24, జనవరి 2017, మంగళవారం

మన్ కీ బాత్

ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా వున్న కొన్ని మాటల్ని మళ్ళీ ఓసారి విందాం.మరోసారి మననం చేసుకుందాం.
'విడిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
'అయిదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలి'
'ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామనే హామీకి కట్టుబడి వున్నాం'
'ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు, ప్రతిపక్షాలు కావాలనే మా మీద బురద చల్లుతున్నాయి'
'ప్రత్యేక హోదా సాధించేవరకు మేము నిద్రపోము'
'ప్రత్యేక హోదా కోసం మా నాయకుడు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మహాజర్లు ఇచ్చివచ్చిన సంగతి ప్రతిపక్షాలు మరిచిపోతున్నాయి'
'మేము అధికారంలోకి రాలేక పోవడం వల్ల గత పార్లమెంటు సాక్షిగా మేము ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోలేకపోయాము. ఈసారి అధికారంలోకి రాగానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి మా మాట నెరవేర్చుకుంటామని మరో హామీ ఇస్తున్నాము'
'ఇచ్చిన హామీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపీ ఘోరంగా విఫలం అయ్యింది'
'పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్తితిలేదు. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పొందుపరచి వున్నట్టయితే ఇప్పుడీ పరిస్తితి వచ్చేదే కాదు'
'మేము ఇవ్వలేదు సరే. ఇప్పుడు పార్లమెంటులో బిల్లు ఆమోదింపచేయగల మెజారిటీ వుంది. ప్రత్యేక హోదాకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేయవచ్చు కదా'
'ప్రత్యేక హోదా కుదరదు అన్న కేంద్ర మంత్రి ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ కు వర్తించదు'
'ప్రత్యేక హోదా కుదరని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం'
'రాజీనామాల వల్ల ప్రత్యేక హోదా వచ్చేటట్టయితే అందుకు మేము సిద్ధం'
ఇవన్నీ ఏడాది కాలంగా వినీ వినీ ప్రజల చెవులకు తుప్పు పట్టింది. అవే మాటలు పదేపదే వింటూ రావడం వల్ల పట్టిన చెవుల తుప్పు ఒదిలిపోయింది కూడా. అందుకే ప్రజలకు ఇప్పుడు సర్వం అర్ధం అవుతోంది. రాజకీయ పార్టీల అసలు తత్వం బోధపడుతోంది.
నిజానికి ఈ మాటలు అన్నీ పైకి చెప్పేవి. మనసులోని మాటలు వేరే.
'ఇవ్వచ్చు. కానీ దగ్గర్లో ఎన్నికలు లేవు. ఇప్పుడు ఇస్తే ఏమిటి లాభం?'
'ఇప్పుడే ఇవ్వాలి. ఎన్నికలకు ముందు ఇస్తే మాకేమిటి లాభం'
'ఇవ్వడం వల్ల మా పార్టీకి ప్రస్తుతం ఎలాటి లాభం లేదు. పైగా నష్టం కూడా. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం పోరాడక తప్పదు. రోడ్డెక్కక తప్పదు'
మనసులో మాట అనండి, మన్ కీ బాత్ అనండి. అసలు విషయం ఇది.
(ఏడాది క్రితం రాసింది)

20, జనవరి 2017, శుక్రవారం

శ్వేతసౌధం నుంచి ‘నల్ల సూరీడు’ నిష్క్రమణ

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 22-01-2017, SUNDAY)

యావత్ ప్రపంచానికి అధికార కేంద్రంగా చెప్పుకునే అమెరికాలో భారత కాలమానం ప్రకారం జనవరి ఇరవయ్యవ తేదీ, శుక్రవారం రాత్రి పదిన్నర గంటలకు అధికార మార్పిడి జరిగింది. సంచలనాలకు మారు పేరుగా మారిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి మిసెస్ హిల్లరీ క్లింటన్ పై అనూహ్య విజయం సాధించిన దరిమిలా ఆ దేశంలో ఒబామా నేతృత్వంలో సాగుతున్న ఎనిమిదేళ్ళ పాలనకు తెర పడింది. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నవంబరులో ముగిసి ఫలితాలు వెల్లడి అయినప్పటికీ, కొత్త అధ్యక్షుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు స్వీకరించడం మాత్రం జనవరిలోనే జరగాల్సివుంటుంది. ఆ ప్రకారమే  ప్రజలు ఎంపిక చేసుకున్న కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20వ తేదీన శ్వేతసౌధంలో అడుగు పెట్టారు. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికయి, అదే  భవనంలో నివాసం వుంటున్న ప్రెసిడెంట్  బరాక్  ఒబామా ఒక సాధారణ పౌరుడిగా వైట్ హౌస్ నుంచి బయటకు అడుగు పెట్టారు.
రెండు పర్యాయాలు, అంటే  మొత్తం ఎనిమిది సంవత్సరాలు అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవిలో వుంటూ, ఆ దేశపు రాజ్యాంగం ప్రకారం పదవినుంచి తప్పుకుంటూ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన సాంప్రదాయ  వీడ్కోలు ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రచారం పొందింది.  ఈ సందర్భంగా ఒబామా,  తన పదవీ కాలంలో సాధించిన విజయాలను, చేయాలని గట్టిగా అనుకుని కూడా చేయలేని కొన్ని  పనులను ఏకరవు పెట్టారు. ఉద్వేగం ఆపుకోలేక  ఒక దశలో కంట తడిపెట్టారు కూడా.  

      
వర్ణ వివక్ష మూలాలు కలిగిన  అత్యంత సంపన్న దేశానికి ఒబామా  ఎనిమిదేళ్ళు తిరుగులేని అధినేతగా వున్నారు. కంటి చూపుతో ప్రపంచ దేశాలను శాసించగల అపరిమిత అధికారాలను అనుభవించారు. జన్మతః ఆఫ్రికన్ అమెరికన్  అయిన ఒబామా అమెరికా  దేశాధ్యక్షుడు కాగలిగారంటే అది అమెరికన్ల  ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతుంది. అయితే, ఒబామా తన వీడ్కోలు ప్రసంగంలో అమెరికన్ సమాజంలో ఈనాటికీ అవశేషాలుగా మిగిలివున్న జాత్యహంకార ధోరణులను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
సాధారణంగా రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన వారు ఆ పదవిని వీడిపోయే సమయానికి ఏదో ఒక విధమైన ఆరోపణల మరకలు అంటించుకోవడం పరిపాటిగా మారిన అమెరికాలో ఈ నల్ల సూరీడు మాత్రం  ఎటువంటి మచ్చా లేకుండా పదవీ విరమణ చేయడం ఆయన వ్యక్తిత్వ శోభని తెలియచెప్పుతుంది. అమెరికా అధ్యక్షులగురించి గతంలో  అనేక రకాల ఆరోపణలు, అధికార దుర్వినియోగం, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కధనాలు, ఊహాగానాలు  వెలువడిన ఘన చరిత్ర కలిగిన ఆ దేశంలో ఒబామా మాత్రం పులుకడిగిన ముత్యంలా పదవికి గుడ్ బై చెప్పడం విశేషం. ఒబామా కానీ, ఆయన భార్యాపిల్లలు కానీ నలుగురి నోళ్ళలో నానే విధంగా వైట్ హౌస్ లో ఏనాడూ ప్రవర్తించలేదు. మాటా మన్ననా వారి వ్యక్తిత్వ శోభని మరింత పెంచాయి. 
అభిజాత్య అమెరికన్ సమాజంలో అధికారం కూడా తోడయితే ఆ వ్యక్తుల ప్రవర్తన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. కానీ ఈ సాధారణ అభిప్రాయానికి భిన్నంగా ఆయన అసాధారణ రీతిలో తన నడవడికను ప్రదర్శించి అమెరికా అధ్యక్షులు ఇలాగా కూడా వుంటారు అని నిరూపించారు. ఎనిమిదేళ్ళ పదవీ కాలంలో ఇలాటి సందర్భాలు, సన్నివేశాలు కొల్లలుగా కనిపిస్తాయి.
మచ్చుకి కొన్ని.
నిజమా! నిజంగా నిజమని నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగానే  జరిగింది. ప్రెసిడెంట్ ఒబామా స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం  బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే-
ఒకసారి న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా వాషింగ్టన్ నుంచి బయలుదేరి ఆ నగరం వెళ్ళారు. అక్కడ గడిపిన రోజుల్లో  ఓ రోజు వీలుచేసుకుని హోటల్లో భోజనం చేయడానికి  భార్యను వెంటబెట్టుకుని వెళ్ళారు. అమెరికా ప్రెసిడెంటు ఏమిటి? హోటల్లో భోజనం ఏమిటి? అనే సన్నాయి నొక్కుళ్ళు మనదేశంలోనే.
సరే! హోటల్లో దంపతులిద్దరూ  మాట మంతీ చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్  కార్డు తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, 'ప్రెసిడెంట్! మీ క్రెడిట్  కార్డు చెల్లదు' అని చావు కబురు చల్లగా చెప్పాడు.   పక్కన భార్య వుండబట్టీ, ఆవిడ తన కార్డు తీసి ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది. అయితే ఈ వ్యవహారం వెంటనే బయటకు పొక్కలేదు. తరువాత ఎప్పుడో  ఒక  మీటింగులో మాట్లాడుతూ ఒబామా మహాశయులే మాటవరసకు అన్నట్టు ఈ మాట బయటపెట్టారు. క్రెడిట్ కార్డ్లు, వాటి భద్రత గురించి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం  మీడియాలో గుప్పుమంది.
బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా  అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది – 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు ఆ దేశం గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ వోటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. శ్వేత జాతీయులకు వర్ణ వివక్ష ఎక్కువ అనే అపప్రదని సమూలంగా తొలగించుకుంటూ అమెరికా దేశీయులు బరాక్ హుస్సేన్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు యావత్ ప్రపంచం ఎంతగానో పులకించిపోయింది. వొంటి రంగు మూలంగా పాశ్చాత్య దేశాలలో అదేమాదిరి వివక్షను ఎంతోకొంత ఎదుర్కొంటున్న భారతీయులు సయితం ఒబామా విజయాన్ని తమ గెలుపుగా భావించి పండగ చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి  ముందూ, ఆ తరువాతా నేను క్రైస్తవుడినేఅని బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత టర్కీలో జరిపిన తొలి విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

అలాగే మరొక  స్వానుభవం.
ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని  సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై  ఆ నగరానికి వచ్చివెడుతున్న  అమెరికా ప్రెసిడెంట్ -  ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఒబామా  ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు  వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్  దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక  వార్త సారాంశం.
ఉపశృతి:
అమెరికా నలభయ్ అయిదవ అధ్యక్షుడిగా పదవిని స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్, ఎనిమిదేళ్ళ తరువాత శ్వేతసౌధం వీడిన బరాక్ ఒబామా, వీరిద్దరికీ తమ భార్యల గురించి వింతయిన అభిప్రాయాలు వున్నాయి.  ఇటువంటి సరదా వ్యాఖ్యలు సరదాగా చేస్తారు కాబట్టి వాటిని సరదగా తీసుకుంటే ఏ ఇబ్బందీ వుండదు. 
రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్ ట్రంప్
మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది. తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”- బరాక్ ఒబామా



17, జనవరి 2017, మంగళవారం

రెండు చావులు


నిజానికి ఇది జనవరి మొదట్లోనే రాయాలి.
తెలుగు సినిమాలు, తెలుగు జీవితాలు సెంటిమెంటు మీద ఆధారపడి నడుస్తున్నాయి. కొత్త ఏడాది ఆరంభాన్ని చావులతో మొదలు పెట్టడం ఎందుకనే సందేహం నన్ను నిలువరించింది. అంచేతే ఈ కాలయాపన.
పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. ఎవరు ఎప్పుడు అనేదే తెలియదు. ఎలా అన్నదే ఆ మనిషి ఎటువంటి బతుకు బతికాడు అన్నది తెలుపుతుంది.
ఈరోజు ఆమె చనిపోయి పన్నెండో రోజు. చుట్టపక్కాలు అందరూ వచ్చారు. ఆమె అనాయాస మరణం గురించి మననం చేసుకున్నారు. కోటికొక్కరికి మాత్రమె  దొరికే వరం అది.
ఆ రోజు రాత్రి భార్యా భర్తా ఇద్దరూ భోంచేసి చెరో సోఫాలో పడుకుని  టీవీ చూస్తున్నారు. కాసేపటి తరువాత భార్య సోఫానుంచి చేతులు వేలాయడం భర్త కళ్ళ పడింది. చుట్టుపక్కల వారిని లేపి దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకు వెళ్ళే సరికి అంతా అయిపొయింది. విగత జీవిగా ఆవిడ ఇంటికి తిరిగొచ్చింది.
ఇక రెండో సంఘటన.
కొత్త  సంవత్సరం  కనిపెంచిన వారితో గడుపుదామని ఆమె అమెరికా నుంచి ఇండియా వచ్చింది. హైదరాబాదు విమానాశ్రయంలో తండ్రిని చూడగానే ఆమెకు కళ్ళనీళ్ళు తిరిగాయి. ఆయనలో ఏదో తేడా.
ఆందోళన వున్నా అత్తవారింటికి ముందు వెళ్ళడం కోడలిగా తన విధి. తప్పదు. అలాగే వెళ్ళింది.
మర్నాడు పొద్దున్నే  ఫోను. నిన్న కనపడ్డ తండ్రి ఈ రోజు లేడు. ఇది జరిగే పనా.
అయినా జరిగింది.

