3, జూన్ 2021, గురువారం

ఆధ్యాత్మిక రచనల మార్గంలో జ్వాలా

సుందరకాండ మందర మకరందం, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధ కాండ, యుద్ధకాండ, ధర్మధ్వజం, ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాధలు, శ్రీ మహా భాగవత కధలు, శ్రీ మదాంధ్ర మహాభారత కధలు. ఇవన్నీ ఉద్గ్రంథాలు. ఇంకా అనేకం వున్నాయి. స్థలాభావం కారణంగా పేర్కొనడం లేదు. అన్నీ కలిపితే వేల పుటలు దాటిపోతాయి. రాసింది మాత్రం ఒక్క చేయి. ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ, సంసార బాధ్యతల్లో మెలిగే మనిషికి ఎలా సాధ్యం? అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవడం జ్వాలాకు పుట్టుకతో వచ్చిన విద్య కాదు, పట్టుదలతో అలవరచుకున్న అభ్యాసం.
ప్రచురణ కాగానే నాకొక కాపీ ఇవ్వడం ఈ కరోనా రోజుల్లో పంపడం ఆయనకు అలవాటు. అలాగే ఇవ్వాల కూడా కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారత కధలు అనే పేరుతొ రాసిన ఆస్వాదన గ్రంధాన్ని పంపాడు.
కరోనా కోరల్లో చిక్కుకున్న రోజుల్లో కూడా రామ నామం మరవకుండా, ఆధ్యాత్మిక గ్రంధ రచన కొనసాగిస్తూ వచ్చాడు అనడానికి ఈ కొత్త గ్రంధం ఓ ఉదాహరణ.
భగవదనుగ్రహం ఆ కుటుంబానికి సర్వదా లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందుకు అర్హత ఆయనే సంపాదించుకున్నాడు ఇలాంటి అద్భుత రచనలు చేసి. మరో విశేషం ఏమిటంటే జ్వాలా ఇంతవరకు రాసిన పుస్తకాలను మార్కెట్లో పెట్టి విక్రయించలేదు.
ఆయన ఆ సర్వేశ్వరుడి నీడలో ఉండబట్టే ఆ పరమేశ్వరుడు జ్వాలా చేత ఈ సత్కార్య రచన చేయిస్తున్నాడు.



(03-06-2021)

పెళ్లి చేసి చూడు, పార్టీ మారి చూడు

 పూర్వం పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు చెప్పాలి. ఫోటోలు  చూపించాలి. జాతకాలు చెప్పించాలి. ఏడు తరాల ఆరాలు తీసుకోవాలి. మంచి చెడ్డలు కనుక్కోవాలి. తర్వాత పెళ్ళికొడుకు తల్లీ తండ్రీ వచ్చి పిల్లను చూడాలి. తర్వాత కొన్ని రోజులకు పెళ్ళికొడుకు చెల్లెలు లేదా దూరపు చుట్టాలు వచ్చి చూడాలి. జాతకాలు వగైరా చూపించుకోవాలి. ఈలోగా కట్నం లాంఛనాల వంటి వాటి విషయంలో ఒక స్పష్టత రావాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకునే వరుడు, స్నేహితులతో కలిసి  వచ్చి కాబోయే వధువును చూసి, పెద్దవాళ్ళతో మాట్లాడి ఏ విషయం కబురు చేస్తామని చెప్పాలి. అంతా అనుకున్నట్టు జరుగుతోంది అనే నమ్మకం కుదిరిన తర్వాత లగ్గాలు పెట్టుకోవాలి.

ఇంత తతంగం నెలలు, వారాల పాటు సాగితే కానీ పెళ్లి సంబంధం ఒక పట్టాన తేలేది కాదు, కుదిరేది కాదు, పెళ్లి పీటల దాకా వెళ్ళేది కాదు.

ఇప్పుడంటే పరిస్థితులు మారాయి.  అమెరికా సంబంధాలు వచ్చి పడి వారం పది రోజుల్లోనే పెళ్లి చూపులు,  మాట్లాడుకోవడాలు, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవడాలు చకచకా జరిగిపోతున్నాయి (కరోనా ముందు సంగతి అనుకోండి)

అలాగే, వెనక పార్టీ మారేవారు ఒక ప్రకటన చేసేవారు, పలానా పార్టీలో చేరినట్టు. పలానా పార్టీవాళ్లు మరో ప్రకటన చేసేవాళ్ళు పలానా నాయకుడిని తమ పార్టీలో చేర్చుకున్నట్టు. అంతే! ఆ కధ అక్కడికి చెల్లు.

మరి ఇప్పుడో!

అధినాయకుడు సరే కానీ చుట్టూ ఉన్నవారి మూలంగా పార్టీ ప్రజల్లో చులకన అవుతోందని ముందుగా ఒక  ప్రకటన చేయాలి. దానిమీద టీవీల్లో రెండు మూడు రోజులు చర్చలు జరగాలి. కొన్నాళ్ళు ఆగి ఏకంగా అధినాయకుడినే విమర్శిస్తూ తన పేరుతొ కాకుండా లీకు వదలాలి.  దానిమీద చర్చ పూర్తిగా జరగనిచ్చి మీడియాలో వచ్చిన వార్తలు తప్పుడుతడకలు అని ఓ గంభీర ప్రకటన చేయాలి. ఆఖరి శ్వాస వరకు తాను పార్టీని వీడేది లేదని బల్ల గుద్ది చెప్పాలి.

దాని మీద  సుదీర్ఘ కాలం జరిగే చర్చను మౌనంగా వీక్షించి మళ్ళీ మరో లీకు వదలాలి, అధినాయకత్వం తీరు మార్చుకోకపోతే తాను పార్టీని విడిచి పెట్టాల్సి వస్తుందని. మళ్ళీ దాని మీద టీవీల్లో విస్తృత చర్చ. మీడియా వక్రీకరించిందని  ఖండించాలి. అధినాయకుడికి తాను సర్వదా విధేయుడిని  చెప్పాలి.

కొన్ని రోజులు ఆగి పలానా పార్టీలో చేరబోతున్నట్టు మరో లీకు వదలాలి.  దాని మీద కొన్నాళ్ళు చర్చ. పలానా పార్టీ నాయకులతో రహస్య భేటీ అంటూ  మరో లీకు. దాని మీద మరో కొన్నాళ్ళు చర్చ. పార్టీ మారేది లేదని మరో ప్రకటన.

ఇంత తంతు ఓ  మూడు నెలలు సాగిన తర్వాత కూడా ఆయన పార్టీ మారాడా లేదా అనేది ఓ చర్చనీయాంశమే మీడియాకి.

ప్రతిరోజూ వార్తల్లో నానడానికి ఇదో మార్గం అని గిట్టని వాళ్ళ ఉవాచ.

(03-06-2021)

2, జూన్ 2021, బుధవారం

నడిచివచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు

 పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరవయ్యవ తేది. విజయవాడ, లబ్బీపేటలోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.

అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకున్నాను.

ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-

'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.

ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వుండే మేజా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ.టీ.ఐ., యు.ఎన్.ఐ. వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.

ఆ రోజుల్లో సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు మ్యూజియం రోడ్డు దగ్గరలో ఆఫీసర్స్  క్వార్టర్స్ లో వుండేవారు. ఉదయం  తొమ్మిది గంటలకల్లా భోజనం చేసి పత్రికాఫీసుకు బయలుదేరేముందు మా పెద్ద ఒదిన గారు ఓ రూపాయి నోటు చేతిలో పెట్టేది. PWD మైదానం దాటి వెడితే బస్ స్తాపు. రానూ పోనూ నలభై పైసలు టిక్కెట్ల ఖర్చు. లంచ్ టైంలో ఆంధ్రజ్యోతి బయట టీ స్టాల్లో ముప్పయి పైసలు పెడితే అరకప్పు టీ,  చిన్న సమోసా. సాయంత్రం ఇంటికి చేరేసరికి యెనిమిది గంటలు. ఇలా ఆదివారాలు అమావాస్య అని లేకుండా  మూడు నెలలు పనిచేస్తే నెలకు వంద రూపాయలు జీతం. అలా ఓ ఏడాది గడిచిన తర్వాత యాభయ్ పెంచారు. రేడియోలో చేరడానికి ముందు నా ఆఖరి నెల జీతం అక్షరాలా  నూట డెబ్బయి అయిదు రూపాయలు. కాకపోతే సమాజంలో గొప్ప పలుకుబడి. ఫోన్ చేస్తే కలెక్టర్ లైన్లోకి వచ్చే వైభోగం. సినిమాలు సరే. అన్నీ ఫ్రీవ్యూలే!

దాంతో ఈ కృత్రిమ జీవితమే నిజమనుకుని భ్రమ పడి, తాహతుకు మించి  నెలకు డెబ్బయి అయిదు రూపాయలు అద్దె పెట్టి పశువుల ఆసుపత్రి వద్ద ఆంధ్రజ్యోతికి దగ్గరలో ఓ రెండు గదుల వాటా తీసుకున్నాను. పెద్ద పిల్లవాడు సందీప్ పాల డబ్బాలు మద్రాసు నుంచి మా మామగారు ప్రతినెలా ట్రావెల్స్ లో పంపేవారు. ఆయన దగ్గర నుంచి మనీ ఆర్డర్లు కూడా వచ్చేవి కానీ ఎవరు పంపారు, ఎంత అని మా ఆవిడను అడిగేవాడిని కాను. సంపాదన లేని వాడికి సంజాయిషీలు అడిగే హక్కు లేదు.

అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి అక్కవుంటెంట్ ని  కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.

ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా- ప్రూఫ్ లో అచ్చయిన నా వార్తల్ని చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాధ్యతలు  స్వీకరించడం జరిగిపోయాయి. ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో - పిల్లలకోసం ప్రత్యేక కధలు - బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు తుర్లపాటి కుటుంబరావు,  ఉపేంద్ర, ఐ వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ, సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్రజ్యోతి ఉద్యోగపర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.

అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.

రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్రజ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తాసేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియోలోకి వెళ్ళిపోయి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యెక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.

ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల-వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం, రేడియోపై ఎక్కువగా ఆధార పడాల్సి రావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యతను కొంత పెంచింది.

ఈ క్రమంలో,  ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారులు,  కేంద్రమంత్రులు,  ఎంపీలు,  శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు, విమానయానాలు, విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తు'లో వృత్తి జీవితం గడిచిపోయింది.

మాస్కోలో వున్న కాలంలో ఇండియన్ ఎంబసీ ద్వారా నాకో లీగల్ నోటీసు వచ్చింది. విజయవాడలోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు వడ్డీతో సహా లక్ష రూపాయలు ఖుద్దున చెల్లించాలన్నది దాని సారాంశం.  

నాకు ప్రధాని తెలుసు, నాకు ముఖ్యమంత్రి తెలుసు” అని  పాత తెలుగు సినిమాలో ఒక పాత్ర అంటూ వుంటుంది. అలాగే జర్నలిస్టులకు కూడా ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులతో వృత్తిగతమైన పరిచయాలు వుండడం సహజం. కానీ చాలామంది పాత్రికేయుల జీవితాలు పైకి కనిపించేటంత పట్టు పరుపులు కావు.  

1987  నుంచి దాదాపు అయిదేళ్లపాటు మాస్కోలో 'పిల్ల జమీందారు' లాగా వెలిగాను. దేనికీ లోటు లేని, లక్షాధికారులకు మాత్రమే సాధ్యం అయ్యే సుఖాలు, భోగాలు అనుభవించాను. నాలుగు గదుల అద్దె లేని ఇల్లు, కరెంటు, ఫోను, గ్యాసు పూర్తిగా ఉచితం. జీతం డబ్బులు ఏమి చేసుకోవాలో తెలియని పరిస్థితి.

వారాంతపు రోజుల్లో మాస్కోలో  మా ఇల్లు విందు కాలక్షేపాలతో వెలిగిపోయేది. మన దేశం నుంచి మాస్కో వచ్చే తెలుగువాళ్లే కాదు, భాష తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేసి అన్నదాతా సుఖీభవ అని ఆశీర్వదించి పోయేవారు. వారిలో క్యాబినెట్ మంత్రులు, కోటీశ్వరులైన వ్యాపారులు, జర్నలిస్టులు, సినిమా వాళ్ళు, ఇస్కస్ ప్రతినిధి బృందాల వాళ్ళు వుండేవారు. ఎందుకంటే అక్కడ దొరికే భోజనం మన వైపు నుంచి వచ్చేవాళ్ళకు నోటికి హితవుగా వుండేది కాదు. అన్నం, పప్పు, ఆవకాయ కారాలు, సాంబారు వంటివి కావాలంటే మా ఇల్లే వారికి చిరునామా.

ఇలా పెద్ద ఎత్తున భోజనాలు పెట్టడానికి పెద్దగా ఖర్చయ్యేది కాదు, పనిమనుషులు లేని దేశం కనుక శారీరక శ్రమ మాత్రం తప్పదు. ఆ బరువు మా ఆవిడ మోసేది కాబట్టి నేను భోజరాజులాగా మిత్రులతో కాలక్షేపాలు చేస్తుండేవాడిని.      

 అసందర్భంగా అనిపించినా మాస్కో జీవితం గురించి రాస్తున్నప్పుడు  నా వృత్తి జీవితం జ్యోతిలో మొదలయిన రోజులను కూడా నెమరు వేసుకోవడం తప్పనిసరి. జీతానికీ, జీవితానికీ పొంతన లేని ఆ  రోజుల్లో, బతుకు బండి నడపడం గగనంగా వుండేది. ప్రతి దానికీ ఇబ్బందే, కటకటే. ఆఖరికి, బియ్యం, నూనె వంటివి కూడా  ఏరోజుకారోజు కొనుక్కున్న హీనమైన రోజులు వున్నాయి. మా ఆవిడకు పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలన్నీ కుదువ పెట్టి డబ్బు తెచ్చేవాడిని. వాటిని విడిపించే స్థోమత లేక అవి మాకు కాకుండా పోయాయి.

ఆ గడ్డురోజుల్లో ఒక రోజు రామారావనే ఆర్టిస్ట్ మా ఇంటికి వచ్చాడు. నా స్నేహితుడయిన లాల్ మోహన్ అనే మరో ఆర్టిస్ట్ అతడిని నాకు పరిచయం చేసాడు. ఒక విషయంలో నా సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. చెప్పాపెట్టకుండా అతడు రావడం నాకూ మా ఆవిడకూ ఆ క్షణంలో అంత బాగా అనిపించలేదు.  అతడు వచ్చిన సమయంలో మేమొక చిక్కు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాము. పిల్లవాడికి పాలు పట్టాల్సిన సీసా కడుగుతుంటే పగిలిపోయింది. రూపాయి ఖరీదు చేసే ఆ సీసా కొనడానికి ఇల్లు మొత్తం గాలించినా ఎర్ర ఏగాని కూడా దొరకలేదు. పిల్లవాడేమో ఒక పక్క గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఈ సీను చూసి అతడు నిశ్శబ్దంగా  వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళాడు కదా అని అనుకునేంతలో మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ వచ్చిన అతడి చేతిలో పాలసీసా కనబడగానే దేవుడే దిగివచ్చాడనిపించింది. పాల సీసా వెల తక్కువే కావచ్చు. కానీ ఆ క్షణంలో, దానికి ఖరీదు కట్టగల షరాబు లేడనిపించింది.

అన్ని రోజులుగా అతడు నన్నడుగుతున్నది ఒక్కటే. సొంతంగా హోర్డింగుల వ్యాపారం పెట్టాలనుకుంటున్నాడు. పది వేలు అప్పు కావాలి. జామీను ఇచ్చే వాళ్ళుంటే బ్యాంకు వాళ్ళు లోను ఇస్తామన్నారుట. ఆ రోజు అడగకుండా అతడు చేసిన సాయానికి ఏదయినా చేసి రుణం  తీర్చుకోవాలనిపించింది. నా అంతట నేనే వెళ్లి బ్యాంకులో అతడి రుణానికి జామీను పత్రంపై సంతకం చేసాను. ఆ తరువాత హైదరాబాద్ ఆకాశవాణిలో ఉద్యోగం రావడం , నేను విజయవాడ వొదిలిపెట్టడం జరిగిపోయాయి. ఆ తరవాత అతడు ఏమయ్యాడో తెలియదు. పదేళ్ళ అనంతరం, మాస్కోలో వున్నప్పుడు , ఇండియన్ ఎంబసీ ద్వారా నాకొక లీగల్ నోటీసు అందింది. ఆ పదిహేనేళ్ళలో ఆనాటి ఆ అప్పు పాపంలా పెరిగి లక్ష రూపాయలకు డిక్రీ అయింది. అదే నేనందుకున్న కోర్టువారి శ్రీముఖం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే డబ్బును  మంచి నీళ్ళలా ఖర్చు చేస్తూ మాస్కోలో పాలు, పెరుగు అమ్మే  ప్రొదుక్తి దుకాణంలో  లీటర్లకు లీటర్లు పాలను కొంటున్నప్పుడు,  నడిచి వచ్చిన దారిలో తొక్కుకుంటూ వచ్చిన ఇలాంటి ముళ్ళ బాటలు కళ్ళల్లో మెదిలేవి. అలనాటి దృశ్యాలు సినిమా రీలులా గిర్రున తిరిగేవి.

అందాల రాముడు సినిమాలో డబ్బున్న ఖామందు గారు సెక్రటరీని పిలిచి ' నేను ఎక్కే రైలుకు థర్డ్ క్లాసు బోగీలు తగిలించింది ఎవరు' అని గద్దిస్తాడు. ఆ సెక్రటరీ తెలివిగా, 'థర్డ్ క్లాసు వుంటేనే ఫస్ట్ క్లాసు విలువ తెలుస్తుందని తానే తగిలించా'నంటాడు.

నిజమేకదా. కష్టాలు లేకపోతే సుఖాలకున్న విలువేమిటి?

ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు – కే.ఎస్. శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్  దూరదర్సన్  వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ.

లోగడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.

(02-06-2021)

రామోజీ గారి నుంచి ఫోను

 

2018లో ఓరోజు ఉదయం టీవీ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తరువాత వాట్సప్ కాల్ ఫ్లాష్ వెలిగింది. రామోజీరావు గారి ఫోటో. ఆశ్చర్యపోతూనే కాల్ రిసీవ్ చేసుకున్నా.

ఆప్యాయంగా పలకరిస్తూ భగీరధ గొంతు. భగీరధ సీనియర్ ఫిలిం జర్నలిస్టు. నలభయ్ ఏళ్ళకు పూర్వం మేము చిక్కడపల్లిలో ఉంటున్నప్పటి నుంచీ పరిచయం. నాలాగే ఆంద్ర జ్యోతి ప్రొడక్ట్. చాలా పుస్తకాలు రాసారు. ప్రత్యేకంగా పనికట్టుకుని మా ఇంటికి వచ్చి మరీ ఇచ్చి వెడుతుంటారు. అది ఆయన సహృదయత.

చంద్రబాబు, కేసీఆర్ నాలుగేళ్ల పాలన గురించి నేను రాసిన వ్యాసాలను ఆయన ప్రస్తావించారు. ‘మీరు మళ్ళీ ఇల్లు మారారట కదా! అడ్రసు చెప్పండి, నా కొత్త పుస్తకం ఒకటి మీకివ్వాలి’ అన్నారు భగీరధ. చెప్పాను. ఎందుకంటే పుస్తకం అంటే నాకు ప్రాణం. మనకు ఇష్టం ఉన్న రాత అయితే ఎంచక్కా చివరిదాకా చదువుకోవచ్చు. నచ్చలేదనుకోండి, పక్కన పడేయొచ్చు. అదే సంభాషణ అయితే.... ఇష్టం లేకపోతే ఎక్కడిదాకా సాగుతుందో మాట్లాడే ఇద్దరికీ తెలవదు. అందుకే పుస్తకాన్ని మించిన మంచి స్నేహితుడు ఉండడు అంటారు.

ఫోను పెట్టేసే ముందు మనసులో తొలుస్తున్న అనుమానాన్ని బయట పెట్టాను, ఈ రామోజీగారి ఫోటో సంగతేమిటని. మంచి మితృడు కనుక భేషజం లేకుండా సమాధానం చెప్పాడు భగీరధ.

“అదా! ఒకసారి నేను ఆయనతో కలిసి దిగిన ఫోటో. మీఫోన్లో ఆయన ఫోటో వరకే డిస్ ప్లే అయినట్టుంది”

1, జూన్ 2021, మంగళవారం

మరణించే హక్కు

 హిందూ దినపత్రికలో వచ్చిన వార్త ఇది. అంచేత ఉత్ప్రేక్షలకు అవకాశం ఉండకపోవచ్చు.

ఈ పత్రిక రాసిన దాని ప్రకారం, చిత్తూరు జల్లా లోని ఒక పేద కుటుంబానికి ఎక్కడలేని కష్టం వచ్చి పడింది. అయిదేళ్ళ బాలుడికి బోన్ కేన్సర్. ఎక్కడలేని డబ్బు నయం కాని ఆ వ్యాధికి ఖర్చు చేస్తూ ఆర్ధికంగా, మానసికంగా చితికిపోయారు. దానితో తమ కుమారుడికి మరణం ప్రసాదించి అతడు పడుతున్న బాధల నుంచి విముక్తుడిని చేయాల్సిందని పుంగనూరు కోర్టు తలుపు తట్టారు. కోర్టు వారి కేసు విచారించి అప్పీలును త్రోసిపుచ్చింది. కాకపోతే ఆ కేసును జిల్లా అధికార యంత్రాంగానికి నివేదించింది. ఇది ఇలా సాగుతుండగానే ఆ పిల్లవాడు గత ఆదివారం రాత్రి మరణించాడు.
అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం...’ అన్నారు. హాయిగా చీకూ చింతా లేకుండా బతకడం, అనాయాసంగా చనిపోవడం ఈ రెండింటికీ మించి మనిషి బతుక్కు వేరే సార్ధకత వుండదు.
‘జాతస్య హిధ్రువో మృత్యు:’ అని గీతావాక్యం. పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు, తప్పని దానికి విచారించడం దేనికన్నది కృష్ణుడి ప్రశ్న.
ప్రతి జీవితానికి ముగింపు మరణమే అని తెలిసి కూడా ప్రతి ఒక్కరూ మరణభీతితోనే జీవిస్తుంటారు. ఇదొక వైచిత్రి.
జీవితం మనిషికి లభించిన అపూర్వ వరం. బలవన్మరణాలతో దీనికి చరమగీతం పాడరాదని పెద్దల వాక్కు. అయినా జీవించివున్నన్నాళ్ళు మనిషిని వెంటాడి వేధించే విషయం మరణ భయమే. ఆ భయంతోనే కాబోలు అనాయాసంగా మృత్యువు ఒడి చేరాలని అనుకుంటారు. కోరుకుంటారు.
కొందరి మరణాలు కళ్ళారా చూసినప్పుడు ఇటువంటి చావు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. కొందరు అత్యంత సునాయాసంగా జీవితాన్ని చాలించినప్పుడు ఇలాంటి మరణం సిద్ధిస్తే యెంత బాగుండు అని వయసు పైపడినవారు అనుకోవడం కద్దు.
‘దీర్ఘాయుత్వంచమే...’ అని చమకంలో చెప్పారు. అంటే ఏమిటన్నమాట. అపమృత్యువు లేని దీర్ఘాయువు కావాలి. శతమానం భవతి అంటూ నిండు నూరేళ్ళు జీవించమని ఆశీర్వదించడం బట్టి చూస్తే పూర్ణాయుర్దాయం అంటే బాల్య, కౌమారాది నాలుగు దశలు దాటి సహజమైన ముగింపుకు చేరుకోవడం. ఏ ప్రమాదాలవల్లో అకాల మరణం రాకూడదని, ఆత్మహత్యల ద్వారా బలవన్మరణాలు తగవనీ పూర్వీకులు చెబుతూ వచ్చారు. ఆత్మహత్య మహాపాపం అని నిర్ధారణ చేసి, దాన్ని నిషేధ కార్యాల జాబితాలో చేర్చేసారు కూడా.
పొద్దునపొద్దున్నే ఈ వేదాంతపు కబుర్లు చెప్పుకోవడానికి ‘యూధనేసియా’ అనే గ్రీకు పదం కారణం. దీనికి తెలుగు మీడియా చేస్తున్నసమానార్ధక అనువాదం ‘కారుణ్య మరణం’.
ఒక వ్యక్తి ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతూ తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు ‘కారుణ్య మరణం ఎంచుకునే అవకాశం అతగాడికి వుండాలనేది ఒక వాదన. వెంటిలేటర్ల వంటి కృత్రిమ వ్యవస్థల ద్వారా అతడి ఆయుర్దాయాన్ని కొంత కాలం పెంచడానికి ఆధునిక వైద్యం ఉపకరించవచ్చు కానీ, తద్వారా ఆ రోగి శారీరక బాధను కూడా పొడిగించినట్టే అవుతుంది. కాబట్టి, కారుణ్య మరణాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్ చాలాకాలంగా వినబడుతోంది. జీవించే హక్కులో, గౌరవంగా మరణించే హక్కు కూడా మిళితమై వుంటుంది కనుక, నయం కాని దీర్ఘ వ్యాధులతో బాధపడేవారికి కారుణ్య మరణాలను ప్రసాదించే విధంగా చట్టాలు చేయాలనీ కొన్ని స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి.
కారుణ్య మరణాలపై దేశ వ్యాప్తంగా చాలా ఏళ్ళుగా చర్చ సాగుతూనే వుంది. వీటిపై అనేక వార్తా కధనాలతో పాటు, ఈ కధాంశంతో కొన్ని నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. కొన్నేళ్ళ క్రితం మరణించిన అరుణా షాన్ బాగ్ అనే మహిళ దీన గాధను కారుణ్య మరణాలను చట్టబద్ధం చేయాలనే వారు ఉదహరిస్తుంటారు. చిన్నవయస్సులోనే దారుణమైన లైంగిక అత్యాచారానికి గురై నలభై రెండేళ్ళ పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవచ్చంలా బతికి కన్నుమూసిన ఈ మహిళ తరపున జరిగిన న్యాయపోరాటం యావత్తు ఈ కారుణ్య మరణాలకు సంబంధించినదే.
సీవీ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ కూడా ప్రభుత్వానికి ఇదే మాదిరి సిఫారసు చేసింది. అరుణా షాన్ బాగ్ అనే ఆ నర్సు మాదిరిగా జీవచ్చవంలా బతుకు ఈడ్చే స్థితికి చేరుకున్నవారికి, కోమాలోకి వెళ్ళిపోయి, తిరిగి ఎంతమాత్రం స్పృహలోకి వచ్చే అవకాశం లేదని నిర్ధారణ అయిన రోగులకి, కారుణ్య మరణం ఎంచుకునే వీలు కల్పించాలని అప్పట్లోనే లా కమిషన్ సూచించింది.
ఆస్తులు, వారసులు, దాయాది తగాదాలు మిక్కుటంగా వున్న సమాజంలో కారుణ్య మరణాలకు చట్టబద్ధత కలిపిస్తే మరిన్ని చిక్కులు ఎదురుకాగలవని సందేహాత్మకుల డౌటేహం. ఆస్తులపై వ్యామోహంతో కన్నవారిని కూడా మట్టుబెట్టాలని చూసే వారి గురించిన కధలు, కధనాలు వింటున్నప్పుడు ‘కారుణ్య మరణాలకు’ అనుమతి ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువన్నది వారు వెలిబుచ్చే అనుమానం.
సరే ఈ విషయం పక్కనబెట్టి అసలు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వడం వల్ల లాభనష్టాలు గురించి ఆలోచిద్దాము. మంచాన పడి, అయిన వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకు బండి ఈడుస్తున్న అనేకమంది వృద్ధులకు, దీర్ఘ రోగ పీడితులకు ఇది ఉపశమనం కలిగించే విషయమే. అలాగే, వయోభారంతో మంచానికి బందీగా మారి కట్టకడపటి రోజుకోసం ఎదురు చూస్తూ రోజులు లెక్కబెడుతున్న తమ కన్నవారిని సరిగా చూసుకోలేకా, చూడకుండా వుండలేకా అనునిత్యం మధన పడే వారి సంతానానికి సయితం ఈ కారుణ్య మరణం అనేది ఒక విముక్త మార్గంగా కనిపించవచ్చు.
అయితే కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించడం వల్ల సమాజంలో కొంతమందికి మాత్రమే ఊరట. అదెలా అంటే:
పైకి చెప్పుకున్నా చెప్పలేకపోయినా చాలామందికి మరణానికి సులువయిన మార్గం ఏమిటి అనే ఆలోచన తొలుస్తూనే వుంటుంది. దారుణ మరణాలను కళ్ళారా చూసినప్పుడు ఈ రకమైన వేదాంతతత్వం మరింత పెరుగుతూ వుంటుంది. చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు ‘ఇలా కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే దాటిపోతే బాగుంటుంద’ని. అలాగే మరణం తధ్యం అనుకున్న సందర్భాలలో కూడా మానవ మనస్తత్వం ఈ విధంగానే ఆలోచిస్తూ వుంటుంది అనడానికి చరిత్రలో అనేక రుజువులు వున్నాయి. యావత్ ప్రపంచంలో తాను అందరికంటే అందగత్తెనని విర్రవీగిన క్లియోపాత్రా సంగతే చూడండి. అక్టేవియస్ సీజర్ తనని బందీగా పట్టుకుంటాడేమో అని భయపడిపోయిన క్లియోపాత్రా ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. చనిపోయిన తరువాత కూడా తన శరీరం రంగు మారకుండా వుండే విషం కోసం అన్వేషించి ఒక రకం సర్పాన్ని అందుకోసం ఎంపికచేసుకుంటుంది. చక్కగా అలంకరించుకుని, శయ్యాగతురాలై, ఆ విషనాగుతో కాటు వేయించుకుని మహరాణిలా మరణిస్తుంది.
పురాణాల్లో మనకు తెలిసిన భీష్ముడి స్వచ్చంద మరణం కొద్ది తేడా వున్నా అలాంటిదే. కాకపొతే అర్జున గాండీవ విముక్త శస్త్రాలతో శరీరమంతా చిల్లులు పడి, అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఎదురు చూసి, తండ్రి ఇచ్చిన స్వచ్చంద మరణ వరం కారణంగా ఇచ్చామరణం పొందిన గాధ భీష్మాచార్యులది. ఆయన మాదిరిగా అలాటి వరభాగ్యం అందరికీ దక్కదు.
శరీరం రోగగ్రస్తమై, నివారణ కరువై, అహరహం చావుకోసం చకోరపక్షుల వలె కన్నుల్లో వత్తులు వేసుకుని ఎదురుతెన్నులు చూసేవారికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న, కోర్టులు పరిశీలిస్తున్న ‘యుధనేసియా’ అంటే సునాయాస మరణ ప్రాప్తి అనేది నిజంగా వరమే.
ప్రతి మనిషికి హుందాగా జీవించే హక్కు మాదిరిగా గౌరవంగా మరణించే హక్కు కూడా వుండాలని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతా బాగున్నప్పుడు, జీవితంలో ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా కన్నుమూయడం ఎందరికి సాధ్యం. ఇలాటి అవకాశం చట్టబద్ధంగా వుంటే జీవన్మరణాలు తగ్గిపోయి ప్రశాంత మరణాలు పెరుగుతాయని వారి అభిప్రాయం. సందేహం లేదు, ఇది గొంతెమ్మ కోరికే. అయినా ఆలోచించాల్సిన విషయం.

ఉపశ్రుతి: మా చుట్టం ఒకరు బీ ఎస్ ఎన్ ఎల్ లో అధికారిగా పనిచేస్తున్నారు. వయసు 57. ఆఫీసులో పై అధికారి సిబ్బందికి ఇచ్చిన లంచ్ మీటింగ్ కు హాజరై ఇంటికి వచ్చారు. దుస్తులు మార్చుకుని వచ్చి టీ తాగుతూ అలాగే పక్కకి ఒరిగిపోయారు. మాసివ్ హార్ట్ అటాక్. అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క క్షణం ముందు వరకు ఆయన ప్రాణం వున్న మనిషి, మరుక్షణం విగత జీవి. ఆయనకు షుగర్ లేదు, బీపీ లేదు, గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా లేవు. అయినా కూడా ఆయన జీవన యానం అలా హాయిగా, ప్రశాంతంగా ముగిసింది. కోటికొక్కరికి కూడా లభించని అరుదయిన అవకాశం.
సాధ్యం కాదని తెలిసినా వయసుమళ్ళిన వాళ్ళలో చాలామంది కోరుకునేది ఇదే.
ముఖ్యంగా కరోనా కాలంలో.
(01-06-2021)

ఎస్వీ ప్రసాద్ గారి సంస్మరణలో – భండారు శ్రీనివాసరావు

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో శ్రీ ఎస్వీ ప్రసాద్ ఏకబిగిన దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేశారు.
ఆ తర్వాత జరిగిన అంటే 2004 ఎన్నికల తర్వాత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు ముఖ్యంగా ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన అధికారులకి స్థానచలనం జరగడం ఆనవాయితీ.
ఎస్వీ ప్రసాద్ నిబద్దత, నిజాయితీల మీద వై.ఎస్.ఆర్. కి ఉన్న నమ్మకం చేత, ఆయన్ని పిలిచి ఆయన కోరుకున్న పోస్టు ఇవ్వాలని సంకల్పించారు. కానీ ప్రసాద్ గారు మాత్రం ముఖ్యమైన, కీలకమైన పోస్టులు కోరుకోలేదు. చాలా ఏళ్ళుగా విశ్రాంతి ఎరగకుండా పనిచేయడం వల్ల కావచ్చు, పనిభారం కొంత తేలికగా వుండే అప్రధాన పోస్టుని ఏరికోరి వేయించుకున్నారు. అదేమిటంటే – Environment Protection Training and Research Institute (EPTRI). అది హైదరాబాదులోనే వుంది కాని అలాంటి సంస్థ ఒకటి వుందని చాలా మందికి తెలియదు. అక్కడ డైరెక్టర్ గా ఆరు నెలలు కూడా పనిచేశారో లేదో తెలియదు, వై.ఎస్. ఆయన్ని అతి కీలకమైన పోస్టుకి ఎంపిక చేశారు. ఎస్వీ ప్రసాద్ గారెని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఇదేమిటి అని సొంత పార్టీ వాళ్ళు అడిగితె అది అంతే అని వై.ఎస్. జవాబు. తనకు అడ్మినిస్ట్రేషన్ కొత్త అయినా, రాజకీయాల్లో సుదీర్ఘ కాలం వుండడం చేత ఐ.ఏ.ఎస్. అధికారుల పనితీరు తనకు కరతలామలకం అని చెప్పేవారు. ఎవరో ఒకరిద్దరు తప్ప సాధారణంగా చాలా మంది ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు Loyal to their duty అనేది ఆయన అభిప్రాయం. దీన్నే కొందరు Loyal to CM అని అన్వయించి చెబుతారు.
ఆయన సీఎం పేషీలో వుండడం వల్ల ఐ.ఏ.ఎస్. అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయంతో చక్కటి సమన్వయం ఉండేదని, ప్రభుత్వ నిర్ణయాలు సత్వరంగా అమలు జరగాలంటే ఇలాంటి సమన్వయాన్ని అధికారులు కోరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు అభిప్రాయ పడ్డారు.
అనేకమంది, అదీ పరస్పర విరుద్ధమైన పార్టీల ముఖ్యమంత్రుల వద్ద సన్నిహితంగా పనిచేసే అవకాశం ఎస్వీ ప్రసాద్ గారెకి లభించింది. కత్తి మీది సాము లాంటి వ్యవహారాలను ముఖ్యమంత్రికి మాట రాకుండా, తను మాట పడకుండా చక్కబెట్టే చాణక్యం ఉంటేనే కాని ఇది సాధ్యపడదు.
కరోనా కారణంగా, అంత మంచి అధికారికి నూరేళ్లు నిండడం విషాదం.

(01-06-2021)

కింది ఫోటో:
1973 లో ఐ.ఏ.ఎస్. సహచరులతో ఢిల్లీలో దిగిన ఫోటో. కుడి వైపు చివర శ్రీ ఎస్వీ ప్రసాద్
May be an image of one or more people and people standing

చిరునవ్వుల ఐ.ఏ.ఎస్. ఎస్వీ ప్రసాద్ ఇక లేరు

 

మొన్నే ఓ మిత్రుడు ఫోన్ చేసి ప్రసాద్ గారు కరోనాతో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి బాగాలేదు అంటున్నారు అని చెప్పాడు. పోలేని పరిస్థితి. నా దగ్గర వున్న ఫోన్ నెంబరుకు ఓ మెసేజ్ పెట్టాను, గెట్ వెల్ సూన్ అని. చూసి వుండరు. ఈ ఉదయం కన్ను మూశారు అని వార్త. ఎప్పుడూ చెదరని నవ్వు మొహంతో వుండే ఎస్వీ ప్రసాద్ గారు ఇక లేరు అని తలచుకుంటే చాలా బాధ వేస్తుంది.
అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. ఒక్క మాట కూడా పడకుండా నెట్టుకు రావడం అంటే ఆషామాషీ కాదు. విజయభాస్కర రెడ్డి, ఎన్టీఆర్, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలా అందరి చేతా సెహబాష్ అనిపించుకున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత విజిలెన్స్ కమిషనర్ గా చాలా కాలం పనిచేశారు.
గోటేటి రామచంద్రరావు గారి ఇంట్లో జరిగిన ఓ పెళ్ళిలో కలుసుకోవడమే ఆఖరి సారి.
వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను



(శ్రీ ఎస్వీ ప్రసాద్ IAS)


(01-06-2021)