మన దేశంలో అవినీతి ఆరోపణలకు అతీతులయిన రాజకీయ నాయకుల
జాబితా తీస్తే అందులో మొదట కనబడే పేరు నీతీష్ కుమార్. అవినీతి మరకలు ఇసుమంతైనా
అంటని వాళ్ళలో ఆయన ప్రధముడు. నీతినిజాయితీలకు మారుపేరనిపించుకుంటాడని భావించి
తలితండ్రులు ఆ పేరు పెట్టి వుంటారేమో అని అనుకునేవాళ్లు కూడా వున్నారు. అయితే
అదంతా నిన్న మొన్నటి దాకానే. ఇప్పుడు ఆయనా ఆ తానులో ముక్కే అని బాధపడుతున్నారు ఆయన
అభిమానులు.
లాలూవంటి అవినీతి పరుడయిన రాజకీయ
నాయకుడు అనుయాయులకో, బడా బడా కాంట్రాక్టర్లకో అధికారాన్ని
అడ్డం పెట్టుకుని అడ్డమయిన పనులు చేసి
పెట్టి కోట్లు దండుకుంటే, అటువంటివాళ్ళు రాజకీయాలకు
చీడ పురుగువంటివాడని తీర్మానిస్తాము. మరి అలాంటి అధికారాలు అనేకం కలిగిన రాష్ట్ర
ముఖ్యమంత్రి పదవిని అనైతికంగా, అప్రజాస్వామికంగా దొడ్డిదారిన పొందితే
అటువంటి వారిని యేమని పిలవాలి? అవినీతి ఎలాంటిదో అనైతికం కూడా అలాంటిదే. వేసుకున్న
చొక్కా మార్చినట్టు, రాత్రి రాత్రి ఏకంగా ఉత్తర దక్షిణాలవంటి రెండు పార్టీ కూటముల్లో
ఒకదాన్ని ఒదిలి మరో దాంట్లో చేరిపోతే, దాన్ని సమర్ధించడం ఏం ధర్మం.
అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను ఏర్పాటు
చేసుకోవడం గొప్పవిషయమూ కాదు, మన దేశానికి కొత్త విషయమూ కాదు. అలా గతంలో
జరిగినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతొ గగ్గోలు పెట్టిన వాళ్ళే ఈరోజు అలాంటి
పనులకు పూనుకోవడం, అవినీతిపై చేస్తున్న యుద్ధంగా పేరు పెట్టుకుని వాటిని సమర్ధించుకోవడం
క్షంతవ్యం కాదు. అలా ఏర్పడ్డ ప్రభుత్వాలు అవినీతిరహిత
పాలన అందివ్వవచ్చు. యేవో కొన్ని మంచి పనులు చేసి మంచి ప్రభుత్వాలు అనిపించుకోవచ్చు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు
మాత్రం కానేరవు. లాలూ కానీ అతడి కుమారుడు
కానీ చెడ్డవాడు అయితే వాళ్ళని తిరస్కరించాల్సింది ప్రజలే కాని వారి రాజకీయ ప్రత్యర్ధులు కారు. ఇటువంటి నీతిబాహ్య
చర్యలకు ప్రజాస్వామ్య ముసుగు తగిలించుకోవడం అంటే ఆ స్పూర్తిని అవహేళన చేయడమే.
ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి అయినా, దించడానికి అయినా రాజ్యాంగంలో కొన్ని పద్దతులు
వున్నాయి. వాటిని తుచ తప్పకుండా పాటించడం వదిలేసి, వాటిల్లోని లొసుగులను వాడుకోవాలని
చూస్తే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు సిద్ధించవచ్చేమో కాని, శాశ్వితంగా అపకారం
జరిగేది ప్రజాస్వామ్యానికే అనే అంశాన్ని గమనంలో వుంచుకోవాలి.
ఈరోజు గడిస్తే చాలు అనుకునేవాడు రాజకీయ
నాయకుడు. రేపు ఎలా అని ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు.
బీహారు పరిణామాలు గమనిస్తుంటే మొదటి రకానికి
దేశానికి లోటులేదనిపిస్తోంది.