19, అక్టోబర్ 2018, శుక్రవారం

చంద్రబాబుతో మా ఆవిడ పోటీ – భండారు శ్రీనివాసరావు



“చంద్రబాబును చూడండి, ఆ వయసులో ఎలా అలుపు ఎరగకుండా పనిచేస్తున్నాడో. మొన్నీమధ్య అమెరికా వెళ్లి వచ్చాడా. మనమయితే  జెట్ లాగ్ అంటూ రెండ్రోజులు కాళ్ళు మునగతీసుకుని ఇంట్లోనే పడివుంటాం. ఆయన మాత్రం కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు తిత్లీ తుపాను సంగతి చూడండి, తుపాను రావడం తీరం దాటి వెళ్ళడం మాత్రం జరిగింది కానీ ఆయన ఆల్ మకాం శ్రీకాకుళం జిల్లాలోనే పెట్టి ఎలా అహోరాత్రులు పనిచేస్తున్నాడో. టీవీల్లో చూస్తుంటే ఆశ్చర్యంకలుగుతుంది.  రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తానని అంటుంటే ఏమో అనుకున్నా కానీ నిజమే అనిపిస్తోంది”
ఈ మధ్య మా ఇంటికి వచ్చిన ఒక పెద్ద మనిషి చెప్పుకొచ్చాడు, మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ చంద్రబాబు గురించి   అనర్ఘలంగా మాట్లాడుతూ.
ఆయనకో సంగతి తెలవదు మా ఆవిడ కూడా రోజుకు పద్దెనిమిది గంటలు, అవసరమయితే మరికొన్ని గంటలు ఎక్కువగా పనిచేస్తుందని. పని చెయ్యకపోయినా, పని లేకపోయినా ఆమెకు తోచదని నాకూ ఆలస్యంగానే తెలిసింది.
‘చూసారా డ్రాయింగు రూములో తేడా’ అంటుంది నేను మధ్యాన్నం నిద్ర లేవగానే. ఈ కొద్ది సమయంలో కొట్టొచ్చిన ఆ తేడా ఏమిటని నేను నిద్ర కళ్ళు మరింత విప్పార్చి చూస్తే ఏమీ కనబడదు.
‘అదే మరి. నిన్న ఫ్లవర్ వాజు ఎక్కడుంది? ఇవ్వాళ ఎక్కడుంది. ఇక్కడ పెట్టి చూసాను, ఎంతో అందంగా కనిపించింది’
కొలను విడిచిన తామరపూలు వాడి పోతాయని సుమతీ శతకంలో చదివా కానీ, ఫ్లవర్ వాజ్ చోటు మారితే లేని అందాలు సంతరించుకుంటుందని నాకు తెలియదు.
‘అవునా’ అనబోయి ఎందుకయినా మంచిదని ‘అవును’ అన్నాను ముక్తసరిగా.
‘పక్కింటి పిన్నిగారు కూడా అలాగే అంది, ఇలా పెడితేనే చాలా బాగుందని’
ఇచ్చిన కాఫీ తాగి బల్ల మీద పెట్టబోతే అదక్కడ కనిపించలేదు. ఏమైందా అని చూస్తే గదిలో మరో మూలకు జరిగి కూర్చుంది.
‘వాస్తు మహిమా?’ అనబోయి ఆగి ఆ నమ్మకాలు ఆమెకు లేవని గుర్తుకొచ్చి, ఇంటి సర్డుడు కార్యక్రమంలో భాగమని జ్ఞాపకంవచ్చి నాలుక మడతేసి సర్దుకున్నాను.
మా ఇంట్లో సోఫాలు ఈ రోజు వున్నట్టు మరురోజు ఉంటాయన్న గ్యారంటీ లేదు. అటూ ఇటూ మారుస్తూ వాటితో చెడుగుడు ఆడడం మా ఆవిడకో సరదా. మంచాలు జరుగుతాయి. తలగడలు  అటువి ఇటవుతాయి. టీవీ దిక్కు మార్చుకుంటుంది. పూలకుండీలు, బట్టల బీరువాలు, పుస్తకాల అరమరాలు, డైనింగు టేబులు ఏవీ నాల్రోజుల పాటు ఒక్క తీరున, ఒక్క జాగాలో వుండవు. వంటిల్లు సరేసరి. అది ఆవిడ సొంత సామ్రాజ్యం.
‘ఆ గోడ మీద వినాయకుడి పెద్ద పటం అక్కడ బాగా అనిపించడం లేదు, ఎవరయినా వచ్చినప్పుడు ఎదురుగా కనిపిస్తే బాగుంటుంది.’ తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అనేసింది.
నాకు అనిపించింది, బ్రహ్మ రుద్రాదులు కూడా ఆ వినాయకుడి స్థానచలనాన్ని ఇక ఆపలేరని.
మొన్నటికి మొన్న మా అమ్మగారి ఆబ్దీకం, ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతాలు, వినాయక చవితి, ఇప్పడు దేవీ నవరాత్రులు, లలితా సహస్రాలు, ఇవన్నీ ఒక్క చేత్తో సంభాళిస్తూనే మళ్ళీ ఇలా తెచ్చి పెట్టుకున్న పనులు. అలసట అనేది ఈ మనిషికి లేదా ఉండదా అనిపిస్తుంది.
అలాగే మరోటి కూడా అనిపిస్తుంది.
ఇందులో పనికొచ్చే పనులెన్ని? పనికిరానివెన్ని?
పని కోసం పనిచేయడమా? పనికొచ్చే పనిచేయడమా?
అడగడానికి మా ఇంట్లో అసెంబ్లీ లేదు.      

5 కామెంట్‌లు:

రామారావు చెప్పారు...

ఇంతకీ ఇది చంద్రబాబుపై పొగడ్తా? సెటైరా??

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@రామారావు : కరక్టుగా కనుక్కున్నారు.

నీహారిక చెప్పారు...

ఇలాగే మావారు కూడా ఒకానొక అమావాస్య దినాన ఇంటి పని చేస్తే దమ్మిడీ రాదు అని నోరు జారారు. ఆ తర్వాత దమ్మిడీ ఆదాయం రాని పనులు మరిన్ని చేసాను. ఇదివరకు నువ్వు ఎంత శ్రద్ధగా పనులు చేసేదానివి ఈ బ్లాగులు చదివితే ఏమొస్తుంది అని అనడం మొదలుపెట్టారు. మా ఇల్లే ఒక పార్లమెంట్ అయిపోయింది.

సూర్య చెప్పారు...

లాభం లేదు. హిప్నాటిస్ట్ పట్టాభిరాం గారిని కలవండి.

అజ్ఞాత చెప్పారు...

Srinivasarao garu, manalaanti vaallaki aa panulu kanipinchavu, kanipinchina cheyyataniki oopika oorpu undavu. Anduke alane anipistundi. Oopika unnavaallani cheyyaniddam lendi, evaro okariki entho kontha use avutayi