19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

కేటీఆర్ వంద రోజుల చిత్రమ్


సూటిగా........సుతిమెత్తగా.........

యువత ఆలోచనల్లో ఆవేశం ఒక్కటే కాదు నవ్యత్వం కూడా వుంటుంది. పెద్దల ఆలోచనల్లో ముందు జాగ్రత్తతో పాటు పరిపక్వత వుంటుంది. నవ్యత్వం, పరిపక్వత ఈ రెండూ సమపాళ్ళలో మేళవిస్తే, అటువంటి ఆలోచనలు ఆచరణలో విజయాలు సాధించే అవకాశం మెండుగా వుంటుంది.
అనుభవశాలి కేసీఆర్ నేతృత్వంలో, నవ్యత్వం కాంక్షించే కేటీఆర్ సారధ్యంలో పురుడు పోసుకున్న ‘వంద రోజుల’ ఆలోచన విలక్షణంగా వుంది. ఆలోచనలను రేకెత్తించే విధంగా కూడా వుంది.

తనది ‘వంద రోజుల చిత్రం’ అని  చాలా భరోసాగా చెబుతున్నారు, కేటీఆర్ గా ప్రసిద్దులయిన తెలంగాణా  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. మంత్రి పదవి ఆయనకు కొత్తది కాదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఐ.టీ. శాఖలను ఆయన గత ఇరవై మాసాలుగా సమర్ధవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాలకపక్షం టీఆర్ఎస్  పార్టీని ఘనవిజయపధంలో నడిపించినందుకు కేటీఆర్ కు మునిసిపల్ మంత్రిత్వ శాఖ అదనంగా లభించింది. విజయోత్సవాల వేడి తగ్గకముందే అయన ఆలస్యం చేయకుండా పురపాలన శాఖను ఒక గాడిన పెట్టడానికి నడుం బిగించారు. ఈ విషయంలో ఆయన అనుభవమే ఆయనకు అక్కరకు వచ్చింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నగరం నలుమూలలు చుట్టబెట్టారు. బడుగు బలహీన వర్గాలు నివసించే  బస్తీల్లో అడుగు పెట్టారు. సంపన్న వర్గాలు కాపురాలు వుండే కాలనీల్లో కాలు మోపారు. ఓటర్లను ఆకర్షించడానికి ఉపన్యాసాలలో  చేసిన వాగ్దానాలు  విజయానికి బాటలు వేశాయి.  అదే సమయంలో పౌరుల కష్ట సుఖాలు దగ్గరనుంచి గమనించడానికి ఆయా  సందర్భాలు పనికివచ్చాయి. ఆ క్రమంలో ఆయన మెదడులో రూపుదిద్దుకున్నదే ఈ వంద రోజుల పధకం.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైయస్సార్, చంద్రబాబునాయుడు జరిపిన పాదయాత్రలు వారి హయాములో  కొత్త కొత్త పధకాల ఆవిష్కరణకు దోహదపడ్డ సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్రణాళికలు కాలయాపనతో కూడినవి అయినప్పుడు వాటి ఫలితాలు ప్రజలకు చేరడానికి ఏళ్ళూపూళ్ళూ పట్టే అవకాశం వుంది. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు కేటీఆర్ ‘వంద రోజుల్లో పూర్తిచేసే విధంగా  ‘సరికొత్త కార్యాచరణ’కు తెర తీశారు.
ఈ వివరాలను కేటీఆర్ విలేకరులకు స్వయంగా తెలియచేశారు. విషయాన్ని సంగ్రహంగా, సందేహాలకు తావు లేకుండా సమగ్రంగా వివరించగల నైపుణ్యం ఆయనకు తండ్రి  నుంచే అలవడి వుంటుంది. వంద రోజుల కార్యక్రమం కాకుండా ఇతరత్రా అడిగిన ప్రశ్నలను ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. ఈ అంశంపైనే ఏవయినా సందేహాలు వుంటే తీర్చడానికి సిద్ధం అని చెబుతూ, సలహాలు, సూచనలను సైతం ఆహ్వానించారు. నూరు రోజుల్లో కొన్ని పనులను పూర్తిచేయడానికి కార్యాచరణ రూపొందించుకున్నామని, నిర్దేశిత గడువు తీరగానే వీటిల్లో ఎన్ని చేసిందీ తానే విలేకరులకు వెల్లడిస్తానని అన్నారు. మూడు మాసాల వ్యవధే కనుక వేచి చూడడం కూడా అంత ఇబ్బంది అనిపించదు.
