27, నవంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు - 26 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 27-11-2019, Wednesday)
వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ

రేడియో న్యూస్ రీడర్లు గురించి నేను రాసినవాళ్ళందరూ  నాతో పాటు హైదరాబాదు కేంద్రంలో పనిచేసినవారే!. ఇక, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ, జ్యోత్స్నాదేవి వీరంతా విజయవాడలో, మరికొందరు న్యూస్ రీడర్లు  ఢిల్లీలో - ఉదాహరణకు కొంగర జగ్గయ్య గారు,  రేడియోలో వార్తలు చదివినవారే. తమ స్వరమాధుర్యంతో శ్రోతలని మెప్పించిన వారే. వీరిలో సుబ్బారావు, ప్రయాగలతో బెజవాడలో తాత్కాలికంగా పనిచేసిన అనుభవం వుంది. అక్కడ న్యూస్ ఎడిటర్లు సుదీర్ఘకాలం సెలవులో వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుండి వెళ్ళి అక్కడ మూడు నాలుగు వారాలపాటు  బులెటిన్ వ్యవహారాలు చూసేవాడిని. ఆ విధంగా సుబ్బారావు, ప్రయాగలతో నాకు చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరిదీ వొకే వూరు. మంచి స్నేహితులు కూడా. పాపం సుబ్బారావు రిటైర్ అయిన కొన్నేళ్లకే కన్ను మూసాడు. ప్రయాగ హైదరాబాదు వచ్చి సుజనా కంపెనీలో మంచి పొజిషన్ లో చేరి సమాజానికి పనికివచ్చే మంచి కార్యక్రమాలు చేస్తూవస్తున్నాడు. యెంత బిజీగా వున్నా తనకు ఇష్టమైన రచనా వ్యాసంగానికి దూరం కాలేదు. అది ఇంకా మంచి విషయం.
పోతే, బెజవాడ వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ ప్రాంతీయ వార్తల ప్రసారం విషయంలో నాకు చక్కని సహకారం అందించేవారు. ఆరోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగావెళ్ళి ఆరోజు ఉదయం  ప్రాంతీయ వార్తలు నేనే చదివేవాడిని, అది నా డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న వార్తలు హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో  విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి తెలుసుకునేది. ఇవన్నీ వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా జరిగిన విషయాలే. రేడియోలో నేను అనుభవించిన స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణలే.

వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పండితత్వం ఇవన్నీ ప్రయాగకు న్యూస్ రీడర్ గా పనికొచ్చాయి. ఒక్కోసారి బులెటిన్ అంచనా తప్పి కొద్ది నిమిషాలు తక్కువయ్యేది. వాటిని రాసి  స్టూడియోకి తీసుకువెళ్ళి అందించేలోగా రామకృష్ణ ఆశువుగా కొన్ని వార్తలు చదివి సరిపెట్టడం నాకు బాగా గుర్తుంది. శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాల్లో రాత ప్రతి అవసరం లేకుండా ఏఏ దేవాలయాల్లో ఏం జరుగుతున్నదో ఆ విశేషాలన్నీ అనర్ఘళంగా చెప్పేవాడు. కొప్పుల సుబ్బారావుది మరో బాణీ. మిన్ను విరిగి మీదపడుతోందన్నా చలించని తత్వం. వార్తల టైం దగ్గరపడుతున్నా, బులెటిన్ పూర్తిగా తయారు కాకపోయినా, వున్నంతవరకు కాగితాలు తీసుకుని వెళ్ళి వార్తలు చదివే వాడు తప్ప, తను కంగారు పడడం కానీ, ఇతరులను కంగారు పెట్టడం కానీ నేను చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగివచ్చి ఉద్యోగపర్వంలో శిఖరాగ్రం చేరిన కొన్నాళ్ళకే కన్నుమూయడం బాధాకరం.
ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావుల వద్ద నేను మరో విషయం గమనించాను. ఈ ఇద్దరికీ ఆకాశవాణి స్టూడియో అంటే ఒక దేవాలయం. వార్తలు చదవడానికి అందులోకి వెళ్లేముందు ఇద్దరూ తమ పాదరక్షలను బయటే వదిలేవారు.
జ్యోత్స్నాదేవి గారిది మరో తరహా. ఆవిడ న్యూస్  రూమ్ లో వున్నారా లేరా అనేంత నెమ్మది. మౌనంగా తనపనేమిటో తాను  పనిచేసుకు పోవడం తప్ప వేరే ధ్యాస వుండేది కాదు. ఆవిడ వార్తలు మొదలు పెట్టేటప్పుడు నేను జాగ్రత్తగా చెవులొగ్గి వినేవాడిని, ఆవిడ తన పేరును ఎలా ఉచ్చరిస్తుందో అనే కుతూహలంతో.
తరువాత కాలంలో  జ్యోత్స్నాదేవి బదిలీపై హైదరాబాదు వచ్చారు. అప్పుడూ అదే తరహా. నేను మాస్కో వెళ్ళిన తరువాత  అమెరికాలో ఉంటున్న పిల్లల వద్ద స్తిరపడ్డారని  విన్నాను.
జ్యోత్స్న గారని హైదరాబాదు ఆకాశవాణిలో మరో అనౌన్సర్ వున్నారు. చాలా సీనియర్. ఇద్దరికీ పేరులోనే కాకుండా అభిమానులను సంపాదించుకునే సుస్వరం విషయంలో కూడా పోలిక వుంది.  జ్యోత్స్నగారిది రేడియో కుటుంబం. వారి అమ్మగారు, రేడియో భానుమతి అనేవారు, మద్రాసు రేడియో కేంద్రంలో పనిచేశారు. వారి మనుమరాలు,  జ్యోత్స్నగారి అమ్మాయి స్వప్న. స్వప్న సుందరి.  ఒక రకంగా టీవీ స్టార్.
పరిచయం అవసరం లేని ప్రముఖ మీడియా ప్రయోక్త. యాంఖర్, జర్నలిస్ట్.  ప్రైవేటు రేడియోల్లో పనిచేసిన అనుభవం కూడా వుంది.  
(ఇంకా వుంది)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

విజయవాడ AIR లో 1950వ దశకంలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు అని ఉండేవారు. న్యూస్ రీడర్ గానా, వేరే పనా .. గుర్తు రావడం లేదు. మా తండ్రిగారు నిర్వహిస్తున్న కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రికార్డ్ చెయ్యడానికి విజయవాడ నుండి వేన్ లో వచ్చారు. మా ఇంటికి కూడా వచ్చారు.

వారు ఏ హోదాలో పని చేశారో చెప్పగలరా శ్రీనివాసరావు గారు? అలాగే ప్రయాగ రామకృష్ణ గారు శాస్త్రి గారికి బంధువా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహా రావు గారు: బావగారి కబుర్లు, వినోదాల వీరయ్య అంటే ఆనతి శ్రోతలు చప్పున గుర్తు పడతారు. ప్రయాగ వారు ఆశువుగా అనర్ఘలంగా , స్క్రిప్ట్ లేకుండా రేడియోలో ప్రోగ్రాములు చేసేవారని ప్రతీతి. బుర్రకధలకు, భద్చరాచలంలో జరిగే రామనవమి ఉత్సవాలకు ప్రత్యక్ష వ్యాఖ్యానాలకు ప్రసిద్ధి. న్యూస్ రీడర్ కాదు కానీ విజయవాడ రేడియో కేంద్రంలో, అంతకు ముందు మద్రాసు రేడియోలో పనిచేసారు.