మే మూడు వరకు లాక్ డౌన్ పొడిగించడం.
చాలామంది అనుకున్నదే. పేదప్రజల్ని దృష్టిలోపెట్టుకుని ఈనెల ఇరవై తర్వాత అవసరమైన చోట్ల సడలింపులు. ఇందులో సామాజిక ఆర్ధిక కోణాలు కూడా
వున్నాయి. నిర్ణయం తీసుకోవడంలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినట్టు కనబడే ప్రయత్నం చేసారు. తన
ఒక్కడి నిర్ణయాన్ని దేశం మీద రుద్దడం లేదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించిన
తర్వాతనే ఈ పొడిగింపు అనే సంకేతాన్ని జనంలోకి బలంగా పంపారు.
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే దేశ ప్రజలు
పడుతున్న ఇబ్బందులు మరికొంతకాలం కొనసాగుతాయి. రోజువారీ కూలీపనులు చేసుకుని
పొట్టపోసుకునే పేద ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతాయి. నిజమే!
ఈ సందర్భంలో ఒక విషయం చెప్పదలిచాను.
చాలా పాత సంగతి.
ఒకప్పుడు సోవియట్ యూనియన్ ని తన
కనుసన్నల్లో శాసించిన మిహయిల్ గోర్భచేవ్ పదవి నుంచి దిగిపోయిన తరవాత బీబీసీ కి
ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు.
సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన
విస్తృతంగా దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. వాళ్ళు పడే ఇబ్బందులను
దగ్గర నుంచి గమనిస్తారు. సరిపడా తిండి గింజలు కూడా లేని పరిస్తితి. ఆ విషయం
ప్రజలతో అంటే వాళ్ళు ఓ మాట చెబుతారు.
“తిండి గింజల కొరత చాలా చిన్న విషయం.
అందరం కాస్త కష్ట పడితే ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు. అది కాదు మిమ్మల్ని కోరేది.
యుద్ధాలు రాకుండా చూడండి. యుద్ధాల వల్ల మన దేశం గతంలో ఎంత కష్టపడిందో, ఎంత నష్ట
పోయిందో అందరికీ తెలుసు. కాబట్టి మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూడండి” అంటారు.
ఆ నాటి రష్యన్ ప్రజల స్పూర్తి ఈనాడు
మనకు అవసరం.
కరోనాను కట్టడి చేయడానికి ఇప్పటివరకు
ఇరవై ఒక్కరోజులు లాక్ డౌన్ లో గడిపాము. ప్రధాని మోడీ మరో పందొమ్మిది రోజులు తప్పదు
అంటున్నారు. కరోనా రక్కసిని తుద ముట్టించడానికి ఇంతవరకు వాక్సిన్ అంటూ ఏమీ లేదు.
కాకపోతే అది వ్యాప్తి చెందకుండా చేసే ఉపాయం మన చేతిలోనే వుంది. అదేమిటంటే ప్రధాని
సప్తపది ప్రణాళికలో చెప్పినట్టు కష్టమో, నష్టమో మే మూడు వరకు ఇంటి పట్టున ఉండడమే.
అదొక్కటే మనం మన దేశానికి మొత్తం
ప్రపంచానికి చేసే సేవ. నాడు రష్యన్ ప్రజలు చెప్పినట్టు స్వచ్చందంగా ఈ బాధ్యతని మనం
అందరం నెత్తికెత్తుకోవాలి. ఇది మినహా గత్యంతరం లేదు.
మొదటి మూడు వారాల లాక్ డౌన్ కాలంలో
కొన్ని పొరబాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకుంటూ మరో పందొమ్మిది రోజులు గడపాలి.
మందు వంట పట్టడానికి మండలం వ్యవధి అవసరం అంటారు. అంటే నలభయ్ రోజులు. నలభయ్
రోజుల్లో ఈ మహమ్మారిని పారద్రోలే అవకాశం వుందనుకున్నప్పుడు ప్రధాని మోడీ
చెప్పినట్టు వినాలి. విని తీరాలి. మరో దారి లేదు. ముందు ముందు మరింత కఠినంగా అమలు
చేస్తామంటున్నారు. అదీ మంచిదే. అలా చేయని పక్షంలో ఇన్నాళ్ళు ప్రజలు పంటి బిగువున
ఓర్చుకుంటూ వచ్చిన కష్టాలకు ఫలితం లేకుండా పోతుంది.
ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే మార్గదర్శిక
సూత్రాలు రేపో మాపో వస్తాయి. కరోనా విసిరిన సవాలును తేలిగ్గా తీసుకోకపోవడమే నేటి తక్షణ
కర్తవ్యమ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి