27, ఏప్రిల్ 2020, సోమవారం

మార్పు చూడని కళ్ళు (మూడో భాగం)



గోర్భచెవ్ అరెస్టు
1991, ఆగస్టు 18.
క్రిమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ఫోరొస్ భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్  గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే  రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్  వ్లాదిమిర్  కృశ్చెవ్ తో మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. ఒకనాటి సోవియట్ అధినేత నికితా  కృశ్చెవ్ ఉదంతం గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్  యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త ఒప్పందంపై ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు. అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోవియట్  రిపబ్లిక్ అధ్యక్షుడిగా పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. ఆయన ఆర్ధిక సంస్కరణల విషయంలో గోర్భచేవ్ కంటే రెండడుగులు ముందున్నారు. యువతలో మంచి అభిమానం సంపాదించుకున్నారు.
సోవియట్ యూనియన్ సమగ్రతను కాపాడాలని అనుకున్నవారి ప్రయత్నాలు ఫలించలేదు. అనుకున్నట్టే నాలుగు మాసాల అనంతరం సోవియట్ యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆరోజు ప్రెసిడెంట్ గోర్భచెవ్ వేసవి విడిదిలో ఏమి జరిగింది అనే విషయంలో కూడా విభిన్న కధనాలు వున్నాయి. తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్  కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం.  అయితే అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత స్థిమితపడ్డట్టు కనిపించింది. ఆ తరువాత వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని అంగీకరించడానికి మాత్రం  తిరస్కరించారు.
“మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పదు” అంటూ ఆయన వారిని హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత ఫోరొస్ విడిదిలోనే గోర్భచేవ్ దంపతులు గృహ నిర్బంధంలో  వుండిపోయారు. తరువాత రైసా గోర్భచేవ్ మరణించారు. ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ వారిద్దరూ చాలా భయం భయంగా రోజులు గడిపారు.  ఏది తిందామన్నా భయమే. ఏది తాగాలన్నా భయమే.  దేంట్లో విషం కలిపారో తెలవదని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో చెప్పారు.
మరునాడు, ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ యనఏవ్ మాస్కోలో  విలేకరులతో మాట్లాడారు. ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను  ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.
‘ప్రెసిడెంట్ సెలవులో వున్నారు’ అని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం,  చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం యావత్తు చూసింది.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే మళ్ళీ విధులకు హాజరవుతారు” అని ఆయన చెప్పారు.
ఆ రోజు ఆ విడిదిలో ఏమి జరిగింది అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి ఇలా అన్నారు. “పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి”
అయితే ఎమర్జెన్సీ ఎలా విధించాలి అనే దానిపై మాకు కొన్ని సూచనలు కూడా చేసారు అని బోల్దిన్ చెప్పారు.
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: