(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-02-2016, THURSDAY)
సూటిగా....సుతిమెత్తగా.....
సూటిగా....సుతిమెత్తగా.....
నేరస్తులకు
న్యాయస్థానాలు విధించే శిక్షల్లో ఒకటయిన
మరణశిక్షకు చెల్లుచీటీ రాయాలనే అంశం మరోమారు తెర మీదకు వచ్చింది. శిక్షగా
అయినా సరే ఒక మనిషి ఉసురు తీసే హక్కు చట్టానికి కూడా వుండకూడదని వాదించే వాళ్ళు
దేశదేశాల్లో వున్నారు. వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. పంటికి పన్ను, కంటికి కన్ను అనే
వాదన కూడా అనాదిగా వినబడుతోంది. దారుణమైన
నేరాలు చేసేవాళ్ళకు మానవత్వం పేరుతొ మరణశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వడం
మానవత్వానికే మాయని మచ్చ అని నమ్మే వాళ్లకు కూడా కొదవలేదు. అందుకే ఈ ఉభయ వర్గాలు
తమ వాదనే సరియినదన్న నమ్మకంతో ఎదుటి పక్షం వాదనను పూర్వ పక్షం చేసే ప్రయత్నాలు
కూడా కొత్తకాదు.
జాతీయ
న్యాయకమిషన్ కొన్ని కీలక అంశాలపై కేంద్ర
ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో ఉరి శిక్షలను రద్దు చేయాలనేది కూడా వుంది. ఈ విధానానికి స్వస్తి చెప్పాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉగ్రవాద సంబంధమైన కేసులు మినహా మిగిలిన సందర్భాల్లో మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని కమిషన్ కోరింది. అత్యంత అరుదయిన కేసుల్లోను ఉరిశిక్ష రద్దు చేయాలన్నది కమిషన్ అభిప్రాయం. ఉరిశిక్ష అనేది రాజ్యాంగపరంగా చూసినప్పుడు నిలబడదని స్పష్టం చేసింది. ఉరిశిక్ష రద్దు విషయంలో ప్రస్తుతం వున్న
విచక్షణాధికారాలు వినియోగిస్తున్న తీరు సరిగా లేదన్నది కమిషన్ అభిప్రాయంగా వుంది. మరణ దండన విధించిన కేసుల్లో ఏదైనా న్యాయ పరమైన తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దే రక్షణ కవచంగా పొందుపరచిన రాజ్యాంగ అధికరణాలు సరిగా అమలు కావడం లేదని కూడా పేర్కొన్నది.
ఈ
సిఫారసుపై మోడీ సర్కారు సానుకూలంగా వున్నట్టు సమాచారం. ఈ అంశంపై అన్ని రాష్ట్ర
ప్రభుత్వాల అభిప్రాయాలను కోరుతూ కేంద్రం లేఖలు రాసింది. మెజారిటీ రాష్ట్ర
ప్రభుత్వాలు మరణశిక్షల రద్దుకు అంగీకారం తెలిపితే ఇక దేశంలో మరణ శిక్ష విధించడం, దాన్ని అమలు పరచడం
అనే ప్రక్రియ గత కాలపు ముచ్చటగా
మారిపోతుంది.
ఇప్పటికే
నూట నలభయ్ దేశాల్లో మరణ శిక్షను రద్దు చేసారు. మన దేశంతో సహా యాభయ్ అయిదు దేశాల్లో
మాత్రమే ప్రస్తుతం ఈ శిక్ష అమల్లో వుంది.
న్యాయ
కమిషన్ నివేదిక ప్రకారం చైనాలో మరణశిక్షల సంఖ్య హెచ్చు. అయితే, క్రూరాతి క్రూరంగా ఈ
శిక్షలను అమలుచేసే విషయం తీసుకుంటే సౌదీఅరేబియా అగ్రస్థానంలో వుంది. నిరుడు ఒక్క
ఏడాది కాలంలోనే అ దేశంలో వందకు పైగా నేరస్తులు
శిరచ్చేదానికి గురయ్యారు. ఈ విషయంలో
పాకీస్తాన్ కూడా తక్కువ తిన్నది లేదు.
చందమామ
కధల్లో రాజుకి ఆగ్రహం వస్తే చాలు, ఎవడి తలనైనా సరే
ఖండించి దాన్ని కోటగుమ్మానికి వేలాడదీయమని భటులకు ఆజ్ఞలు జారీచేయడం అన్నది అందరికీ
ఎరుకే. మనదేశంలో రికార్డుల కెక్కిన ఉరిశిక్ష మొట్టమొదటగా వందేళ్ళ క్రితం అమలు జరిగింది. దేశం బ్రిటిష్ వలస
పాలనలో వున్నప్పుడు 1898 లో తొలిసారి ఈ శిక్షను అమలుచేసారు.
ఎవరు ఏమిటి అన్న వివరాలు లభ్యం కావడం లేదు.
దరిమిలా, భారత
స్వాతంత్రోద్యమ కాలంలో విప్లవ బావుటా ఎగురవేసిన స్వతంత్రసమర యోధులు సుఖ్ దేవ్ , రాజ్ గురులను ఆనాటి బ్రిటిష్
సర్కారు ఉరితీసింది. దీనితో దేశ వ్యాప్త నిరసనలతోపాటు ఉరిశిక్షను రద్దు చేయాలనే
ఉద్యమాలు కూడా ఊపిరి పోసుకున్నాయి. అనేక భాషల్లో ఈ ప్రచారానికి దన్నుగా సినిమాలు
కూడా తీసారు. నవలల విషయం చెప్పక్కర లేదు. యండమూరి వీరేంద్ర నాథ్ ఈ ఇతివృత్తంతో
రాసిన ‘అభిలాష’ నవల, దాని ఆధారంగా నిర్మించిన చలనచిత్రం పొందిన
జనాదరణ తెలుగునాట సర్వజన విదితమే.
ఈ
మరణ శిక్షలకు కూడా చాలా చరిత్ర వుంది.
క్రీస్తుకు
పూర్వం పద్దెనిమిదో శతాబ్దం నాటికే బాబిలోన్ లో మరణ శిక్షలు నేర శిక్షాస్మృతిలో
భాగంగా వున్నాయి. ఇరవై అయిదు నేరాలకు
సంబంధించి మరణ శిక్ష విధించేందుకు నాటి పాలకులు
శాసనాలు చేసారు. అంతకు ముందు ఏడో శతాబ్దంలో
ఏ నేరం చేసినా ముద్దాయికి మరణ దండన విధించే ఆచారం వుండేది. ఈ శిక్షలను అమలు
చేసే తీరు కూడా విభిన్నంగా వుండేది. శిక్షపడిన పడిన వారిని నీళ్ళల్లో ముంచి ఊపిరి
ఆడకుండా చేసి చంపేవాళ్ళు. సిలువవేసే వాళ్ళు. చనిపోయేంతవరకు కొరడా దెబ్బలు
కొట్టేవాళ్ళు. నిలువునా కాల్చి చంపేవారు. శిరచ్చేదం చేసేవాళ్ళు.
పన్నెండో
శతాబ్దం నాటికి బ్రిటన్ దేశంలో నేరస్తులను
ఉరికంబం ఎక్కించే పద్దతి అమల్లోకి వచ్చింది. పదమూడో శతాబ్దం కల్లా పరిస్తితి
పూర్తిగా మారిపోయింది. బ్రిటిష్ సింహాసనం ఎక్కిన ‘విలియం ది కాంక్వరర్’ యుద్ధ
సమయాల్లో తప్ప ఏ నేరానికీ మరణ శిక్ష విధించరాదని ఆదేశించారు. మూడు శతాబ్దాల తరువాత
బ్రిటిష్ సింహాసనం అధిరోహించిన ఎనిమిదో హెన్రీ ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికాడు.
ఆయన హయాములో డెబ్బయి రెండు వేలమంది ఉరికంబం ఎక్కారు.
మరణ శిక్షల పరంపర తరువాత కూడా బ్రిటన్ లో కొనసాగింది.
పెద్ద నేరాలు చేసిన వాళ్ళకే కాకుండా దొంగతనం చేసినందుకు, అనుమతి లేకుండా చెట్లు నరికినందుకు కూడా ఉరిశిక్షలు వేయడం
మొదలయింది. తదనంతర కాలంలో బ్రిటన్ లో న్యాయ సంస్కరణలు చోటుచేసుకున్నాయి ఉరిశిక్ష విధించే నేరాల సంఖ్యను పరిమితం చేసారు.
మరణ శిక్షల విషయంలో అమెరికాకి కూడా బ్రిటన్ ఆదర్శం అయింది.
ఆ దేశానికి వలస వెళ్ళిన బ్రిటిష్ వాళ్ళు ‘మరణ దండన’ ప్రక్రియని తమతో పాటు అక్కడికి
తీసుకు వెళ్ళారు. అమెరికాలో మొట్టమొదటి ఉరిశిక్ష 1608 లో అమలయింది. స్పెయిన్ కు గూఢచారిగా పనిచేస్తున్నాడు అనే నేరం మీద కెప్టెన్ జార్జ్ కెండాల్ ని విచారించి
ఉరితీసారు. 1612 లో వర్జీనియా గవర్నర్ సర్
థామస్ డెల్, ఒక అడుగు ముందుకు వేసి, ద్రాక్షపళ్ళు, కోళ్ళు
దొంగిలించడం అనే చిన్న చిన్న నేరాలకు కూడా మరణ దండన విధించిన సందర్భాలు వున్నాయి.
ఇక మన దేశం విషయానికి వస్తే,
ఏదైనా నేరంలో ఉరిశిక్ష పడ్డప్పుడు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పొందడం ద్వారా దాన్ని రద్దు చేసుకోవడానికి కూడా ఓ వెసులుబాటు వుంది. అయితే ఇటువంటి విచక్షణాధికారాలు కేవలం బాగా కలిగిన వారికే
తప్ప బడుగుబలహీన వర్గాలకు ఒరిగేది ఏమీ వుండదన్న వాదన కూడా వుంది. ఉరిశిక్ష నుంచి
క్షమాభిక్ష పొందిన వారిలో అత్యధికులు రాజకీయ పలుకుబళ్ళతో ప్రాణాలు
దక్కించుకోగలిగారని, ఉరికంబం ఎక్కుతున్న వారిలో ఎక్కువమంది దళిత, మైనారిటీ, బలహీన వర్గాలకు చెందినవారేనని వారు గణాంకాలు ఉదహరిస్తున్నారు.
ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన వారికే ‘క్షమాభిక్ష’ వెసులుబాటు లభిస్తోందని
వారి ఆరోపణ.
చట్టం
ముందు అందరు సమానులే అని అంటుంటారు. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు అనే సమసమాజ
సిద్ధాంతం ప్రవచించిన పూర్వపు సోవియట్ యూనియన్ లో వాస్తవ పరిస్తితిని
గమనించిన జార్జి ఆర్వెల్, ‘అక్కడ అందరు సమానులే, కాకపొతే కొందరు ఎక్కువ సమానులు’
అని ఎద్దేవా చేసాడు. కాబట్టి, చట్టమే కాదు, న్యాయం అమలు జరిగే తీరు కూడా అందరి
విషయంలో కూడా ఒకే విధంగా వుండాలి. అప్పుడే అది న్యాయం అనిపించుకుంటుంది. (10-02-2016)
5 కామెంట్లు:
ఇంతకీ మీరు మరణ శిక్ష రద్దును సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తునారా?
< "మనదేశంలో రికార్డుల కెక్కిన ఉరిశిక్ష మొట్టమొదటగా వందేళ్ళ క్రితం అమలు జరిగింది. దేశం బ్రిటిష్ వలస పాలనలో వున్నప్పుడు 1898 లో తొలిసారి ఈ శిక్షను అమలుచేసారు. ఎవరు ఏమిటి అన్న వివరాలు లభ్యం కావడం లేదు. "
--------------
(1). ???? అర్ధంకాలేదు శ్రీనివాసరావు గారూ.
రికార్డులకెక్కినట్లయితే ఎవరు ఏమిటి అన్న వివరాలు కూడా రికార్డులో ఉండాలి కదా!!
(2). బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసిన వీరపాండ్య కట్టబొమ్మన్ ఉరిశిక్షకు గురయ్యాడు కదా. ఆయన 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అంటే మీరు చెప్పిన 1898 కన్నా వంద సంవత్సరాల క్రితం వాడు. అలాగే తొలి భారత స్వాతంత్ర్య యుద్ధం వీరుడు మంగళ్ పాండే 1857 లో ఉరిశిక్షకు గురయ్యాడు. కాబట్టి 1898 కన్నా ముందు కూడా ఉరిశిక్ష జరిగిందని అనుకోవాలి. ఏమంటారు?
అడ్డమైన చెత్త రాసే ప్రెస్టిట్యూట్లను వురి తీయడమే బెటర్. బ్రతకనిస్తే జనాల దీపాలు ఆర్పేస్తారు.
@విన్నకోట నరసింహారావు గారు : ధన్యవాదాలు అదనపు సమాచారమే కాకుండా అసలయిన విషయాలు తెలియచేసినందుకు. నేను రాస్తూ పోతున్తానే కాని, దాని మీద ఎవరు ఎలా స్పందించారు అనేది చాలా అరుదుగా గమనిస్తుంటాను. పొరబాటు చేశాను అనిపిస్తే దిద్దుకోవడానికి భేషజపడను. ఎవరయినా నన్ను వ్యక్తిగతంగా విమర్శ చేసినా ఆ వ్యాఖ్యలను నాకు నేనుగా తొలగించను. ఎవరి అభిప్రాయం వారు చెప్పుకోవడానికే కదా ఈ వేదిక. కాకపొతే వ్యాఖ్యలు శృతి మించి నా చదువరులను బాధ పెట్టేవిగా వుంటే వాటిని తీసివేస్తాను. కానీ అవి నామీద ఎక్కుబెట్టినవి అయితే అలాగే ఉంచేస్తాను. వాటి మంచి చెడ్డలను చదువరులే నిర్ణయిస్తారు. నా రచనా వ్యాసంగాన్ని వ్యభిచారంతో పోల్చి రాసిన వ్యాఖ్యను తొలగించక పోవడానికి అదే కారణం. డెబ్బయిఏళ్ళ వయస్సులో కూడా ఇలాటి వృత్తి చేయడానికి వీలుంటుందని నాకు తెలవదు. అయితే నాకు చూచాయగా తెలిసిన విషయం ఒకటుంది. సాని కొంపలకు వెళ్ళే వాళ్ళు తమని ఎవరూ గుర్తు పట్టకుండా నెత్తిన ముసుగు కప్పుకుని వెడతారని విన్నాను. మన 'అజ్ఞాత' కూడా అదే బాపతేమో తెలవదు.
@ Narender Reddy గారు: మరణ శిక్ష రద్దును సమర్ధించడం లేదా వ్యతిరేకించడం అనేది కాదు నేను చెప్పబోయింది. ఒక అంశం మీద నాకు తెలిసినవి, తెలియవచ్చినవి నలుగురితో పంచుకోవడం. ఆ ఉద్యమ కారులు వేరే వున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి