2, అక్టోబర్ 2021, శనివారం

ఎయిర్ ఇండియా మహారాజా

ఈ మహారాజా నేనూ ఒక ఈడు వాళ్ళమే. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ ఏడాది ముందే అంటే 1946లో మేమిద్దరం పుట్టామన్న మాట.
పుట్టుక దగ్గర నుంచీ ఈ మహారాజా గారెకి దేశ విదేశాల్లో అసంఖ్యాక అభిమానులు ఏర్పడ్డారు. ఈ లోగో పుణ్యమా అని ఎయిర్ ఇండియాకు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
ఆకారానికి మించిన పెద్ద పెద్ద మీసాలు, రంగు రంగుల కుచ్చు తలపాగా, పంచమీద కోటూ, రాజులు ధరించే పాదరక్షలు ఇవన్నీ జనాలను బాగా ఆకర్షించాయి.
ఏ దేశానికి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించినా ఈ మహారాజా కూడా అందుకు తగ్గట్టే తన వేషాన్ని సవరించుకుని, దశావతారాలు ఎత్తుతాడు. నవ తరాన్ని ఆకర్షించడానికి అవసరమైతే పంచె కట్టు పక్కనబెట్టి, జీన్స్ ప్యాంటు వేసుకుంటాడు. ఎయిర్ ఇండియా మహారాజా మస్కాట్ తమ డ్రాయింగు రూములో వుండాలని ఎగబడి వీటిని కొనుక్కున్న వారి సంఖ్య లక్షల్లో వుంటుంది.
ఇంత ప్రాచుర్యం తెచ్చుకున్న ఈ మహారాజాకు కూడా విమర్శల దాడి తప్పలేదు.
సోషలిజం అని ఓ పక్క కబుర్లు చెబుతూ ప్రభుత్వ విమాన సంస్థకు ఈ మహారాజా లోగో ఏమిటనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చివరికి ఎయిర్ ఇండియా 1989లో తన లోగో మార్చుకోవాల్సివచ్చింది. ఎగురుతున్న హంస, కోణార్క్ చక్రతో కూడిన కొత్త లోగోను ప్రవేశపెట్టింది. దానితో యాభయ్ ఆరేళ్లు ఓ వెలుగు వెలిగి దేశ విదేశాల్లో తన ప్రభావం చాటిన ఎయిర్ ఇండియా మహారాజా ఇప్పుడు ఓజ్ఞాపకంగా మిగిలాడు.
కానీ అదేమిటో విచిత్రం.
ఎయిర్ ఇండియాలో పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుని, ఆ బిడ్డును టాటా సంస్థ సొంతం చేసుకుందని వస్తున్న వార్తల నేపధ్యంలో ఈ మహారాజానే మళ్ళీ వార్తల్లో ప్రముఖంగా కనబడ్డాడు. అంటే ఎయిర్ ఇండియా అంటే మహారాజా. ఆ మీసాల మహారాజా అంటే ఎయిర్ ఇండియా అని జనం డిసైడ్ అయిపోయారన్న మాట.


NOTE: Courtesy Image Owner


(02-10-2021)

1, అక్టోబర్ 2021, శుక్రవారం

టాటా! బై బై ! అంటున్న మహారాజా !

 

(టాటాల  చేతికి ఎయిర్ ఇండియా!)



Note: Courtesy Image Owner

ఎవరీ గాంధి? – భండారు శ్రీనివాసరావు

 

(అక్టోబర్ రెండు మహాత్ముని జయంతి)
1969
మహాత్మాగాంధీ శతజయంతి సంవత్సరం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జర్మని నుంచి ఒక ప్రొఫెసర్ భారత దేశానికి వచ్చారు. ఆయన ఆ దేశంలోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయం హైడల్ బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పేరు డాక్టర్ మర్ల శర్మ. వారిది కాకినాడ. పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. గాంధి గారు పుట్టి వందేళ్ళు గడుస్తున్న సందర్భంలో భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు గాంధీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఒక పరిశోధనా పత్రం తయారు చేసే పని పెట్టుకుని వచ్చారు. ఆరోజుల్లో నేను విజయవాడ ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను. ఆయన చేస్తున్న పరిశోధనలో చేదోడువాదోడుగా వుండే అవకాశం నాకు లభించింది. అందులో భాగంగా నేను శర్మ గారితో కలిసి (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాలు తిరిగాను.
‘మహాత్మాగాంధి ఎవరు?’ అనేది శర్మ గారు తయారు చేసుకొచ్చిన ప్రశ్నావళిలో మొట్టమొదటిది. వూరి పేరు గుర్తు లేదు కానీ పట్టుమని పాతిక గడప కూడా లేని ఓ మారుమూల గ్రామంలో ఒక నడికారు మనిషిని ఇదే ప్రశ్న అడిగితే, ఆమె జవాబుగా తన కుమారుడిని చూపించింది. అతడి పేరు గాంధి. మహాత్మాగాంధీ హత్యకు గురైన తర్వాత పుట్టిన తొలిచూలు బిడ్డడు అతడు. మహాత్ముడి మీది గౌరవంతో కొడుక్కి గాంధి అని పేరు పెట్టుకుంది. స్వాతంత్ర ప్రదాత అనే కృతజ్ఞతతో ఆ రోజుల్లో వేలాదిమంది తమ సంతానానికి గాంధీ పేరు పెట్టుకున్నారు. వారిలో ఎంతమంది తమ నడవడికతో ఆ పేరుకు న్యాయం చేకూర్చారో తెలుసుకోవాలంటే మరో విదేశీ యూనివర్సిటీ పూనుకోవాలి.
అది అప్పటి మాట.
దశాబ్దాలు గడిచిన తర్వాత మా పక్కింటి పిల్లవాడు తల్లిని అడుగుతుంటే విన్నాను, ‘మమ్మీ! గాంధి అంటే ఎవరు? ఈరోజు నేను స్కూల్లో మాట్లాడాలి. నా ఫ్రెండ్ గోపి ఏమో, రాహుల్ గాంధి గ్రాండ్ పా అంటున్నాడు, కరక్టేనా!’
ఈ పిల్లవాడి ప్రశ్న కంటే ఆ తల్లి ఇచ్చిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘నన్ను విసిగించకురా! వెళ్లి గూగుల్ లో వెతుక్కో’
ఈ నేపధ్యంలో మహాత్మా గాంధి ఆయన బోధనలు, ప్రబోధాలు నేటి తరానికి ఏ మేరకు శిరోధార్యాలు అనే పెద్ద ప్రశ్న నా ముందు నిలిచింది.
మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ఎన్నో చెప్పారు. ఎన్నో రాశారు. ఈ విషయంలో ఆయనది ఒక రికార్డు అనే చెప్పాలి. తన దృష్టికి వచ్చిన ప్రతి ఉత్తరానికీ, సామాన్యులు, అసామాన్యులు అనే బేధం లేకుండా స్వదస్తూరీతో ఓ కార్డు ముక్కపై జవాబు రాయడం ఆయనకు ఓ అలవాటు. ఆయన సూక్తులూ, బోధనలు వర్తమానానికికూడా వర్తిస్తాయంటూ గాంధి జయంతి, వర్ధంతి రోజుల్లో నాయకులు చేసే షరామామూలు ప్రసంగాలతో జాతి జనుల చెవులు చిల్లులు పడివుంటాయి. ఆచరణకు వచ్చేసరికి హళ్లికి హళ్లి. సున్నకు సున్నా.
భారతీయ సమాజంలో వైరుధ్యాలు, అసమానతలు నానాటికి పెరిగిపోతున్నాయి. పెరగడమే కాదు, మరింత తీవ్రస్వరూపం ధరిస్తున్నాయి. సంపదలు పెరుగుతున్నా దేశంలో కోట్లాది సామాన్య ప్రజలకు వాటి పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలు నిరుపేదలు అవుతున్నారు. సంపన్నులు కోట్లకు పడగెత్తుతున్నారు. సామాన్యుల జీవన ప్రమాణాలు పాతాళంలోకి దిగజారుతుంటే, కలవారి జీవన ప్రమాణాలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. దేశంలో సంపదలు పెరిగాయి. సంపదలతో పాటు వైరుధ్యాలు, అసమానతలు పెరిగాయి. పెరిగిన సంపదలలో 73 శాతం భారత జనాభాలో కేవలం ఒక శాతం వున్న శ్రీమంతుల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు గాంధి పుట్టిన దేశమా ఇది? అనే అనుమానం కలక్కమానదు. బహుశా ఆయన మళ్ళీ పుట్టి ఈ దేశాన్ని చూస్తుంటే ఆయనకు కూడా తప్పకుండా ఇలాంటి సందేహమే పొటమరించి వుండేదేమో! ఎందుకంటే ఆయన స్వతంత్ర భారతం గ్రామీణ భారత పునాదులపై నిర్మించబడాలి అని బలంగా కోరుకున్నారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని నమ్మిన నాయకుడాయన.
అలా అని దేశం పరిస్తితి మరీ ఘోరంగా వుందని అర్ధం కాదు. ఎన్నో అవలక్షణాల నడుమ కూడా పురోగతి చుక్కల్ని తాకుతున్నమాట సైతం అవాస్తవం కాదు. కాకపోతే ఆనాడు మహాత్మా గాంధి కన్న కలల ప్రకారం సాగుతోందా అంటే అనుమానమే.
మహాత్ముడి బోధనలలో సర్వకాలాలకు వర్తించేవి వున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సినవీ వున్నాయి. మహాత్ముడు రాట్నం వడికి తీసిన నూలు దుస్తులు ధరించమని ప్రజలకు చెప్పారు. ఆనాడు ఆయన ఉద్దేశ్యం ఖద్దరును ప్రోత్సహిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం వుండదు అన్నది కావచ్చు. మరి నేటి తరం ‘రాటం మాకిప్పుడు కాదు వాటం’ అంటోంది. విదేశీ వస్తు బహిష్కరణకు గాంధి నాడు పిలుపు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్వెత్తున స్పందించి తమ దుస్తులు మూటలు కట్టి తీసుకొచ్చి నడి వీధుల్లో రాశులుగా పోసి తగలబెట్టారు. మహాత్ముడి మాటకు జనాలు ఎలాంటి విలువ ఇచ్చారో తెలుసుకోవడానికి ఇలాంటి దృష్టాంతాలు కోకొల్లలు.
‘గమ్యం (లక్ష్యం) ఎంత గొప్పదిగా పరిశుద్ధంగా వుండాలని కోరుకుంటామో, ఆ లక్ష్య సాధనకు మనం అనుసరించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా వుండాలి’ అని మహాత్ముడు చెప్పిన సూక్తిని ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా ప్రపంచం పరిగణించిన నల్ల జాతి నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ తరచూ పేర్కొంటూ వుండేవారు. మహాత్ముడు ప్రబోధించిన అహింసావాదాన్ని ఆయన మనసా వాచా కర్మణా నమ్మి ఆయన తన ఉద్యమాన్ని నడిపారు. ఏ దేశంలో అయితే వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటాన్ని మహాత్ముడు ప్రారంభించారో ఆ దేశమే తదనంతర కాలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి నివాళులు అర్పించిందంటే ఆయన బోధనల లోని ప్రభావం అంత గొప్పదని అవగతమవుతుంది.
నిజానికి మహాత్ముడి బోధనల అవసరం ఆనాటి రోజులకంటే ఈనాడే ఎక్కువగా వుంది. కానీ వాటిని విదేశాల్లో వారు పాటిస్తూ, గౌరవిస్తుంటే, మనం మాత్రం జయంతులు, వర్ధంతుల సందర్భాల్లో ఇచ్చే సందేశాలకు పరిమితం చేసి సంతోషపడుతున్నాం. మోహన్ దాస్ కరం చంద్ గాంధి అనే మహానీయుడు నడయాడిన నేలమీదనే మనమూ నడుస్తున్నాం అనే స్పృహను కోల్పోతున్నాం. పైగా ఆయనకు మహాత్ముడు అనే బిరుదు ఎవరిచ్చారు అనే అర్ధ రహితమైన చర్చలతో కాలక్షేపం చేస్తున్నాం.
‘ఇది తగునా!’ అనే ప్రస్తావన మనకు రాదు. ఎందుకంటే మహాత్మా గాంధి అంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే గూగుల్ వెతుక్కోవాల్సిన దుస్తితిలో వున్నాం. ఇక ముందు కూడా వుంటాం. కారణం గాంధీతో కానీ, ఆయన సూక్తులతో కానీ నేటి యువతరానికి అవసరం లేదు. పాత తరం పట్టించుకునే పరిస్తితిలో లేదు.
అక్టోబర్ రెండున మరో మహానుభావుడు కూడా జన్మించారు. కానీ ఆయన Unsung Hero.
ఆయనే....
లాల్ బహదూర్ శాస్త్రి గారు.
కింది ఫోటో:



(1980 లో మాస్కోలోని గాంధి విగ్రహం దగ్గర మా పెద్దపిల్లవాడు సందీప్, అతడి స్నేహితులు)

30, సెప్టెంబర్ 2021, గురువారం

రేడియో రాంబాబు – భండారు శ్రీనివాసరావు

 నవ్వు ముందు కనబడుతుంది. తర్వాత ఆయన కనబడతాడు.


ఆయనే పేరే రాంబాబు. సీతా రాంబాబు. చెన్నూరి సీతారాంబాబు. ఆఫీసు రికార్డ్స్ లో వేరే పొడుగు పేరు ఏమైనా ఉందేమో తెలవదు. వున్నా ఆయన అందరికీ రాంబాబే. నాకయితే నవ్వుల రేడు.

నవ్వుకు రిటైర్ మెంట్ ఉంటుందా! వుండదు. వుండకూడదు.

అంచేత ఈరోజు రేడియోలో రాంబాబు గారికి ఇస్తున్న వీడ్కోలు ఓ లాంఛనం మాత్రమే. ఆయన చిరుదరహాసం మాత్రం పర్మనెంట్.

రాంబాబు గారి మందహాస వదనం చూడడానికి ఈరోజు పుట్టిల్లు రేడియోకి వెళ్ళాలనే వుంది. ఎలా కుదురుతుందో ఏమో!

రాంబాబు గారికి ముందస్తు  శుభాకాంక్షలు.

భండారు శ్రీనివాసరావు

(30-09-2021)

29, సెప్టెంబర్ 2021, బుధవారం

నోటికి తాళం


పెదవి దాటిన మాట పృధివి దాటుతుందంటారు.
అందుకే ఏదయినా ఒక మాట అనేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని పెద్దలంటారు.
దీనికి ఉదాహరణగా ఇంగ్లీష్ లో ఓ కధ నెట్ సంచారం చేస్తోంది.
అదేమిటంటే-
అనగనగా ఒక పెద్దమనిషి. వూళ్ళో నలుగురి గురించీ నాలుగు రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం ఆయనకో అలవాటు. నిజమో కాదో నిర్ధారణ చేసుకోకుండా అందరి మీదా నీలాపనిందలు మోపడం ఆయనకో హాబీ. అందులో భాగంగా, ‘పక్కింటి కుర్రాడు దొంగ’ అంటూ తేలిగ్గా అతడిపై ఓ నెపం మోపాడు. అంతటితో ఆగకుండా వైనవైనాలుగా ప్రచారాలు చేసి ‘ఆ కుర్రవాడు నిజంగానే నిజం దొంగ’ అని నలుగురు నమ్మేలా చేసాడు. పోలీసులు కూడా అది నిజమని నమ్మి ఆ కుర్రాడిని పట్టుకుని జైల్లో వేసారు. శిక్ష అనుభవించి తిరిగొచ్చిన తరువాత ఆ కుర్రాడు సదరు పెద్దమనిషిపై పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగాడు.
పోతే, న్యాయమూర్తి ముందు ఆ పెద్దమనిషి మాట మార్చాడు. తానేదో ఉబుసుపోకకు అన్న మాటలే కాని ఆ కుర్రాడు దొంగ కాదన్నాడు. అతడిని బాధ పెట్టే ఉద్దేశ్యం లేదన్నాడు.
జడ్జి అంతా విని, అతగాడికి ఓ కాగితం ఇచ్చి ఆ కుర్రాడిని గురించి లోగడ అన్న మాటలన్నీ దానిమీద రాయమన్నాడు. ఆ కాగితాన్ని ముక్కలుగా చించి ఇంటికి వెళ్ళే దారిలో విసిరేసి మర్నాడు కోర్టుకు రమ్మన్నాడు.
ఆ పెద్దమనిషి న్యాయమూర్తి చెప్పినట్టే చేసి మరునాడు కోర్టులో జడ్జి ముందు బోనులో నిలబడ్డాడు.
న్యాయమూర్తి తీర్పుచెప్పబోయేముందు, విసిరేసిన కాగితం ముక్కలు తనకు చూపించమన్నాడు. ‘ఇంకా అవెక్కడున్నాయి. ఎప్పుడో గాలికి కొట్టుకుపోయాయి’ అని పెద్దమనిషి జవాబు చెప్పాడు.
అప్పుడు న్యాయమూర్తి ఇలా అన్నాడు.
‘వేళాకోళంగా అనే మాటలు కూడా చింపిపారేసిన కాగితం ముక్కలు లాంటివే. గాలికి కొట్టుకుపోయిన వాటిని తిరిగి తేలేనట్టే చెడుపు చేసే మాటల్ని కూడా. అవి అవతలి వ్యక్తికి చేసే అపకారాన్ని గురించి కాసేపు ముందే ఆలోచిస్తే అలాటి మాటలు అనడానికి కాస్త సంకోచిస్తాము. ఏదో మాటే కదా! అన్నంతమాత్రానికే ఏమవుతుంది అనుకుంటే ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఎదుటివాడిని గురించి మంచి చెప్పలేనిపరిస్తితే వుంటే అప్పుడు కనీసం అసలేమీ చెప్పకపోవడం మంచిది.
‘మన నాలికకి మనమే యజమానులం. మనం చెప్పినట్టే అది మాట్లాడాలి. అది మాట్లాడినట్టల్లా మనం తలాడించకూడదు. ఆడిస్తే ఇలాగే తల దించుకోవాల్సిన పరిస్తితి ఎదురవుతుంది.’
ముగించాడు న్యాయమూర్తి మందలింపుగా.
నీతి: నోటికి ఇలా తాళం వేసుకోలేకపోయినా నాలుకను సంభాలించుకోవడం ఉత్తమం.
NOTE: Courtesy Image Owner



28, సెప్టెంబర్ 2021, మంగళవారం

ఆడుతూ పాడుతూ ఉద్యోగం – భండారు శ్రీనివాసరావు

 ఆలిండియా రేడియోలో ఉద్యోగాన్ని ఆడుతూ పాడుతూనే కాదు ఓ ఆటలా కూడా చేశాను. అవన్నీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది, చిన్నతనమూ అనిపిస్తుంది.

జలగం వెంగళరావు గారు కేంద్ర మంత్రిగా వున్నప్పుడు నా మేనల్లుడు దుర్గాప్రసాద్ తో కలిసి హైదరాబాదు, ద్వారకాపురి కాలనీలో వారి ఇంటికి వెళ్లాను. లోకయ్య( వెంగళరావు గారి నమ్మిన బంటు) మమ్మల్ని చూడగానే లోపలకు తీసుకు వెళ్ళాడు.  వెంగళరావు గారు అప్పుడే బ్రేక్ ఫాస్ట్ చేయబోతూ మమ్మల్ని కూడా తనతో కూర్చోబెట్టుకున్నారు.  ఈ లోపల ఉద్యోగధర్మంగా ఏదో అడగడం ఆయన చెప్పడం జరిగింది. నేను వారి ఇంటినుంచే ఎస్టీడీ ఫోనులో మాట్లాడి విజయవాడ ఆలిండియా రేడియోకి చెప్పాను. న్యూస్ ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు రిసీవ్ చేసుకున్నారు. మేము టిఫిన్ చేస్తుండగానే రేడియోలో ఉదయం ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. మొదటి హెడ్ లైన్ వెంగళరావు గారి వార్తతోనే మొదలయింది. అది విని ఆయనగారు ఆశ్చర్యంగా,  ‘అరె! అప్పుడే ఎలా వచ్చింది, నేనింకా సాయంత్రం వార్తలు అనుకున్నా’ అన్నారు.

మదన్ మోహన్ గారు ఆరోగ్యశాఖ మంత్రి. రాజ్ భవన్ రోడ్డులో ఓ ప్రభుత్వ భవనంలో వుండేవారు. మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు. అలా ఒకరోజు ఆయన ఇంట్లో కాలక్షేపం చేస్తుండగా రేడియోలో వివిధభారతిలో శ్రోతలు కోరిన పాటలు వేస్తున్నారు. నేను పిల్లల పేర్లు అడిగి తరువాతి పాటలో ఆ పేర్లు చెప్పాల్సిందని మా డ్యూటీ రూముకు ఫోన్ చేసి చెప్పాను. మదన్ మోహన్ గారింట్లో ఓ చక్కటి పెంపుడు కుక్క వుంది. దాని పేరు పింకీ అనుకుంటా. ఆ పేరు కూడా చెప్పాను. వెంటనే ఆ పేర్లన్నీ రేడియోలో వచ్చాయి. మదన్ మోహన్ గారు ఆ రోజు ఎంత సంతోషపడ్డారో, తన పెంపుడు కుక్క పేరు కూడా రేడియోలో వచ్చినందుకు.



(28-09-2021)

27, సెప్టెంబర్ 2021, సోమవారం

మీరేమిట్లు? – భండారు శ్రీనివాసరావు

‘నాన్నా మనమేమిట్లు?’ అన్నాడు మా పెద్ద కొడుకు సందీప్ ఓ రోజు స్కూలు నుంచి రాగానే.

ముందు ఆ ప్రశ్న అర్ధం కాలేదు. కాసేపటి తర్వాత చిన్నప్పుడు ఈ మాట మా బామ్మగారి నోటంట విన్న సంగతి గుర్తుకువచ్చింది. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి రాగానే వారిని ‘ఏమిట్లు’ అని అడిగేది. నాకు ముందు అర్ధం అవకపోయినా అర్ధం అవడం మొదలయినప్పటి నుంచి ఆ మాట వినగానే చిరాకేసేది. (ఏమిట్లు అంటే మీరెవరు? ఏం కులం?)
మా ఇద్దరు పిల్లల్నీ చిక్కడపల్లిలో మా ఇంటికి రిక్షా దూరంలో హిమాయత్ నగర్ సెంట్ ఆంథోనీ స్కూల్లో చేర్పించాను. మొదటి రోజే నాకూ ఆ స్కూలు ప్రిన్సిపాల్ గ్రిగరీ రెడ్డి గారికీ మాట తేడా వచ్చింది.
‘మీరెన్నయినా చెప్పండి ఆ కాలమ్ (Column) నేను పూర్తి చేసేది లేదు’ అనేశాను.
‘అలా ఎలా కుదురుతుంది. అది రూలు’ అన్నారాయన ఇంకా గట్టిగా.
‘అన్నీ రూలు ప్రకారమే చేస్తున్నారా’ అన్నాను ఒకింత వెటకారంగా.
‘చూడండి. మీరు రేడియో జర్నలిస్టు అని మీ ఇద్దరు పిల్లలకీ డొనేషన్ తీసుకోలేదు. మిగిలిన వారి దగ్గర తీసుకోకపోతే స్కూలు నడపలేము’
‘అప్లికేషన్ లో పిల్లవాడి కులం రాస్తేనే స్కూలు నడుస్తుందా?
ఇండియన్ అని మాత్రమే రాస్తాను, కావాలంటే రెలిజియన్ రాస్తాను. అంతేగాని కులం పేరు రాయను’
చెప్పి వచ్చేశాను.
ఆ తర్వాత ఏమీ కాలేదు. ఆయన ఆ ప్రసక్తి లేకుండానే ఇద్దరు పిల్లల్ని చేర్చుకున్నాడు.
ఇప్పుడు మళ్ళీ మావాడి మాటలతో ఆ గతం గుర్తుకువచ్చింది.
‘ఎవరు అడిగారు’ అన్నాను మా వాడితో.
‘నా క్లాస్ మేట్స్ అడుగుతున్నారు’
‘తెలవదని చెప్పు’
‘సరే’ అని వెళ్ళిపోయాడు.
అప్పటినుంచి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునే దాకా వారి కులం ఏమిటో తెలవకుండా వారి చిన్నతనం గడిచింది.




(NOTE: COURTESY IMAGE OWNER)