రాష్ట్ర విభజనకు ముందరి నుంచి, సరిగ్గా
చెప్పాలంటే జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో విబేధించి సొంతంగా
వై.ఎస్.ఆర్.సి.పి. పేరుతొ కొత్తగా కొత్త పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి అటు చంద్రబాబును,
ఇటు జగన్ మోహన రెడ్డిని వ్యక్తిగతంగా అభిమానించే అనేకమంది నాకీ ఫేస్ బుక్ లో
తారసపడ్డారు. అయితే వీరందరూ వారిద్దరినీ ప్రగాఢంగా అభిమానించే వారే కాని, మూఢ౦గా అనుసరించే వారు కాదు. ఈ నాయకులను అభిమానించడానికి
వీరికి కులమూ, రాజకీయాలు కారణాలు కావు. జస్ట్. అంతే! ‘బాబు అంటే మాకు ఇష్టం, జగన్
అంటే మాకు అభిమానం’. ఇవే వారిని కదిలిస్తే
వచ్చే జవాబులు. నాకు తెలిసి ఒకే కుటుంబంలో ఇలా వీరిద్దర్నీ విడివిడిగా
అభిమానించేవారు కూడా వున్నారు. 2014లో
జగన్ ఓడిపోయి బాబు గెలిచినప్పుడు,2019 లో జగన్ గెలిచి బాబు ఓడిపోయినప్పుడు కూడా
ఏమాత్రం తేడా రాలేదు.
‘బాబు మంచి సమర్ధకుడైన పాలకుడు.
రాష్ట్రం ఆయన చేతిలో సురక్షితంగా వుంటుంది’.
‘జగన్ పాపం చిన్నవాడు, అమాయకుడు,
రాజకీయాలు తెలవ్వు, అందరూ కలిసి ఈ
పిల్లవాడిని వేధిస్తున్నారు’
ఇవీ వాళ్ళు తమ అభిమానానికి కొలమానంగా
పెట్టుకున్న ప్రాతిపదికలు.
అభిమానాలు వుంటే పర్వాలేదు. దురభిమానాల
స్థాయి కూడా తక్కువేమీ కాదు.
‘చంద్రబాబువి కుటిల రాజకీయాలు. నమ్మిన
వారిని నట్టేట ముంచుతారు. పత్రికలను అడ్డుపెట్టుకుని పేపర్ టైగర్ మాదిరిగా జనంలో
తానో పెద్ద రాజనీతిజ్ఞుడిని అని ప్రచారం చేసుకుంటూ దాన్ని తానే నమ్ముతూ ఊహాలోకంలో
మునిగితేలుతూ వుంటారు’
‘జగనా! బాబోయి! పెద్ద దోపిడీ దొంగ.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నాడు. పరిపాలన బొత్తిగా
తెలవదు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి’
నేను గమనించింది ఏమిటంటే ఈ అభిమానులలో
ఎవ్వరికీ రాజకీయ ప్రయోజనాలు లేవు. అసలు రాజకీయాల అంటూ సొంటూ అంటని వారే వీరిలో
ఎక్కువ. యువతీయువకులు, చదువుకున్న గృహిణులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు. ఏ
రాజకీయ పార్టీతో కానీ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేనివాళ్ళు. ఇది మొదటి తరగతి. ఇలాంటివారు నాతోపాటు మీకు కూడా
ఈ ఫేస్ బుక్ లో తారసపడి ఉండవచ్చు. వీరిది కల్తీ లేని అభిమానం. వారిపట్ల అవ్యాజానురాగం.
అదే వారిచేత అలా మాట్లాడిస్తోంది. ఇలా ఉంచుదాం.
పొతే రెండో తరగతి. వీరికి రాజకీయాలతో
సంబంధం వుంది. ఏదో ఒక రాజకీయ పార్టీతో ఏదో ఒక సంబంధం ఉన్నవాళ్ళే. ఒకరకంగా ఒక
శ్రేణి నాయకులు. వీలును బట్టి, గాలి వాలునుబట్టి వీరి రాజకీయ విధేయతలు
తారుమారవుతుంటాయి. ఎంతోకొంత ప్రయోజనం ఆశించే ఈ రకమైన రాజకీయాలు నెరుపుతుంటారు.
బాబు పట్ల, జగన్ పట్ల వీరి అభిమానాలు కాలనుగుణంగా, అవసరాలను బట్టి మారిపోతుంటాయి. ఇలాంటివాళ్ళు ఫేస్ బుక్ లోను,
టీవీల్లోనూ కనబడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వుంటారు. ఓ పదేళ్ళ కాలాన్ని
జాగ్రత్తగా గమనిస్తే, ఈ కొద్దికాలంలోనే
వీళ్ళు తమ రాజకీయ అభిప్రాయాలను ఎన్నిసార్లు
ఎలా మార్చుకుంటూ వచ్చిందీ అవగతమవుతుంది.
ఇంతకీ చెప్పవచ్చింది ఏమిటంటే మొదటి
తరగతి వారి అభిమానం ఇప్పటికీ ఆ నాయకుల పట్ల
చెక్కు చెదరకుండా ఉంటూ వస్తోంది. ఈ ఇద్దరు
నాయకుల పట్ల వారి అభిమాన దురభిమానాలలో ఎలాంటి తేడా రాలేదు. ఎందుకంటే అవి రాతిమీది
గీతలు. తేలిగ్గా చెరిగిపోవు. రెండో తరగతి వాళ్ళవి నీటి మీద రాతలు. ఇట్టే మాయమై
పోతాయి.
మొదటి తరగతి వారివల్ల రాజకీయ నాయకులకు పెద్ద
ఉపయోగం లేదు. తమ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకునేందుకు వీలుగా ప్రజాభిప్రాయాన్ని
ఏదో ఒక మేరకు ప్రభావితం చేసేందుకు వీరి రాతలు, అభిప్రాయాలు వారికి
ఉపయోగపడుతుంటాయి. ప్రతిఫలం ఆశించకుండా ఈ
పనులు చేస్తుంటారు కాబట్టి వీళ్ళను పెద్దగా పట్టించుకోవాల్సిన పని వారికీ లేదు.
పొతే, రెండో తరగతి వాళ్ళను ఎలా
ఉపయోగించుకోవచ్చో రాజకీయులకు కొట్టిన పిండి. రాజకీయుల్ని ఎలా వాడుకోవచ్చో వీరికీ
వెన్నతో పెట్టిన విద్య.
ఇతి వార్తాః
1 కామెంట్:
100 % fact you have written sir.
Super comedy on babu press meet
https://youtu.be/I-VT1iHEU_w
కామెంట్‌ను పోస్ట్ చేయండి