాదు వచ్చిన  తరువాత  ఇన్నేళ్ళలో ఆయన్ని కలిపించమని ఎన్నడూ అడగలేదు.


  

మాస్కో బ్యాచ్


రేడియో మాస్కోలో పనిచేయడానికి  1987 లో  మాస్కో వెళ్లిన వాళ్ళమై,  అప్పటి సోవియట్ యూనియన్ అంగవంగ కళింగ దేశాలుగా విచ్చిన్నం అయిన చారిత్రిక సందర్భాన్ని కళ్ళారా చూసిన వాళ్ళమై, 1991 లో సకుటుంబ  సమేతంగా స్వదేశం చేరుకొని తిరిగి హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగ ప్రస్తానం కొనసాగిస్తున్న వేళ....
.......తాజాగా తెలియవచ్చిన విషయం ఏమిటంటే, మాస్కోలో వున్న కాలంలో  నాతొ పాటే అక్కడ ఉద్యోగరీత్యా వున్న ఐదారు  తెనుగు కుటుంబాలు కూడా హైదరాబాదులోనే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నాయని.
మాస్కోలోని  ఇండియన్ ఎంబసీలో పనిచేసే నేవల్ కమాండర్లు సుధీర్ పరకాల, రమా పరకాల, దాసరి రాము, అమ్మాజీ రాము,  స్టీల్  అధారిటీ  తరపున పనిచేసే  ఇంజినీర్  కే.వీ. రమణ, త్రిలోచన రమణ,  హిందూస్తాన్ ఏరో నాటిక్స్  తరపున పనిచేసే శ్రీధర్ కుమార్, విశాల శ్రీధర్ కుమార్, రాదుగ  ప్రచురణాలయంలో పనిచేసే రాళ్ళభండి వెంకటేశ్వరరావు (ఆర్వీయార్), సుందరమ్మ గారు, (ఆర్వీయార్ దంపతులు కాలం చేశారు) ప్రగతి ప్రచురణాలయంలో పనిచేసే నిడమర్తి ఉమారాజేశ్వరరావు (ప్రస్తుతం బెంగళూరులో సెటిల్ అయ్యారు)  ఇత్యాది తెలుగు సంసారులం  అందరం మాస్కోలో వున్న అయిదేళ్ళు వారంవారం భార్యా పిల్లలతో కలిసి ఒకరింట్లో కలుసుకుని,  సాయం కాలక్షేపాలతో  మగవాళ్ళు, మాటలు, ముచ్చట్లతో ఆడంగులు  పొద్దుపుచ్చడం అనేది  ఒక ఆనవాయితీగా  మారింది.







మళ్ళీ ఇన్నేళ్ళకు నిన్న ఆదివారం మధ్యాన్నం లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో వున్న జల వాయు విహార్ లోని పరకాల సుధీర్ గారి నివాసంలో అందరం కలుసుకున్నాము. రెండున్నర దశాబ్దాలు వెనక్కి మళ్ళి,  కలబోసుకున్న కబుర్లతో, రమా పరకాల గారు స్వహస్తాలతో వండి వడ్డించిన విందు  భోజనాలతో కడుపులు, మనస్సులు నింపుకుని ’దస్విదానియా’ (రష్యన్ పదం- మళ్ళీ కలుద్దాం అని అర్ధం) అనుకుంటూ  ఎవరిళ్లకు వాళ్ళం మళ్ళాము.  




7, ఫిబ్రవరి 2016, ఆదివారం

పెద్దల దర్శనం – అతులిత ఆనందం


అనేక ‘పత్రికల’ ఆరితేరిన అక్షర యోధుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గారితో చాలాసేపు ముచ్చటించే అపూర్వ అవకాశాన్ని మాకు వారే కల్పించారు. నిన్న సాయంత్రం జ్వాలాతో కలిసివెళ్ళి వారింట్లో, నిజంగానే  ఇల్లు, నగరంలో అలాటివి అరుదు కనుక ‘ఇల్లు’ అంటున్నాను. ఇంటి ముందు అరుగు, చక్కటి పూలమొక్కలు, లోపల కూడా వెనుకటి వాతావరణం ఉట్టిపడే విధంగా అన్నీ అమర్చిన తీరు, పొత్తూరి వారు తమ జీవిత పర్యంతం ఇష్టపడి కూడబెట్టిన ఐశ్వర్యం , పుస్తకాల రూపంలో దర్శనం ఇచ్చింది. పొత్తూరి వారింటికి నేను అనేక సార్లు వెళ్లాను. అయినా అన్నీ పాతవి, ఎప్పుడూ కొత్తగా కానవస్తుంటాయి. వారి అబ్బాయి ప్రేమ్ గోపాల్, నిజంగా ప్రేమ మూర్తి. ఈ రోజుల్లో అలా ఆప్యాయతలు చూపడం చాలా అబ్బురం అనిపించింది. ఈ విషయంలో కూడా పొత్తూరి వారు ధన్యులు.
రేపు సోమవారం ఎనభయ్ మూడో పడిలో అడుగుపెడుతున్న ఆ యువ,వృద్ధ మూర్తి నోటి వెంట అనేక పాత ముచ్చట్లు వినడం చాలా సంతోషం అనిపించింది. మధ్య మధ్యలో కీర్తిశేషులు అయిన మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారి ప్రసక్తి. మా అన్నయ్యతో పొత్తూరి వారి అనుబంధం అంతా ఇంతా కాదు.
నాకూ పొత్తూరివారికి  వయస్సులో పదమూడేళ్ళు తేడా. కానీ ఫోటోలో చూస్తే అసలు తేడా తెలుస్తుంది, నా పొట్ట పెరిగిన తీరు గమనించిన వారికి.
పొత్తూరి వారి మనుమరాలు సంతోషి మనీష వివాహం  ఈ నెల రెండో వారంలో. ఆయన ఇలాగే నిండు ఆరోగ్యంతో మనుమలు, మునిమనుమలతో హాయిగా ఆనందంగా గడుపుతూ,  భవిష్యత్ పాత్రికేయ  తరాలకు మంచి మార్గ దర్శనం చేయాలని భవదీయుడి కోరిక.



ఫోటో కర్టెసీ : ప్రేమ్ గోపాల్ పొత్తూరి. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితుల వారు కూడా అక్కడే వుండడం మరింత సంతోషం అనిపించింది.