29, నవంబర్ 2019, శుక్రవారం

నిర్భయతో ఉన్న భయం పోయిందా ? లేని భయం పట్టుకుందా? – భండారు శ్రీనివాసరావు


ఆడపిల్లలకు సంబంధించి ఘోరమైన వార్తలు వినబడుతున్న నేపధ్యంలో ఏడేళ్ళ నాటి మరో ఘోర దురంతం గుర్తుకు వస్తోంది.
2012 డిసెంబరు 16  తేదీ రాత్రి భారత  రాజధాని ఢిల్లీలో జరిగిన పాశవిక కాండ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది.   సంఘటనలో మానాన్నీ, ప్రాణాన్నీ పోగొట్టుకున్న  యువతికి ఏమి న్యాయం జరిగిందో తెలియదు కానీ దేశంలోని ఆడపడుచులందరికీ ఊరట కలిగించే ఒక శాసనం  ఊపిరి పోసుకుంది.  నాకు తెలిసి స్వతంత్ర భారతంలో ప్రజల ఒత్తిడి ఫలితంగా ఒక చట్టం రూపొందిన సందర్భం కూడా అదే.  చట్టమే ‘నిర్భయ’.
ఆరుగురు కామాంధుల చేతికి చిక్కిన ఒక యువతి ఎటువంటి దుర్భర, దుస్సహ, శారీరక, మానసిక వేదనలకు గురైందన్న విషయం లోకానికి తెలిసివచ్చిన పదమూడు రోజుల తరువాత ఆ అనామిక (ఆ యువతి తల్లి ఆశాదేవి, చనిపోయిన తన కుమార్తె పేరు జ్యోతి సింగ్అని మొదటిసారి బహిర్గత పరిచారు. ఇటువంటి ఘోరాలకు బలి అయిన ఆడవారి పేర్లను బయట పెట్టరాదని మీడియా ఆ రోజుల్లో తనకు తానే ఒక లక్ష్మణ రేఖ గీసుకుంది) సింగపూరులో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన  పట్ల సభ్య సమాజం స్పందించిన తీరు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితిని సైతం కదిలించింది. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే. ఎస్. వర్మ నేత్ర్యత్వంలో త్రిసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన పరిశీలనకు వచ్చిన ఎనభయ్ వేలకు పైగా సలహాలు, సూచనలను పరిశీలించి నెల రోజుల లోపునే  సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.   మహిళల పట్ల లైంగిక పరమైన నేరాలు పెరిగిపోవడానికి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థల వైఫల్యంగా వారు అభిప్రాయపడ్డారు.  కమిటీ నివేదికలో సుమారు తొంభయ్  శాతం సిఫారసులను గుదిగుచ్చి రూపొందించిన ఆర్దినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, తదుపరి అది శాసనంగా చట్టసభల ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆర్డినెన్స్ బిల్లు రూపం ధరించి, 2013 మార్చి 19 తేదీన   లోకసభ ఆమోదం పొందేనాటికే అందులో పొందుపరచిన అనేక అంశాలు పలు మార్పులకు గురయ్యాయి. నిర్భయ చట్టంతో ఇటువంటి హేయమైన సంఘటనలు పునరావృతం కావని ఆశించడం  వృధా అని ఆ తరువాత  మూడేళ్ళ కాలంలో చోటుచేసుకుంటున్న అదే విధమైన పలు సంఘటనలు నిరూపించాయి. ఒక్క ఢిల్లీ కేసులో మినహా మరే సందర్భంలో కూడా కఠిన శిక్షలు పడిన  దాఖలా లేదు. అలా అని ఈ శాసనం వల్ల ఎలాటి ఉపయోగం లేదని కాదు. లైంగిక అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు చట్టాలను లెక్కపెట్టే స్థితిలో వుండకపోవచ్చు కానీ, అత్యాచార బాధితులకు మాత్రం ఈ చట్టం కొంత ఊరట కలిగిస్తోంది. తమ మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందన్న భరోసా ఆ  అబలలకు  ఒకింత ఉపశమనాన్ని ఇస్తోంది. అన్నింటికీ మించి ప్రజల ఆకాంక్షల మేరకు ఒక శాసనం రూపొందడం అనేది ప్రజాస్వామ్యం సాధించిన  ఒక విజయం. అంతే కాకుండా, లైంగిక అత్యాచార బాధితులు సమాజం  దృష్టిలో మరిన్ని అవహేళనలకు గురికాకుండా అటువంటి వారిని అసలు పేర్లతో కాకుండా నిర్భయగా పిలవాలనే ఒక సంప్రదాయం అమల్లోకి వచ్చింది.
మూడేళ్ళ తర్వాత ఢిల్లీ నిర్భయకేసులో ఆరుగురు ముద్దాయిల్లో నలుగురికి (ఒక ముద్దాయి విచారణ జరుగుతూ వున్న  సమయంలోనే  జైల్లో  ఉరివేసుకుని చనిపోయాడు) ప్రత్యేక  న్యాయస్థానం మరణశిక్ష  విధించింది. చివరకు సుప్రీం కోర్టు దాన్ని  యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
మరో సంగతి ఇక్కడ ప్రస్తావించాలి. ఈ కేసు విచారణా కాలంలో జైల్లో ఒక విదేశీ వార్తా సంస్థకు ముద్దాయిల్లో ఒకరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ యువతి బలాత్కారానికి సహకరించి వుంటే ఇంతటి విషమ పరిస్తితి ఆమెకు ఎదురయ్యేది కాదనిఅతడు చెప్పిన తీరు కరడు గట్టిన నేర ప్రవృత్తికి నిలువెత్తు సాక్ష్యం.
ఆరో  ముద్దాయి మైనర్’ (అల్ప వయస్కుడు) అన్న కారణంతో అతడ్ని మూడేళ్ళు జువెనైల్ హోం లో ఉంచారు. మైనారిటీ తీరగానే అతడ్ని విడుదల చేసారు. నేరం జరిగిన నాటికి మైనర్ అనే ఒకే ఒక కారణంతో నేరశిక్షాస్మృతి ప్రకారం అతడికి మిగిలిన నేరస్తులతో పాటు శిక్ష వేయకుండా మూడేళ్ళ జువెనైల్ హో౦ నిర్బంధంతో సరిపుచ్చాల్సి వచ్చింది.
అల్పవయస్కుడి’   విడుదలను అడ్డుకుంటూ సుబ్రమణ్య స్వామి కోర్టుకు ఎక్కారు, కానీ న్యాయస్థానం ఆ అభ్యర్ధనను తిరస్కరించింది.
పిన్న వయస్కుడు అనే కారణంతో శిక్ష తప్పించుకుని దర్జాగా సమాజంలోకి తిరిగి అడుగుపెట్టిన  అతగాడు చేసిన నేరం చిన్నదేమీ కాదు. ఆనాటి   సామూహిక మానభంగ పర్వంలో అతడూ ఒక భాగస్వామి. పైపెచ్చు, నిస్సహాయ స్తితిలో వున్న ఆ  అభాగ్యురాలిని ఒక ఇనుప చువ్వతో అతి క్రూరంగా, అత్యంత రాక్షసంగా హింసించిన పాపం అతడి ఖాతాలో వుంది. అయినా,  ‘అల్పవయస్కుడుఅనే కారణంతో చేసిన నేరానికి శిక్ష పడకుండా బయటపడగలిగాడు.
కోర్టు నిర్ణయం జ్యోతిసింగ్ తలితండ్రులను నిరాశ పరచింది. నేరం జయించిందని, తామే పరాజితులమనిఆమె తల్లి ఆశాదేవి ఆవేదన వెలిబుచ్చారు. ఆమె బాధ సమంజసం  అనిపించేలా వుంది. చట్టం ప్రకారం అలాంటి  బాల హంతకులకు   జువనైల్ హోం నుంచి బయటపడగానే కొత్త జీవితం ప్రసాదించే పేరుతొ ఆర్ధిక సాయం చేస్తారు. అతడి పాత పేరును మార్చి కొత్త పేరు తగిలిస్తారు. అప్పటినుంచి అతడు సమాజంలో నూతన నామధేయంతో చెలామణీ అవుతాడు. ఇదంతా వినడానికి బాగానే వుంది. పేర్లు మార్చినట్టు నేరస్తులను పూర్తిగా సంస్కరించగలిగితే అంతకంటే కోరుకునేది ఏమీ వుండదు. మనిషి వేష భాషలను మార్చినంత సులభంగా అతడి మనస్త్వత్వాన్ని మార్చడం అంత తేలికా అన్నదే ప్రశ్న. జైలు  ఇంటర్వ్యూలో ఒక ముద్దాయి చెప్పిన అభిప్రాయమే దీనికి సరయిన సమాధానం. ధర్మం ప్రకారం ఆ అల్ప వయస్కుడుకూడా మిగిలిన వారితో పాటు శిక్షార్హుడే. కానీ చట్టం చెప్పే న్యాయం వేరుగా వుంటుంది.    
కోర్టుల్లో న్యాయం  చట్టాన్ని బట్టి వుంటుంది. చట్టం మారితే దానికి తగ్గట్టుగా న్యాయం, దానికి తగ్గట్టుగా శిక్షలు  మారిపోతూ వుంటాయి. ధర్మం అనేది మారుతున్న కాలంతో ప్రమేయం లేకుండా స్థిరంగా మార్పు లేకుండా వుంటుంది.
అల్ప వయస్కులు నేర పూరిత మనస్త్వత్వం కలిగివుండరన్న అభిప్రాయం ఒకప్పుడు సరికావచ్చు. కానీ వారి మనస్సులను కలుషితం చేసే అనేక అవకాశాలు  చిన్న వయస్సునుంచే ప్రస్తుతం  అందుబాటులో ఉంటున్నాయి. గుప్పెట మూసివుంచాల్సిన అనేక సెక్స్ పరమైన సంగతులు, వారి గుప్పెట్లో ఉంటున్న సెల్ ఫోన్ల పుణ్యమా అని చిన్నతనం నుంచే వారికి కరతలామలకం. ఈ వెసులుబాట్లతో వారు పెడమార్గం పడుతున్నారన్న వాస్తవాలను మరిచిపోరాదు. అల్పవయస్కులు అయినంత మాత్రాన వారు ఇటువంటి హీనమైన లైంగిక కార్యకలాపాలకు పనికిరారు అని నిర్ధారణకు రావడానికి వీల్లేదు  అనడానికి  ఈ కేసులో శిక్ష తప్పించుకున్న ఈ బాల నేరస్తుడే సాక్షి. 
తక్కువ వయస్సు కారణంగా శిక్షలు తప్పించుకునే పరిస్తితి ముందు ముందు కూడా కొనసాగితే అందువల్ల మరికొన్ని విషమ పరిణామాలు కూడా చోటుచేసుకునే ప్రమాదం పొంచి వుంటుంది. పిల్లల్ని చేరదీసి,  చిన్నతనం నుంచే ఉగ్రవాద శిక్షణ ఇచ్చే విదేశీ  సంస్థలు,  తప్పుడు సర్టిఫికేట్లతో వయస్సు తక్కువగా చూపించి, వారిచేత ఉగ్రవాద చర్యలు జరిపించే అవకాశాన్ని కూడా కొట్టివేయలేము. అటువంటి వారు ఒకవేళ పట్టు పడినా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని, అనతి కాలంలోనే బయటపడి తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగించే వీలుంటుంది.
వీటన్నిటినీ  దృష్టిలో  ఉంచుకుని ఆలోచిస్తే,   ప్రస్తుతం వున్న చట్టాలను తగువిధంగా సవరించుకోవాల్సిన అవసరాన్ని ఈ అల్పవయస్కుడివిడుదల వ్యవహారం  గుర్తు చేస్తోంది. 

28, నవంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 28 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 29-11-2019, Friday)

రేడియో ఎవరు వింటున్నారు?

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అనేది ప్రసార భారతిలో కొత్తగా చేరి పనిచేసేవారికి ఒక అధికారి పేరు. కానీ సంగీత పరిజ్ఞానం కొద్దో  గొప్పో వున్నవారికి మాత్రం ఆయన ఒక సంగీత కారుడు. రేడియో అంటే సంగీతం అనుకునేవారు ఇలాటి అధికారులు రావాలని, వుండాలని కోరుకుంటారు. కాని ప్రసాద్ గారు మాత్రం రేడియో శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటూ వుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా సమయం చూసుకుని తన మనసులోని మాటని బయట పెడుతుంటారు.




(మంగళగిరి ఆదిత్య ప్రసాద్)


"ఇప్పుడు రేడియోలు ఎక్కడ దొరుకున్నాయండీ" అనే ప్రశ్నకు జవాబు ఆయన వద్ద సిద్ధంగా వుంటుంది. అలా అడిగినవారికి ఒక చిన్న సైజు ట్రాన్సిస్టర్ రేడియో ఇచ్చి 'రేడియో దొరికింది కదా! ఇక వినండ'ని అంటుంటారని ఆయన గురించి మెచ్చుకోలుగా చెప్పుకునే ఒక  జోకు ప్రచారంలో వుంది.  కొన్నేళ్ళ క్రితం  ఆదిత్య ప్రసాద్ రాజభవన్ లో నాటి  గవర్నర్  నరసింహన్ గారిని కలుసుకున్నప్పుడు ఏకంగా వారికి ఒక చిన్ని  ట్రాన్సిస్టర్  రేడియోను  కానుకగా ఇచ్చారట. దాన్ని స్వీకరించిన గవర్నర్ ఎంతగానో సంతోషించారట.
2014 లో హైదరాబాదు రేడియో ప్రాంగణంలో డాక్టర్ పద్మనాభరావు గారు  రచించిన 'అలనాటి ఆకాశవాణి'  పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనే ఈ విషయాన్ని మర్యాదకు భంగం కలగని రీతిలో చాలా మన్ననగా ప్రస్తావించారు. 'రేడియో ప్రచార సభ' ఆలోచన కూడా వారిదే.  
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే.వీ. రమణాచారి తమ ప్రసంగంలో   రేడియోతో తనకున్న  అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఆలిండియా సర్వీసులో చేరడడానికి ముందు ఆయన కొంతకాలం హైదరాబాదులో లెక్చరర్ గా పనిచేసారు. మధ్యాన్నం చాయ్ తాగడానికి ఆలిండియా రేడియో మీదుగా  వెళ్లివస్తుండేవారట. ‘ఆకాశవాణి – నిషేధిత ప్రాంతము’ అనే బోర్డు చూస్తూ జీవితంలో ఎప్పుడయినా రేడియో స్టేషన్ లోకి అడుగుపెట్టే అవకాసం వస్తుందా అని అనుకునేవారట. ఒకరోజు గేటు వద్ద సెంట్రీని మాటల్లో పెట్టి లోపల వరకూ వెళ్లారట కూడా. దరిమిలా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పలు పర్యాయాలు రేడియో రికార్దింగుల్లో, అలాగే ఒక రచయితగా కవిగా అనేకమార్లు రేడియో స్టేషన్ కు వచ్చినా ఆ తొలినాటి రేడియో ప్రవేశం మరపునపడలేదని గుర్తు చేసుకున్నారు. కేవీ రమణాచారి గారు.
సహజంగా హాస్య ప్రియులైన రమణాచారి చెప్పినట్టు ఈనాడు కావాల్సింది 'హాయ్ ఓయ్ రేయ్' అంటూ చెలరేగిపోయే మిర్చీ బజ్జీ శ్రోతలు కాదు. మంచి సంగీతాన్ని, మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి శ్రోతల సంఖ్య పెరగాలి. అందుకు నాందిగా ఆదిత్య ప్రసాద్ గారి మాదిరిగా ఒకరికొకరు చిన్న చిన్న రేడియోలు చిరుకానుకలుగా ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం రావాలి.
పోతే, రేడియో ఎవరు వింటున్నారు అని కదా మొదలు పెట్టింది.
ఇప్పటికీ పూర్వంలా ప్రతి ఇంట్లో రేడియో మోగుతూ ఉండకపోవచ్చు. కానీ నెట్లో రేడియో వినేవాళ్ళు బహు కొల్లలు.
నేను రేడియోలో పనిచేసే రోజుల్లో వార్తల్ని టైం ప్రకారం వినేవాళ్ళు నాకు తెలుసు. శ్రీ ఎం. సత్యనారాయణ రావు ఏ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా పనిచేసే రోజుల్లో ఢిల్లీలో వారింట్లో కలుసుకున్నాను. చిత్రంగా నేను వెళ్ళిన సమయానికి ఆయన రేడియో వార్తలను చాలా శ్రద్ధగా వింటున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు. ఒకసారి రికార్డింగు పనిమీద ఇంటికి వెళ్లాను. కాసేపే ఆగి మొదలెడదా౦ అన్నారు. నాకు అర్ధం కాలేదు. ఒకటీ పది కాగానే పక్కనే వున్న ట్రాన్సిస్టర్ చేతిలోకి తీసుకున్నారు. ‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.. అంటూ మొదలయ్యాయి. ఓహో! ఇందుకా ఆగమన్నది అని అప్పుడు బోధ పడింది.
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన రోశయ్య గారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వార్తలు వినేవారు. మరో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా అలాగే మంచి రేడియో శ్రోత. ఉమ్మడి రాష్ట్రంలో  చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు   ఖమ్మం నుంచి రోడ్డు మార్గాన హైదరాబాదు వస్తూ మధ్యాన్నం రేడియో వార్తల టైం కాగానే డ్రైవర్ని కారు పక్కకు తీయమని చెప్పి వార్తలు వినేవారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.
ఢిల్లీలో సెంటర్ ఫర్ మీడియా సర్వీసు అనే ప్రసిద్ధ సంస్థ సంస్థాపకులు డాక్టర్ ఎన్.   భాస్కర రావు చేతిలో ఎప్పుడూ ఒక చిన్న రేడియో వుంటుంది. ప్రతి రేడియో బులెటిన్ ను ఆయన శ్రద్ధగా వింటుంటారు.
ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రధాన పౌరసంబంధాల అధికారిగా పనిచేస్తున్న శ్రీ జ్వాలా నరసింహారావుకు రేడియో వార్తలు వినే అలవాటు వుంది. కారులో వెడుతున్నాకూడా  వార్తల సమయం కాగానే రేడియోపెట్టి వార్తలు వింటుంటారు.
ఈ జాబితాలో చివరన పేర్కొంటున్నప్పటికీ  రేడియో శ్రోతల్లో ప్రధముడుగా చెప్పాల్సిన వ్యక్తి కప్పగంతు శివరామ ప్రసాద్, రేడియో అభిమాని అనే బ్లాగు నడుపుతూ ఆకాశవాణి కళాకారుల అపురూప చిత్రాలను సేకరించడం ఆయన హాబీ.             
(ఇంకా వుంది)

రేడియో రోజులు - 27 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 28-11-2019, Thursday)

లోకాన్ని ఒదిలి వెళ్ళిన ప్రపంచం
ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, ఫ్లూట్ కళాకారుడు ప్రపంచం సీతారాం అయిదేళ్ళ క్రితం మరణించినప్పుడు ఆయన సంస్మరణ వ్యాసానికి నేను ఎంచుకున్న శీర్షిక ఇది. 
సంగీతానికి చావు లేదు. అయితే, అజరామరమైన సంగీతాన్ని జనాలకు వొదిలి సంగీత కారులు మాత్రం  అమరులుగా మిగిలిపోతుంటారు. అలాంటి సంగీత నక్షత్రం ఒకటి అమెరికాలోని అట్లాంటాలో 2014 జూన్ ఒకటవతేదీన రాలిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫ్లూట్ వాయిద్యకారుడు ప్రపంచం సీతారాం. అంతటి సంగీతకారుడు పనిచేసిన రేడియోలోనే నేనూ పనిచేశాను అనే ఒకే ఒక్క  కారణం తప్ప ఆయన్ని గురించి రాయగల  ఏ యోగ్యతా నాకులేదని, ఆ ఒక్కటే  ఈ వ్యాసానికి ప్రేరణ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మగౌరవం కలిగిన కళాకారులు సర్కారీ నౌకరీ చేయడంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణలు గురించి ప్రస్తావించాలని అనుకోవడం కూడా ఈ రచనకు దోహదం చేసింది.


(ప్రపంచం  సీతారాం) 

