23, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు – 23 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily  on 23-11-2019, Saturday, today)

వార్తలు చదువుతున్నది ఏడిద గోపాల రావు
“ఢిల్లీలో ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని కలవండి”
ఇప్పటి పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.
ఆ మాట విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ మీరు ఢిల్లీ వదిలి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యతను ఆయన స్వచ్చందంగా, ఆనందంగా భుజానికి ఎత్తుకుంటాడు అని ప్రసిద్ధ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే అతిశయోక్తి కాదు.
ఆయన పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్. ముప్పూటలా వార్తలు చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.
1975 లో నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి ఆఫేసులో ఎవరో కోటూబూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు. వెంకట్రామయ్య గారు కాబోలు నాకు పరిచయం చేస్తూ చెప్పారు, ఏడిద గోపాలరావని. వార్తల్లో పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది) చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.
ముందే చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరుప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా  సోదరుడు.  సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ  కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.
రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి  స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు.  రంగస్థలంపై  మహాత్మా  గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.
కింది ఫోటో : రంగస్థల గాంధి శ్రీ ఏడిద గోపాల రావు 

(ఇంకా వుంది)   


కామెంట్‌లు లేవు: