6, అక్టోబర్ 2018, శనివారం

వ్యవస్థలతో చెలగాటం, ప్రజాస్వామ్యానికి ప్రాణసంకటం – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN THE EDIT PAGE OF SURYA DAILY ON 07-10-2018, SUNDAY)

 “కేంద్రం మిధ్య” పొమ్మన్నారు, అలనాడు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు.
“కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదు” అంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు ఈనాడు అదే పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
అయితే ఈ రెండు తిరస్కార స్వరాల నేపధ్యం వేరు.
రామారావు సొంత పార్టీ పెట్టిననాడు ఆయన పెట్టుకున్న లక్ష్యాలు ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ, కాంగ్రెస్ వ్యతిరేకత, ప్రాంతీయ ప్రయోజనాల సాధన. ఆ క్రమంలో ఆయన కేంద్రంపై విరుచుకుపడడాన్ని ప్రజలు అర్ధం చేసుకుని ఆయన్ని ఆశీర్వదించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చిన రీతిలో మార్చడం, ఆ పార్టీ హయాములో ముఖ్యమంత్రి అంజయ్యకు జరిగిన అవమానం, తెలుగు వాడి ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఆనాడు తీసుకున్న కొన్ని చర్యలు కూడా కేంద్రంపై పోరాటంలో రామారావు సాధించిన అపూర్వ  విజయానికి ఉపయోగపడిన మాట వాస్తవం. పోరాట పటిమ ప్రదర్శించడంలో ఎన్టీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు త్రికరణశుద్ధిగా ఆమోదించారు.    
ఇప్పుడు, ఇన్నేళ్ళ తర్వాత కేంద్రంపై చంద్రబాబు నాయుడు పెంచుతున్న  తిరుగుబాటు స్వరానికి ఆయన చెబుతున్న కారణాలు వేరు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్రధాని నరేంద్రమోడీతో విబేధించి, నాలుగేళ్ళకు పైగా ఆయనతో నెరపిన నెయ్యాన్ని కాదనుకుని, రాష్ట్రానికి అధికార హోదా సాధించడమే ధ్యేయంగా ప్రకటించి, ఎన్డీయే కూటమినుంచి వైదొలగి, ధర్మపోరాట దీక్షల పేరుతో కేంద్రంపై కాలుదువ్వడం మొదలు పెట్టారు. అయితే ఆయన చెబుతున్న కారణాలను ప్రజలు మనః పూర్తిగా విశ్వసించేలా చేయడంలో అంతగా సఫలీకృతులు కాలేకపోయారు. ఆనాడు రామారావును నమ్మినట్టుగా ఈనాడు చంద్రబాబును నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేకపోవడానికి కారణం, కొందరు చెబుతున్నట్టు  ఆయన అనుసరిస్తున్న అవకాశవాద రాజకీయాలు. అయితే, అదేసమయంలో ఆయన మరో కార్యక్రమాన్ని దిగ్విజయంగా  పూర్తిచేసారు. ఆంద్ర ప్రదేశ్ ప్రజల్లోని అధిక సంఖ్యాకుల్లో అప్పటివరకు మోడీ పట్ల  పెరుగుతూ వచ్చిన ఆదరాభిమానాలను ఆయన తన రాజకీయ చాతుర్యంతో సమూలంగా తుడిచి పెట్టగలిగారు. మోడీ, ఆయన నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో వైమనస్యం కలిగేలా చేయగలిగారు. రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన కాంగ్రెస్ పార్టీ పట్ల పేరుకు పోయిన ప్రజాగ్రహాన్ని బీజేపీ దిశగా మళ్ళించడంలో ఆయన తన రాజకీయ అనుభవం యావత్తూ రంగరించి ఉపయోగించారు.
ఈ విషయంలో సంపూర్ణంగా విజయం సాధించిన చంద్రబాబునాయుడు, కేంద్రంపై పోరాటానికి మరో అస్త్రాన్ని ఎంచుకున్నారు. కాకపొతే ఈ అస్త్రం ఆయన అంబులపొదిలోనిది కాదు. నిజానికి కేంద్ర ప్రభుత్వమే ఐటీ దాడుల రూపంలో దీన్ని ఆయనకి  అందించింది. ఎదురయిన ప్రతి సమస్యను ఒక అవకాశంగా  మలచుకుని ముందుకు సాగుతుంటానని చంద్రబాబు తరచుగా చెబుతుంటారు. ఇప్పుడూ అదే చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు,విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  ఆదాయపు పన్ను శాఖ (ఐటీ)కు చెందిన అనేక బృందాలు ఒకే రోజున ఏక కాలంలో పలుచోట్ల నివాసాలను, కార్యాలయాలను సోదా చేయడం ఒక పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన మాజీ శాసన సభ్యుడు బీద మస్తాన్ రావు కంపెనీలు, అలాగే ప్రకాశం జిల్లాలో  టీడీపీ శాసన సభ్యుడు పోతుల రామారావు కంపెనీలు దాడులు జరిగినవాటిలో వుండడం వల్ల ఈ అంశానికి రాజకీయ ప్రాముఖ్యం కలిగింది.  నిజానికి ఐటీ సోదాలు అనేవి రాజకీయాలతో సంబంధం వుండి జరగవు. కొన్ని నిర్దిష్ట నియమ నిబంధనలకు లోబడి జరుగుతాయని ఆ శాఖకు చెందినవాళ్ళు చెబుతుంటారు. అంతా ఒక పద్దతి ప్రకారం, రహస్యంగా జరుగుతూ ఉంటుందని, రాజకీయ ప్రమేయం చాలా తక్కువ అని కూడా చెబుతుంటారు. కానీ ఈసారి అది జరిగిన తీరు, సమయం అనేక సందేహాలను తెరపైకి తెచ్చింది. విస్తృత స్థాయిలో ఐటీ సోదాలు జరగబోతున్నట్టు కొన్ని పత్రికల్లో, కొన్ని టీవీ ఛానళ్లలో వార్తలు ముందుగానే వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖలోని వారెవరో ఉప్పందించకుండా ఇలా జరగడం అసాధ్యం. అలాగే ఈ దాడులు (ఈ పద ప్రయోగంపై కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి) లేదా సోదాలు గురించి తమవద్ద  సమాచారం ఉందనే రీతిలో  పాలక పక్షానికి చెందిన కొందరు నేతలు ముందుగానే ప్రకటనలు చేశారు. కొన్ని చోట్ల ఆదాయపు పన్ను అధికారుల కంటే ముందుగానే మీడియా ప్రతినిధులు అక్కడకు చేరి వుండడం గమనించిన అధికారులే విస్తుపోయారని పత్రికలు రాసాయి.  దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరిగి కారకులు ఎవ్వరన్నది నిగ్గు తేల్చేవరకు ఈ దాడులు రాజకీయ ప్రేరేపితమని నమ్మేవాళ్ళు నమ్ముతూనే వుంటారు. అంచేత రాజకీయాలకు, ఈదాడులకు సంబంధం లేదని ఖండితంగా చెబుతున్న వాళ్ళు, ముందు ఈ సమాచారం బయటకు ఎలా పొక్కిందో, దానికి బాధ్యులు ఎవరో బయట పెట్టాలి.     
మోడీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఈ ఐటీ దాడులు అందులో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్ముతున్నారు. ప్రజలని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు మరి కొన్ని మాసాల్లో జరగబోతున్నప్పుడు, కేంద్రం కక్ష కట్టి ఈ దాడులకు పూనుకున్నదని అనేకమంది తెలుగు దేశం నాయకులు పదేపదే ఆరోపణలు చేస్తూ వుండడం ఇందులో భాగమే.      
ఈ మొత్తం వ్యవహారాలను గమనించిన వారికి రెండు విషయాలలో ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
ఈ మూకుమ్మడి ఐటీ సోదాలకు ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇందులో ఏమైనా రాజకీయం దాగున్నదా? ఈ ప్రశ్నకు సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి.
అలాగే ఐటీ దాడులు అనేవి పన్ను ఎగవేతదారులపై జరుగుతాయి. అటువంటప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఈ స్థాయిలో కలవరపాటు ఎందుకు? ఈ సందేహాన్ని ఆ పార్టీ నాయకులే తీర్చాలి.
అన్నింటికంటే సామాన్యులను, ప్రజాస్వామ్య ప్రియులను, రాజకీయాలతో లేదా ఏ పార్టీతో సంబంధం లేని వారిని వేధిస్తున్న మరో ప్రశ్నకు బదులు రావాల్సి వుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను ప్రశ్నార్ధకం చేస్తున్న ఇటువంటి పరిమాణాలకు ఎవరిది బాధ్యత?
సోదాలు జరిపే ఐటీ అధికారులు పోలీసు భద్రత కోరితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి. ఇదే నిజమయితే పరిణామాలు వేరే విధంగా పరిణమించే ప్రమాదం వుంది. అవసరం అనుకుంటే కేంద్రం తన బలగాలను నేరుగా రంగంలోకి దింపితే ఆ పరిస్తితులు మరో విషమ స్తితికి దారితీయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ తరుణంలో అలాంటి పరిణామాలు తనకు కలిసి వస్తాయని, ప్రజల  సానుభూతి పవనాలు రానున్న ఎన్నికల్లో తమ పార్టీని ఒడ్డెక్కిస్తాయనే టీడీపీ అధినేత ఆలోచనలు కూడా ఇటువంటి తీవ్ర నిర్ణయాలకు కారణం అయి ఉండవచ్చని కొందరి విశ్లేషణ. అలా జరిగితే జాతీయ మీడియా దృష్టి రాష్ట్రంపై కేంద్రీకృతమై దేశ స్థాయిలో మోడీ ప్రతిష్టను దెబ్బతీయడం సులభం కావచ్చని కూడా అనుకుని ఉండవచ్చని వారి అభిప్రాయం.  నలభయ్ ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఇలా తనకు ఎదురయిన గడ్డు సమస్యను ఒక అవకాశంగా మలచుకునే అవకాశం లేకపోనూ లేదని కొందరి విశ్లేషకుల భావన. రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని మీడియాలో వార్తలు అయితే  వచ్చాయికానీ, మంత్రివర్గ సమావేశం వివరాలను  విలేకరులకు వివరించిన మంత్రిగారు  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఏమైనా ఇవన్నీ ఊహాగానాలు. నిజం చెప్పాలంటే ఊహాగానాల ఆధారంగా చేసే మరికొన్ని ఊహాగానాలు. మీడియా విస్తృతి కారణంగా ఈరోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి.    
ఏ లెక్కన చూసినా ప్రధాన మంత్రి మోడీ కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయాల్లో సీనియర్. అయితే బ్యురోక్రసీలో మాదిరిగా రాజకీయాల్లో ఈ చిన్నా పెద్ద తేడాలు పాటించరు. వయసులో తమకంటే ఎంతో చిన్నవాళ్ళయిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల మంత్రివర్గాల్లో అనేకమంది కాంగ్రెస్ సీనియర్లు పనిచేసారు. ఇక్కడ అర్హత వయస్సు, సీనియారిటీ కాదు. ఒకరకంగా అవకాశం. మరోరకంగా  నమ్మినా నమ్మకున్నా అదృష్టం.
కేంద్రం అధీనంలో కొన్ని కీలకమైన విభాగాలు వుంటాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కూడా. వాటిపై పర్యవేక్షణ వుండాలి కానీం వాటిని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం వాడడం మొదలు పెడితే పరిస్తితులు ఇలాగే వుంటాయి. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం వల్ల, ఎన్ని  చట్టాలు వున్నా, అవి ఎంత పకడ్బందీగా తయారుచేసినవి అయినా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ పోతుండడం అనేది వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కాకుండా వాటి నిబద్ధత పట్ల ప్రజలలో లేనిపోని అనుమానాలను రగిలిస్తోంది.
ఒక్క ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి అనేకాదు,   ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పదవికీ, ప్రతి ఉద్యోగికీ కొన్ని అధికారాలు వుంటాయి. ఆ అధికారాలుకు అనుగుణంగా పనిచేసే కొన్ని వ్యవస్థలు వుంటాయి. వాటిని ప్రత్యర్ధులు, లేదా తాము  ఇష్టపడని వారిపై ప్రయోగిస్తూ పోతే అది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే అవుతుంది. అలా వాడుకోలేని అధికారాలు వుంటే ఏమి, లేకపోతే ఏమి అని వాదించేవాళ్లకు ఒక నమస్కారమే నా సమాధానం.
ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ప్రజలకు సంబంధించి ఏదైనా సమస్యను తమ హోదాలను ఉపయోగించుకుంటూ  పరిష్కరించుకోవాలని చూస్తే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ అది కేవలం మోడీ, బాబు నడుమ వ్యవహారం అయితే అందులో ప్రజల్ని కలపకూడదు. వాళ్ళే తేల్చుకోవాలి.
అదీ నిజమయిన రాజకీయం అంటే!            
ఉపశృతి: ఇది జరిగి అరవై ఏళ్ళు దాటింది. ఆ రోజుల్లో పత్రికల్లో చిన్న వార్తగా వచ్చింది. అప్పటి హైదరాబాదు పొలిమేరల్లో ఉన్న మిలిటరీ కంటోన్మెంటు నుంచి ఒక సైనిక జవాను నగరానికి వచ్చాడు. సినిమాహాల్లో కాబోలు అతడికీ స్థానిక పోలీసు జవానుకూ నడుమ ఒక తకరారు వచ్చింది. అది ముదిరి చేతులు కలుపుకునే దాకా వెళ్ళింది. స్థానిక పోలీసు తనకున్న స్థానబలంతో ఆ మిలిటరీ జవానును తీసుకువెళ్ళి లాకప్పులో పడేశాడు. ఈ సమాచారం కాస్త ఆలస్యంగా కంటోన్మెంటుకు చేరింది. ఒక ట్రక్కులో సైనికులు ఆ పోలీసు స్టేషన్ కు చేరుకొని స్థానిక పోలీసులకు దేహశుద్ధి చేసి తమ సహోద్యోగిని బందీ నుంచి విడిపించి వెంటబెట్టుకు వెళ్ళారు. అప్పుడు సమాచార వ్యాప్తి మెల్లగా జరిగేది కనుక, విషయం పైఅధికారులకు తెలిసేసరికి కొంత ఆలస్యం అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ వ్యవహారం కాబట్టి  అది మరింత ముదరకుండా ఇరువైపులా ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు తీసుకున్నారని పత్రికా వార్తల  కధనం.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595    

3, అక్టోబర్ 2018, బుధవారం

వారాలబ్బాయి – భండారు శ్రీనివాసరావు


టీవీల వాళ్ళు నాకు పెట్టిన పేరు వారాలబ్బాయి. అంటే రోజుకొక ఛానల్. ఈరోజు ఒక టీవీకి వెడితే మళ్ళీ వారం తర్వాతే ఉదయం పూట ఆ ఛానల్ కి వెళ్ళడం.  అది చార్టు వేస్తే ఇలా వుంటుంది:
(సోమవారం నుంచి ఆదివారం వరకు)
Monday – AP 24 X 7 – From 7.30 am to 9 am. (మార్నింగ్ డిబేట్ విత్ వెంకట కృష్ణ)
Tuesday – NTV – 7.30 am to 8.39 am (బిగ్ డిబేట్)
Wednesday – T. News – 7.30 am to 8.30 am (వార్తలు, వాస్తవాలు)
Thursday – Sneha – 7.30 am to 8.45 am (One to One debate, న్యూస్  టాక్)
Thursday – Sakshi – 7.30 pm to 8.30 pm (Amar’s Fourth Estate)
Friday – Maha News – 7.00 am 8.30 am ( సన్ రైజ్ షో)
Saturday-  ABN Andhra Jyothy – 7.00 am to 8 am. (పబ్లిక్ పాయింట్)
Sunday – TV 5 – 7.30 am to 9 am (న్యూస్ స్కాన్)
(ఇప్పుడిదంతా ఎందుకంటే ఈ మధ్య మీరు కనిపించడం లేదేమిటి అంటూ కొందరు  మెసేజులు పెడుతున్నారు.  ఒక రోజు కనబడకపోతే మళ్ళీ వారం తిరిగేదాకా వీలు కుదరదు అని చెప్పడానికి మాత్రమే సుమా!)

2, అక్టోబర్ 2018, మంగళవారం

మహాత్ముని మననంలో......భండారు శ్రీనివాసరావు


1969
సుమారుగా  యాభయ్ ఏళ్ళ కిందటి మాట. అప్పుడు నేను  ఎస్సారార్ కాలేజీలో చదువుతున్నాను. 
మహాత్మాగాంధీ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని  గాంధీపై  పరిశోధన చేయడానికి జర్మనీలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం హైడెల్ బర్గ్ యూనివర్సిటీ నుంచి శర్మ మార్ల అనే ఒక ప్రొఫెసర్ వచ్చారు. వారిది కాకినాడ. చిన్నప్పుడే చదువులకోసం జర్మనీ వెళ్లి, అక్కడే   జర్మన్ అమ్మాయిని పెళ్ళాడి అక్కడే  స్థిర పడ్డారు.
గాంధీ గారి గురించి నగరాల్లో, పట్టణాల్లో, మారుమూల పల్లెల్లో జనం  ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవడానికి శర్మగారు వారి యూనివర్సిటీ పనుపున ఈ పరిశోధనకు పూనుకున్నారు. ఈ యజ్ఞంలో నన్ను ఆయన తన సహాయకుడిగా తీసుకున్నారు. సెలవుల్లో ఆయన వెంట తిరగడం, ఆయన ఏ వూరు వెడితే ఆ వూరికి తోడుగా వెళ్ళడం, ఆ వూరిలో నా వంటి విద్యార్ధులను మరి కొంతమందిని వెంట బెట్టుకుని ఆయన తయారు చేసిన ప్రశ్నావళి ప్రకారం ప్రజాభిప్రాయాన్ని నమోదు చేయడం ఇలా అన్నమాట.
ఈ క్రమంలో నాకు గాంధిగారి గురించి నాకు తెలియని విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది.
కొన్ని ఊళ్లలో గాంధి గారి ఫోటోను ఇళ్ళల్లో పూజామందిరాలలో పెట్టుకుని పూజిస్తున్న వైనం నన్ను ఆశ్చర్య పరచింది. శాంతి మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తిగా గాంధి గురించి తెలిసిన నాకు ఆయన కొందరి దృష్టిలో భగవత్ స్వరూపంగా మారడం ఒకింత వింత గానే అనిపించింది. ఒక దారీ తెన్నూ లేని మూలగట్టు పల్లెటూళ్ళలో కూడా గాంధీ అనే పేరు విన్నట్టు చెప్పారు కానీ కొందరికి ఆయన ఎవ్వరన్నది తెలవదు.
‘దేశానికి (వాళ్ళ దృష్టిలో వాళ్ళ ప్రాంతానికి) ఏదో చేసాడట కదయ్యా, మనకిక మంచి రోజులు వస్తాయని మా నాయనమ్మ చెప్పింది నిజమేనా’ అని మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా వున్నారు.
‘ఆయన్ని కాల్చి చంపిన కబురు చెవిన పడిన తర్వాత మా వూళ్ళో ఎవరింట్లో పొయ్యి వెలిగించలేదు’ అని ఒక వూళ్ళో బాగా వయసుమళ్ళిన ఒక వ్యక్తి చెప్పారు.( ఆయన ఉద్దేశ్యం  ఆ మర్నాడు జనవరి ముప్పయి ఒకటిన అని. గాంధీ చనిపోయింది ముప్పయ్యో తేదీనే అయినా వారికి ఆ కబురు చేరేసరికి ఒక రోజు గడిచి పోయిందిట)
నేను పుట్టిన మూడేళ్ళలోపునే మహాత్మా గాంధి గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. శర్మ గారి ధర్మమా అని గాంధి గురించి ఒక అవగాహనకు వచ్చే అవకాశం నాకు విద్యార్ధి దశలోనే లభించింది.

1, అక్టోబర్ 2018, సోమవారం

ఫస్టు తారీకు – భండారు శ్రీనివాసరావు


1987 లో మాస్కో వెళ్ళేవరకు మా ఇంటిల్లిపాదికీ చిరపరిచితమైన పదం, ఈ ఫస్టు తారీకు.  అందరం చకోర పక్షుల్లా ఎదురుచూసే రోజును ఎలా మరచిపోగలం!
చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కొలువు కాబట్టి నెల జీతం ఏనెలకానెల నెలాఖరురోజున ఇచ్చేవాళ్ళు. సూర్యుడు ఎటు పొడిచినా సరే మేము నలుగురం అంటే నేనూ మా ఆవిడా ఇద్దరు పిల్లలు, ఆరోజు సాయంత్రం మొదటి ఆట ఏదో ఒక సినిమా చూడాల్సిందే. హిమాయత్ నగర్ మినర్వా ( బ్లూ ఫాక్స్) లో భోజనం చేయాల్సిందే. ఆ రోజు తప్పిందంటే మళ్ళీ నెల రోజులు, రోజులు లెక్కపెట్టుకుంటూ ఆగాల్సిందే. ఎందుకంటే మళ్ళీ మర్నాటి నుంచే మాఇంట్లో నెలాఖరు మొదలు కాబట్టి.
మాస్కో  వెళ్ళిన కొత్తల్లో ఏమో కానీ ఆ తరవాత్తరవాత అక్కడ ఫస్ట్ తారీకు అనే మాటే మరచిపోయాము. గమ్మత్తేమిటంటే అక్కడ నెలకు ముప్పయి రోజులు మాకు ప్రతి రోజూ ఫస్ట్ తారీకు మాదిరిగానే గడిచిపోయేవి.
తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ కధ మామూలే. కాకపొతే కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డులు మళ్ళీ మొదటి తారీకును మరచిపోయేలా చేసాయి కానీ, ఆ తరవాత టిక్కెట్టు కొనకుండానే నరకాన్ని కూడా చూపించాయి. ఈ కార్డులు అనేవి లేకపోతే నాకసలు బీపీ అనే జబ్బు వచ్చేది కాదని మా ఆవిడ దృఢ విశ్వాసం.
ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా పాత రోజుల్ని రివైండ్ చేసే పనిలో పడ్డాము. పించను డబ్బులు బ్యాంకులో పడగానే, నెట్లో సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని, ఉబెర్ లో బయలుదేరివెళ్లి మల్టీప్లెక్స్ లో  సినిమా చూసేసి, ఎంచక్కా హోటల్లో భోజనం చేసేసి, ఉబెర్లో పడి ఇంటికి చేరుతున్నాము.
కాకపొతే అప్పుడు నలుగురం, ఇప్పుడు ఇద్దరం.    
 

పునేఠ ఐ.ఏ.ఎస్. – భండారు శ్రీనివాసరావు



మొన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనిల్  చంద్ర పునేత పేరులో చివర ‘ఠ’ తగిలించి కొన్ని తెలుగు పత్రికలు రాస్తున్నాయి కానీ ఆయనలో అంతటి  కఠినత్వం కనబడదు. అంచేత ఆయన పేరు రాసేటప్పుడు నేను పునేత అనే రాస్తాను.
నేను మాస్కో నుంచి తిరిగొచ్చి రేడియోలో మళ్ళీ విలేకరిగా జాయిన్ అయిన మొదటి రోజుల్లో మా రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్నపబ్లిక్ గార్డెన్ లో పునేత గారు పనిచేసే కార్యాలయం వుండేది. దాన్ని ఉద్యానవనాల శాఖ అనే వాళ్ళు. దానితో ప్రజలకు కానీ, పత్రికా విలేకరులకు కానీ పెద్దగా పని వుండేది కాదు. రేడియో వాళ్ళం కనుకా, పాడీ, పేడా తప్ప మాకు వేరే వార్తలు ఉండేవి కావనే అపప్రధ ఎలాగూ మోస్తున్నాము కనుక అప్పుడప్పుడూ నేనూ, మా సహా విలేకరి పవని విజయలక్ష్మి(ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు) వెడుతుండేవాళ్ళం. ఆ విధంగా పునేత గారితో తొలిపరిచయం.

తరవాత్తరవాత ఆయన ఉద్యోగ పర్వంలో మెట్లెక్కుతూ కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే నేను రిటైర్ అయి, హెచ్.ఎం.ఆర్.ఐ. (104) అనే  సంస్థలో ఒక హోదా అంటూ లేని, ఉద్యోగం అనే పేరు పెట్టలేని కొలువు చేస్తూ ఉండేవాడిని. ఆ పనుల మీద నేను అప్పుడప్పుడూ వారిని కలుస్తూ ఉండేవాడిని. అక్కడ వెంకట్రావు గారనే పియ్యే వుండేవారు. మంచి సహృదయులు. ‘వున్నారా!’ అని అడగ్గానే ఆయన ‘వెళ్ళండి’ అంటూ తలుపు వైపు చేయి చూపించేవారు. తరవాత అర్ధం అయింది ఏమిటంటే పునేత గారిని కలవాలంటే విజిటింగ్ కార్డులు గట్రా అక్కర లేదు. వెళ్లి తలుపు తోయగానే ఆయన బిజీగా వుంటే ‘ఒక్క క్షణం, నేనే పిలుస్తాను’ అనేవారు. లేకపోతే తలుపు తోసుకుని వెళ్లి ఎవరయినా సరే ఆయనతో మాట్లాడానికి వీలుండేది. ఏదైనా సమస్య గురించి చెప్పగానే దాన్ని ఎలా పరిష్కరించవచ్చు అనే పద్దతిలో ఆలోచించేవారు.

ఇప్పుడాయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. పరిపాలనాపరంగా చూస్తే, ఒక రకంగా ముఖ్యమంత్రి తరవాత ముఖ్యమంత్రి.

మరిన్ని బాధ్యతలతో కూడిన ఉద్యోగం అయినా  సమర్దుడయిన అధికారి అనే ట్యాగ్ లైన్  కూడా అనిల్ చంద్ర పునేత గారి పేరుకు అనుబంధంగానే  వుంది.

మొన్న సాయంత్రం హైదరాబాదు నుంచి ఫోను చేసి అభినందనలు తెలిపాను. ఆ రోజుల్లో మాతో పాటు కలిసి వెళ్ళిన వాళ్ళను కూడా ఆయన పేరుపేరునా గుర్తుకు తెచ్చుకున్నారు. అదీ ఆయన సహృదయత.         

29, సెప్టెంబర్ 2018, శనివారం

సంచలన వార్తల సునామీలో తెలుగు మీడియా – భండారు శ్రీనివాసరావు

  
(Published in SURYA telugu daily on 30-09-18, SUNDAY)
గత కొద్ది రోజులుగా పట్టిన ‘వార్తల ముసురుతో’ తెలుగు రాష్ట్రాల్లో మీడియా తడిసి ముద్దవుతోంది.
ఒకదాని వెంట మరో వార్త ఎవరో తరుముతున్నట్టు వస్తూ ఉండడంతో మీడియా ఉడ్డుగుడుచుకుంటోంది.
మరో రెండు రోజుల్లో, అక్టోబరు రెండో తేదీన  పదవీవిరమణ చేయబోతున్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, కొద్ది రోజుల వ్యవధానంలోనే అతి ముఖ్యమైన అంశాలలో కీలకమైన పలు తీర్పులను వరసగా  వెలువరించి మీడియాకు మరింత పని ఒత్తిడి కలిపించారు.
స్వలింగ సంపర్కం  తప్పు కాదంటూ ఇచ్చిన తీర్పుపై రగిలిన రగడ చల్లారక ముందే వివాహేతర సంబంధాలు శిక్షార్హమైన నేరం కాదంటూ సుప్రీం ఇచ్చిన మరో తీర్పు అయోధ్య వివాదం పై తాజాగా  ఇచ్చిన మరో తీర్పును మరుగున పడేసింది. ఇదిలా ఉండగానే శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై వున్న నిషేధాన్ని సుప్రీం కొట్టివేయడం సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలకు ఊపిరి ఊదింది. భీమా కొరేగాం కేసుకు సంబంధించి వరవరరావు గృహ నిర్బంధాన్ని మరో మాసం పాటు పొడిగిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం కూడా ఈ వరుస లోనిదే.
దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పెంపు గురించి ఎప్పుడో పాతరేసిన మరో అంశానికి ఊపిరి పోస్తూ కేంద్రహోం శాఖ ఎన్నికల కమీషన్ ను నివేదిక కోరడం,  తెలంగాణలో ముందస్తు ఎన్నికల  ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలయిన కేసులో వారం రోజుల లోగా వివరణ ఇవ్వాలని  తెలంగాణా ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు ఇవ్వడం, దరిమిలా ముందు అనుకున్న ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశంపై అనుమాన మేఘాలు ముసురుకోవడం, ఇది ఇలా ఉండగానే,  నాలుగు ఇతర రాష్ట్రాలతో కలిపి తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడానికి అన్నీ సక్రమంగా వున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు నివేదిక ఇవ్వడం ఇలా పరస్పర విరుద్ధమైన సమాచారాలు ఇప్పటికే  బాగా పేరుకుపోయిన  అయోమయ పరిస్తితిని మరింత పెంచుతూ పోతున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, టీడీపీ శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ నడుమ సాగుతున్న మాటల యుద్ధం రోజురోజుకూ తన స్వరూప స్వభావాలను మార్చుకుంటూ కొత్త వివాదాలకు, సరికొత్త రాజకీయ ఆరోపణలకు తెర తీస్తోంది. తనపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, చంపడానికి కుట్ర జరుగుతోందని స్వయంగా పవన్ ప్రకటించడం ఆయన పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ స్థాయి నాయకుడు చేసిన ఇటువంటి ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం అవసరమనిపిస్తోంది.
అలాగే విశాఖ ఒడిసా సరిహద్దుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు,  అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఇరువురూ ఒకేచోట, ఒకేరోజు మావోయిస్టుల  తుపాకుల బారినపడి , ఒకేసారి  అసువులు బాయడం ఆ ప్రాంతంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో సయితం ప్రకంపనలు సృష్టించింది. ఒక గిరిజన ఎమ్మెల్యేను  మావోయిస్టులు మట్టుబెట్టడంలో పోలీసుల వైఫల్యం వుందని భావించిన గిరిజనులు ఒక్క పెట్టున అరకు పోలీసు స్టేషన్ పై దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
ఈ నేపధ్యంలో అమెరికాలో జరిపిన ప్రతిష్టాత్మక  పర్యటన నుంచి స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి సమస్యలు స్వాగతం పలకడంతో తన  పర్యటనలో సాధించిన విజయాలను, విశేషాలను ప్రజలకు తెలియప్పాలనే   ఉత్సాహంపై నీళ్ళు చల్లినట్టు వుండవచ్చు.  పులిమీద పుట్రలా  పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, ఒకప్పుడు తమ పార్టీలో ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రేవంతరెడ్డి ఇంటిపైనా, ఆయన బంధువుల ఇళ్ళ మీదా  ఆదాయపు పన్ను(ఐటీ), ఎన్ఫోర్స్ మెంటు విభాగం (ఈడీ)  అధికారులు దాడులు జరపడం,  ఒక్క రేవంతరెడ్డి ఇంట్లోనే దాదాపు రెండు రోజులు ముమ్మరంగా సోదాలు చేయడం, అనేక గంటలపాటు రేవంత్ రెడ్డిని విచారించడం,  కోట్లరూపాయల్లో సాగిన   బినామీ లావాదేవీలకు సంబంధించిన సమాచారాలు బయటకు పొక్కుతూ వుండడం, అదే సమయంలో మరుగున పడిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసు మరోసారి తెర మీదికి వస్తూ వుండడం తెలుగుదేశం అధినేతకు ఈ తరుణంలో అంతగా రుచించని విషయాలే.
అందుకే ఆయన తన మనసులోని మాటను ఆచితూచినట్టుగా మాట్లాడుతూనే  బయట పెట్టారు కూడా. ‘దొంగలు, నేరగాళ్ళను పట్టుకోలేరు కానీ రాజకీయ వేధింపులకు మాత్రం ముందుంటున్నారు’ అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ‘ఎన్నికలు రాగానే మొదలు పెడుతున్నారు. ఈ పద్దతులు దేశానికి మంచిది కావు. అవినీతిపరుల తాట తీస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పుడు అదే అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేయడం వల్ల మోడీ విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు.
అయితే, అంతకు ఒక రోజు ముందే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ అధినేతపై ఇదే విధమైన విమర్శ చేయడం గమనార్హం. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీలుగా ప్రవర్తిస్తున్నా అధినాయకుడు  పట్టించుకోవడం లేదని పవన్ తన ప్రజాపోరాటయాత్రలో ప్రసంగిస్తూ ఆరోపించారు. అవినీతిపరులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారు అని అర్ధం వచ్చే రీతిలో ఆయన ప్రసంగం సాగింది.     
పొతే, రేవంతరెడ్డి ఉదంతం తెలంగాణలో భారీ స్థాయిలో  రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణా కాంగ్రెస్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా వున్నప్పుడు ఐటీ, ఈడీ దాడులు గురించిన సమాచారం టీవీ ఛానళ్ళు ప్రసారం  చేయడం మొదలు పెట్టిన దాదిగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, సీనియర్  కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, దామోదర రాజ నరసింహ,  వీ. హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ మల్లు రవి, డి. అరుణతో   సహా అనేకమంది   నేతలు రేవంతరెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి చేస్తున్న  ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. లేనిపోని కేసులు పెట్టి తమ నాయకులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇందుకు మద్దతుగా గండ్ర వెంకట రమణా రెడ్డి, జగ్గారెడ్డి కేసులను ఉదహరిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను టీఆర్ఎస్ నాయక శ్రేణులు ఖండిస్తున్నాయి. ఐటీ, ఈడీ విభాగాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి కావని, అవి కేంద్రప్రభుత్వ ఆధీనంలోనే పని చేస్తాయని పేర్కొంటూ రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, తమ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ వంటి టీఆర్ఎస్ నాయకులు  ఎదురు దాడి మొదలు పెట్టారు.
ఇలాంటి సందర్భాలు గతంలో కూడా ఎదురయ్యాయి. అప్పుడూ రాజకీయాల రంగు అంటుకుని అవీ ఈనాటికీ కూడా ఒక దరీదాపూ చేరని అంశాలుగానే  ఉండిపోతున్నాయి.
ఏదైనా ఒక కేసు రాజకీయ రంగు పులుముకుందంటే ఇక అది  ఒక పట్టాన తేలదు అనే భావన సామాన్య ప్రజల్లో వుంది. రాజహంసలు పాలను, నీళ్ళనీ విడదీయగలిగిన చందంగా,  రాజకీయాల నుంచి  శిక్షార్హమైన కేసులను విడదీసి చూడగలిగిన  విజ్ఞత రాజకీయాల్లో రానంత కాలం  ప్రస్తుతం రాజకీయ రంగంలో కానవస్తున్న ఇటువంటి పెడ ధోరణులకు ముకుతాడు వేయడం సాధ్యం కాదన్నది అత్యధికుల అభిప్రాయంగా తోస్తున్నది. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షలను తీర్చుకోవడం, లేదా పార్టీలను అడ్డు పెట్టుకుని  చట్టం నుంచి తమను తాము కాపాడుకోవడం ఈనాటి రాజకీయుల వైఖరిగా వుందని, అంచేతే నేరస్తులు తాము చేసిన నేరాలకు శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నారని, అదేసమయంలో   ప్రత్యర్ధులు చేయని నేరాలకు కూడా  తమ అధీనంలో ఉన్న  రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారనీ  ఇలా రెండు రకాల అభిప్రాయాలు ప్రజల మనస్సులో నాటుకుపోయేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయనే  ఓ అపప్రధ కూడా వుంది. ‘చట్టం ఎవరికీ చుట్టం కాదని, అది తన పని తాను  చేసుకు పోతుందని అధికారంలో వున్నప్పుడు వ్యాఖ్యలు చేసిన నోటితోనే, అధికారంలో లేనప్పుడు అటువంటి కేసులను ‘రాజకీయ కుట్రగా అభివర్ణించడం’ గత కొన్నేళ్లుగా రాజకీయాలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చేవారికి అనుభవైకవేద్యమే.    ఇటువంటి రాజకీయ ఎత్తుగడల కారణంగా నష్టపోయేది మన ప్రజాస్వామ్యమే. వ్యవస్తల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే పరిణామాలు దారుణంగా ఉంటాయనే వాస్తవాన్ని ఈనాటి రాజకీయ పార్టీలవాళ్ళు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  
జనాలకు ఏదీ కలకాలం జ్ఞాపకం వుండదనే ధీమా వారినిలా మాట్లాడిస్తుంది కాబోలు.
పరిస్తితులకు తగ్గట్టు  స్వరం మార్చడమే రాజకీయమా!
ఏమో! రాజకీయులే చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పరు.Top of Form
                                                        
మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకుంటూ వుంటాం. నిజమే.  పెద్దప్రజాస్వామ్య దేశమే. కానీ అతి పెద్ద  రుగ్మతలతో అది కునారిల్లుతోందనే వాస్తవాన్ని విస్మరిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలం. ఆ మూలంలోని లోపాలను సవరించుకోకపోగా , వాటిని రాజకీయ పార్టీలు తమ స్వార్ధానికి వాడుకోవడం మౌనంగా చూస్తూ వుండడం కూడా మన ప్రత్యేకత.
నేరం చేసినట్టు అభియోగాలు వున్నవాళ్ళు చట్ట సభల్లో ప్రవేశించకుండా, వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలనే ప్రతిపాదన చాలాకాలంగా వుంది. నేరం రుజువై న్యాయ స్థానాల్లో శిక్షలు పడిన వాళ్ళకే ఈ అనర్హత నిబంధన వర్తింప చేయాలని మరి కొందరు అంటున్నారు. లేనిపక్షంలో అధికారంలో వున్నవాళ్ళు తమ ప్రధాన ప్రత్యర్ధులను ఏదో ఒక కేసులో ఇరికించి వారి బెడదను శాశ్వతంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తారని వారి వాదన. అది సబబు అనుకుంటే మరో సమస్య వచ్చి పడుతుందని వారి ప్రత్యర్ధుల వాదన. న్యాయ స్థానాలలో ఏళ్ళతరబడి కేసులు పరిష్కారానికి నోచుకోకుండా ఉంటున్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కేసులు ఒక కొలిక్కి వచ్చేలోగా వాటిని ఎదుర్కుంటున్న వ్యక్తుల రాజకీయ జీవితం ఎన్నేళ్ళు సాగినా దానికి  అడ్డంకి ఉండదని వాళ్ళ భావన.
మరి పాము చావకుండా, కర్ర విరక్కుండా పరిష్కారం ఎలా! అనేది మరో ప్రశ్న.
చట్టసభల్లో  సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధాన మంత్రులు కావచ్చు ఒకటి రెండు పర్యాయాలకు మించి పదవుల్లో కొనసాగకుండా రాజ్యాంగ సవరణ చేసుకోవడం ద్వారా ఈ ప్రశ్నకు జవాబు లభిస్తుందని మరి కొందరి అభిప్రాయం. అలా చేసినా వారసుల సంగతేమిటి, వారసత్వంగా వాళ్ళ  అధికారం కొనసాగేలా చేసుకుంటే అప్పుడు ఏమి చేయాలి అనేది మరో జవాబు లేని ప్రశ్న.
ఇవన్నీ ప్రజాస్వామ్యప్రియులు మధన పడే విషయాలు. ప్రజాస్వామ్యం పేరుతొ పదవులు, అధికారాన్ని అనుభవించే రాజకీయుల అభిప్రాయాలు ఖచ్చితంగా ఇలా ఉండవని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.     
ఎందుకంటే వారికి గమ్యం ముఖ్యం, మార్గం కాదు.

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

రణతంత్ర రాజకీయ గణితం – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY ON SUNDAY, 16-09-2018)
రాజకీయాల్లో కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు వుంటాయి. అయితే గణిత శాస్త్రంలో మాదిరిగా ఇవి స్థిరంగా వుండవు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మారుతుంటాయి. లెక్కల్లో రెండును  రెండుతో  కలిపితే నాలుగు అవుతుంది. అది మారదు. కానీ రాజకీయాల్లో అలా కాదు. ఆ  ప్రశ్నకు జవాబు నాలుగు కావచ్చు, కాకపోవచ్చు. అయినా రాజకీయులు గణితాన్నే నమ్ముకుని ముందుకు సాగుతుంటారు. వాళ్ళ లక్ష్యం గణితంలో పాసు మార్కులు తెచ్చుకోవడం కాదు, ఎన్నికల పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం.
ఇందులోనుంచి పుట్టుకొచ్చిన ప్రక్రియే పొత్తులు, అవగాహనలు, సీట్ల సర్దుబాట్లు. కాస్త ముదిరితే ఈ పొత్తులే కూటములు, మహా కూటములుగా రూపు మార్చుకుంటాయి.  ఈ కూటముల సృష్టికర్తలు ముందుగా వేసుకున్న అంచనాలు నిజమైన సందర్భాలు వున్నాయి, వికటించిన అనుభవాలు వున్నాయి. కనుకే,  ఇది లెక్కల వ్యవహారమే అయినా లెక్క తప్పే అవకాశం కూడా లేకపోలేదు.  
కొన్ని రాజకీయ పార్టీలు కలసి ఇలా కూటములు కట్టే వ్యవహారం కొత్త విషయమేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అనుభవైకవేద్యమే. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిన తర్వాత    కొత్తగా ఏర్పడ్డ పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో నిర్వహించిన ఎన్నికల్లో, ఒక  కూటమి అనే పేరుతో యేర్పడ లేదు కానీ టీడీపీ, బీజేపీలు పొత్తు కుదుర్చుకునే పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో పోటీకి దిగని పవన్ కళ్యాణ్ జనసేన ఆ పొత్తును బలపరచి వాటి విజయానికి తన వంతు పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే దేశంలో ఏ కూటమి కూడా తాను  సాధించిన విజయాలను సుస్థిరం చేసుకోలేక పోయింది. అధికారానికి వచ్చిన దరిమిలా తలెత్తిన వివాదాల కారణంగా ఆ స్నేహాలు మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలి పోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అయిదేళ్ళ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా కలిసి వుండలేకపోయాయి. ఎన్నికల సమయంలో కలయికకు కారణాలు తెలిసినవే అయినా, విడి పోవడానికి మాత్రం ఎవరి కారణాలు వారు చెబుతున్నారు. ఈ పరిణామాలకు తగ్గట్టే పాత సమీకరణాల స్థానంలో కొత్తవి రావడం రాజకీయ అనివార్యతగా మారింది. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి కలిసున్నవాళ్ళు విడిపోయినట్టే, ఇప్పటివరకు విడిగావున్న  వాళ్ళు కలిసే అవకాశం ఎలాగూ వుంటుంది. సిద్ధాంతాలు, సూత్రాలు అని ఎవరయినా సుద్దులు చెప్పబోతే వాళ్ళని వెర్రివాళ్ళ లాగా జమ కట్టే ప్రమాదం వుంది.
నేటి రాజకీయాల్లో పైకి  పార్టీ పేరు ఏమైనా, అన్ని పార్టీల  రంగూ రుచీ వాసనా ఒక్కటే. అధికారం. ఏమిచేసైనా సరే  ఆ పీఠాన్ని అధిరోహించడం. దీనికి వాళ్ళు చెప్పే భాష్యం ఒక్కటే, మార్గం ఎలాంటిదైనా అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం.
ముందు నగారా తెలంగాణలో మోగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనతో మెరుపు వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు. అసెంబ్లీ రద్దుకావడం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తును ఎన్నికల సంఘం ప్రారంభించడం అన్నీ ఆఘమేఘాల మీద సాగుతున్నాయి. ‘ఇదేమీ సబబుగా లేదు, ప్రభుత్వం ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుస్తోంద’నే  ప్రతిపక్షాల వాదనలు ఈ హోరులో కొట్టుకుపోతున్నాయి. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే’ సామెతలాగా కేసీఆర్  చాలా ముందస్తుగానే నూట అయిదు మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం ఇతర పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే మంట పెట్టిన వారికి కూడా ఎంతోకొంత ఆ సెగ తగులుతుందన్నట్టు, పాలకపక్షం టీఆర్ఎస్ కు కూడా ఈ ముందస్తు ప్రకటన కొన్ని ఇబ్బందులను కలగచేస్తోంది. అసంతృప్తుల బెడద రాజుకుంటోంది. మొదట మెల్లగా మొదలయినా రోజులు గడుస్తున్న కొద్దీ అసంతృప్తి జ్వాలలు తమిళనాడు రాజకీయాలను తలపిస్తున్నాయి. కొందరు కార్యకర్తలు తమ నాయకులకు సీటు రాలేదన్న మనస్తాపంతో తీవ్రమైన చర్యలకు పూనుకోవడం పరిస్తితిలోని తీవ్రతను తెలుపుతోంది. అయితే, ఎన్నికల ఘడియ దగ్గర పడేసరికి ఇవన్నీ సర్దుకుంటాయని, బుజ్జగింపులు, లాలింపులు ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీకయినా సహజమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
వాళ్ళు చెబుతున్నట్టు, నిజానికి  ఇదేమీ కొత్త విషయం కాదు, అధికారం కోసం రాజకీయ పార్టీలే తమ సిద్ధాంతాలను పక్కన బెట్టి కానివారితో చెలిమికోసం చేయి చాపుతున్నప్పుడు పార్టీలలోని దిగువశ్రేణి నాయకులు కూడా అదేరకం ఆలోచన చేస్తుంటారు. ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు’ కదా! గత వారం రోజులుగా అనేకమంది ఛోటా, బడా నాయకులు ‘ఆస్మాసిస్’ పద్దతిలో అటూ ఇటూ పార్టీలు మారుతున్నారు. ‘ఎవరు ఏ పార్టీకి సలాం చెప్పారు, ఎవరు ఏ పార్టీకి సలాం కొట్టారు’ అనే జాబితాను విశ్లేషించడం అనవసరం. ఎందుకంటే, ముందు ముందు ఈ ‘మార్పిళ్ల’ వేగం, పరిమాణం మరింత పెరిగే వీలుంది. ఒక పద్దతి అంటూ లేకుండా సాగిపోతున్న ఈ వికృత రాజకీయ క్రీడ గురించి ఇప్పటికే కుప్పలుతెప్పలుగా సాంఘిక మాధ్యమాల్లో అనేక వ్యాఖ్యానాలు వెలుగు చూస్తున్నాయి.
ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ లు పెట్టుకోబోయే పొత్తు గురించి అనేక ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై జరిగింది. ‘అలాంటి ఆగర్భ ప్రత్యర్ధితో కలయికా’ అంటూ కొందరు ఆక్షేపిస్తున్నారు. పొత్తును సమర్ధించేవారు గతంలో జరిగిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మితృలు ఉండరని, తాము కలిస్తే అది ఎంతమాత్రం అపవిత్ర కలయిక కాబోద’ని అంటున్నారు. ఇది ఇలా ఉండగానే, మహాకూటమి గురించిన వార్తలు వెలుగు చూశాయి. బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే నలుగురు కలిస్తేనే సాధ్యం కాగలదన్న నమ్మకంతో మహా కూటమి దిక్కుగా చూస్తున్నారు. కొన్ని అడుగులు పడ్డాయి కూడా. సీపీఐ, జనసేన, కోదండరామిరెడ్డిగారి కొత్త పార్టీ ఇలా అందరూ కలసి ఏకోన్ముఖ దాడికి సిద్ధం అవుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తెలంగాణా ప్రజలకు ఈ మహాకూటముల సంగతి ఎరుకే కాని, కొత్త తెలంగాణా రాష్ట్రానికి మాత్రం కొత్త సంగతే. అందులోనూ, కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత మొట్టమొదటి సారి జరుగుతున్న ఎన్నికలు. అంచేతే వీటికి ఇంతటి  ప్రాముఖ్యత.
ఈనాటి రాజకీయ రణతంత్ర నీతి ప్రకారం కూటముల ఏర్పాటు తప్పుకాకపోవచ్చు. అయితే, అందులో రాజకీయ అవసరాలు ఉన్నప్పటికీ జత కట్టే పార్టీలలో నిజాయితీ  వుండాలి. భారతంలో కురుక్షేత్ర మహా సంగ్రామానికి ముందు సామంత రాజులతో కౌరవ, పాండవులు పొత్తులు ఏర్పాటు చేసుకున్న ప్రస్తావనలు వున్నాయి. కృష్ణుడి తరపున వున్న సైన్యం యావత్తూ, కృష్ణ భగవానుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్రంలో కౌరవుల తరపున నిబద్ధతతో కూడిన యుద్ధం చేస్తాయి. సహజంగా పాండవ పక్షపాతులు అయిన భీష్మ, ద్రోణాదివీరులు కూడా తమ అంతరాత్మను యుద్ధ రంగానికి ఆవలే విడిచిపెట్టి దుర్యోధనుడి విజయం కోసమే ఎంతో నిబద్ధత, నిజాయితీతో పోరాడతారు. కూటముల ఆలోచన చేసేవాళ్ళు ఈ విషయం కూడా గమనంలో వుంచుకోవాలి.
అలాకాకుండా తాత్కాలిక ప్రయోజనాలకోసం కలిపే  చేతులు, కలిసే మనుషులు, అనుకున్న  లక్ష్యం నెరవేరగానే అంత సులభంగానూ  విడిపోయే పరిస్తితి రాకూడదు. నిజాయితీతో కూడిన రాజకీయ  కూటములను  ఏర్పరచగలిగితే వాటి మనుగడ ప్రశ్నార్ధకం కాబోదు.                        
తోకటపా: విజేతలు  తమ పరిమితులు ముందు తెలుసుకుంటారు. తరువాత తమ శక్తి సామర్ధ్యాలపై దృష్టి పెడతారు.
పరాజితులకి తమ బలహీనతలేవిటన్న దానిపై ఒక అవగాహన వుంటుంది. కాకపోతే దృష్టంతా వారి తమ బలహీనతలపైనే వుంటుంది.
(EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595