ప్రపంచం సీతారాం స్వయం ప్రతిభ కలిగిన వ్యక్తి. స్వయంశక్తితో పైకి వచ్చారు. చేతిలో ఇమిడిపోయే వేణువును ఒక పరికరంగా  తీసుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. సరయిన వయస్సులో తగిన విద్యార్హతలు సంపాదించుకోలేకపోయినా తదనంతర  కాలంలో పట్టుదలతో శ్రమించి అనేక విశ్వవిద్యాలయాల డిగ్రీలు తన ఖాతాలో వేసుకున్నారు. జీవిక కోసం ఒకప్పుడు ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్లూట్ కచ్చేరీలు చేసేవారు. ఆ పిదప యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా ఎంపికై రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా చేరి, ఢిల్లీ రేడియో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
ఒకప్పుడు రేడియో అంటే అనేక సంగీత దిగ్గజాల పేర్లు వినిపించేవి.                                   
మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి (గాత్రం),  బాలాంత్రపు రజనీకాంతారావు (వాగ్గేయకారుడు), అన్నవరపు రామస్వామి, మారెళ్ళ కేశవరావు, నేతి శ్రీరామ శర్మ (వయొలిన్) దండమూడి రామ్మోహన రావు, ఎల్లా వెంకటేశ్వరరావు  (మృదంగం) ప్రపంచం సీతారాం,  ఎన్ ఎస్ శ్రీనివాసన్ (వేణువు), మంచాల జగన్నాధరావు( వీణ), చెన్నై  బ్రదర్స్  గా పేరు తెచ్చుకున్న  చిట్టూరి వేణుగోపాల  శర్మ (వయొలిన్), చిట్టూరి కామేశ్వర శర్మ (వీణ).
మామూలుగా అయితే ఇవి కొన్ని పేర్లు మాత్రమే. కానీ ఆ పేర్లకువున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ఇలాటి మహనీయులు నడయాడిన నట్టిళ్లు ఆకాశవాణి కేంద్రాలు. వారు బయట ప్రదేశాలకు వెళ్ళి సంగీత కచ్చేరీలు ఇచ్చినప్పుడు పలానా వారు, బెజవాడ రేడియో కేంద్రం,  హైదరాబాదు కేంద్రంలో   నిలయ విద్వాంసులు అని కరపత్రాలు ముద్రిస్తే,  అది వారు పనిచేసే కార్యాలయానికి ఒక అదనపు గుర్తింపు తెచ్చిపెట్టేదిగా భావించేవారు. గతంలో రేడియో కేంద్రాలకు అధిపతులుగా పనిచేసిన అధికారులు కూడా వారికి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. చక్కటి సంగీత కళాకారులు తమ వద్ద పనిచేయడం అనేది గొప్ప విషయంగా పరిగణించేవారు. ఆ కారణంగానే పాత కాలంలో సంగీతానికి రేడియో, రేడియోకు సంగీతం పరస్పర సహకారం ఇచ్చుకున్నందువల్లే కచ్చేరీల ద్వారా కొందరికే అందుబాటులో వున్న సంగీతం రేడియో ద్వారా ఎల్లెడలా వున్న జనాలకు చేరువకాగలిగింది.  కానీ కాలం గడుస్తున్న కొద్దీ అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టే రేడియోలో కూడా పరిస్థితులు మారుతూవచ్చాయి. తమ సంగీతపాటవాన్ని పదిమందికీ తెలియచేయాలన్న తపనతో ఓ పక్క రేడియోలో పనిచేస్తూనే కొందరు కళాకారులు మరోపక్క తగిన అనుమతులు తీసుకోకుండా బయట సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ వుండేవారు. ముందే చెప్పినట్టు వెనుకటి రోజుల్లో ఈ తరహా వ్యవహారాలను అధికారులు ఓ దృష్టితో చూసి, చూసీ చూడనట్టు వొదిలేస్తే తదనంతరం వచ్చిన అధికారుల్లో కొందరు దీన్ని నిబంధనలకు వ్యతిరేకం అన్న కోణంలో చూడసాగారు. అదిగో అక్కడే రేడియో ఆర్టిస్టులకు, అధికారులకు మధ్య సంఘర్షణలకు దారితీసింది. అయితే సహజంగా ఈ విషయంలో అధికారులదే పైచేయి కావడంతో ఆర్టిస్టులు మానసికంగా కుంగిపోయేవారు. రేడియోలో తమది ఉపాధి అనుకున్నారు కాని ఉద్యోగం కాదనుకుని వచ్చి ,  పరిస్తితులతో రాజీపడలేని కొందరు రేడియోనే వొదిలేసారు. అలాటివారిలో ప్రపంచం సీతారాం ఒకరు. దక్షిణ భారతంలో పేరెన్నికగన్న టీ ఆర్ మహాలింగం శిష్యులు. ప్రపంచం అన్నది సీతారాం ఇంటిపెరుకాదనీ, ఎప్పుడో దశాబ్దాలక్రితం తెలుగులో తీసిన 'ప్రపంచం' అనే చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కారణంగా ఆయనకు ప్రపంచం అన్నది ఇంటి పేరుగా మారిపోయిందని చెబుతారు.  


నిబంధనల  పేరుతొ నిరంకుశంగా వ్యవహరించే అధికారుల చేతుల్లో కళాకారులు యెలా కుంగిపోతారన్నదానికి ఒక అనుభవాన్ని బెజవాడ రేడియోలో న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన నా సీనియర్ సహచరులు ఆర్వీవీ కృష్ణారావు నాతొ పంచుకున్నారు.
ఇది జరిగి కూడా పాతిక ముప్పయ్యేళ్ళు అవుతుందేమో.  మంగళగిరి,  నంబూరు నడుమ ఒక జైన దేవాలయం వుంది. ఆ ఆలయం అధికారుల ఆహ్వానం మేరకు ఒకరోజు బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ అయూబీ, కృష్ణారావు గారిని వెంటబెట్టుకుని అక్కడకువెళ్లారు. అదేసమయంలో అక్కడ వారికి ప్రపంచం సీతారాం తన బృందంతో తారస పడ్డారు. అప్పటికే ఆయన రేడియో కళాకారుడే కాకుండా తదనంతరం సంపాదించుకున్న డిగ్రీల సాయంతో రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా ఎంపికై. ప్రమోషన్ మీద  బెజవాడ రేడియో స్టేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగం ఏదైనప్పటికీ, స్వతహాగా ఆయన సంగీత కారుడు.  కచ్చేరీలు చేయాల్సిందిగా ఆహ్వానాలు అందుతూ వుండేవి. అయితే రేడియో ఉద్యోగులు ఇలా కచ్చేరీలు చేయడం అప్పటి స్టేషన్ డైరెక్టర్ కు సుతరామూ ఇష్టం వుండేదికాదు. పైగా అలాటి వారికి  మెమోలు ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన హయాములో రేడియో కళాకారులు బిక్కచచ్చినట్టు వుండేవారు.
జైన దేవాలయంలో పై అధికారి కనబడగానే కచ్చేరీ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రపంచం సీతారాం కూడా కంగారు పడిపోయారు. మరునాడు స్టాఫ్ మీటింగులో కూడా స్టేషన్ డైరెక్టర్ అదే విషయాన్ని ప్రస్తావించి హెచ్చరిక చేయడంతో,  ఆయన కృష్ణారావు గారితో చెప్పుకుని తెగ మధన పడిపోయారు. ఇలాటి అనేకానేక అనుభవాల తరువాత రేడియోలో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తరువాత కూడా సీతారాం, తన మనస్సుని సమాధానపరచుకోలేక, తన మనస్సుకు నచ్చని రేడియో ఉద్యోగాన్ని వొదిలి పెట్టి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడే విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
తన సంగీత జ్ఞానంతో తెలుగు  సంగీత ప్రాభవాన్ని ఏనాడో ఎల్లలు దాటించిన ప్రపంచం సీతారాం, దేశం ఎల్లలు  దాటివెళ్ళి అక్కడెక్కడో పరాయి దేశంలో మరణించడం విధి విచిత్రం.
(ఇంకా వుంది)

27, నవంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు - 26 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 27-11-2019, Wednesday)
వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ

రేడియో న్యూస్ రీడర్లు గురించి నేను రాసినవాళ్ళందరూ  నాతో పాటు హైదరాబాదు కేంద్రంలో పనిచేసినవారే!. ఇక, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ, జ్యోత్స్నాదేవి వీరంతా విజయవాడలో, మరికొందరు న్యూస్ రీడర్లు  ఢిల్లీలో - ఉదాహరణకు కొంగర జగ్గయ్య గారు,  రేడియోలో వార్తలు చదివినవారే. తమ స్వరమాధుర్యంతో శ్రోతలని మెప్పించిన వారే. వీరిలో సుబ్బారావు, ప్రయాగలతో బెజవాడలో తాత్కాలికంగా పనిచేసిన అనుభవం వుంది. అక్కడ న్యూస్ ఎడిటర్లు సుదీర్ఘకాలం సెలవులో వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుండి వెళ్ళి అక్కడ మూడు నాలుగు వారాలపాటు  బులెటిన్ వ్యవహారాలు చూసేవాడిని. ఆ విధంగా సుబ్బారావు, ప్రయాగలతో నాకు చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరిదీ వొకే వూరు. మంచి స్నేహితులు కూడా. పాపం సుబ్బారావు రిటైర్ అయిన కొన్నేళ్లకే కన్ను మూసాడు. ప్రయాగ హైదరాబాదు వచ్చి సుజనా కంపెనీలో మంచి పొజిషన్ లో చేరి సమాజానికి పనికివచ్చే మంచి కార్యక్రమాలు చేస్తూవస్తున్నాడు. యెంత బిజీగా వున్నా తనకు ఇష్టమైన రచనా వ్యాసంగానికి దూరం కాలేదు. అది ఇంకా మంచి విషయం.
పోతే, బెజవాడ వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ ప్రాంతీయ వార్తల ప్రసారం విషయంలో నాకు చక్కని సహకారం అందించేవారు. ఆరోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగావెళ్ళి ఆరోజు ఉదయం  ప్రాంతీయ వార్తలు నేనే చదివేవాడిని, అది నా డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న వార్తలు హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో  విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి తెలుసుకునేది. ఇవన్నీ వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా జరిగిన విషయాలే. రేడియోలో నేను అనుభవించిన స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణలే.

వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పండితత్వం ఇవన్నీ ప్రయాగకు న్యూస్ రీడర్ గా పనికొచ్చాయి. ఒక్కోసారి బులెటిన్ అంచనా తప్పి కొద్ది నిమిషాలు తక్కువయ్యేది. వాటిని రాసి  స్టూడియోకి తీసుకువెళ్ళి అందించేలోగా రామకృష్ణ ఆశువుగా కొన్ని వార్తలు చదివి సరిపెట్టడం నాకు బాగా గుర్తుంది. శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాల్లో రాత ప్రతి అవసరం లేకుండా ఏఏ దేవాలయాల్లో ఏం జరుగుతున్నదో ఆ విశేషాలన్నీ అనర్ఘళంగా చెప్పేవాడు. కొప్పుల సుబ్బారావుది మరో బాణీ. మిన్ను విరిగి మీదపడుతోందన్నా చలించని తత్వం. వార్తల టైం దగ్గరపడుతున్నా, బులెటిన్ పూర్తిగా తయారు కాకపోయినా, వున్నంతవరకు కాగితాలు తీసుకుని వెళ్ళి వార్తలు చదివే వాడు తప్ప, తను కంగారు పడడం కానీ, ఇతరులను కంగారు పెట్టడం కానీ నేను చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగివచ్చి ఉద్యోగపర్వంలో శిఖరాగ్రం చేరిన కొన్నాళ్ళకే కన్నుమూయడం బాధాకరం.
ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావుల వద్ద నేను మరో విషయం గమనించాను. ఈ ఇద్దరికీ ఆకాశవాణి స్టూడియో అంటే ఒక దేవాలయం. వార్తలు చదవడానికి అందులోకి వెళ్లేముందు ఇద్దరూ తమ పాదరక్షలను బయటే వదిలేవారు.
జ్యోత్స్నాదేవి గారిది మరో తరహా. ఆవిడ న్యూస్  రూమ్ లో వున్నారా లేరా అనేంత నెమ్మది. మౌనంగా తనపనేమిటో తాను  పనిచేసుకు పోవడం తప్ప వేరే ధ్యాస వుండేది కాదు. ఆవిడ వార్తలు మొదలు పెట్టేటప్పుడు నేను జాగ్రత్తగా చెవులొగ్గి వినేవాడిని, ఆవిడ తన పేరును ఎలా ఉచ్చరిస్తుందో అనే కుతూహలంతో.
తరువాత కాలంలో  జ్యోత్స్నాదేవి బదిలీపై హైదరాబాదు వచ్చారు. అప్పుడూ అదే తరహా. నేను మాస్కో వెళ్ళిన తరువాత  అమెరికాలో ఉంటున్న పిల్లల వద్ద స్తిరపడ్డారని  విన్నాను.
జ్యోత్స్న గారని హైదరాబాదు ఆకాశవాణిలో మరో అనౌన్సర్ వున్నారు. చాలా సీనియర్. ఇద్దరికీ పేరులోనే కాకుండా అభిమానులను సంపాదించుకునే సుస్వరం విషయంలో కూడా పోలిక వుంది.  జ్యోత్స్నగారిది రేడియో కుటుంబం. వారి అమ్మగారు, రేడియో భానుమతి అనేవారు, మద్రాసు రేడియో కేంద్రంలో పనిచేశారు. వారి మనుమరాలు,  జ్యోత్స్నగారి అమ్మాయి స్వప్న. స్వప్న సుందరి.  ఒక రకంగా టీవీ స్టార్.
పరిచయం అవసరం లేని ప్రముఖ మీడియా ప్రయోక్త. యాంఖర్, జర్నలిస్ట్.  ప్రైవేటు రేడియోల్లో పనిచేసిన అనుభవం కూడా వుంది.  
(ఇంకా వుంది)

26, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు – 24 - భండారు శ్రీనివాసరావు




(Published in SURYA daily on 24-11-2019, SUNDAY)

ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు

స్క్రిప్ట్ ఒకటే. చదివేది అదే మైకు ముందు. మరి రేడియో వార్తలు చదివే వాళ్ళలో ప్రత్యేకత ఏమిటి?
ఢిల్లీ నుంచి గతంలో తెలుగు వార్తలు చదివిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాణీ.
నిజమే.ఎవరు చదివినా అవే వార్తలు. కానీ చదవడంలో ఓ విరుపు. చదువుతూ చదువుతూ ఎక్కడో ఓ మెలిక. వార్తకు తగ్గట్టు స్వరంలో హెచ్చుతగ్గులు. వీటిని బట్టే ఆ రోజుల్లో శ్రోతలు వార్తలు మొదలయిన తర్వాత కూడా చదివే వ్యక్తిఎవరన్నది సులువుగా గుర్తు పట్టేవాళ్ళు.
అద్దంకి మన్నార్ వార్తలు చదువుతుంటే  జెట్ విమానంలా ఉరుకులు పరుగులు పెట్టినట్టు సాగిపోయేవి. దుగ్గిరాల పూర్ణయ్య గారు కంచు కంఠంతో నింపాదిగా చదివేవారు. కందుకూరి సూర్య నారాయణ గారు ప్రతి వాక్యాన్ని తనదైన శైలిలో ముగించేవారు. మావిళ్ళపల్లి  రాజ్యలక్ష్మి గారిది మరో తరహా. నిండుగా సాగిపోతున్న గంగా ప్రవాహం మాదిరిగా వుండేది. జోళిపాల్యం మంగమ్మ గారు వార్తలు చదువుతుంటే మరి కాసేపు అలా అలా వినాలి అనిపించేలా వుండేది. ఏడిద గోపాల రావు గారు వార్తల్ని చదువుతుంటే ముచ్చట్లు చెబుతున్నట్టు ముచ్చటగా ఉండేవి.  చొప్పదంటు లాంటి వార్తలకు కూడా ఆ మహానుభావులు జీవం పోసేవారు. అందుకే శ్రోతలను అంతగా ఆకట్టుకోగలిగారు.
ఢిల్లీలో ఆకాశవాణికి  చాలా పెద్ద వార్తా విభాగం వుంది. అనేక జాతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో సైతం ఢిల్లీ నుంచి వార్తలు ప్రసారం చేస్తుంటారు. ప్రసార భారతి ఏర్పాటు అయిన తరువాత ఆయా దేశీయ భాషల్లో బులెటిన్లు రూపొందించే విభాగాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. ఆ క్రమంలోనే ఢిల్లీ నుంచి తెలుగు వార్తా విభాగాన్ని యావత్తూ, సిబ్బందితో సహా హైదరాబాదుకు మార్చారు. ఢిల్లీలోని ఆకాశవాణి జనరల్ న్యూస్ రూమ్ లో ఇంగ్లీషులో జాతీయ వార్తలతో కూర్పు చేసిన  బులెటిన్ కాపీని హైదరాబాదుకు పంపితే ఆ వార్తల్ని  న్యూస్ రీడర్లు తెలుగులోకి తర్జూమా చేసుకుని చదువుతున్నారు. కాకపొతే  ప్రాధాన్యతను బట్టి కొన్ని స్థానిక వార్తలను కూడా ఆ బులెటిన్ లో చేరుస్తారు.
న్యూ ఢిల్లీ నుంచి – కపిల కాశీపతి, కలపటపు రామగోపాలరావు, వారణాసి సుబ్రహ్మణ్యం, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల పూర్ణయ్య, జె.మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు,  మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, సూర్యదేవర ప్రసన్నకుమార్, రాజశ్రీ, బుచ్చిరెడ్డి (అతి స్వల్ప కాలం)
ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.

పెద్దవిశేషమేమిటంటే మహాకవి శ్రీ శ్రీ  సయితం  కొద్దికాలం ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో పనిచేశారు. ఆయన కూడా తెలుగులో వార్తలు చదివినట్టు  అనౌన్స్సర్ల సంఘం ఇటీవల  వాచస్పతి పేరుతొ ప్రచురించిన ప్రత్యెక సంచికలో పేర్కొన్నారు.
నిర్వహణ కారణాల రీత్యా న్యూఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే తెలుగు వార్తలను కూడా హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయడం వల్ల అక్కడి న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వార్తలు చదువుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వార్తలు చదువుతున్నది- యండ్రపాటి మాధవీ లత, సమ్మెట నాగమల్లేశ్వర రావు, గద్దె దుర్గారావు, తురగా ఉషారమణి
రేడియో అక్కయ్యగా ప్రసిద్దురాలయిన తురగా జానకీ రాణి, సుప్రసిద్ధ హాస్య రచయిత తురగ కృష్ణ మోహన రావు దంపతుల ముద్దుల బిడ్డే ఈ ఉషారమణి. 
(ఇంకా వుంది)

రేడియో రోజులు – 25 – భండారు శ్రీనివాసరావు


( Published in SURYA daily  on 26-11-2019, Tuesday)
ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్
కొన్ని శబ్దాలు చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటాయి. కొన్ని స్వరాలు నాలుకపై నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటాయి. కాలచక్రం గిర్రున తిరిగినా,  కాలదోషం పట్టని కొన్ని అద్భుతాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఆకాశవాణి సిగ్నేచర్‌ ట్యూన్‌. ప్రతి రోజూ ఉదయం రేడియోలో వినిపించే ఆ సుస్వరం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మాండలీన్‌, వయోలిన్‌, పియానో,  కలగలసిన అద్భుతమైన ఆ రాగం పురుడు పోసుకుని ఇప్పటికి ఎనభై ఏళ్ళు దాటింది. అయినా, నేటికీ ఆ ట్యూన్‌ స్మార్ట్  ఫోన్ లో  రింగ్‌ టోన్‌గా వినిపిస్తోంది. వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ అవుతూనే ఉంది.

ఇంతకీ ఆకాశవాణి సిగ్నేచర్‌ ట్యూన్‌ని కంపోజ్‌ చేసిందెవరో తెలుసా..? ఆ సంగీతజ్ఞుడి పేరు వాల్టర్  కౌఫ్‌మన్‌. చెక్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన వ్యక్తి. 1934లో ముంబైకి వచ్చిన కౌఫ్‌మన్‌, బాంబే చాంబర్‌ మ్యూజిక్‌ సొసైటీలో పియానో వాద్యకారుడిగా ఉండేవాడు. ఇండియన్‌ బ్రాడ్‌కాస్ట్‌ కంపెనీ విజ్ఞాపన మేరకు 1936లో ఒక ట్యూన్‌ కంపోజ్‌ చేసి ఇచ్చాడు కౌఫ్‌మన్‌. పాశ్చాత్య, శాస్త్రీయ సంగీతాల మేళవింపుగా దీనిని రూపొందించాడాయన. శివరంజని రాగం ఆధారంగా దీనిని కంపోజ్‌ చేశారని చెబుతారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ ట్యూన్‌ని మారుద్దామని కొందరు అన్నారట! అయితే, ఈ స్వరంలో ప్రణవనాదం అయిన ఓంకారం ప్రతిధ్వనిస్తున్నట్టు ఉందనే అభిప్రాయంతో ఆ ట్యూన్ మార్చే ప్రయత్నాన్ని విరమించుకున్నారట ఆకాశవాణి అధికారులు.
1934 లో ఇండియాకు వచ్చిన పద్నాలుగేళ్ళపాటు ఈ దేశంలోనే వుండిపోయాడు. బాంబేలోని విల్లింగ్టన్ జింఖానాలో ప్రతి గురువారం నాడు ఒక సంగీత కచ్చేరీ ఇచ్చేవాడు. ఆయన బృందంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన  సంగీత విద్వాంసుడు జుబెన్ మెహతా  తండ్రిగారయిన మెహ్లీ మెహతా వుండేవారు. ఆయన వయొలిన్ పైనా,  కౌఫ్‌మన్‌ పియానో పైనా శ్రోతలను అలరిస్తూ వుండేవారు.  ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్  ట్యూన్ లో వయొలిన్ వాయించింది మెహ్లీ మెహతా అనేవారు కూడా లేకపోలేదు.
కౌఫ్‌మన్‌ సంగీతంలో దిట్ట. పూర్వపు జెకొస్లవాకియా దేశంలో 1907 లో జన్మించిన ఈ సంగీత కారుడు, బెర్లిన్ సంగీత కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్నాడు. నాజీల బాధితుడిగా అతడు భారతదేశానికి ఓ కాందిశీకుడుగా వచ్చాడు. ఇండియాకు వీసా దొరకడం చాలా సులభం కాబట్టి తాను ఈ దేశాన్ని ఎంచుకున్నానని ఆయన చెప్పేవాడు.
1937  నుంచి  1946 వరకు ఆల్ ఇండియా సంగీత విభాగంలో డైరెక్టర్ గా రేడియోలో పనిచేశాడు. ఈ  దేశపు అతి గొప్ప సంగీత కళాకారులను గురించి తెలుసుకోవడానికి  ఈ ఉద్యోగం ఎంతగానో  ఉపకరించిందని తను రాసిన ఒక పుస్తకంలో  ఆయన వెల్లడించారు.
పాతతరానికి చెందిన అనేకమంది భారతీయ  సంగీత విద్వాంసులు రేడియో వారు చెక్కుల  రూపంలో ఇచ్చే ప్రతిఫలాన్ని తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదని, విచ్చు రూపాయలలో ఇస్తే సంతోషంగా తీసుకునేవారని, ఆ నాణేలను జాగ్రత్తగా లెక్కపెట్టుకోవడానికి తమ వెంట ఎవరో ఒకరిని తోడు తెచ్చుకునేవారని తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఇండియా వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత 1957 లో అమెరికాలో స్థిరపడడానికి ముందు కొన్నేళ్ళు ఇంగ్లాండ్ లో, కెనడాలో గడిపారు. 1984 లో కౌఫ్‌మన్‌ అక్కడే కన్ను మూశారు.

(ఇంకా వుంది)

23, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు – 23 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily  on 23-11-2019, Saturday, today)

వార్తలు చదువుతున్నది ఏడిద గోపాల రావు
“ఢిల్లీలో ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని కలవండి”
ఇప్పటి పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.
ఆ మాట విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ మీరు ఢిల్లీ వదిలి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యతను ఆయన స్వచ్చందంగా, ఆనందంగా భుజానికి ఎత్తుకుంటాడు అని ప్రసిద్ధ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే అతిశయోక్తి కాదు.
ఆయన పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్. ముప్పూటలా వార్తలు చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.
1975 లో నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి ఆఫేసులో ఎవరో కోటూబూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు. వెంకట్రామయ్య గారు కాబోలు నాకు పరిచయం చేస్తూ చెప్పారు, ఏడిద గోపాలరావని. వార్తల్లో పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది) చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.
ముందే చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరుప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా  సోదరుడు.  సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ  కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.
రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి  స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు.  రంగస్థలంపై  మహాత్మా  గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.
కింది ఫోటో : రంగస్థల గాంధి శ్రీ ఏడిద గోపాల రావు 

(ఇంకా వుంది)