5, ఆగస్టు 2017, శనివారం

శ్రద్ధాంజలి – కృతజ్ఞతాంజలి



ఈ రోజు మా అమ్మగారు శ్రీమతి వెంకట్రావమ్మ గారి ఆబ్దీకం.


ఆమె కాలం చేసి రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఆమె చనిపోయిన రోజు ఇంకా కళ్ళకు కట్టినట్టు వుంది.  శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఆవిడకు వొంట్లో బాగా లేదని తెలిసి అంతా వచ్చారు. ఇంటి కోడళ్ళు అందరూ శుక్రవారం నోములకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆవిడ వారి నోములకు, వాయినాలకు ఆటంకం కలిగించకుండా అన్నీ పూర్తయ్యేవరకు వుండి ఆ తరువాత కన్ను మూసింది. దహన సంస్కారాలు పూర్తికాగానే, మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారు ఆమె అపరకర్మలు కాశీలో జరపాలని ప్రతిపాదించడం, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు, బావగార్లు అందరం వారణాసి వెళ్లి ఆ పవిత్ర ప్రదేశంలో గంగా తీరంలో పిండ ప్రదానాలు చేసి తర్పణాలు విడవడం అంతా ఓ కలలా జరిగిపోయింది.
మా నాన్నగారు రాఘవరావు గారు చనిపోయి అనేక దశాబ్దాలు దొర్లిపోయాయి. నా చిన్నతనంలోనే కన్నుమూయడం వల్ల,  ఆయన రూపం కూడా నాకు గుర్తు లేదు.  ఆయన ఆబ్దీకాలను మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అత్యంత శ్రద్దాసక్తులతో  ప్రతియేటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు. మా స్వగ్రామంలో వరుసగా నలభయ్ యాభై ఏళ్ళపాటు జరుగుతూ వచ్చిన  ఈ ఆబ్దీకాలు,  కాలక్రమంలో  వాస్తవంగా ఒక పండుగ మాదిరిగా మారిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలందరూ ఓ శుభకార్యానికి వచ్చినట్టు హాజరయ్యేవారు. పిల్లలు, వారిపిల్లలు, వారి పిల్లలు  ఇలా అందరూ,  అదొక తద్దినం అనే  కన్నా కూడా నలుగురు కలిసి  పెద్దలను సంస్మరించుకునే ఒక అవకాశంగా భావించి,  ఒకరికొకరు  కూడబలుక్కుని  ఆరోజుకల్లా అంతా ఠంచనుగా ఓ దారీతెన్నూ లేని  ఆ చిన్న పల్లెటూరు మా వూరు  కంభంపాడు చేరుకునేవారు. నిజానికి ఈ యావత్ కార్యక్రమానికి వెన్నుదన్ను మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు. ఆయన మా వూరు కరణీకం చేసేవారు. ప్రతియేడూ మా నాన్న తద్దినానికి పెళ్ళికి పంపినట్టు అందరికీ పేరుపేరునా  వర్తమానాలు పంపేవారు. మా నాన్న ఆబ్దీకం అంటే మా వూళ్ళో ఓ సందడి. వూరబంతి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ కంటే తద్దినాలు ఘనంగా జరిగేవని చెప్పుకునేవారు.
ఇన్నేళ్ళ తరువాత కొన్ని విషయాలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అన్ని సంవత్సరాలుగా అంత శ్రద్ధగా ఘనంగా మా అమ్మానాన్నల తద్దినాలను బాధ్యతగా  నిర్వహిస్తూ వచ్చిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుగారు ఈ నాడు మా మధ్యన లేకపోవడం మేమందరం  తట్టుకోలేకపోతున్న ఓ విషాద పరిణామం. మూడో అన్నయ్య ఏకంగా మా వూరిలో అమ్మానాన్నల గుడినిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడా గుడి పక్కనే వారిద్దరి స్మారక చిహ్నాలు నిర్మించి మా అన్నయ్య పిల్లలు ఆయన ఋణం కొంతమేర తీర్చుకున్నారు.
పోతే, చావంటే ఏమిటో తెలియని రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకుని, తద్దినం అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని స్తితిలో పెరుగుతూ వచ్చిన నేను,  వూహ తెలిసే నాటికే తద్దినం పెట్టే కర్త  తమ్ముడి పాత్రలో వొదిగిపోయాను. మా రెండో అన్నయ్య  రామచంద్రరావు గారు దత్తు పోవడం వల్ల, చివరికి మిగిలింది నేనే కావడం వల్ల ఏటా మా అమ్మానాన్నల తద్దినాలు కర్తగా కూర్చుని  పెట్టే అవకాశం, ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి, నాకు లభించింది. దాదాపు కాపురానికి వచ్చింది లగాయతు మా పెద్ద వొదినె గారు శ్రీమతి  సరోజినీ దేవి, రెండో వొదినెగారు శ్రీమతి  విమలాదేవి, మూడో వొదినెగారు శ్రీమతి  అరుణా దేవి మడికట్టుకుని  తడిబట్టలతో ఎంతో శ్రద్ధతో  ఈ పవిత్ర కార్యానికి తోడ్పడుతూ వచ్చారు. గత కొన్నేళ్ళుగా ఈ బాధ్యతను  మా ఆవిడ నిర్మలాదేవి నెత్తికెత్తుకుంది.
దాదాపు   అరవై ఏళ్ళుగా  మా నాన్నగారి ఆబ్దీకం, సుమారు రెండు దశాబ్దాలకు పైగా మా అమ్మగారి తద్దినం క్రమం తప్పకుండా నిర్వహించే భాగ్యం   నా పూర్వజన్మ సుకృతం.  కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా మా పెద్దవాడు సందీప్  పూనుకుని ఏర్పాట్లు చేయడం వల్ల అక్కడ కూడా ఏలోటూ రాకుండా ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించగలిగాను.
ఇందుకు సహకరిస్తూ వచ్చిన అందరికీ కృతజ్ఞతాంజలి. గతించిన పెద్దలకు శ్రద్ధాంజలి.


1, ఆగస్టు 2017, మంగళవారం

ఆంధ్రపత్రిక మళ్ళీ వస్తోంది!


యాభయ్ అరవై ఏళ్ళ క్రితం, మా వూళ్ళో గూడా సత్యనారాయణ సిద్ధాంతిగారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి మర్నాడు  సాయంత్రం అయ్యేది. అయినా, సరే అది చదువుతుంటే  ఏ రోజు వార్తలు, ఆరోజే తెలుసుకుంటున్న ఫీలింగ్‌ కలిగేది. ఊరు మొత్తానికి కలిపి ఇద్దరు ముగ్గురు మాత్రమే చందా కట్టి పత్రిక తెప్పించుకునేవారు. పోస్ట్ మాన్ చేతిలో ఆంధ్రపత్రిక కనబడగానే మా అందరికీ ప్రాణాలు లేచొచ్చేవి.
‘అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఫిట్జరాల్ద్  కెనెడీ ఎన్నిక, ఓటమి అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన’ అంటూ పత్రికలోని వార్తలను స్కూలు మేష్టరుగారు శివరాజు అప్పయ్య పంతులు గారు ఉచ్చైస్వరంతో చదివి వినిపిస్తుంటే ఊరి వారందరూ పోగయి చెవులప్పగించి వినేవారు.
బెజవాడ గాంధి నగరంలో ఆంధ్రపత్రిక ఆఫీసు వుండేది. దాన్ని మద్రాసు నుంచి బెజవాడ తరలించినప్పుడు మా దగ్గరి బంధువు పినపాక ప్రకాశరావు గారు పత్రిక సంపాదకత్వ బాధ్యతలు చూస్తుండేవారు. ప్రముఖ రచయిత వీరాజీ కూడా అప్పుడే  మద్రాసు నుంచి మకాం బెజవాడకు మార్చుకున్నారు. బెజవాడలో సమాచార శాఖ అధికారిగా పని చేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారి ఆఫీసుకు వస్తుండేవారు. సి.కనకాంబర రాజు (సికరాజుగా, ఆంద్ర భూమి వారపత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు) కూడా నాకు అక్కడే పరిచయం.
తదుపరి నేను హైదరాబాదులో రేడియోలో చేరిన తరువాత బషీర్ బాగ్ చౌరస్తాలో ఆంధ్రపత్రిక ఆఫీసుకు వెడుతుండేవాడిని. సీ.వీ. రాజగోపాలరావు గారు రెసిడెంట్ ఎడిటర్. బ్యూరో చీఫ్ ముక్కు శర్మగారు, పాపయ్య శాస్త్రి గారు, సుందరం, (ఇప్పుడు లేరు), పాశం యాదగిరి, కే.వేణుగోపాల్, ములుగు రాజేశ్వర రావు, చుట్ట రాంప్రసాద్, విద్యారణ్య అక్కడ పనిచేస్తూ వుండేవారు. ఆ భవనం అంతెత్తున ఒక రాజ మహల్ ని తలపించేదిగా వుండేది. అంతటి భోగం అనుభవించిన ఆంధ్రపత్రిక చివరికి  గగన్ మహల్ లో ఒక  అద్దె ఇంటిలో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటికే అది అవసాన దశకు చేరుకున్నట్టే. కాశీనాధుని నాగేశ్వరరావు, శివలెంక సంభుప్రసాద్, శివలెంక రాధాకృష్ణ చేతుల్లో పెరిగి పెద్దదయిన తెలుగువారి మొట్టమొదటి పూర్తిస్థాయి దినపత్రిక  ఆంధ్రపత్రిక, విద్యారణ్య మాటల్లో చెప్పాలంటే, ‘శివ సాయుజ్యం’ పొందింది.

ఆంధ్రపత్రిక లేకుండానే తెలుగు పత్రికారంగానికి  ఏండ్లు గడిచిపోయాయి. ఆ పత్రికలో పనిచేసి పేరు తెచ్చుకున్న జర్నలిష్టులందరూ వేరే పత్రికలకు మరలిపోయారు.  మళ్ళీ ఇన్నాళ్టికి ‘మహానగర్’ అనే ఓ చిన్న పత్రికను యజ్ఞంలా నడుపుకుంటున్న మనసున్న మారాజు ‘పాంచజన్యం’,  పెద్ద మనసు చేసుకుని ఆంధ్రపత్రికకు ఊపిరులూదాడు. ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతిలో ఈ మధ్యనే వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమై  మళ్ళీ జనం మధ్యకు వస్తోంది. సంతోషం!         

29, జులై 2017, శనివారం

ముసలితనం, పసి తనం, రెండింట్లో కామన్ మొండితనం

  
చిన్నప్పుడు మా బామ్మను చూసినప్పుడు నేనెప్పుడు ఇంత పెద్దవాడిని అవుతానో కదా అనుకునేవాడిని.  ఆమె పోయిన నలభయ్ అయిదేళ్లకల్లా  నాకామె వయసు ఈజీగా నా ప్రమేయం లేకుండానే  వచ్చేసింది. ఇంట్లో అందరికంటే వయసులో చిన్నవాడినేకావచ్చు, కానీ నేనూ ఇప్పుడు పెద్దవాడినే!
పుట్టిన ప్రతివాడికి బాల్యం వుంటుంది కాని ముసలి వయసు అనేది  ఆయుస్సునిబట్టి వుంటుంది. ఇంకో చిత్రం ఏమిటంటే మొండితనం అనే ఒక లక్షణం మాత్రం  పసితనానికి, ముసలితనం ఈ రెండింటికీ కామన్.
చిన్నప్పుడు ‘అలా చేయోద్దురా’ అనే పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. ‘ఏమిట్రా అలా ముందూ వెనకా చూసుకోకుండా ఆ గెంతులు. పడితే కాలో చెయ్యో విరుగుతుంది. సిమెంటు కట్టు కట్టుకుని ఆటా పాటా లేకుండా మంచం మీద పడి వుండాలి, జాగ్రత్త!’ అంటూ వుంటారు. ‘ఏవిటో ఈ పెద్దవాళ్ళు, అనవసరంగా అన్నింటికీ కంగారు పడుతుంటారు’ అనుకుంటారు పిల్లవాళ్ళు. నేనూ అలాగే చెప్పిన మాట వినకుండా ఒకరోజు సైకిల్ మీద నుంచి పడి  చెయ్యి విరగగొట్టుకున్నాను. సర్కారు దవాఖానాలో సిమెంటు కట్టు వేస్తే దాన్ని మెడకి తగిలించుకుని మోస్తూ నలభయ్ రోజులు తిరిగాను. ‘ఇంకా నయం కాలు విరిగింది కాదు’ అనుకున్నాను. అంతే కాని ‘కాళ్ళూ చేతులు విరగగొట్టుకోవద్దు’ అన్న పెద్దల మాటలు చెవి కెక్కించుకోలేదు.
ఇప్పుడు మళ్ళీ సీను రివర్స్. ‘కాస్త జాగ్రత్త’ అంటారు పిల్లలు. ‘ఆ మాత్రం తెలియదా’ అంటుంది మనలోని మొండితనం.
‘వద్దమ్మా! అలా మిట్ట మధ్యాన్నం వరకు పూజలూ అవీ చేస్తూ కడుపు మాడ్చుకోకు. అసలే నీకు, సుగరు, బీపీ. డాక్టరు ఏం చెప్పాడు, పొద్దున్నే ఏదో ఇంత  తిన్న తరువాతనే ఏ పని అయినా అని చెప్పాడా లేదా. మళ్ళీ ఏదైనా అయితే ఇబ్బంది పడేది నువ్వే’ అంటుంటారు పిల్లలు. అందరి మాటా అంతవరకూ వింటూవచ్చి, ‘మంచి అమ్మ’  అని నలుగురి చేతా అనిపించుకున్న ఆ అమ్మ మాత్రం పిల్లలు చెప్పిన ఆ మంచి మాట వినదు.  పైగా ‘ఆ మాత్రం నాకు తెలవదా’ అనుకుంటుంది. ‘మనం పెద్దవాళ్ళం కదా పిల్లవాళ్ళ మాట వింటే ఇక మన పెద్దరికం ఏముంటుంది’ అని కూడా అనుకుంటుంది. నిజానికి ఏదైనా జరిగితే ఇబ్బంది పడేది నిజమే అయినా, అసలు ఇబ్బంది పిల్లలది.
మొన్నీమధ్య తెలిసిన దంపతులు పిల్లల్ని చూడ్డానికి అమెరికా వెళ్ళారు. ఆమెకు బీపీ, సుగరూ పుట్టింటి కట్నంగా వచ్చాయి. కావాల్సిన మాత్రలు అవీ తీసుకు వెళ్ళారు. తల్లీ తండ్రికి అమెరికాలో నాలుగు ప్రదేశాలు చూపించాలని ముచ్చటపడి పిల్లలు,  ఎక్కడికో విహార యాత్రకు తీసుకువెళ్ళారు. ఈసందడిలో మాత్రలు వెంట  పట్టుకుపోవడం మరచిపోయారు. నాల్రోజులు మాత్రలు వేసుకోకపోతే ఏం కొంప మునుగుతుందని పిల్లలకి ఆ విషయం చెప్పలేదు. చెబితే ఏదైనా ప్రయత్నం చేసేవాళ్ళేమో! చివరికి నిజంగానే కొంప మునిగింది. జబ్బున పడ్డ తల్లిని ఆసుపత్రిలో చేర్చి బయటకు తీసుకురావడానికి వాళ్ళ లెక్కలో అటూ ఇటూగా ఓ యాభయ్ లక్షలు ఒదిలాయని చెప్పుకున్నారు.  కాబట్టి ఏమిటట! చిన్నప్పుడు పిల్లల మొండితనం మనకు యెంత కోపం తెప్పించేదో గుర్తుకు తెచ్చుకుని పెద్దతనంలో మనం కాస్త మొండితనం తగ్గించుకోవాలి. ‘ఈ రోడ్డే కదా దాటి అవతల ఉన్న గుడికి వెళ్ళలేమా!’ అంటే వెళ్ళవచ్చు. అదే ఖర్మం కలిసిరాక ఏదైనా జరిగితే మంచాన పడేది పిల్లలు కాదు, మనమే  అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.
చలికాలం వస్తే మూడంకె వేసి దుప్పటి కప్పుకుని పడుకుంటాం.  ముసలి తనం కూడా అలాగే. ఆ వయసుని బట్టి దానికి తగ్గట్టు మన  మనసును కాస్త వీలుగా ముడుచుకోవాలి.
కాదూ కూడదంటే కలిగేవి ఇబ్బందులే. మనం పడడంతో సరిపోదు ఇతరులను కూడా అనవసరంగా ఇబ్బందుల పాలు చేయాల్సిరావచ్చు.

నీతి: పెద్దతనంలో మొండితనాన్ని అటక ఎక్కించాలి. లేకపోతే ‘పడక’ వేయాల్సి వస్తుంది. 

కల్యాణం కమనీయం



పూర్వాశ్రమంలో ఒక దినపత్రికలో పనిచేసేరోజుల్లో అంటే నలభయ్ ఏళ్ళకిందట రాష్ట్రంలో వేసవి వచ్చిందంటే చాలు అనేక చోట్ల అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉండేవి. ఒకోసారి ఒకే రోజు అనేకచోట్ల నుంచి ఈ ప్రమాద వార్తలు అందేవి. వాటినన్నిటినీ కలిపి ‘వాడవాడలా అగ్నిప్రమాదాలు’ అనే ఒకే శీర్షిక కింద హోల్ మొత్తం ఫుల్ పేజీలో ఒకే చోట ప్రచురించేవారు. వేసవిలోనే పెళ్లి ముహూర్తాలు కూడా ఎక్కువగా వుంటాయి. పలానా వారి పెళ్లి పలానా వారితో పలానా రోజున జరిగిందని పత్రికలో ప్రచురించే సాంప్రదాయం ఒకటి వుండేది. అదీ చాలా ముఖ్యులు అనుకునేవారి విషయంలోనే దీన్ని పాటించేవారు. అయితే కాలక్రమంలో పత్రికలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వాళ్ళ పెళ్లి పత్రికలు పట్టుకొచ్చి, ఆ శుభలేఖలోని తేదీ ప్రకారం  పలానా రోజున పలానావారి  పెళ్లి ఘనంగా జరిగిందనే వార్త  ఆ ‘పెళ్ళిళ్ళకాలమ్’ లో అచ్చయ్యేలా తమవంతు ప్రయత్నం చేసుకునేవారు. అది ఎంతవరకు విస్తరించింది అంటే ‘వాడవాడలా వివాహాలు’  అనే శీర్షిక కింద పెళ్ళిళ్ళ వార్తలు  ప్రచురించే దుస్తితి దాపురిస్తుందేమో అని చెప్పుకుని నవ్వుకునే వాళ్ళం. అయితే చివరికి ఈ అంటు వ్యాధికి అడ్డుకట్ట ఒక పెళ్లి వార్త రూపంలోనే పడింది. పెళ్లి పత్రికల దాకా వచ్చిన ఒక పెళ్లి, పెళ్లి పీటల దాకా వెళ్ళకుండానే ఏదో కారణంతో వాయిదా పడడం, ఆ విషయం తెలియక ఆ పెళ్లి జరిగినట్టు పత్రికలో రావడం ఒక చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి ఈ ముందస్తు పెళ్లి వార్తల ప్రచురణకు ఎడిటర్ గారు స్వస్తి పలకడంతో అప్పటికా కధ ఆవిధంగా  ముగిసింది.      

28, జులై 2017, శుక్రవారం

అవినీతి, అనైతికం రెండూ కవలపిల్లలు


మన  దేశంలో అవినీతి ఆరోపణలకు అతీతులయిన రాజకీయ నాయకుల జాబితా తీస్తే అందులో మొదట కనబడే పేరు నీతీష్ కుమార్. అవినీతి మరకలు ఇసుమంతైనా అంటని వాళ్ళలో ఆయన ప్రధముడు. నీతినిజాయితీలకు మారుపేరనిపించుకుంటాడని భావించి తలితండ్రులు ఆ పేరు పెట్టి వుంటారేమో అని అనుకునేవాళ్లు కూడా వున్నారు. అయితే అదంతా నిన్న మొన్నటి దాకానే. ఇప్పుడు ఆయనా ఆ తానులో ముక్కే అని బాధపడుతున్నారు ఆయన అభిమానులు.
లాలూవంటి అవినీతి పరుడయిన రాజకీయ నాయకుడు   అనుయాయులకో, బడా బడా కాంట్రాక్టర్లకో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమయిన  పనులు చేసి పెట్టి  కోట్లు దండుకుంటే, అటువంటివాళ్ళు రాజకీయాలకు చీడ పురుగువంటివాడని తీర్మానిస్తాము. మరి అలాంటి అధికారాలు అనేకం కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అనైతికంగా, అప్రజాస్వామికంగా దొడ్డిదారిన   పొందితే అటువంటి వారిని యేమని పిలవాలి? అవినీతి ఎలాంటిదో అనైతికం కూడా అలాంటిదే. వేసుకున్న చొక్కా మార్చినట్టు, రాత్రి రాత్రి ఏకంగా ఉత్తర దక్షిణాలవంటి రెండు పార్టీ కూటముల్లో ఒకదాన్ని ఒదిలి మరో దాంట్లో చేరిపోతే, దాన్ని సమర్ధించడం ఏం ధర్మం.
అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం గొప్పవిషయమూ కాదు, మన దేశానికి కొత్త విషయమూ కాదు. అలా గతంలో జరిగినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతొ గగ్గోలు పెట్టిన వాళ్ళే ఈరోజు అలాంటి పనులకు పూనుకోవడం, అవినీతిపై చేస్తున్న యుద్ధంగా పేరు పెట్టుకుని వాటిని సమర్ధించుకోవడం క్షంతవ్యం కాదు.  అలా ఏర్పడ్డ ప్రభుత్వాలు అవినీతిరహిత పాలన అందివ్వవచ్చు. యేవో కొన్ని మంచి పనులు చేసి మంచి  ప్రభుత్వాలు అనిపించుకోవచ్చు.  కానీ   ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు మాత్రం కానేరవు.  లాలూ కానీ అతడి కుమారుడు కానీ చెడ్డవాడు అయితే వాళ్ళని  తిరస్కరించాల్సింది ప్రజలే కాని వారి  రాజకీయ ప్రత్యర్ధులు కారు. ఇటువంటి నీతిబాహ్య చర్యలకు ప్రజాస్వామ్య ముసుగు తగిలించుకోవడం అంటే ఆ స్పూర్తిని అవహేళన చేయడమే. ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి అయినా, దించడానికి అయినా రాజ్యాంగంలో కొన్ని పద్దతులు వున్నాయి. వాటిని తుచ తప్పకుండా పాటించడం వదిలేసి, వాటిల్లోని లొసుగులను వాడుకోవాలని చూస్తే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు సిద్ధించవచ్చేమో కాని, శాశ్వితంగా అపకారం జరిగేది ప్రజాస్వామ్యానికే అనే అంశాన్ని  గమనంలో వుంచుకోవాలి.
ఈరోజు గడిస్తే చాలు అనుకునేవాడు రాజకీయ నాయకుడు. రేపు ఎలా అని ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు.

బీహారు పరిణామాలు గమనిస్తుంటే మొదటి రకానికి దేశానికి లోటులేదనిపిస్తోంది.

