19, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు - 19 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 19-11-2019, Tuesday, today)
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మాడపాటి సత్యవతి
సాయంత్రం ఆరుగంటల పదిహేను నిమిషాలకల్లా తెలుగునాట లోగిళ్ళలో ఈ మధుర స్వరం వినబడేది. మెల్లగా, సౌకుమార్యంగా వినవచ్చే ఆ కంఠస్వరం చాలామందికి సుపరిచితం.
‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’
పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ నోటినుంచి నేను విన్న అతి పెద్దవాక్యం ఇదే.
మాడపాటి సత్యవతి గారు ఎంతో క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ స్వరాన్ని భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారు చేసాడేమో అనిపిస్తుంది. ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండుసార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.
ఆకాశవాణి వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్ బహుత్ గంభీర్.’ 1975 నవంబరులో నేను అక్కడ కుడికాలు పెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా ‘స్క్రీన్ ప్లే’ పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు రాకుండా బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి, యెంత ప్రాధాన్యం ఇవ్వాలి అని ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్లు. మరీ ముఖ్యంగా సత్యవతిగారికీ, డి. వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. దానితో నాది ఆడింది ఆట పాడింది పాట అయింది. అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడివుండరేమో కూడా.
నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను. రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి. ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా సెల్ ఫోనులు లేని రోజులాయె. ఆవిడ అనుభవమే ఆవిడకు అక్కరకు వచ్చింది. కాని ఆరోజు, డబ్బింగు పని పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.
మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. కోపడ్డారు కూడా. యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే! ఆ ఒక్క ముక్క చాలు. కర్రు కాల్చి వాత పెట్టినా దానికి సరిపోదు.
రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు. యెంత క్లుప్తంగా (వార్త) చెబితే భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of expression).
ఆ రోజు సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది. తీరు పూర్తిగా మార్చుకోకపోయినా కొంత గాడిలో పడ్డాను. (అని అనుకున్నాను)
(ఇంకావుంది)



మాడపాటి సత్యవతి


కామెంట్‌లు లేవు: