17, అక్టోబర్ 2018, బుధవారం

ఏవిటి లాభం అంటే అదే లాభం – భండారు శ్రీనివాసరావు

‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నన్ను కష్టపెట్టడానికే పుట్టారు’ అనేది ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నాకున్న ఓ నిశ్చితాభిప్రాయం.
అది చిన్నప్పుడు బలవంతాన కలరా సూదిమందు ఇచ్చిన సర్కారు మనిషి కావచ్చు, అడిగిన అప్పచ్చులు వెంటనే పెట్టలేదని నేను కోపం పెంచుకున్న మా బామ్మ కావచ్చు, హోం వర్కు చేయలేదని నా వీపు వాయగొట్టిన లెక్కల మాస్టారు కావచ్చు, దాచిపెట్టుకున్న గోలీలు కాజేసిన నా బెస్టు ఫ్రెండు కావచ్చు ఇలా ఈ డెబ్బయి ఏళ్ళ పైచిలుకు సాగిన నా ఈ జీవితంలో, ప్రతి దశలో ఎవరో ఒకరు నన్ను కష్టపెడుతూనే వచ్చారని అదేమిటో ఓ పిచ్చి నమ్మకం. ఆ నమ్మకంతోనే వాళ్ళతో పెరుగుతూ విరుగుతూ వచ్చిన మానవ సంబంధాలు.
ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏమిటో అంతా విష్ణుమాయ.
‘ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నన్ను సుఖపెట్టడానికే పుట్టారు’ అనేది కొత్తగా మొగ్గ తొలుస్తున్న భావన.
అది పొరుగింటివారు కావచ్చు, ఆటో డ్రైవరు కావచ్చు, ఇంట్లో పొద్దున్నే పత్రికలు వేసే పేపరు బాయి కావచ్చు, ఇలా ఎందరెందరో వాళ్ళ సుఖాల్ని వదులుకుని నన్ను సుఖపెడుతున్నారనే అభిప్రాయం నాలో నాకే ఒక కొత్త మనిషిని చూపిస్తోంది.
ఈ ఎరుక నలభయ్ ఏళ్ళ క్రితమే కలిగివుంటే ఈనాడు నాకు ఎటు చూసినా మంచి మిత్రులే వుండేవాళ్ళు. అలాంటి విలువయిన సంపదను నేనే చేతులారా పోగొట్టుకున్నానన్నమాట.
ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం?


‘ఏం లాభం అనే ప్రశ్నే శుద్ధ వేస్టు. మనిషి ఆలోచనా ధోరణి మంచిగా మారడం అనేది ఏ వయస్సులో జరిగినా అది లాభమే. నీకే కాదు, నీ చుట్టూ వున్న సమాజానికి కూడా’ అన్నాడు మా మేనల్లుడు రామచంద్రం.

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


ఇటువంటి జ్ఞానం / కనువిప్పు జీవితంలో కొంచెం ఆలస్యంగానే కలుగుతుంది లెండి.

ఇవాళ తెల్లవారుఝాము నుండే కుండపోత వర్షం (“నగరంలో పలుచోట్ల భారీ వర్షం, స్తంభించిన ట్రాఫిక్, ఇక్కట్లు పడుతున్న వాహనదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం, ఇబ్బందులు పడుతున్న జనం”, పట్టించుకోని అధికారులు ...... ఆహా నాకు కూడా టీవీ భాష వచ్చేసిందండి 🙂, ఇన్-పుట్ ఎడిటర్ ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందేమో 🤔?) . సరే, ఇక్కడ నేను సీరియస్ గా చెప్పదల్చుకున్నది —> తలుపు తీసి చూస్తే గుమ్మం దగ్గర న్యూస్ పేపర్ ... రోజూ లాగానే. తరువాత కాస్సేపటికి పాలపేకెట్లు ... రోజూ లాగానే. వీళ్ళు గదండీ .. ఎండనక వాననక .. జనాలకు అమూల్యమైన సేవ చేస్తున్న వాళ్ళు. హేట్సాఫ్ 👏.

అజ్ఞాత చెప్పారు...

బతుకుతెరువు, అవసరార్థం కోసం ఒకరికొకరు సేవలందిస్తూ జీవిస్తారు మనుష్యులు. ఏ కొద్దిమందిని మినహాయిస్తే నిజంగా సేవాభావంతో చేసేవాళ్ళు ఉండరు. అయితే ఇతరులు చేస్తున్న సహాయం పట్ల కృతజ్ఞతాభావం ఉండడం సంస్కారం. రైతు, చెత్త తరలింపు, ఆటో, పాలు, కిరాణా, ఎలక్ట్రిక్, ప్లంబర్... వీళ్ళు చేసేపని
ఉద్యోగులు ఆఫీసుల్లో పనికిరాని రిపోర్టులు తయారుచేయడం, పుచ్చు వంకాయ టీవీ చర్చలకంటే అమూల్యమైనవి.

సూర్య చెప్పారు...

అందరూ మంచోల్లే లేదా అందరూ చెడ్డోల్లే అనే రెండు భావాలూ జీవితానికి ప్రమాదమే సుమా!
తమ పనిని తాము సమర్థంగా చేసే వాళ్ళు ఎక్కువైనపుడు దేశం దానంతట అదే బాగుపడుతుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యటం మన కనీస ధర్మం.

బుచికి చెప్పారు...

అందరూ మంచోల్లే లేదా అందరూ చెడ్డోల్లే అనే రెండు భావాలూ జీవితానికి ప్రమాదమే సుమా!-agree.