7, నవంబర్ 2019, గురువారం

రేడియో రోజులు – 9 – భండారు శ్రీనివాసరావు(Published in SURYA telugu daily on 07-11-2019, Thursday)
రేడియో  విలేకరిగా పనిచేసిన రోజుల్లో ఒక్క పాలక పక్ష నేతలతోనే కాకుండా ప్రతిపక్షంలో వున్న నాయకులతో కూడా సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి.
నేను హైదరాబాదులో రేడియో విలేకరిగా చేరినప్పుడు నాకు బాగా తెలిసిన రాజకీయ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. 1978 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ నాయకులు మరో ఇద్దరితో కూడా నాకు బాగా పరిచయం వుండేది. ఒకరు శ్రీ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాగా రెండో నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు. పైగా ఆ రోజుల్లో  వీరిద్దరూ జిగ్రీ దోస్తులు. ఒక మంచం, ఒక కంచం అంటారే అలా అంత స్నేహం వారి మధ్య. నాలాగే ఆ కాలంలో పనిచేసిన విలేకరులందరికీ ఈ విషయం తెలుసు.
ఆ రోజుల్లో సీనియర్ పాత్రికేయులందరూ వయసులో, అనుభవంలో చాలా పెద్ద వారు. వాళ్ళ ఆహార్యం కూడా పెద్దరికంగా వుండేది. కొందరు పంచెలు, లాల్చీలు ధరిస్తే కొందరు సూటూ బూటుతో కనబడేవారు. కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరేమో యువకులు.  బహుశా అదొక కారణం అయుంటుంది ప్యాంటూ చొక్కా వేసుకుని తిరుగుతున్న నాలాంటి విలేకరులతో మాటామంతీ కలపడానికి.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ ను అనుదినం దుమ్మెత్తిపోస్తూ వున్నప్పుడు కూడా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోలేదు. పైగా అవకాశం లభిస్తే మామగారి (ఎన్టీఆర్) పైనే పోటీ చేస్తానని విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనను ఆయన చాంబర్ నుంచే నేను రేడియోకి ఫోన్ చేసి చెప్పడం, అది వెనువెంటనే వార్తల్లో రావడం జరిగిగింది. ఎన్టీఆర్ పార్టీ  పెట్టిన తొమ్మిది మాసాల్లోనే కాంగ్రెస్ నుంచి అధికారం కైవసం చేసుకున్న కొన్నాళ్ళ వరకు వై.ఎస్. బాబుల  స్నేహం కొత్త చిగుళ్ళు వేస్తూనే వుంది. తదనంతర కాలంలో చంద్రబాబు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న తరువాత వారి దారులూ వేరయ్యాయి, పార్టీలూ  వేరయ్యాయి. దాంతో  సహజంగానే ఆ నాటివరకు వారి నడుమ వెల్లివిరిసిన  స్నేహం వసివాడిపోయింది. వారితో నా పరిచయం కూడా విడివిడిగా కొనసాగింది.
ఇతర పార్టీల్లో కూడా నాకు మంచి పరిచయం వున్న నాయకులు అనేకమంది వుండేవారు. ఆ పరిచయాలు మరింత బలపడడానికి కూడా ప్రధాన కారణం నాకున్న రేడియో విలేకరి అనే ట్యాగ్ లైన్.
శాసనసభలో సీపీఎం నాయకుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన బోడేపూడి వెంకటేశ్వర రావు గారు వ్యవహరించేవారు. ఆకారంలోనూ, ఆహార్యంలోను నిజంగా పెద్దమనిషి. ఆ రోజుల్లో అంటే రేడియో ఏకచ్ఛత్రాధిపత్యం సాగిపోతున్న కాలంలో అసెంబ్లీ జరిగే రోజుల్లో ప్రతిరోజూ సభాకార్యక్రమాలపై అదే రోజు రాత్రి రేడియోలో ఒక సమీక్షాకార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళం. హైదరాబాదులోని పాత, కొత్త  ఎమ్మెల్యే హాస్టళ్ళలో ప్రత్యేకంగా మైకులు పెట్టి వినిపించేవాళ్ళు. అసెంబ్లీ ముగిసిన తర్వాత హాస్టళ్ళలో చాలామంది శాసన సభ్యులు, ఇతరులు గుమికూడి  ఈ కార్యక్రమం ఆసక్తిగా వినేవాళ్ళు. తమ తమ నియోజక వర్గాల సమస్యలు గురించి తాము సభలో  లేవనెత్తిన విషయాలు తమ ప్రాంతం  వారికి వెనువెంటనే తెలుస్తాయని వారి అభిప్రాయం. అయితే ఈ సమీక్షలను రేడియోలో పనిచేసే మేము కాకుండా పత్రికలలో పనిచేస్తూ అసెంబ్లీ కార్యక్రమాలు రిపోర్ట్ చేసే విలేకరుల చేత  రాయించేవాళ్ళం. అలా అయితే నిష్పాక్షికంగా సమీక్షించే అవకాశం ఉంటుందన్నది రేడియో అధికారుల భావన.  వాటిలో ఏదైనా తప్పులు దొర్లాయా అనేది పర్యవేక్షించడం వరకు మాత్రమే వార్తావిభాగం బాధ్యత. ఒకసారి బోడేపూడి వారు ఏదో అంశంపై సభలో మాట్లాడారు. అందుకు విరుద్ధంగా రేడియో సమీక్షలో ప్రసారం అయిందని వారికి ధర్మాగ్రహం కలిగింది. వెంటనే రేడియో స్టేషన్ అధికారులకు అసెంబ్లీ నుంచి తాఖీదు వచ్చింది. ఏదైనా తభావతు జరిగిందని స్పీకర్ భావిస్తే రేడియో స్టేషన్ డైరెక్టర్ అసెంబ్లీకి హాజరై క్షమాపణ చెప్పాలి. (ఇప్పుడు ఈ నిబంధనలు వున్నాయో లేదో తెలియదు. వున్నా పాటిస్తున్నారో లేదో తెలియదు)
ఇది తెలియగానే నేను  అసెంబ్లీ ఆవరణలో బోడేపూడివారిని కలిసి విషయం చెప్పి పొరబాటు ఎలా జరిగిందో చెప్పాను. ఆయన సంతుష్టపడ్డారు. అంతేకాదు, తన పిర్యాదును ఉపసంహరించుకున్నట్టు స్పీకరుకు లేఖ రాసి ఆ ప్రతిని స్వయంగా తీసుకుని వచ్చి మా స్టేషన్ డైరెక్టర్ కు అందచేశారు. అది వారి మంచితనం, అది వారి హుందాతనం.
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: