6, అక్టోబర్ 2018, శనివారం

వ్యవస్థలతో చెలగాటం, ప్రజాస్వామ్యానికి ప్రాణసంకటం – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN THE EDIT PAGE OF SURYA DAILY ON 07-10-2018, SUNDAY)

 “కేంద్రం మిధ్య” పొమ్మన్నారు, అలనాడు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు.
“కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదు” అంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు ఈనాడు అదే పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
అయితే ఈ రెండు తిరస్కార స్వరాల నేపధ్యం వేరు.
రామారావు సొంత పార్టీ పెట్టిననాడు ఆయన పెట్టుకున్న లక్ష్యాలు ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ, కాంగ్రెస్ వ్యతిరేకత, ప్రాంతీయ ప్రయోజనాల సాధన. ఆ క్రమంలో ఆయన కేంద్రంపై విరుచుకుపడడాన్ని ప్రజలు అర్ధం చేసుకుని ఆయన్ని ఆశీర్వదించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చిన రీతిలో మార్చడం, ఆ పార్టీ హయాములో ముఖ్యమంత్రి అంజయ్యకు జరిగిన అవమానం, తెలుగు వాడి ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఆనాడు తీసుకున్న కొన్ని చర్యలు కూడా కేంద్రంపై పోరాటంలో రామారావు సాధించిన అపూర్వ  విజయానికి ఉపయోగపడిన మాట వాస్తవం. పోరాట పటిమ ప్రదర్శించడంలో ఎన్టీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు త్రికరణశుద్ధిగా ఆమోదించారు.    
ఇప్పుడు, ఇన్నేళ్ళ తర్వాత కేంద్రంపై చంద్రబాబు నాయుడు పెంచుతున్న  తిరుగుబాటు స్వరానికి ఆయన చెబుతున్న కారణాలు వేరు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్రధాని నరేంద్రమోడీతో విబేధించి, నాలుగేళ్ళకు పైగా ఆయనతో నెరపిన నెయ్యాన్ని కాదనుకుని, రాష్ట్రానికి అధికార హోదా సాధించడమే ధ్యేయంగా ప్రకటించి, ఎన్డీయే కూటమినుంచి వైదొలగి, ధర్మపోరాట దీక్షల పేరుతో కేంద్రంపై కాలుదువ్వడం మొదలు పెట్టారు. అయితే ఆయన చెబుతున్న కారణాలను ప్రజలు మనః పూర్తిగా విశ్వసించేలా చేయడంలో అంతగా సఫలీకృతులు కాలేకపోయారు. ఆనాడు రామారావును నమ్మినట్టుగా ఈనాడు చంద్రబాబును నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేకపోవడానికి కారణం, కొందరు చెబుతున్నట్టు  ఆయన అనుసరిస్తున్న అవకాశవాద రాజకీయాలు. అయితే, అదేసమయంలో ఆయన మరో కార్యక్రమాన్ని దిగ్విజయంగా  పూర్తిచేసారు. ఆంద్ర ప్రదేశ్ ప్రజల్లోని అధిక సంఖ్యాకుల్లో అప్పటివరకు మోడీ పట్ల  పెరుగుతూ వచ్చిన ఆదరాభిమానాలను ఆయన తన రాజకీయ చాతుర్యంతో సమూలంగా తుడిచి పెట్టగలిగారు. మోడీ, ఆయన నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో వైమనస్యం కలిగేలా చేయగలిగారు. రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన కాంగ్రెస్ పార్టీ పట్ల పేరుకు పోయిన ప్రజాగ్రహాన్ని బీజేపీ దిశగా మళ్ళించడంలో ఆయన తన రాజకీయ అనుభవం యావత్తూ రంగరించి ఉపయోగించారు.
ఈ విషయంలో సంపూర్ణంగా విజయం సాధించిన చంద్రబాబునాయుడు, కేంద్రంపై పోరాటానికి మరో అస్త్రాన్ని ఎంచుకున్నారు. కాకపొతే ఈ అస్త్రం ఆయన అంబులపొదిలోనిది కాదు. నిజానికి కేంద్ర ప్రభుత్వమే ఐటీ దాడుల రూపంలో దీన్ని ఆయనకి  అందించింది. ఎదురయిన ప్రతి సమస్యను ఒక అవకాశంగా  మలచుకుని ముందుకు సాగుతుంటానని చంద్రబాబు తరచుగా చెబుతుంటారు. ఇప్పుడూ అదే చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు,విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  ఆదాయపు పన్ను శాఖ (ఐటీ)కు చెందిన అనేక బృందాలు ఒకే రోజున ఏక కాలంలో పలుచోట్ల నివాసాలను, కార్యాలయాలను సోదా చేయడం ఒక పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన మాజీ శాసన సభ్యుడు బీద మస్తాన్ రావు కంపెనీలు, అలాగే ప్రకాశం జిల్లాలో  టీడీపీ శాసన సభ్యుడు పోతుల రామారావు కంపెనీలు దాడులు జరిగినవాటిలో వుండడం వల్ల ఈ అంశానికి రాజకీయ ప్రాముఖ్యం కలిగింది.  నిజానికి ఐటీ సోదాలు అనేవి రాజకీయాలతో సంబంధం వుండి జరగవు. కొన్ని నిర్దిష్ట నియమ నిబంధనలకు లోబడి జరుగుతాయని ఆ శాఖకు చెందినవాళ్ళు చెబుతుంటారు. అంతా ఒక పద్దతి ప్రకారం, రహస్యంగా జరుగుతూ ఉంటుందని, రాజకీయ ప్రమేయం చాలా తక్కువ అని కూడా చెబుతుంటారు. కానీ ఈసారి అది జరిగిన తీరు, సమయం అనేక సందేహాలను తెరపైకి తెచ్చింది. విస్తృత స్థాయిలో ఐటీ సోదాలు జరగబోతున్నట్టు కొన్ని పత్రికల్లో, కొన్ని టీవీ ఛానళ్లలో వార్తలు ముందుగానే వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖలోని వారెవరో ఉప్పందించకుండా ఇలా జరగడం అసాధ్యం. అలాగే ఈ దాడులు (ఈ పద ప్రయోగంపై కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి) లేదా సోదాలు గురించి తమవద్ద  సమాచారం ఉందనే రీతిలో  పాలక పక్షానికి చెందిన కొందరు నేతలు ముందుగానే ప్రకటనలు చేశారు. కొన్ని చోట్ల ఆదాయపు పన్ను అధికారుల కంటే ముందుగానే మీడియా ప్రతినిధులు అక్కడకు చేరి వుండడం గమనించిన అధికారులే విస్తుపోయారని పత్రికలు రాసాయి.  దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరిగి కారకులు ఎవ్వరన్నది నిగ్గు తేల్చేవరకు ఈ దాడులు రాజకీయ ప్రేరేపితమని నమ్మేవాళ్ళు నమ్ముతూనే వుంటారు. అంచేత రాజకీయాలకు, ఈదాడులకు సంబంధం లేదని ఖండితంగా చెబుతున్న వాళ్ళు, ముందు ఈ సమాచారం బయటకు ఎలా పొక్కిందో, దానికి బాధ్యులు ఎవరో బయట పెట్టాలి.     
మోడీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఈ ఐటీ దాడులు అందులో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్ముతున్నారు. ప్రజలని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు మరి కొన్ని మాసాల్లో జరగబోతున్నప్పుడు, కేంద్రం కక్ష కట్టి ఈ దాడులకు పూనుకున్నదని అనేకమంది తెలుగు దేశం నాయకులు పదేపదే ఆరోపణలు చేస్తూ వుండడం ఇందులో భాగమే.      
ఈ మొత్తం వ్యవహారాలను గమనించిన వారికి రెండు విషయాలలో ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
ఈ మూకుమ్మడి ఐటీ సోదాలకు ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇందులో ఏమైనా రాజకీయం దాగున్నదా? ఈ ప్రశ్నకు సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి.
అలాగే ఐటీ దాడులు అనేవి పన్ను ఎగవేతదారులపై జరుగుతాయి. అటువంటప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఈ స్థాయిలో కలవరపాటు ఎందుకు? ఈ సందేహాన్ని ఆ పార్టీ నాయకులే తీర్చాలి.
అన్నింటికంటే సామాన్యులను, ప్రజాస్వామ్య ప్రియులను, రాజకీయాలతో లేదా ఏ పార్టీతో సంబంధం లేని వారిని వేధిస్తున్న మరో ప్రశ్నకు బదులు రావాల్సి వుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను ప్రశ్నార్ధకం చేస్తున్న ఇటువంటి పరిమాణాలకు ఎవరిది బాధ్యత?
సోదాలు జరిపే ఐటీ అధికారులు పోలీసు భద్రత కోరితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి. ఇదే నిజమయితే పరిణామాలు వేరే విధంగా పరిణమించే ప్రమాదం వుంది. అవసరం అనుకుంటే కేంద్రం తన బలగాలను నేరుగా రంగంలోకి దింపితే ఆ పరిస్తితులు మరో విషమ స్తితికి దారితీయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ తరుణంలో అలాంటి పరిణామాలు తనకు కలిసి వస్తాయని, ప్రజల  సానుభూతి పవనాలు రానున్న ఎన్నికల్లో తమ పార్టీని ఒడ్డెక్కిస్తాయనే టీడీపీ అధినేత ఆలోచనలు కూడా ఇటువంటి తీవ్ర నిర్ణయాలకు కారణం అయి ఉండవచ్చని కొందరి విశ్లేషణ. అలా జరిగితే జాతీయ మీడియా దృష్టి రాష్ట్రంపై కేంద్రీకృతమై దేశ స్థాయిలో మోడీ ప్రతిష్టను దెబ్బతీయడం సులభం కావచ్చని కూడా అనుకుని ఉండవచ్చని వారి అభిప్రాయం.  నలభయ్ ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఇలా తనకు ఎదురయిన గడ్డు సమస్యను ఒక అవకాశంగా మలచుకునే అవకాశం లేకపోనూ లేదని కొందరి విశ్లేషకుల భావన. రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని మీడియాలో వార్తలు అయితే  వచ్చాయికానీ, మంత్రివర్గ సమావేశం వివరాలను  విలేకరులకు వివరించిన మంత్రిగారు  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఏమైనా ఇవన్నీ ఊహాగానాలు. నిజం చెప్పాలంటే ఊహాగానాల ఆధారంగా చేసే మరికొన్ని ఊహాగానాలు. మీడియా విస్తృతి కారణంగా ఈరోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి.    
ఏ లెక్కన చూసినా ప్రధాన మంత్రి మోడీ కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయాల్లో సీనియర్. అయితే బ్యురోక్రసీలో మాదిరిగా రాజకీయాల్లో ఈ చిన్నా పెద్ద తేడాలు పాటించరు. వయసులో తమకంటే ఎంతో చిన్నవాళ్ళయిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల మంత్రివర్గాల్లో అనేకమంది కాంగ్రెస్ సీనియర్లు పనిచేసారు. ఇక్కడ అర్హత వయస్సు, సీనియారిటీ కాదు. ఒకరకంగా అవకాశం. మరోరకంగా  నమ్మినా నమ్మకున్నా అదృష్టం.
కేంద్రం అధీనంలో కొన్ని కీలకమైన విభాగాలు వుంటాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కూడా. వాటిపై పర్యవేక్షణ వుండాలి కానీం వాటిని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం వాడడం మొదలు పెడితే పరిస్తితులు ఇలాగే వుంటాయి. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం వల్ల, ఎన్ని  చట్టాలు వున్నా, అవి ఎంత పకడ్బందీగా తయారుచేసినవి అయినా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ పోతుండడం అనేది వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కాకుండా వాటి నిబద్ధత పట్ల ప్రజలలో లేనిపోని అనుమానాలను రగిలిస్తోంది.
ఒక్క ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి అనేకాదు,   ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పదవికీ, ప్రతి ఉద్యోగికీ కొన్ని అధికారాలు వుంటాయి. ఆ అధికారాలుకు అనుగుణంగా పనిచేసే కొన్ని వ్యవస్థలు వుంటాయి. వాటిని ప్రత్యర్ధులు, లేదా తాము  ఇష్టపడని వారిపై ప్రయోగిస్తూ పోతే అది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే అవుతుంది. అలా వాడుకోలేని అధికారాలు వుంటే ఏమి, లేకపోతే ఏమి అని వాదించేవాళ్లకు ఒక నమస్కారమే నా సమాధానం.
ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ప్రజలకు సంబంధించి ఏదైనా సమస్యను తమ హోదాలను ఉపయోగించుకుంటూ  పరిష్కరించుకోవాలని చూస్తే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ అది కేవలం మోడీ, బాబు నడుమ వ్యవహారం అయితే అందులో ప్రజల్ని కలపకూడదు. వాళ్ళే తేల్చుకోవాలి.
అదీ నిజమయిన రాజకీయం అంటే!            
ఉపశృతి: ఇది జరిగి అరవై ఏళ్ళు దాటింది. ఆ రోజుల్లో పత్రికల్లో చిన్న వార్తగా వచ్చింది. అప్పటి హైదరాబాదు పొలిమేరల్లో ఉన్న మిలిటరీ కంటోన్మెంటు నుంచి ఒక సైనిక జవాను నగరానికి వచ్చాడు. సినిమాహాల్లో కాబోలు అతడికీ స్థానిక పోలీసు జవానుకూ నడుమ ఒక తకరారు వచ్చింది. అది ముదిరి చేతులు కలుపుకునే దాకా వెళ్ళింది. స్థానిక పోలీసు తనకున్న స్థానబలంతో ఆ మిలిటరీ జవానును తీసుకువెళ్ళి లాకప్పులో పడేశాడు. ఈ సమాచారం కాస్త ఆలస్యంగా కంటోన్మెంటుకు చేరింది. ఒక ట్రక్కులో సైనికులు ఆ పోలీసు స్టేషన్ కు చేరుకొని స్థానిక పోలీసులకు దేహశుద్ధి చేసి తమ సహోద్యోగిని బందీ నుంచి విడిపించి వెంటబెట్టుకు వెళ్ళారు. అప్పుడు సమాచార వ్యాప్తి మెల్లగా జరిగేది కనుక, విషయం పైఅధికారులకు తెలిసేసరికి కొంత ఆలస్యం అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ వ్యవహారం కాబట్టి  అది మరింత ముదరకుండా ఇరువైపులా ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు తీసుకున్నారని పత్రికా వార్తల  కధనం.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595    

5 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

శివాజీ అనే చంద్రబాబు అనుచరుడు బీజేపీ ఆపరేషన్ గరుడ పేరుతొ ఎదో పెద్ద కుట్ర పన్నిందని ప్రచారం చేస్తున్నాడు. అతడి ఆధారాలు ఏమిటో, ఉన్న క్రెడిబిలిటీ ఎంతో అని కనీస ఆలోచన చేయకుండా పచ్చ మీడియా మొత్తం ఆరేడు నెలల నుండి హోరెత్తించింది.

సోదాలు చేసే అధికారులకు రాష్ట్ర పోలీసుల రక్షణ ఉపసంహరించాలని ఆంద్ర కాబినెట్ నిర్ణయించిందని వార్తలు (పుకార్లు?) వస్తున్నాయి. ఇది నిజమయితే పరమ దారుణం.

కొన్ని ప్రచా(సా)ర ఇంకా చోద్యంగా మా విలేఖరులను చూసి దర్యాప్తు అధికారులు పారిపోయారని స్క్రోలింగులు ఇవ్వడం విడ్డూరం!

ఓటుకు నోటు ఉదంతంలో చంద్రబాబు ప్రమేయం బైటికి రాగానే అప్పటి ప్రభుత్వ అధికారి పరకాల ప్రభాకర్ రంగంలో దిగారు. ఇటీవలి కాలంలో మరో ప్రభుత్వ అధికారి కుటుంబరావు టీవీలలో బీజేపీని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాధనంతో జీతాలు పుచ్చుకునే వ్యక్తులు పార్టీ విషయాలలో దూరడం శోచనీయం.

నీహారిక చెప్పారు...

>>>ప్రజాధనంతో జీతాలు పుచ్చుకునే వ్యక్తులు పార్టీ విషయాలలో దూరడం శోచనీయం>>>>

అవునండీ మీరు చెప్పేది నిజం..బ్రతుకమ్మ చీరలు,రైతు బంధు, దుర్గమ్మకు ముక్కుపుడక, యగ్నాలూ, యాగాలూ వీటన్నిటికీ డబ్బు ఎక్కడనుండి వస్తుందో వీళ్ళకి అవసరమా ?
లేబర్ మొఖాలకి కాస్త డబ్బు మొఖాన కొడితే, నాలుగు ఊర మాస్ డైలాగులు కొడితే, తాగేసి గమ్మున పడి ఉండాలి కానీ ఎదురొచ్చే ఆ ఆంధ్రావాడు మీ గడ్డ మీద నిలబడే అర్హతుందా ?

అజ్ఞాత చెప్పారు...

కేతిగాడిలాగా శివాజీ ఏదో అభూతకల్పనలు చేస్తున్నాడు. చంద్రబాబును ఎన్ కౌంటర్ చేయమంటాడు. తలతోక లేకుండా ఏదో మాట్లాడుతున్నాడు. ఒకవైపు కచరా కంపుమాటలు. ధూ నీయవ్వ. ఏమి దరిద్రమిది.

bonagiri చెప్పారు...

ఎవడి దూల వాడిది...
అన్నట్టు ఉన్నాయి, తెలుగు రాజకీయాలు.

సూర్య చెప్పారు...

శభాష్. కీలెరిగి వాత పెట్టడం మీకే చెల్లింది!