15, ఏప్రిల్ 2020, బుధవారం

అభిమానం అర్ణవమైతే.....ఒక పరిశీలన


రాష్ట్ర విభజనకు ముందరి నుంచి, సరిగ్గా చెప్పాలంటే జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో విబేధించి సొంతంగా వై.ఎస్.ఆర్.సి.పి. పేరుతొ కొత్తగా కొత్త  పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి అటు చంద్రబాబును, ఇటు జగన్ మోహన రెడ్డిని వ్యక్తిగతంగా అభిమానించే అనేకమంది నాకీ ఫేస్ బుక్ లో తారసపడ్డారు. అయితే వీరందరూ వారిద్దరినీ ప్రగాఢంగా అభిమానించే వారే కాని, మూఢ౦గా  అనుసరించే వారు కాదు. ఈ నాయకులను అభిమానించడానికి వీరికి కులమూ, రాజకీయాలు కారణాలు కావు. జస్ట్. అంతే! ‘బాబు అంటే మాకు ఇష్టం, జగన్ అంటే మాకు అభిమానం’.  ఇవే వారిని కదిలిస్తే వచ్చే జవాబులు. నాకు తెలిసి ఒకే కుటుంబంలో ఇలా వీరిద్దర్నీ విడివిడిగా అభిమానించేవారు కూడా వున్నారు. 2014లో జగన్ ఓడిపోయి బాబు గెలిచినప్పుడు,2019 లో జగన్ గెలిచి బాబు ఓడిపోయినప్పుడు కూడా ఏమాత్రం తేడా రాలేదు.
‘బాబు మంచి సమర్ధకుడైన పాలకుడు. రాష్ట్రం ఆయన చేతిలో సురక్షితంగా వుంటుంది’.
‘జగన్ పాపం చిన్నవాడు, అమాయకుడు, రాజకీయాలు తెలవ్వు,  అందరూ కలిసి ఈ పిల్లవాడిని  వేధిస్తున్నారు’
ఇవీ వాళ్ళు తమ అభిమానానికి కొలమానంగా పెట్టుకున్న ప్రాతిపదికలు.
అభిమానాలు వుంటే పర్వాలేదు. దురభిమానాల స్థాయి కూడా తక్కువేమీ కాదు.
‘చంద్రబాబువి కుటిల రాజకీయాలు. నమ్మిన వారిని నట్టేట ముంచుతారు. పత్రికలను అడ్డుపెట్టుకుని పేపర్ టైగర్ మాదిరిగా జనంలో తానో పెద్ద రాజనీతిజ్ఞుడిని అని ప్రచారం చేసుకుంటూ దాన్ని తానే నమ్ముతూ ఊహాలోకంలో మునిగితేలుతూ వుంటారు’
‘జగనా! బాబోయి! పెద్ద దోపిడీ దొంగ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నాడు. పరిపాలన బొత్తిగా తెలవదు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి’     
నేను గమనించింది ఏమిటంటే ఈ అభిమానులలో ఎవ్వరికీ రాజకీయ ప్రయోజనాలు లేవు. అసలు రాజకీయాల అంటూ సొంటూ అంటని వారే వీరిలో ఎక్కువ. యువతీయువకులు, చదువుకున్న గృహిణులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు. ఏ రాజకీయ పార్టీతో కానీ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేనివాళ్ళు.  ఇది మొదటి తరగతి. ఇలాంటివారు నాతోపాటు మీకు కూడా ఈ ఫేస్ బుక్ లో తారసపడి ఉండవచ్చు. వీరిది కల్తీ లేని అభిమానం. వారిపట్ల అవ్యాజానురాగం. అదే వారిచేత అలా మాట్లాడిస్తోంది. ఇలా ఉంచుదాం.
పొతే రెండో తరగతి. వీరికి రాజకీయాలతో సంబంధం వుంది. ఏదో ఒక రాజకీయ పార్టీతో ఏదో ఒక సంబంధం ఉన్నవాళ్ళే. ఒకరకంగా ఒక శ్రేణి నాయకులు. వీలును బట్టి, గాలి వాలునుబట్టి వీరి రాజకీయ విధేయతలు తారుమారవుతుంటాయి. ఎంతోకొంత ప్రయోజనం ఆశించే ఈ రకమైన రాజకీయాలు నెరుపుతుంటారు. బాబు పట్ల, జగన్ పట్ల వీరి అభిమానాలు కాలనుగుణంగా, అవసరాలను బట్టి  మారిపోతుంటాయి. ఇలాంటివాళ్ళు ఫేస్ బుక్ లోను, టీవీల్లోనూ కనబడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వుంటారు. ఓ పదేళ్ళ కాలాన్ని జాగ్రత్తగా గమనిస్తే,  ఈ కొద్దికాలంలోనే వీళ్ళు  తమ రాజకీయ అభిప్రాయాలను ఎన్నిసార్లు ఎలా   మార్చుకుంటూ వచ్చిందీ అవగతమవుతుంది.
ఇంతకీ చెప్పవచ్చింది ఏమిటంటే మొదటి తరగతి వారి అభిమానం  ఇప్పటికీ ఆ నాయకుల పట్ల చెక్కు చెదరకుండా ఉంటూ వస్తోంది.  ఈ ఇద్దరు నాయకుల పట్ల వారి అభిమాన దురభిమానాలలో ఎలాంటి తేడా రాలేదు. ఎందుకంటే అవి రాతిమీది గీతలు. తేలిగ్గా చెరిగిపోవు. రెండో తరగతి వాళ్ళవి నీటి మీద రాతలు. ఇట్టే మాయమై పోతాయి.
మొదటి తరగతి వారివల్ల రాజకీయ నాయకులకు పెద్ద ఉపయోగం లేదు. తమ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకునేందుకు వీలుగా ప్రజాభిప్రాయాన్ని ఏదో ఒక మేరకు ప్రభావితం చేసేందుకు వీరి రాతలు, అభిప్రాయాలు వారికి ఉపయోగపడుతుంటాయి. ప్రతిఫలం ఆశించకుండా  ఈ పనులు చేస్తుంటారు కాబట్టి వీళ్ళను పెద్దగా పట్టించుకోవాల్సిన  పని వారికీ లేదు.
పొతే, రెండో తరగతి వాళ్ళను ఎలా ఉపయోగించుకోవచ్చో రాజకీయులకు కొట్టిన పిండి. రాజకీయుల్ని ఎలా వాడుకోవచ్చో వీరికీ వెన్నతో పెట్టిన విద్య.
ఇతి వార్తాః   

14, ఏప్రిల్ 2020, మంగళవారం

ఐ వాంట్ టు డై ఎట్ మై హోం


రెండు సంఘటనలు చెప్పుకుందాం.
2018 ఏప్రిల్ పద్నాలుగో తేదీ సాయంత్రం. కార్పొరేట్ ఆసుపత్రిలో ఓ  డాక్టరు తన పేషెంటుతో   చెబుతున్నాడు.
‘మీకు మంచి వైద్యం అందుతోంది, త్వరలో కోలుకుంటారు’
‘సరే కానీ డాక్టర్! ఐ వాంట్ టు డై ఎట్ మై హోమ్. ప్లీజ్ డిశ్చార్జ్’
ఆ పేషెంటు కూడా డాక్టరే. మా అక్కయ్య కుమారుడు డాక్టర్ ఏపీ రంగారావు.
పేషెంటు అభ్యర్ధన మేరకు డిశ్చార్జ్ చేసారు. ఇంటికి చేరాడు. పన్నెండు గంటలు కూడా కాలేదు. ఆ రాత్రి గడవలేదు. తెల్లవారుజామున కన్ను మూశాడు.
ఇక రెండోది.
మా దగ్గరి బంధువును హైదరాబాదులోని ఓ పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. వారిది ఈ ఊరు కాదు. పరిస్తితి క్రిటికల్ అన్నారు. రెండు రోజులు గడిస్తే కాని చెప్పలేమన్నారు. ‘ఒక టెస్ట్ చేయించాలి, అదిక్కడ లేదు, బయట వాళ్ళు చేస్తారు, ఏడు వేలు అవుతుంది, ఆ టెస్ట్ చేయడానికి వచ్చిన వాడికి ఏడు వేలు ఇవ్వండి’ అని చెప్పారు ఆసుపత్రివాళ్ళు. ఆ టెస్ట్ చేయించారు. డబ్బు చెల్లించారు. గంటలు గడవక ముందే ఆ పేషెంటు కన్ను మూసింది. ఆసుపత్రి ఫీజులన్నీ ముందే కట్టేశారు కనుక డిశ్చార్జ్ కి ఎక్కువ టైం తీసుకోలేదు. ఇంతలో వాళ్లకు అంతకు ఒక రోజు ముందు చేయించిన టెస్ట్ జ్ఞాపకం వచ్చి అడిగారు. ఆ రిజల్ట్ అయిదు రోజులకు వస్తుంది అని జవాబు.
‘రెండు రోజులు గడవటం కష్టం’ అని చెప్పిన వాళ్ళు అయిదు రోజుల తర్వాత రిజల్ట్ వచ్చే టెస్ట్, అదీ ఆసుపత్రి వెలుపల వాళ్ళ చేత చేయించడం ఏమిటో అర్ధం కాని స్తితిలోనే వాళ్ళు పేషెంటు బాడీ తీసుకుని  ఊరికి వెళ్ళిపోయారు.   
చికిత్స పేరుతో డబ్బులు పిండుతూ చేసే ఇటువంటి వైద్యాలకు డాక్టర్ రంగారావు పరమ విరోధి. అతితక్కువ ఖర్చుతో చేసే వైద్యమే పేదవారు ఎక్కువగా వుండే మన వంటి దేశాలకు ఉపయుక్తమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. స్వల్ప ఖర్చుతో సత్వర వైద్యం అనేది ఆయన నినాదం. చిన్న చిన్న అస్వస్థతలను శరీరమే తట్టుకుంటుందని, వీటి కోసం పెద్ద పెద్ద వైద్యాలు, పరీక్షలు అనవసరమన్నది డాక్టర్ రంగారావు నిశ్చితాభిప్రాయం. ఇలా వచ్చిన వారికి ఆయన ఓ క్రోసిన్ గోలీ వేసుకోండని చెబుతూ వుండేవారు. ఆయన అన్నట్టే వారికి స్వాంతన చేకూరేది. దానితో ఆయనకు డాక్టర్ క్రోసిన్ అనే పేరు వచ్చింది.
ఎన్నో ఏళ్ళక్రితం వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడు, యువ డాక్టర్లకు నేర్పే ఓ నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.
రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదుఅన్నది ఆ పాఠం.
నిజానికి డాక్టర్ రంగారావు ఒక మామూలు డాక్టర్. ‘నేనొక షరా మామూలు డాక్టర్ ని’  ఆయన అనుకున్నట్టయితే ఆయన కధే వేరుగా వుండేది. ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.
పది జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే చక్కబెట్టగలిగారు.
అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి కనుకనే ఇతరులకు అసాధ్యం అనుకున్న 108, 104 వంటి అనేక అపూర్వ  పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.
సకల జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. కనుకనే ఆయన మరణించిన తర్వాత జ్వాలా వంటివారు డాక్టర్ రంగారావు గురించి రాసిన అనేక వ్యాసాలు పత్రికల్లో చదివి,  ‘ఈయన ఇంతటి గొప్పవాడా, మాకు తెలియదే’ అంటూ ఫోన్లు చేసి కొనియాడిన అపరిచితులు అనేకమంది.

ఏప్రిల్ పదిహేను ఆయన వర్ధంతి.   



(డాక్టర్  ఏపీ రంగారావుతో నేను)
   


మోదీగారి సప్తపది


మే మూడు వరకు లాక్ డౌన్ పొడిగించడం. చాలామంది అనుకున్నదే. పేదప్రజల్ని దృష్టిలోపెట్టుకుని  ఈనెల ఇరవై తర్వాత అవసరమైన చోట్ల  సడలింపులు. ఇందులో సామాజిక ఆర్ధిక కోణాలు కూడా వున్నాయి. నిర్ణయం తీసుకోవడంలో ప్రజాస్వామ్యబద్ధంగా  వ్యవహరించినట్టు కనబడే ప్రయత్నం చేసారు. తన ఒక్కడి నిర్ణయాన్ని దేశం మీద రుద్దడం లేదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించిన తర్వాతనే ఈ పొడిగింపు అనే సంకేతాన్ని జనంలోకి బలంగా పంపారు.
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరికొంతకాలం కొనసాగుతాయి. రోజువారీ కూలీపనులు చేసుకుని పొట్టపోసుకునే పేద ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతాయి. నిజమే!
ఈ సందర్భంలో ఒక విషయం చెప్పదలిచాను. చాలా పాత సంగతి.
ఒకప్పుడు సోవియట్ యూనియన్ ని తన కనుసన్నల్లో శాసించిన మిహయిల్ గోర్భచేవ్ పదవి నుంచి దిగిపోయిన తరవాత బీబీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం  చెప్పారు. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన విస్తృతంగా దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. వాళ్ళు పడే ఇబ్బందులను దగ్గర నుంచి గమనిస్తారు. సరిపడా తిండి గింజలు కూడా లేని పరిస్తితి. ఆ విషయం ప్రజలతో అంటే వాళ్ళు ఓ మాట చెబుతారు.
“తిండి గింజల కొరత చాలా చిన్న విషయం. అందరం కాస్త కష్ట పడితే ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు. అది కాదు మిమ్మల్ని కోరేది. యుద్ధాలు రాకుండా చూడండి. యుద్ధాల వల్ల మన దేశం గతంలో ఎంత కష్టపడిందో, ఎంత నష్ట పోయిందో అందరికీ తెలుసు. కాబట్టి మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూడండి” అంటారు.
ఆ నాటి రష్యన్ ప్రజల స్పూర్తి ఈనాడు మనకు అవసరం.
కరోనాను కట్టడి చేయడానికి ఇప్పటివరకు ఇరవై ఒక్కరోజులు లాక్ డౌన్ లో గడిపాము. ప్రధాని మోడీ మరో పందొమ్మిది రోజులు తప్పదు అంటున్నారు. కరోనా రక్కసిని తుద ముట్టించడానికి ఇంతవరకు వాక్సిన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే అది వ్యాప్తి చెందకుండా చేసే ఉపాయం మన చేతిలోనే వుంది. అదేమిటంటే ప్రధాని సప్తపది ప్రణాళికలో చెప్పినట్టు కష్టమో, నష్టమో మే మూడు వరకు ఇంటి పట్టున ఉండడమే. అదొక్కటే మనం మన  దేశానికి మొత్తం ప్రపంచానికి చేసే సేవ. నాడు రష్యన్ ప్రజలు చెప్పినట్టు స్వచ్చందంగా ఈ బాధ్యతని మనం అందరం నెత్తికెత్తుకోవాలి. ఇది మినహా గత్యంతరం లేదు.
మొదటి మూడు వారాల లాక్ డౌన్ కాలంలో కొన్ని పొరబాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకుంటూ మరో పందొమ్మిది రోజులు గడపాలి. మందు వంట పట్టడానికి మండలం వ్యవధి అవసరం అంటారు. అంటే నలభయ్ రోజులు. నలభయ్ రోజుల్లో ఈ మహమ్మారిని పారద్రోలే అవకాశం వుందనుకున్నప్పుడు ప్రధాని మోడీ చెప్పినట్టు వినాలి. విని తీరాలి. మరో దారి లేదు. ముందు ముందు మరింత కఠినంగా అమలు చేస్తామంటున్నారు. అదీ మంచిదే. అలా చేయని పక్షంలో ఇన్నాళ్ళు ప్రజలు పంటి బిగువున ఓర్చుకుంటూ వచ్చిన కష్టాలకు ఫలితం లేకుండా పోతుంది.
ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే మార్గదర్శిక సూత్రాలు రేపో మాపో వస్తాయి. కరోనా విసిరిన  సవాలును తేలిగ్గా తీసుకోకపోవడమే నేటి తక్షణ కర్తవ్యమ్.   

13, ఏప్రిల్ 2020, సోమవారం

కరోనా కలయిక


ఆదివారం రాత్రి పద్నాలుగు కుటుంబాల వాళ్ళం ఒక చోట కలిసాము, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండానే. ఈ కలయికకు కర్త కర్మ క్రియ మా అన్నయ్య పెద్ద కోడలు రేణు సుధ. రాత్రి తొమ్మిది గంటలకు మనమంతా కలుస్తున్నాం, జూమ్ యాప్ సాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా’ అని ముందుగానే అన్ని కుటుంబాలకు వాట్సప్ సమాచారం అందించింది. అమెరికాలో వేర్వేరు చోట్ల ఉంటున్న మా అన్నయ్య పిల్లలు, మా పెద్దబ్బాయి కుటుంబం, ఖమ్మంలో మూడు కుటుంబాల వాళ్ళు, ముంబైలో ఉంటున్న ఒక కుటుంబం,   హైదరాబాదు సరే సరి మిగిలిన వాళ్ళందరూ రకరకాల ప్రదేశాల్లో వుంటున్నారు, అందరూ చెప్పిన టైము కల్లా కెమెరాల్లో మొహాలు పెట్టాము. ఒకళ్ళనొకళ్ళం పలకరించుకున్నాం. మనసారా మాట్లాడుకున్నాం. ఇంతకు  ముందు ఇలా ఫోన్ల ద్వారా పలకరింపులు మాకు  కొత్తేమీ కాదు, అలాగే వీడియో కాల్స్ కూడా. కానీ ఇలా అందరం ఒక ఫ్రేములో కలవడం ఇదే మొదటి సారి.
కొసమెరుపు ఏమిటంటే ఏ కరోనా అయితే మమ్మల్నందర్నీ ఇలా కలిపిందో ఆ కరోనా ముచ్చటే లేదు మా మాటల్లో. దాని ప్రస్తావన లేకుండానే అరగంట మాట్లాడుకున్నాం.     

కరోనా రోజుల్లో హైదరాబాదు


1970 లేదా అంతకుపూర్వం నుంచి హైదరాబాదులో నివసిస్తూ ఉన్నవారికి, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వుంటున్నవారికి నాటి హైదరాబాదు భౌగోళిక వాతావరణ పరిస్తితులు గుర్తుండేవుంటాయి. చాలా ప్రశాంతంగా వుండేది. బస్సులో హైదరాబాదు వస్తుంటే నగర పొలిమేరలకు చేరుతుండగానే కిటికీ చువ్వలు చల్లగా ఐస్ కడ్డీలుగా మారిపోయేవి. నడి వేసవిలో కూడా ఉదయాలు, సాయంత్రాలు చల్లగా, ఆహ్లాదంగా ఉండేవి. తెల్లవారి బాగా పొద్దుపోయే దాకా నగర వీధులు నిశ్శబ్దంగా, జన సంచారం లేకుండా కానవచ్చేవి. అప్పుడప్పుడు అక్కడక్కడ సైకిళ్ళ మీద, రిక్షాలమీద  వెడుతూ కొందరూ, కాలినడకన కొందరూ కనిపించేవారు. కానీ చాలా చాలా అరుదు. ఆ దృశ్యాలు ఆహ్లాదకరంగా ఉండేవి. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చిన దాకా నగరం బద్ధకం దుప్పటి కప్పుకున్నట్టు నిద్రాణంగా వుండేది. ఏదో పనులమీద, బహుశా ఉస్మానియా యూనివర్సిటీలో పనిపడి కాబోలు  ఒకటి రెండు సార్లు ఆ రోజుల్లో హైదరాబాదు వచ్చిన అనుభవం వుంది. ఇక 1975 నుంచి నా ఆల్ మకాం హైదరాబాదుకే మారింది.
ఇప్పుడు ఈ లాక్ డౌన్ కాలంలో ఆలోచిస్తుంటే నాటి నగర శోభ కనుల ముందు తిరుగుతోంది. నేను బయటకి వెళ్లి చూడగలిగిన, లేదా తిరుగాడగలిగిన అవకాశం వుంటే బహుశా ఆ నాటి నగరాన్ని, నిశ్శబ్దంగా, జన సంచారం, వాహనాల రొద లేని నాటి వీధుల్ని మళ్ళీ ఒకసారి చూడగలిగే అదృష్టం లభించేదేమో! కానీ దురదృష్టం. ఇవన్నీ ఊహలకే పరిమితం చేసుకోవాల్సివస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి ఈనాటి వరకు నేను  ఇంటిగడప (ఇప్పుడు అన్నీ గడపలు లేని ఇళ్ళే అనుకోండి) దాటి కాలు బయట పెట్టలేదు. అపార్ట్ మెంటు లిఫ్ట్ లో కూడా కాలుమోపలేదు.   

https://www.youtube.com/watch?v=UVH0hoMmMJE    

(LINK COURTESY: విన్నకోట నరసింహారావు గారు)

12, ఏప్రిల్ 2020, ఆదివారం

వార్తలు చదువుతున్నది పార్వతీప్రసాద్! ఇకలేరు !


దుర్వార్తలకు గంధర్వుల శాపం ఉందేమో! మొదలు పెడితే చాలు వరసగా అవే.
ఆకాశవాణి న్యూస్ రీడర్ పార్వతి ప్రసాద్ గారు ఈ తెల్లవారుఝామున కన్నుమూసారు. గత కొద్దికాలంగా అస్వస్తులుగా వుంటున్నారు. ఆ సంగతి తెలిసినా పోలేని పరిస్తితి. డి. వెంకట్రామయ్య గారు పోయినప్పుడు ఆవిడ కలిసారు. సంస్మరణ సమావేశంలో పార్వతి గారే సర్వం చూసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మాడపాటి సత్యవతి గారు, దుగ్గిరాల పూర్ణయ్య గారు, పొత్తూరి  వెంకటేశ్వర రావు గారు, సి.నరసింహారెడ్డి గారు, ఈరోజు పార్వతి గారు.
ఇంతమెల్లగా మృదువుగా మాట్లాడే పార్వతి గారు వార్తలు ఎలా చదువుతారు అనిపించేది. కానీ ఆవిడ రెడియోలోనే కాదు, దూరదర్సన్లో కూడా వార్తలు చదివారు.
ఒకసారి ఢిల్లీ నుంచి ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ వచ్చారు. ఆర్వీవీ కృష్ణారావు గారు, సీజీకే మూర్తిగారు అందరం కలిసి మాట్లాడుతుంటుంటే అప్పుడే రేడియోలో వార్తలు మొదలయ్యాయి. పార్వతిగారు చదువుతున్నారు. తెలుగు తెలియని డీజీ గారు శ్రద్ధగా వింటున్నారు. ఆవిడ స్టూడియో నుంచి రాగానే డీజీ లేచి నిలబడి ఆవిడని అభినందించారు. చక్కటి స్వరం అని మెచ్చుకున్నారు. ఆవిడ క్యాజువల్ న్యూస్ రీడర్ అని చెబితే రెగ్యులర్ రీడర్ల కంటే బాగా చదివారని ఆయన అందరిలో ప్రశంసించడం పార్వతి గారి ప్రతిభకి తార్కాణం.
‘బాగున్నారు కదా!’ అని ఆత్మీయంగా పలకరించే మనిషి ఇక కనబడరు. ఆవిడ సుస్వర స్వరం మరి వినపడదు.
పార్వతీ ప్రసాద్ గారి ఆత్మశాంతికి ప్రార్ధించడం మినహా ఈ కరోనా సమయంలో చేయగలిగింది లేదు.    

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఓ పాత వృత్తాంతం నెమరు వేసుకోవడానికి మాత్రమే


ఏదో జరుగుతుంది. వెంటనే అప్పుడెప్పుడో ఇలాగే జరిగింది అంటారు పెద్దవాళ్ళు, దానికీ దీనికీ పెద్దగా పోలికలేకపోయినా.
అలాగే ఇది. జరిగింది ఏమిటో మీకు తెలుసు, విడిగా అదేమిటో చెప్పక్కర లేదు. పోలిక అంటారా! మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని  పేటిక మాదిరే. అందులో ఎవరికి కావాల్సింది వాళ్లకు కనబడుతుంది. అక్కరలేదు అనుకున్నది కనబడదు. మన రాజకీయాల సంగతి చెప్పేది ఏముంది.
ఇక చిత్తగించండి!
ఈ వ్యాసం ఇండియా టుడే పత్రికలో 1993 అక్టోబర్ సంచికలో వచ్చింది. రాసిన జర్నలిస్టు పేరు మనోజ్ మిత్తా. ఆ వ్యాసానికి ఇది స్వేచ్చానువాదం. ఆ పత్రిక వారికి కృతజ్ఞతలు.
ఆ రోజుల్లో ఎన్నికల చీఫ్ కమిషనర్ టి.ఎన్. శేషన్ అంటే జనాలకు ఎనలేని ఆదరణ అభిమానం. రాజకీయులకు సింహస్వప్నం.
అయితే ఎంతటి వారికి కూడా ఒక రోజు వస్తుందనేది నానుడి. అది సెషన్ విషయంలో కూడా జరిగింది.
అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది. అది ఆయన్ని ఇరకాటంలోనే కాదు ఆశ్చర్యంలో కూడా ముంచివేసింది. ఎందుకంటే ఇలాటి రోజు ఒకటి వస్తుందని ఆయన కూడా ఎప్పుడూ ఊహించి వుండరు.
అప్పటివరకు ఎలెక్షన్ కమిషన్ అంటే శేషన్ ఒక్కరే. ఆయనే దానికి కర్తా కర్మా క్రియా అన్నీను. అలాంటిది మరో ఇద్దరు ఎలెక్షన్ కమిషనర్లను ప్రభుత్వం అదనంగా నియమించింది. అది ఎంతటి ఆకస్మిక నిర్ణయం అంటే కొత్తగా నియమితులయిన ఇద్దరు కమిషనర్లు శ్రీ జీవీజీ కృష్ణమూర్తి, శ్రీ ఎం.ఎస్. గిల్ లకు కూడా ఆ సమాచారం ఆఖరి నిమిషంలోనే తెలిసింది. అప్పుడు వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్న గిల్ అధికారిక పర్యటన నిమిత్తం ఆ రోజు ఉదయమే గ్వాలియర్ వెళ్ళారు. ఆయన్ని మళ్ళీ ఢిల్లీ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక  ప్రత్యేక విమానాన్ని పంపింది.  పుణేలో సెలవులు గడపడానికి వెళ్ళిన శేషన్ కు ఈ విషయం తెలిసింది. “ఇంకా నూటొక్క మంది కమిషనర్లను వేసుకోమనండి, నాకేమీ ఫరకు పడదు” అన్నది ఆయన మొదటి స్పందన.
ఇక కృష్ణమూర్తి గారి విషయం తీసుకుంటే ఆయన కొన్నింటిలో శేషన్ కు ఏ మాత్రం తీసిపోరు. ఆయన కేంద్రంలో న్యాయ శాఖ కార్యదర్శిగా పనిచేసారు. ఆయన శేషన్ రక కోసం ఎదురు చూడకుండా ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో తనకంటూ ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు.  శేషన్ కు నమ్మకస్తుడిగా  ఎలెక్షన్ కమిషన్ లో కోర్టు వ్యవహారాలు చూస్తున్న మాజీ అటార్నీ జనరల్  జి. రామస్వామి, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఒక కేసులో కమిషన్ తరపున వాదించడానికి వీలులేకుండా ఆర్డరు వేసారు. ఎందుకంటే అనదరి కంటే ముందు ఇలాముగ్గురు సభ్యులను నియమించడం రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది ఆ రామస్వామి కాబట్టి.
“ఇక నుంచి  ఎలెక్షన్ కమిషన్ అంటే మేము ముగ్గురం.” అని ఇండియా టుడే తో తేల్చి చెప్పారు. అయినా శేషన్ పట్టుబట్టి ఆ కేసును మళ్ళీ రామస్వామికే అప్పగించారు. అది వేరే విషయం. అప్పటి నుంచి ఈ ఇరువురి నడుమ విబేధాలు పెరిగిపోయాయి. తనకు ఆఫీసులో తగిన గౌరవం లభించడం లేదని ఒకసారి శ్రీ కృష్ణమూర్తి ఆఫీసు నుంచి బయటకు వెళ్ళిపోయారు కూడా. తను కూర్చుండే గదికి తాళం వేసి వుండడం, ఫోను వైర్లు తెగిపోయి వుండడం గమనించిన శ్రీ కృష్ణమూర్తి అవమానంగా భావించారు. భద్రతా హర్యాల కారణంగా ఒక రోజు ఆ గదికి తాళం వేసినట్టు శేషన్ విలేకరులకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మెత్తపడని కృష్ణమూర్తి ఆ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని శేషన్ హామీ ఇచ్చిన తర్వాతనే ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టారు.
మూడో సభ్యుడైన గిల్ మాత్రం ఈ వ్యవహారాలను తేలిగ్గా తీసుకున్నారు. ‘మనం ఏ కుర్చీలో కూర్చున్నాం, మన గదిలో ఎన్ని సోఫాలు వున్నాయి అన్నది ప్రధానం కాదు. రాజ్యాంగం మనకు ఒప్పగించిన బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అన్నదే ప్రధానం’ అనేది ఆయన అభిప్రాయం.
ఇదిలా ఉండగానే ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తెచ్చింది. ముగ్గురు కమిషనర్లలో  ఒకరుఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు, హోదాలో, అధికారాల్లో అందరూ సమానమే” అన్నది దాని సారాంశం.
(ఇండియా టుడే సౌజన్యంతో)