ఈ  త్రైమాసిక ప్రణాళికలో అనేక అంశాలు వున్నాయి. కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా దీని పరిధిని  చాలా విస్తృతంగా నిర్దేశించుకున్నారు. తెలంగాణాలోని ఇతర మునిసిపల్  కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు  కూడా  ఇది వర్తిస్తుంది.    
తెలంగాణా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో, నగరాల్లో అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్దీకరణ కోసం దాఖలయిన  ధరఖాస్తులను అన్నింటినీ పరిష్కరించడం కూడా ఈ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో వుంది. పాత వాటిని క్రమబద్దీకరించడంతో పాటు కొత్త కనెక్షన్లు కూడా జారీ చేస్తామని మంత్రి చెప్పారు. గుక్కెడు మంచి నీటికోసం అల్లాడుతున్న జనాలకు ఇది మంచి ఊరట కలిగించే కబురే. లేఔట్ల అనుమతులను దరఖాస్తు పెట్టుకున్న నెల రోజుల్లోగా ఆన్  లైన్ లో పరిష్కరించాలనేది మరో చక్కటి నిర్ణయం.
ప్రధానమంత్రి స్వచ్చ భారత్ స్పూర్తితో కాబోలు మొత్తం పదిహీను పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించి, ఆ సదుపాయంలేని ఇల్లంటూ లేకుండా చేయడం మరో ప్రధాన మైన అంశం. ఇరవై మూడు నగర పంచాయితీల్లో సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ ఈ డీ విద్యుత్ దీపాలను అమర్చడం, గ్రేటర్ హైదరాబాదు  పరిధిలో పౌర సదుపాయాలను మెరుగు పరిచే విషయంలో ప్రజలను భాగస్వాములుగా చేయడానికి వీలుగా వార్డు కమిటీలు, ఏరియా కమిటీల ఏర్పాటు, రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అయిదువందల పైచిలుకు బీటీ రోడ్ల నిర్మాణాన్ని వర్షాకాలం వచ్చేలోగా పూర్తి చేయడం, ప్రధాన నాలాల్లో పూడిక తొలగింపు, పది కోట్లతో పది శ్మశానవాటికల అభివృద్ధి, అవసరమైన చోట్ల బస్  షెల్టర్లు, వంద  పబ్లిక్ టాయిలెట్లు, ఇరవై ఆరు కోట్లతో నగరంలో నలభయ్ మోడల్ మార్కెట్లు....ఇలా వుంది ఆ జాబితా. మొన్నీమధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సంరంభంలో కేటీఆర్ స్వయంగా ఇచ్చిన హామీల్లో కొన్ని ఇవి కూడా వున్నాయి.  వాటిని నెరవేర్చడానికి చెప్పుకుంటున్న సంకల్పమే ఈ నూరు రోజుల పధకం.
ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి. ఉదాహరణకు నగరానికి వడ్డాణంలా రూపుదిద్దుకుంటున్న ఔటర్  రింగ్  రోడ్డు, కొన్ని చోట్ల అసంపూర్తిగా వుండిపోవడంతో ఆ రోడ్డు పూర్తిగా వినియోగంలోకి రాకుండా వుంది. ఘట్ కేసర్, కీసర, శామీర్ పేట్ నడుమ ఓ.ఆర్.ఆర్. పనులను పూర్తిచేసి ఆ రోడ్డును వినియోగంలోకి తేవడం కూడా పెట్టుకున్న లక్ష్యాల్లో వుంది. ఈ రోడ్డు వెంట సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం,ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన  కోహెడ గ్రామస్తులకు ప్లాట్ల కేటాయింపు, పదేళ్లనుంచి పెండింగులో వున్న ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ధరఖాస్తుల పరిష్కారం ఇవన్నీ వంద రోజుల్లో పూర్తి చేసి చూపిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
‘మీ వీధులను శుభ్రంగా వుంచండి’ అని నినాదం రాసి వున్న మునిసిపాలిటీ చెత్త లారీలు, అవి ప్రయాణించే దారిపొడుగునా చెత్త పారేస్తూ పోయే దృశ్యాలు ప్రజలకు అనుభవైకవేద్యం. మునిసిపాలిటీ అంటేనే ‘చెత్త’ అనే పర్యాయపదం ఏర్పడడానికి ఇదొక కారణం. ఈ  కోణం నుంచి కూడా ఆలోచించి, నగర పాలక సంస్థ పరిధిలోవున్న వెయ్యీ నూటపదహారు కిలోమీటర్ల నిడివి కలిగిన రహదారుల్లో ఇక చెత్తాచెదారం కనిపించకుండా శ్రద్ధ తీసుకుంటారు.
ఇవన్నీ సరే. వినడానికి వీనుల విందుగా వున్నాయి. పూర్తి  చేయాల్సిన కాలపరిమితి మూడంటే మూడే నెలలు కావడం మరింత సంతోషించాల్సిన సంగతి. బహుశా జూన్  రెండో తేదీ,  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి  పూర్తయ్యేలా ఈ వంద రోజుల పరిమితి నిర్దేశించుకున్నారేమో తెలవదు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన మంత్రి కేటీఆర్, ములుకోల ధరించి స్యందన సారధ్యం వహిస్తే ఈ లక్ష్య సాధన పెద్ద విషయం కాకపోవచ్చు. కావాల్సినదల్లా కాసింత చిత్తశుద్ధి. చెప్పిన తీరును గమనించిన వారికి ఆయనలో ఇది పుష్కలంగా ఉన్నట్టే కానవచ్చింది. కాకపొతే ఆయన అదిలింఛి, కదిలించాల్సిన పాలనా యంత్రాంగానికి  అంత మంచి పేరు వున్నట్టు లేదు. అలసత్వానికీ, అవినీతికీ మారుపేరయిన మునిసిపల్ శాఖలో కొంతలో కొంతయినా   మార్పు తీసుకు రాగలిగితే, మంత్రి గారి ప్రయత్నం సఫలం అయినట్టే.
విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ఒక విషయం చెప్పారు, పనికివచ్చే సూచనలు, సలహాలు ఇవ్వండని. పనికి వస్తుందో లేదో తెలియదు కానీ, ఈ మధ్య సాంఘిక మాధ్యమాల్లో స్మార్ట్ సిటీకి ఒక కొత్త నిర్వచనం కనిపించింది,  ఏ నగరంలో అయితే,  నడి రోడ్డు మీద ట్రాఫిక్ లో చిక్కుకున్న  అంబులెన్స్ కనబడదో,  ఆ నగరాన్ని స్మార్ట్ సిటీ అని పిలవాలని.  
ఉపశృతి: గ్రేటర్ ఎన్నికలకు ముందు నగరంలో బీటీ రోడ్ల నిర్మాణం ఆఘమేఘాల మీద జరిగింది. ప్రతి రోజూ  ఉదయం వేళల్లో అనేక ప్రాంతాల్లో వున్న టీవీ స్తూడియోలకు వెళ్లి వచ్చేటప్పుడు ఈ రోడ్ల నిర్మాణం కళ్ళారా చూసేవాడిని. మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదురుగా కావూరి హిల్స్ వైపు వెళ్ళే రోడ్డు చక్కగా వేసారు. అయితే మూల మలుపులో కొంత పని మిగిలిపోయింది. నన్ను తీసుకువెళ్ళే ఒక స్టూడియో కారు  డ్రైవర్, అది నాకుచూపించి, ‘చూస్తుండండి, ఎన్నికలు అయిపోయాయి. ఇక దీని మొహం చూసేవాళ్ళు వుండరు’ అన్నాడు  నమ్మకంగా. అతడన్నట్టే ఎన్నికలు అయిపోయాయి. కొత్త మేయరుతో సహా,  గ్రేటర్ పాలకమండలి కొలువు తీరింది. ఆ మరునాడే మరో స్టూడియోకి వెడుతూ చూసాను. మిగిలిన ఆ రోడ్డు  పనిని పూర్తి చేసే పని కూడా మొదలయింది. ఆ  డ్రైవర్ నమ్మకం వమ్మయింది. అయితే మంత్రి గారి మీద బాధ్యత కూడా పెరిగింది. చెప్పింది చెప్పినట్టు చెప్పిన వ్యవధిలో పూర్తి చేయని పక్షంలో ఆ డ్రైవర్ మాటే నిజమవుతుంది. (19-02-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       

కామెంట్‌లు లేవు: