24, ఫిబ్రవరి 2016, బుధవారం

రంగు వెలుస్తున్న రాజకీయం


సూటిగా........సుతిమెత్తగా........

రాజకీయులు పార్టీలు మారుతున్నట్టుగా,  జబ్బు పడి కోలుకుంటున్న మనిషి మంచం మీద అటూ ఇటూ మెసులుతుంటాడని చార్లెస్ లాంబ్ అనే రచయిత అంటాడు ‘ఆన్ కన్వల్సెన్స్’ అనే వ్యాసంలో. ఇలాటి మాటే ఇంకో విధంగా చెప్పాడు గిరీశం ‘ అప్పుడప్పుడు ఒపీనియన్స్  చేంజ్ చేస్తుంటేనే కాని పొలిటీషియన్ కానేరడు’ అని.  దాన్నే కాస్త మార్చి ‘సైడ్స్ మారుస్తుంటేనే కాని రాజకీయనాయకుడు కానేరడు’ అని కొత్త భాష్యం చెబుతున్నారు. తాము పార్టీలు మారేది తమకోసం కాదని, తమని నమ్ముకున్న ప్రజల శ్రేయస్సు కోసమని నమ్మబలుకుతుంటారు. తిరుపతి దేవుడి దర్శనం రాజభోగంగా  చేసుకువచ్చిన అనంతరం ప్రముఖులు కూడా ఇదేవిధంగా చెబుతుంటారు, సమాజ శ్రేయస్సుకోసం ఆ దేవదేవుడ్ని ప్రార్ధించి వచ్చామని.     ఆమాటలు జనం నమ్ముతున్నారా లేదా అనేదానితో వారికి నిమిత్తం వుండదు. ఆ సోయి   వున్నవాళ్ళు  అలా  నిస్సిగ్గుగా ఆమాటలు చెప్పలేరు కూడా.
తెలుగునాట ఇలాటి  రాజకీయమే  రసవత్తరంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. ప్రతిపక్షం నుంచి పాలక  పక్షంలోకి ఫిరాయింపుల పర్వం కామాలే కాని ఫుల్   స్టాపుల్లేకుండా కొనసాగుతోంది. పైపెచ్చు  సస్పెన్స్  థ్రిల్లర్ సినిమాను మించి పోయేలా గంటగంటకు ఉత్కంఠ ఒకటి అదనం. ఇటు తెలంగాణలో ఈ రాజకీయ వలసలు దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయేమో అనిపించే తరుణంలో అటు  ఆంధ్రప్రదేశ్ లోకి  కూడా ఈ వలసల  సెగ పాకింది. వై.ఎస్.ఆర్.సీ.పీ.కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, గత సోమవారం నాడు,  మాఘ పౌర్ణమి శుభ ముహూర్తం చూసుకుని పాలక పక్షం టీడీపీ లోకి చేరిపోయి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలోనే పసుపు రంగు కండువాలు కప్పు కున్నారు. అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వెళ్లి పార్టీ మారిపోయిన సందర్భం కూడా ఈ సన్నివేశంలో వుంది. కలం కూలీగా తనను తాను చెప్పుకున్న ప్రసిద్ధ పాత్రికేయులు జీ. కృష్ణ గారన్నట్టు ఇదంతా ‘భలే’గా రక్తి కట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ గత కొద్ది రోజులుగా గిరికీలు కొడుతున్న ఊహాగానాలకు, చర్చోపచర్చలకు ఇది తెరదించింది. ‘అప్పుడేనా, ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఇలాంటి సీన్లు చాలా చూడాల్సి వుంటుంది’ అంటున్నారు టీడీపీ  ద్వితీయ శ్రేణి నాయకులు.  ‘టీడీపీ  ప్రభుత్వంలోకి వచ్చి రెండో ఏడాదేగా. మరో ఏడు గడవనివ్వండి, వలసలు అటు నుంచి ఇటు మొదలు కాకపొతే చూడండి’ అంటూ ప్రతి సవాలు విసురుతున్నారు వారి రాజకీయ ప్రత్యర్ధులు. ఈ సందర్భంగా ఉభయపక్షాలనుంచి షరా మామూలు వ్యాఖ్యానాలే వెలువడ్డాయి. అవి వింటున్నవాళ్ళకు ఈ  మధ్యనే  వాటిని విన్న ఫీలింగు కలిగిన మాట వాస్తవం. చూసిన సినిమానే మళ్ళీ చూసినప్పుడు సంభాషణలు, సన్నివేశాలు నెమరుకు రావడం అతి సహజం. ‘ప్రభుత్వ పధకాల పట్ల ఆకర్షితులం అయ్యాం.  నియోజక వర్గ అభివృద్ధి ముఖ్యమనుకున్నాం’ సరిగ్గా ఇలాటివే కొన్ని పడికట్టు పదాలతో కూడిన స్పందనలే అటూ ఇటూ వినవచ్చాయి. పైగా పార్టీలు మారడం వారిలో చాలామందికి కొత్తేమీ కాదు. మొదటి చెంబు చల్లటి నీళ్ళు వొంటి మీద పడేవరకే చలి. ఆ తరువాత అలవాటయిపోతుంది. ‘ఏకం తప్పితే అనేకం’ అనే నానుడి విన్నదే కదా!


పార్టీ ఫిరాయింపులకు ఎవరి కారణాలు వాళ్ళు చెబుతున్నా  ప్రధాన కారణం మాత్రం రాజకీయ అనివార్యత. పైకి ఎన్ని సుద్దులు వల్లె వేసినా, ఎవరికయినా, ఎంతటి సమర్ధ నాయకుడికయినా ముందు సొంత పార్టీ  మనుగడ ముఖ్యం. ఆ తరువాతే ఆదర్శాలు. గతంలోని రాజకీయ నిబద్ధతలను ఏకరవు పెట్టుకుంటూ, గిరి గీసుకుని వ్యవహారాలు నడిపితే వర్తమానం నష్ట పోతామనేది  నేటి రాజనీతి.   ఈతరం  రాజకీయ పార్టీ అధినేతల్లో సిద్ధాంత నిబద్ధత కంటే పార్టీ  పటిష్టత ప్రధానం.  అలాగే ఏపార్టీకి చెందినా సరే, ఈనాటి  రాజకీయ నాయకుల్లో సొంత పార్టీ లాభానష్టాలకంటే స్వప్రయోజనాలు ముఖ్యం. ఉభయులకు  తమకు  కావాల్సింది  ఏమిటో బాగా తెలుసు. ఇచ్చిపుచ్చుకోవడం ఒక్కటే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం. అది తేలిపోతే అన్ని చిక్కుముళ్ళు దూదిపింజల్లా  తేలిపోతాయి.    ఈ ఎరుక కలిగిన వారు కనుకనే ఈ పార్టీ, ఆ పార్టీ  అనిలేకుండా అందరూ,  సంఖ్యాబల సూత్రాన్నే నమ్ముకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం, ఎదుటి పక్షాన్ని బలహీన పరచడం చాణక్య నీతిలో భాగం. కానీ  ప్రస్తుతం మనకున్న నాయకుల ఆలోచనలు మరో అడుగు  ముందుంటున్నాయి  తాము బలపడడంతో  పాటు ప్రతిపక్షాన్ని  నిర్వీర్యం చేయడం. వీలయితే ఉనికిలో లేకుండా చేయడం ఇప్పుడు పురుడు పోసుకుంటున్న  సరికొత్త రాజనీతి.  ఈ విషయంలో,  రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాల ధోరణి ఒకే రకంగా వుంది. అదేమిటంటే, ఫిరాయింపులను తాము ప్రోత్సహించడం లేదు, వారే ఆకర్షితులై స్వచ్చందంగా వస్తున్నారని. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఒక పార్టీ మీద గెలిచి వచ్చిన అభ్యర్ధులకు ఆ పార్టీ భవిష్యత్తు పట్ల సందేహాలు కలిగితే వెనుకటి రోజుల్లోలాగా మడి కట్టుకుని, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా  ఆ పార్టీకే కట్టుబడి వుండే పరిస్తితిలేదు. ‘ఏదో అధికారంలోకి వస్తుందని అందరిలాగే మేమూ నమ్మాము. కానీ  రాలేదు. మరి ఇలాగే వుంటే పార్టీ కేడర్ మా వెంట  వుంటుందన్న నమ్మకం లేదు. అంచేత మా దారి మేము చూసుకుంటున్నాం’ అనేది వారి మాటగా అనిపిస్తోంది. ఇందులో అనైతికం ఏమీ లేదని అంటున్నారు. పైగా ‘అనైతికంలో నైతికం’ అంటూ పార్టీ మారిన ఓ పెద్దమనిషి కొత్త భాష్యం చెబుతున్నారు.
పార్టీ పెట్టిన కొత్తల్లో వై.స్.ఆర్.సీ.పీ.  అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక మాట చెబుతుండేవారు. ఆయన్ని ఎన్ని కేసులు చుట్టుముడుతున్నా బయట పార్టీల నుంచి ఆ పార్టీలోకి వలసల వేగం పెరుగుతున్నరోజులవి. ‘’ నేను తలుపులు తెరిస్తే  బయట పార్టీల్లో ఒక్కళ్ళు మిగలరు. కానీ, మా నాన్న  తెచ్చిన ప్రభుత్వాన్ని  కూల్చడం నాకు ఇష్టం లేదు’ అని.
అప్పుడేమో  కాని  ఇప్పుడదేమాదిరి ప్రకటన ఈ పరిణామాలు అన్నింటికీ  కారణం అయిందని తెలుగుదేశం నాయకులు టీవీ చర్చల్లో బల్లగుద్ది వాదిస్తున్నారు. పాలక పక్షంలోకి రావాలని వై. ఎస్.ఆర్.సీ.పీ. శాసన సభ్యులు ఎంతో కాలంగా తమను సంప్రదిస్తున్నా మరో పక్క తెలంగాణలో తమ పార్టీవాళ్లు పాలక పక్షంలోకి చేరిపోతున్న సందర్భాలు తమను ఉడ్డుగుడుచుకునేలా చేసి, ఒక  నిర్ణయం తీసుకోకుండా అడ్డు పడ్డాయని అంటూ, ఆ సమయంలోనే  జగన్ మోహన రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యతో  తమకు ఇబ్బంది తీరిపోయిందని చెబుతున్నారు. ‘ఇరవై ఒక్కమంది టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్  లో ఉన్నారనీ, తలచుకుంటే ప్రభుత్వాన్ని గంటలో పడగొట్టడం పెద్ద విశేషం ఏమీ కాదని ఆయన చేసిన ప్రకటనతో తాము తెరిపిన పడ్డామని, , తామే ఈ  విషయంలో  తొలి అడుగు వేసి అయిదు ప్రత్యర్ధి  వికెట్లు పడగొట్టామని అంటున్నారు.  తెలంగాణాలో పరిణామాల కారణంగా మింగలేని కక్కలేని పరిస్తితి  నుంచి తమను ఆయనే బయట పడవేసాడని వారు టీకా తాత్పర్యం చెబుతున్నారు. వైసీపీకి అనైతికం కాని ఫిరాయింపులు  తమకెలా అనైతికం అవుతాయన్నది వారి వాదన. ‘పుట్టలో వేలు పెడితే కుట్టమా’ అనే కధ గుర్తు చేస్తున్నారు.  
ఈ మొత్తం ఉదంతంలో కొత్త కోణం ఏమిటంటే, పార్టీ మారడం అనేది ఇప్పుడొక మీడియా ఆకర్షణగా మారిపోయింది. పలానా నాయకుడు పార్టీ  మారుతున్నారు అనే స్క్రోలింగులు రావడం తరువాయి మీడియా కెమెరాలు అడగకుండానే వారివద్ద వాలిపోతున్నాయి. దీంతో  పార్టీ మార్పిళ్ళకు మీడియా ఆమోదం కూడా లభించిందన్న అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. రాజకీయ పార్టీలు కూడా మొక్కుబడి ఖండనముండనలే తప్ప గట్టిగా కిమ్మనడం లేదు. ప్రభుత్వాలు, ఎలెక్షన్ కమిషన్  ఈ విషయాల్లో మౌన ప్రేక్షకులు. ప్రజలు కూడా వీటిని ఆమోదిస్తున్నట్టు తెలంగాణాలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి. సమస్యతో సంబంధం వున్న రాజకీయ పార్టీలు, మీడియా, ఎన్నికలసంఘం చివరాఖరుకు ప్రజలు, ఇందరి మద్దతు వుంది అన్న అభిప్రాయం ప్రబలిన పిదప ఇక ఈ ‘రాకపోకల’కు అడ్డేముంది? అడ్డుకునేదెవరు?
గతంలో పరిస్తితి ఇలా వుండేది కాదన్నది వాస్తవం.
1978 లో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ఐ బ్రహ్మాండమయిన విజయం నమోదు చేసుకుని మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిత్వంలో కొత్త ప్రభుత్వం  ఏర్పాటయినప్పుడు కూడా ఈ వలసల పర్వం సాగింది. దాదాపు డెబ్బయిమంది రెడ్డి (సంస్థ) కాంగ్రెస్ సభ్యులు పార్టీ మారి ప్రభుత్వ పక్షంలో చేరారు. కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడిగా సర్కారుపై నిప్పులు చెరిగిన రోశయ్యగారు గారు సయితం మంత్రిమండలిలో చేరిపోవడంతో ఆ అంకం అప్పటికి అలా ముగిసింది. అప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా లేదు. కాబట్టి అదొక కారణంగా చెప్పుకోవచ్చు.
ఎనభయ్ నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నాటికి కాస్తాకూస్తో రాజకీయ పరిజ్ఞానం వున్నవారు ఇప్పుడు రాజకీయాలనుంచి మనసు మళ్ళించుకుని కృష్ణా రామ అంటూ కాలక్షేపం చేస్తూ వుంటారు. ఈనాడు సాంఘిక మాధ్యమాల్లో చెలరేగి వ్యాఖ్యలు గుప్పిస్తున్న వారికి ఆనాటి విషయాలు అంతగా తెలిసే వీలులేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెళ్ళగించి, తెలుగుదేశం అధినేత స్వర్గీయ  ఎన్టీ రామారావు గారు ఏకచ్ఛత్రాధిత్యంగా ప్రభుత్వం నడుపుతున్న రోజులవి. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు సేనాధిపతి  సింహాసనం స్వాధీనం చేసుకున్న చందంగా అమెరికాకు గుండె ఆపరేషన్ కోసం వెళ్ళిన రామారావు గారు తిరిగొచ్చేలోగా, అప్పటి మంత్రివర్గంలో నెంబర్ టు అనిపించుకుంటున్న నాదెండ్ల భాస్కర రావు, నెంబరు వన్  స్థానం పై కన్నేసి నెంబరు గేమ్ మొదలుపెట్టారు. ఆనాడు  గవర్నర్ గా వున్న  రాం లాల్ సాయంతో ఎన్టీఆర్ ని పదవి నుంచి తొలగించి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. నాడు కేంద్రంలో అధికారంలో వున్నది రామారావు గారు తీవ్రంగా  వ్యతిరేకించే ఇందిరాగాంధి. అంచేత రామారావుకు తిరిగి పదవి దక్కడం అసాధ్యం అని అంతా అనుకున్నారు. అక్కడే కధ అడ్డం తిరిగింది. దీనికి ప్రధాన కారణం ఆ నాటి పత్రికలు, నాడు తెలుగు దేశం పార్టీని ఒంటిచేత్తో  గెలిపించుకున్న ప్రజలు. రామారావుపై తిరుగుబాటుచేసిన ఎమ్మెల్యేలకు  వారి సొంత నియోజక వర్గాల్లోనే వ్యతిరేకత వెల్లువలా తన్నుకువచ్చింది.  ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీకి మద్దతుగా ప్రతిపక్షాలు ఏకం అయ్యాయి. నిప్పూ ఉప్పూ వంటి బీజేపీ, వామపక్షాలు కూడా సంఘీభావం తెలిపాయి. ఒకే కారుకి పక్కపక్కనే కమలం. సైకిల్, కంకీ కొడవలి, సుత్తీ కొడవలి చిహ్నాలు వున్న పార్టీల జెండాలు రెపరెపలాడాయి. జనం, మీడియా, రాజకీయం వెరసి అన్నీకలిసి బ్రహ్మాండమయిన ప్రజాఉద్యమంగా మారింది. దానితో ఇందిరాగాంధి మెట్టు దిగి, గవర్నర్ రాం లాల్ ని తొలగించి ఆయన స్థానంలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మను నియమించారు. సరిగ్గా నెల తిరగగానే రామారావు చేత మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇందిరాగాంధీని నరనరాన ద్వేషించే వారు సయితం ఆమె తప్పుదిద్దుకున్న తీరును మెచ్చుకున్న మాట నిజం. అప్పట్లో కూడా ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు. ప్రజలే పూనుకుని చట్టం చేయాల్సిన పనిని  పూర్తి చేసారు. తమ చేతిలో వున్న ‘పవర్’ ఏమిటో ప్రపంచానికి ఎరుకపరిచారు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కర్తాకర్మా క్రియా అన్నీ తానై నిలిచారు. నేటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు నాటి ఉద్యమానికి అన్నుదన్నుగా నిలబడ్డారు. తెలుగునాట ప్రజాదరణ కలిగిన పత్రికలన్నీ ఉద్యమానికి ఊపిరి పోశాయి. ఆ విధంగా ప్రజలు, పత్రికలు, రాజకీయ పార్టీలు కలిసి పార్టీ మార్పిళ్ళను సమర్ధవంతంగా అడ్డుకోగలిగారు. అప్పటికి కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు.
ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది. కాలానుగుణంగా దానికి  కొన్ని సవరణలు చేస్తూ,  మరింత పటిష్టం చేస్తూ వచ్చారు. అయినా ఫిరాయింపులు ఆగడం లేదు. మరి లోపం ఎక్కడ వున్నట్టు.
ఇటు తెలంగాణలో ఉద్యమస్పూర్తితో అహరహం తపించే  ముఖ్యమంత్రి కేసీఆర్. అటు ఆంధ్రాలో అభివృద్ధి నినాదంతో అనుక్షణం నినదించే ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇద్దరికీ తమ రాష్ట్రాల్లో  హాయిగా, సజావుగా పరిపాలన చేసుకోగల మెజారిటీ ఇచ్చి పంపారు ప్రజలు. అయినా ఫిరాయింపుల పర్వంలో తమ జోక్యం, ప్రమేయం లేదని చెప్పుకోగల పరిస్తితి లేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు గురించిన ముచ్చట కనుక బాబుగారు ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో అనేకులు అధికారాన్ని చూసి   వస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలా చేరికలతో పెరిగే సంఖ్యాబలం పార్టీ బలోపేతానికి ఉపయోగపడితే సరే. మోయలేని భారంగా మారితే.....అప్పుడేమిటి పరిస్తితి.  రాయల సీమలో ఫాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యర్ధులను ఒక గూటికిందకు చేరుస్తున్నామని ఒక తెలుగు దేశం నేత పేర్కొన్నారు.  ఒక వరలో రెండు కత్తులు ఇమడవని అంటారు. ఇమడ్చగలిగితే, ఫాక్షన్ రాజకీయాలకు మంగళం పాడగలిగితే అంతకు మించి  కోరుకునేది వేరే ఏముండదు. కానీ అది జరిగే పనా!
ప్రజలిచ్చిన పాలనా వ్యవధిలో రెండేళ్ళు చూస్తుండగానే కరిగిపోయాయి. తాత్కాలికంగా పెంచుకున్న  సంఖ్యాబలంతో నల్లేరు మీది బండి నడకలా హాయిగా  రాజ్యం చేయగలిగింది మరో మూడేళ్ళు. పెట్టుకున్న లక్ష్యాల సాధనకు ఈ సమయం బొటాబొటిగా కూడా సరిపోకపోవచ్చు. మళ్ళీ అప్పుడు ప్రజల దగ్గరికే పోవాలి. కొత్తగా అరువు తెచ్చుకున్న ఈ ప్రజాప్రతినిధులు అప్పటికి యెంత బరువుగా మారతారో తెలియదు. ఇప్పుడు పనికి వచ్చిన అవకాశవాద అస్త్రాన్నే అప్పుడు మళ్ళీ ప్రయోగించరన్న గ్యారంటీ ఏమీ లేదు. ముందే చెప్పినట్టు వారికి ‘చలి’ భయం లేదు. ఏకం ఎప్పుడో తప్పారు. 
నిజమే! ముందే చెప్పినట్టు రాజకీయ అనివార్యతల కారణంగానే ఇటువంటి అవాంఛనీయ చర్యలకు పూనుకోవాల్సిన పరిస్తితి ఉన్నమాట కూడా కాదనలేము. నీతి వాక్యాలు నేటి రాజకీయాల్లో పొసగని విషయాలు అని భావించే రోజులివి. అయినా కానీ,  పార్టీల బలోపేతానికి ఫిరాయింపులు మినహా  వేరు పరిష్కారం ఏమీ లేదా!
ఉపశృతి: ఈ వ్యాసం రాస్తున్నప్పుడు దీనికి సమాధానం దొరికింది. మా ఇంట్లో పనిచేసే వాచ్ మన్ కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చింది. వాళ్ళ ఓట్లు మాత్రం స్వగ్రామంలోనే వున్నాయి. మా పనిమనిషి కళావతి మోహంలో చెప్పలేని ఆనందం.
‘బాబుగారు దేవుడండీ. ఇవ్వాళే మా సర్పంచు గారు ఫోను చేసి చెప్పారు. మాకు పక్కా ఇళ్ళు  శాంక్షన్  చేసారట’ అని మా ఆవిడతో  చెబుతోంది. పార్టీ మారి పదవి పుచ్చుకోబోతున్న రాజకీయ నాయకుడి  మోహంలో కూడా ఇంతటి సంతోషం కానరాలేదు.
నిజానికి నిజమైన రాజకీయ పార్టీలకి నిజమైన బలం కళావతి వంటి సామాన్య ఓటర్లే. అటువంటి వారి అభిమానం ఉన్నంతకాలం జంప్ జిలానీలతో పనియేల?  (24-02-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   

కామెంట్‌లు లేవు: