రెండు ఉద్యోగాలు పోగొట్టుకున్న పీవీ నరసింహారావు
“ఆయనదొక రికార్డు కాని విజయవంతమైన చరిత్ర” అని ప్రపంచ ఆర్ధిక వేదిక అధ్యక్షుడు క్లాస్ స్క్వాబ్ పీవీని బాహాటంగా ప్రశంసించారు.
పీవీ ప్రధాని పదవి నుంచి దిగిపోయాక మూడేళ్ళకు
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జే ఆర్ డి టాటా స్మారకోపన్యాసం చేస్తూ పీవీ ఓ
ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
“సోషలిస్ట్ కార్యక్రమాన్ని (భూసంస్కరణలను)
అమలుచేసే క్రమంలో నేను ఒక
ఉద్యోగాన్ని(ముఖ్యమంత్రి పదవి)పోగొట్టుకున్నాను. సోషలిస్ట్ క్రమం తర్వాత
ఉదారీకరణను అమలు చేసే క్రమంలో మరో ఉద్యోగాన్ని(ప్రధాన మంత్రి పదవి)
పోగొట్టుకున్నాను”
రాజీవ్ హత్య తరువాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ
నేతగా ఎన్నికైన పిదప పీవీ నరసింహారావు అప్పటి క్యాబినెట్ సెక్రెటరీ నరేష్ చంద్ర
ఇతర ఆర్ధిక శాఖ అధికారులను పిలిచి చర్చించారు. దేశ ఆర్ధిక పరిస్థితి చాలా ఘోరంగా
వుందని వారు వివరించారు. ఆర్ధిక మంత్రిగా రాజకీయ నాయకుడిని కాకుండా ఒక ఆర్ధిక
వేత్తను నియమించాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు.
పీసీ అలగ్జాండర్ (ఇందిరాగాంధి ప్రిన్సిపల్
సెక్రెటరి) సలహా మేరకు ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్ ఐ.జి.పటేల్ పేరును పరిశీలించారు. ఆయన విముఖత చూపడంతో మన్మోహన్
సింగ్ ని ఎంపిక చేశారు.
1991 జూన్ 21 శుక్రవారం నాడు పీవీ ప్రధానిగా పదవీ
స్వీకార ప్రమాణం చేశారు. తర్వాత రెండు రోజులకే జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆర్ధిక
సంస్కరణల ఆవశ్యకతను వివరించారు. అప్పటికి ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రమాణం
స్వీకరించి ఇరవై నాలుగు గంటలే
అయింది. తర్వాత మూడు రోజులకు మన్మోహన్
సింగ్ ఆయన్ని కలుసుకున్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న దుర్భర ఆర్ధిక స్థితి
నుంచి గట్టెక్కాలంటే 500 కోట్ల
డాలర్లు, హీన
పక్షం 200 కోట్ల డాలర్ల రుణం ఐ.ఎం.ఎఫ్. నుంచి
తీసుకోక తప్పదని మన్మోహన్ ప్రధానితో చెప్పారు. పీవీ చిరునవ్వు నవ్వి ‘నాకు తెలుసు.
అలాగే కానివ్వండి’ అంటే
ఆర్ధిక మంత్రి ఆశ్చర్యపోయారట. అక్కడికక్కడే ప్రధాని అనుమతి లభించడంతో మన్మోహన్
నేరుగా తన కార్యాలయానికి వెళ్లి, అప్పటికప్పుడే రుణం అభ్యర్ధిస్తూ ఐ.ఎం.ఎఫ్. కు
లేఖ రాశారు. రూపాయి మారకం రేటు తగ్గింపు, ఎగుమతి సబ్సిడీల కోత, పారిశ్రామిక లైసెన్సుల
రద్దు వంటి నిర్ణయాలను త్వరితగతిన తీసుకున్నారు. నలభయ్ ఏళ్ళుగా అమల్లో వున్న
లైసెన్స్ రాజ్ వ్యవస్థను ఎనిమిది గంటల్లో రద్దు చేశారని, ఈ నిర్ణయాలకు ముందు, జనతా
దళ్ నేత చంద్రశేఖర్,
బీజేపీ నాయకుడు అద్వాని,
సీపీఎం నేత హరికిషన్ సింగ్ సూర్జిత్ వంటి వారితో ప్రధాని ఆంతరంగిక చర్చలు జరిపారని,
అందువల్లే తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి రణగొణ ధ్వనులు వినిపించలేదని, ఇదంతా
పీవీ వ్యూహ రచన అని రచయిత వివరించారు.
1991 జులై
మూడో తేదీ రాత్రి మన్మోహన్ సింగ్, చిదంబరం, మాంటెక్ సింగ్ ఆహ్లూ వాలియా ప్రధాని నివాసానికి
వెళ్ళారు. అప్పుడే స్నానం చేసి వచ్చి
ఫ్రెష్ గా కనిపిస్తున్న పీవీకి తమ ప్రతిపాదనలు వివరించారు. నిజానికి ఇవన్నీ ఆయన
పనుపునే తయారైనవి. అయినా పీవీ గుంభనగా మన్మోహన్ సింగ్ వైపు చూసి ‘వీటికి మీరు
అంగీకరిస్తున్నారా?’ అని
అడిగారు. మన్మోహన్ తల పంకించారు. ‘అయితే సంతకం చేయండి’ అని
పీవీ అన్నారు. మన్మోహన్ సంతకం చేయగానే దానికింద పీవీ తన సంతకం పెట్టారు.
ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక్కోసారి
కొన్ని నెలలు,
సంవత్సరాలు పడతాయి. కానీ ఈ నలుగురూ కలిసి అతి వేగంతో తీసుకున్న నిర్ణయాలు
విప్లవాత్మమైనవి అని చెప్పక తప్పదని రచయిత కృష్ణారావు పేర్కొన్నారు.
(ఇంకా వుంది)