28, అక్టోబర్ 2018, ఆదివారం

గాడి తప్పుతున్న సీబీఐ వ్యవహారాలు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily, today, Sunday, 28-10-18)

ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే అమెరికాలోని సియాటిల్ నగరంలో మా
మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు
తిరిగే చోట మరో రహదారి పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే
వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, ప్రధాన రహదారిలో వేరే
వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధృవపరచుకుని కానీ ఆ రోడ్డులోకి
ప్రవేశించేవారు కారు. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కుకు అలవాటు పడివున్న
నాకు మాత్రం, ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో
అన్న భీతి పీడిస్తూ వుండేది.

“ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!”
అనేవాడిని మా అబ్బాయితో.

“నమ్మకం” అనేవాడు మావాడు స్థిరంగా.

“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ
నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో
అక్కడ మీరలా ఆచితూచి నడుపుతున్నారు. అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ
నడుపుతోంది ఆ నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళకు పైగా వుంటున్న మావాడు
మరింత నమ్మకంగా.

అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం
‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.

చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.

వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు
చేయగలమన్న నమ్మకం.

కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు
దూసుకు రావన్న నమ్మకం.

బహిరంగ ప్రదేశాలలో ఎంతటి ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు
పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం.

పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం.

అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా
వుండకూడదనే నమ్మకం.

ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.

ఇలాటి నమ్మకం ఏదయినా, ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా
చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలం.

ఎందుకంటే, ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ,
మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా మాత్రం
చేసింది.

నాయకులు తమ అనుచరులనే నమ్మరు. నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన
అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు, కడకంటా
తమ వెంట వుండరేమో అనే అపనమ్మకం నాయకులది.

అనుచరులు నాయకులని నమ్మరు. ఎందుకంటే, తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా
పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్షసాక్షులు కాబట్టి.
అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి ఆ పైమెట్టుకి
ఎగబాకాలనే తాపత్రయం వారిది.

జనం ఈ కార్యకర్తలని నమ్మరు, ఎందుకంటే తమపేరు చెప్పి పైవాళ్ళ నుంచి వసూలు
చేసే పెద్ద మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు
తెలుసు కాబట్టి.

జనాలను రాజకీయులు నమ్మరు, డబ్బులు తీసుకుని కూడా ఓట్లు తమకు వేయరేమో అనే
అపనమ్మకం వారిది.

ఇలా లెక్కేసుకుంటూ వెడితే ఈ ‘అపనమ్మకాల’ జాబితా కొండవీటి చాంతాడే.

ఏటీఎం లనుంచి డ్రా చేసే కరెన్సీ నోట్లలో ఎన్ని అసలువో, ఎన్ని నకిలీవో
తెలియదు. మెరిసిపోతున్నాయని ముచ్చటపడి కొనే నగలలో అసలు బంగారం ఎంతో, కాకి
బంగారం ఎంతో అన్నది అనుమానమే.

నిగనిగ లాడుతోందని తినే మామిడి పండ్లకు, అరటి పండ్లకు ఆ మెరుపు సహజంగా
వచ్చిందా కార్బైడ్ వంటి కృత్రిమ లేపనాలతో వచ్చిందా అంటే చప్పున చెప్పడం
కష్టమే.

నకిలీ ఔషధాలు గురించిన వార్తలు మరింత ఘోరం. శారీరక రుగ్మతలనుంచి
బయటపడడానికి డాక్టర్లు రాసిన మందుల్ని రోగులు నమ్మకంతో కొనుక్కుంటారు.
కానీ మార్కెట్లో విచ్చలవిడిగా పంపిణీలో వున్న నకిలీ మందులు రోగాలను నయం
చేయడం సంగతి అటుంచి రోగుల ప్రాణాలనే బలిగొంటున్నాయి.

తాగే నీళ్ళు అంతే. ప్లాస్టిక్ సీసాల్లో దొరికే మంచి నీళ్ళు తాగడానికి
యెంత శ్రేయస్కరమో చెప్పలేము కాని, వాటిని తయారు చేసేవాళ్ళకు కాసులు
కురిపిస్తున్నాయి.

ఏకంగా ఏడుకొండల వాడి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యే కల్తీ అని ఆ మధ్య
చెప్పుకున్నారు. లెక్క ప్రకారం దర్యాప్తులు అయితే జరుగుతాయి కానీ నిజాలు
వెలుగు చూస్తాయా అన్న విషయంలో ఎవరి అనుమానాలు వారికి వున్నాయి.

ఆదివారం హాయిగా కులాసా కబుర్లు చెప్పుకోక ఈ నమ్మకాలు, అపనమ్మకాల గొడవ ఏమిటంటారా?

గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క పదం జనం నోట్లో నానుతోంది.
మీడియా ముఖతః మోగుతోంది.

అదే సీబీఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దేశం మొత్తంలో ప్రముఖ
దర్యాప్తు సంస్థ.

పాలక పక్షం చేతిలో కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తుంటాయి. కానీ
ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ముందుగా
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఆ పార్టీలే. కాలక్రమంలో అన్ని
వ్యవస్థల మాదిరిగానే ఈ నిప్పు లాంటి సంస్థకు కూడా ఏనాడో చెదలు పట్టాయి.
అయినా ప్రజలకు ఈ సంస్థ పట్ల ఇంకా ఎంతో కొంత గౌరవం, నమ్మకం మిగిలే
వున్నాయి. రాజకీయంకోసం ఈ సంస్థను వాడుకుంటున్నారని పాలక పక్షాన్ని
ప్రతిపక్షాలు దెప్పిపొడుస్తుంటాయి. చిత్రం ఏమిటంటే అధికారం తమ చేతిలోకి
రాగానే అవేపని అవి చేస్తుంటాయి. ఇవే చిలుక పలుకులు మళ్ళీ ప్రతిపక్షంగా
మారిన ఒకనాటి పాలకపక్షం నోటి వెంట వినీ వినీ జనాలకు విసుగు పుడుతోంది.
కానీ గుడ్డిలో మెల్ల అన్నట్టు సీబీఐ సమర్ధత పట్ల ప్రజలకున్న అమితమైన
విశ్వాసం పూర్తిగా ఆవిరి కాలేదు.

ఇప్పుడు ఆ ఘడియ కూడా దాపురించింది.

ఈ సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల నడుమ చెలరేగిన విబేధాలు ఆరోపణల
స్థాయికి పెరిగి అతి స్వల్ప కాలంలోనే బాగా రాజుకుని ఆ సెగలు కేంద్ర
ప్రభుత్వానికి కూడా తగిలాయి. దాంతో వారిరువురిని పదవుల నుంచి తప్పించి
సెలవుపై పంపడం జరిగింది. ఇదంతా సంస్థ ప్రతిష్టను కాపాడడానికే అని
కేంద్ర మంత్రి ఒకరు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం ఈ వివాదంలో కొసమెరుపు.

అత్యున్నత అధికారి లేకుండా మరి సంస్థ నడవడం ఎట్లా! అందుకే తాత్కాలిక
ప్రాతిపదికన కొత్త అధిపతిని నియమిస్తూ అప్పటికప్పుడు అర్ధరాత్రి ఓ
నిర్ణయం తీసుకున్నారు.

పాత అధికారి ఇది అన్యాయం అంటూ సుప్రీం తలుపుతట్టారు. విధానపరమైన కొత్త
నిర్ణయాలు ఏవీ కొత్త అధికారి తీసుకోరాదని, మాజీ డైరక్టర్ పై ఆయన సహచర
అధికారి చేసిన ఆరోపణలపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ రెండు వారాలలోగా దర్యాప్తు పూర్తిచేసి ఆ
నివేదికను సీలు వేసిన కవరులో సర్వోన్నత న్యాయస్థానానికి నవంబరు పన్నెండు
నాడు అందచేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిపెట్టుకున్న అధికారిపై కూడా చాలా పాత
ఆరోపణలు వున్నాయని ఆయన నియామకపు వార్తతో పాటే మరికొన్ని పుకార్లు ప్రాణం
పోసుకున్నాయి.

అత్యున్నత స్థానాలలో వుండేవారిపై వచ్చే ఆరోపణలను విచారించే ఈ అత్యున్నత
దర్యాప్తు సంస్థలో చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులను
ఇంతకాలం ఎలా పనిచేయనిస్తున్నారు అనే ప్రశ్నకు జవాబు దొరుకుతుంది అనుకోవడం
అత్యాశే. సమాధానం తెలిసిన వాళ్ళు కూడా చెబుతారనే ఆశ అంతకంటే లేదు.

ఈ మొత్తం ఉదంతం గమనించిన తర్వాత రామాయణానికి సబంధించిన ఒక ప్రక్షిప్త
వృత్తాంతం గుర్తుకు వస్తోంది.

రాముడు వనవాసం చేస్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు.
కొంతసేపు గడిచిన తర్వాత తన ధనుర్బాణాల కింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక
మండూకం కనిపిస్తుంది.

రాముడి మనసు చివుక్కుమంటుంది.

‘రక్తం స్రవిస్తూ కూడా ఇంతటి బాధను ఎలా ఓర్చుకున్నావు మండూకమా! వెంటనే
నాకు చెప్పక పోయావా’ అంటాడు ఓదార్పుగా.

అందుకా కప్ప ఇచ్చిన జవాబే ఈ వ్యాసానికి ప్రేరణ.

“ఓ శ్రీరామచంద్రా! సమస్త ప్రాణులను కాపాడే దేవదేవుడివి నువ్వు. నువ్వే నా
బాధకు కారణం అయినప్పుడు నేనెవ్వరికి చెప్పుకుంటాను చెప్పు?’



అలాగే వుంది ఈ సీబీఐ వ్యవహారం.

2 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

ఆరోపణల ప్రాతిపదికగా ఒక వ్యక్తిని ఉద్యోగం లోంచి తీసేయ్యలేం. ఆరోపణలు నిరూపించబడాలి. ఇద్దరి పరస్పర ఆరోపణలు ఉన్నపుడు మాత్రం ఇద్దరిని కాసేపు పక్కకి తప్పించడమే తాత్కాలికంగా న్యాయం.

అన్యగామి చెప్పారు...

మంచి మాటలు చెప్పారు. మీరు అమెరికా వచ్చెళ్ళి చాలా సంవత్సరాలయ్యి ఉంటుంది. ఇక్కడ నమ్మకం ఇండియా మీద కొంత మెరుగేమో కానీ, మీరన్నంత ఉన్నతంగా మాత్రం లేదు.