22, అక్టోబర్ 2018, సోమవారం

మంచివాళ్ల మౌనం – భండారు శ్రీనివాసరావు


Silence is connivance,
Connivance is betrayal,
Betrayal is sin,
Sin is punishable offence
అవసరమైన సందర్భాలలో మౌనంగా వుండడం అనేది ఒకరకంగా లాలూచీనే.
లాలూచీ అంటే వెన్నుపోటు
వెన్నుపోటు పొడవడం పాపం
పాపం శిక్షార్హం
స్వేచ్చానువాదం చేస్తే ఆపై ఆంగ్ల వాక్యాలకు దగ్గరగా నాకనిపించిన అనువాదం ఇది.
కీర్తిశేషులు, మాజీ గవర్నర్ జనరల్  శ్రీ సి. రాజగోపాలాచారి ఆంగ్లంలో తిరగ రాసిన మహాభారతంలోనిది.
కురుక్షేత్ర యుద్ధరంగంలో  అంపశయ్యపై పడుకుని  తన  ఆఖరి ఘడియల కోసం ఎదురు చూస్తున్న భీష్మాచార్యులవారితో  కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఇవి.
కదనరంగంలో తీవ్రంగా గాయపడి మరణం తధ్యమని నిర్ధారించుకున్న పిదప ఇచ్చామరణం అనే వరం కారణంగా అంపశయ్యపై ఆఖరి రోజులు గడిపే భీష్ముడికి యెనలేని మనోవేదన పట్టుకుంటుంది.
తనొక మహావీరుడు. తెలిసి తెలిసీ ఏనాడూ ఎలాంటి దుష్ట కార్యం తలపెట్టలేదు. పొరబాటున కూడా పాపానికి ఒడిగట్టలేదు. ఇతరుల రాజ్యంపై కన్ను వేయలేదు. పరకాంతను చెరబట్టడం సరే కలలో సయితం  ఏ కాంత పొందునూ కోరని ఆజన్మ బ్రహ్మచారిని.
ఇలాంటి నాకేల ఈదుస్తితి?
పగలల్లా రణన్నినాదాలు. ప్రళయభీకర ఆయుధ గర్జనలు. పొద్దువాలేసమయానికి నాటి యుద్ధ పరిసమాప్తి. చుట్టూ శవాల గుట్టలు. ఆత్మీయుల ఆక్రందనలు. కొసప్రాణంతో మిగిలిన సైనికులు తమ ప్రాణం కాపాడండంటూ చేసే హృదయ విదారక రోదనలు. ఆసువులు బాసిన అమరుల పార్ధివ శరీరాలను కడుపారా ఆరగించడానికి ఆకాశంలో గిరికీలు కొట్టే రాబందుల రెక్కల చప్పుళ్ళు. ఆ నిశిరాత్రి సమయంలో చెవులు చిల్లులు పడేలా నక్కల ఊళలు.
కడుపు తిప్పే ఇటువంటి దారుణ దృశ్యాల నడుమ నిదురలేని రాత్రులు గడపాల్సిన స్తితి. ఈ దుస్తితి పగవాళ్ళకు కూడా రాకూడదు.
కురుపాండవ వంశాలకే కాదు, యావత్ కురుసామ్రాజ్యానికి పరిరక్షకుడిగా, సకల శస్త్రాస్త్రవిద్యలలో  ఆరితేరినవాడిగా, సమస్త ధర్మశాస్త్రాలు పుణికిపుచ్చుకున్నవాడిగా, త్యాగానికి మారుపేరుగా, ఆడిన మాట తప్పనివాడిగా, శత్రువుకు వెన్ను చూపని వీరాధి వీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తన కడసారి ఘడియలు ఈ విధంగా గడుస్తాయని ఏనాడూ అనుకోలేదే. ఎందుకిలా జరిగింది? నేను చేసిన పాపం ఏమిటి?
అంటూ కుమిలిపోతున్న భీష్ముడి అంతరంగ వేదనకు కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఇది.
“ధృతరాష్ట్రుడి  నిండు కొలువులో దుర్యోధనాదులు పాంచాలిని వివస్త్రను చేసే సందర్భంలో కాపాడమని ఆ ఆబల కోరినదెవరినో గుర్తున్నది కదా గాంగేయా! భీష్మ, ద్రోణ, అశ్వద్ధామ, కృపాచార్యులను. ఎందుకంటే వారు సర్వ ధర్మాలను ఎరిగిన వారు. ఏది మంచో ఏది చెడో నిర్భయంగా చెప్పగలిగిన సమర్ధులు. సర్వ శక్తిమంతులు కూడా. అప్పటి ఆనాటి  మీ మౌనం ఎంతటి అనర్ధానికి కారణం అయిందో ఇప్పటికయినా తెలిసి వచ్చిందా!”
ఈఉదయం  జర్నలిష్టు కాలనీలో AP 24 X 7 స్టూడియోకు వెళ్లి జర్నలిష్టు మిత్రుడు, నడిచే ఎన్ సైక్లోపీడియా పాశం యాదగిరి ఇంటిమీదుగా వస్తూ అతడికి ఫోను చేసాను. షరామామూలు కులాసా కాలక్షేపం కబుర్లకోసం కాదు. పనికొచ్చే నాలుగు ముక్కలు చెబుతాడని. నేను అనుకున్నట్టే యాదగిరి పొద్దున్నే ఏ కళన ఉన్నాడో ఏమో కానీ మంచివాళ్ల మౌనం అంశం ఎత్తుకున్నాడు. చాలా చాలా విషయాలు చెప్పాడు. జాతికి మెదళ్లవంటి మేధావుల అధోగమన తీరుతెన్నులు గురించి చెప్పాడు. అన్నీ రాయాలంటే అదో గ్రంధం అవుతుంది.
అమావాస్య పున్నములకు ఓసారి అన్నట్టుగా ఎప్పుడో కాని కాగితం మీద కలం పెట్టని యాదగిరిని నేను కోపగించుకునేది ఈ ఒక్క విషయంలోనే. రాయి యాదగిరీ! రాయి!! యాదొచ్చినవన్నీ అప్పుడప్పుడన్నా  రాస్తుండు. మాకోసం అయినా!             



2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


ఎక్కువ గా రాస్తే రాళ్ళేస్తారేమో జనాలని మనకెందుకులే అని మౌనమేమో యాదగిరి గారిది :(



జిలేబి

అజ్ఞాత చెప్పారు...

సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే
పారము పొందలేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వారలుపేక్ష సేసిరది వారల చేటగు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవ ముండెడిన్

ఇదే కృష్ణుడు అందరిముందూ రాయబారంలో చెప్పినప్పుడు వినికూడా ఏమీ చేయకపోవడం అనే "లాలూచీ"