27, జులై 2017, గురువారం

పాట్నాలో మూగ మనసులు


కొన్ని వింటున్నప్పుడు, మరి కొన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడో విన్న, ఎన్నడో  కన్న సంగతులు గుర్తుకు వస్తుంటాయి, మూగమనసులు సినిమాలాగా.
1964 లో అనుకుంటాను బెజవాడ లీలామహల్లో చూశాను క్లియోపాట్రా సినిమా. ఒక్కసారి కాదు అనేకసార్లు చూసాను అనేకమంది మాదిరిగానే. అప్పుడే విన్నాను ఆ రెండు పేర్లు, ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్. ఆ సినిమా సెట్లపై వారిరువురి నడుమ  పుష్పించిన ప్రేమ పెళ్ళికి దారితీసిందని పత్రికలు రాసాయి. (ఆ సినిమాలో ఆ ఇద్దరి నడుమా ఒక ముద్దు సీను వుంది. పెదవులు కలుపుకుని గట్టిగా ముద్దు పెట్టుకునే ఆ దృశ్యంలో ఇద్దరూ ఎంతగా ఒళ్ళు మరిచిపోయారంటే, దర్శకుడు కల్పించుకుని ‘కట్ కట్’ అని అంతకంటే గట్టిగా అరవాల్సి వచ్చిందట) అప్పట్లో అదో సంచలనం. కారణం ఆ ఇద్దరికీ అది మొదటి పెళ్లి కాకపోవడం. అప్పటికే పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తున్న ఆ ఇరువురూ విడాకులు తీసుకుని తమ జీవిత సహచరులతో విడిపోయి మళ్ళీ పెళ్ళాడారు. హాలీవుడ్ లో అదో కొత్త విషయం కాదుకాని ఇండియాలో ఇలాంటి కబుర్లు వింతగానే చెప్పుకుంటారు. అలాగే చెప్పుకున్నారు కూడా. ఒక పదేళ్ళు వారి సంసారం బాగానే సాగింది. పాతొక రోత సామెత మాదిరిగా ఇద్దరికీ సరిపడక విడాకులు తీసేసుకుని మళ్ళీ తమకు నచ్చిన పెళ్ళిళ్ళు ఎంచక్కా చేసుకున్నారు. కధ అంతటితో ఆగలేదు. అలా విడిపోయిన వీరిరువురూ ఏదో  సందర్భంలో మళ్ళీ కలుసుకున్నారు. పాత ప్రేమ మళ్ళీ మారాకు తొడిగింది. అంతే! ఏడాది తిరక్కుండానే పాత మొగుడికి టేలరు, పాత భార్యకు బర్టను టాటా చెప్పేసి మళ్ళీ మరోసారి పెళ్లి చేసుకుని కొత్తగా భార్యాభర్తలు అయ్యారు. కానీ పెళ్ళాడి కొన్ని వారాలు గడిచాయో లేదో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. కాపురం చివరికి వచ్చింది. మళ్ళీ విడిపోవడమే వారికి మిగిలింది.
ఈ చిన్ని కధలో ఇన్ని ‘మళ్ళీ’లు  ఎందుకు అంటే, ఆ విషయం మళ్ళీ మరోసారి చెప్పుకుందాం!


25, జులై 2017, మంగళవారం

సెన్స్ ఆఫ్ హ్యూమర్


సామాన్యుడికి, ఆ మాటకు వస్తే ఎవరికయినా వారి వారి దినవారీ ఒత్తిళ్ళ నుంచి ఒకింత ఊరట కలిగించేవి చిన్న చిన్న  కార్టూన్లు, జోకులు. సీరియస్  వాతావరణం నుంచి  ఇవి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. కారణం తెలియదు కానీ రాజకీయ నాయకుల్లో ఈ సెన్స్ ఆఫ్  హ్యూమర్ అనే లక్షణం  రోజురోజుకీ తగ్గిపోతోంది. ఒక కార్టూనును  కానీ, లేదా ఒక హాస్య స్పోరక కధనాన్ని కానీ హరాయించుకోలేకపోతున్నారన్నది సుస్పష్టం.  ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో  ఇదొకటి.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల్లో  కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో, ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
ఈ సందర్భంలో  ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం.   1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి  ఘోర పరాభవం ఎదురయినప్పుడు,  ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్,  నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్  కారణంగా ఆయన అభిమానులనుంచి దాడి తప్పదు అని ఆ కార్టూనిష్టు   అనుకుంటుంటే ఒక చిత్రం జరిగింది. లక్ష్మణ్ గారికి  నెహ్రూ నుంచి  ఒక ఉత్తరం వచ్చింది. తెరిచి చూస్తే విషయం ఇది.
‘పొద్దున్నే పత్రికలో మీ కార్టూన్ చూసి నాకెంతో సంతోషమయింది. అది చూడగానే నా మనసుకు ప్రశాంతత చిక్కింది.  అదే కార్టూన్ ని కొంచెం పెద్దదిగా గీసి నాకు  పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అని రాశారు నెహ్రూ.
బాపూ సినిమా ముత్యాలముగ్గులో  రావు గోపాల రావు అన్నట్టు ‘మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి’. నిజమే!

అయితే అది రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.