విధి వైపరీత్యం అంటే ఇదే!  

ప్రచారాలు


ఈ రోజు ఉదయం ఊబెర్ లో వెడుతున్నాను. డ్రైవర్ పేరు పెండ్యాల సత్యనారాయణ. మా ఊళ్ళో కూడా పెండ్యాల ఇంటి పేరుకలవాళ్ళు వున్నారు. మాటల్లో చెప్పాడు. రెండేళ్ళ క్రితం ఈ కారు కొనుక్కున్నాడట. అంతకు పూర్వం తను డ్రైవరుగా పనిచేసిన యజమాని మాట సాయం వల్ల కారు లోన్ లభించిందనీ, ఆయన పేరు రామచంద్ర మూర్తిగారనీ చెప్పాడు. స్టీరింగు ముందు కూర్చోగానే  సాయం చేసిన  ఆయన్ని ప్రతిరోజూ  గుర్తు చేసుకుంటానని  చెప్పాడు. సంభాషణ కొనసాగిస్తే తేలింది ఏమిటంటే ఆ రామచంద్ర మూర్తిగారు, ఇప్పుడు సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి గారు ఒక్కరేనని. మూర్తిగారు హెచ్.ఎం.టీ.వీ. లో పనిచేసేటప్పుడు ఈ సత్యనారాయణ గారు  అయిదేళ్లపాటు ఆయన కారు డ్రైవరుగా వున్నాడట.
ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, చేసిన పని గురించి గొప్పలు చెప్పుకునే ప్రచార యుగంలో ప్రస్తుతం  జీవిస్తున్నాము. అందుకే చిత్రంగా అనిపించింది. మంచి పని చేసి కూడా దాన్ని చెప్పుకోని కాలాన్ని చూసినవాడిగా కొన్ని విషయాలు రాయాలనిపించి రాస్తున్నాను.
మొన్నీ మధ్య ఒక పెద్దమనిషి చెప్పాడు, పెన్షనర్ల కోసం మోడీ జీవన్ ప్రమాణ్ అనే పేరుతొ ఒక మంచి పధకం ప్రవేశ పెట్టారని. నిజమే. నేనూ వెళ్లి నా పేరు నమోదు చేసుకున్నాను.



తాము ఇంకా బతికే వున్నామని, అందుకు  రుజువుగా పెన్షనర్లు ప్రతియేటా తమ బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారి ఎదుట హాజరయి ఒక సర్టిఫికేట్ సమర్పించుకోవాలి. పెద్దతనంలో ఎక్కడో ఏ ఊళ్లోనో పిల్లల  దగ్గర శేష జీవితం గడిపే పెన్షనర్లు ఇలా బ్యాంకుల చుట్టూ తిరగడం ప్రయాసే. ఈ జీవన్ ప్రమాణ్ వల్ల ఆ ఇబ్బంది వుండదు. ఉంటున్న ఊళ్లోనే ఏదైనా బ్యాంకుకు వెళ్లి బొటనవేలి ముద్ర ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది కంటే పదవీ విరమణ చేసి పించను పుచ్చుకుంటున్న వాళ్ళ సంఖ్యే ఎక్కువ. కాబట్టి అలాంటి వాళ్లకి ఇది వరప్రసాదమే. ప్రయోజనం పొందిన వాళ్ళే చెబుతారు, ఇది మోడీ పుణ్యం అని. కానీ అలా జరగడం లేదు, ఇది మోడీ ప్రవేశపెట్టిన పధకం అంటూ ప్రచారం చేయడం విడ్డూరం అనిపిస్తుంది. మోడీ చేస్తున్న పెద్దపెద్ద పనులు ఇంకా చాలా వుంటాయి. ఇలా ప్రతి పనిని ఆయన ఖాతాలో వేయడం వల్ల ఆయన వ్యక్తిత్వ శోభ ఇనుమడిస్తుందని నేనయితే అనుకోను. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. గతంలో ఒకసారి కొన్ని మందుల కోసం సీ.జీ.హెచ్. క్లినిక్ కి వెళ్లాను. కొన్ని మందులు ఇచ్చారు. మరి కొన్ని స్టాక్ లో లేవన్నారు. బయటకు వస్తుంటేనే సెల్ లో ఎస్సెమ్మెస్ వచ్చింది. ‘మీరు ఇన్ని మందులు  తీసుకున్నారు, మిగిలిన మందుల కోసం ఇండెంటు పెట్టారు, పలానా రోజున వచ్చి వాటిని పట్టుకెళ్ళమని’. నేను ఎంతో ఆశ్చర్య పోయాను. ఆ రోజుల్లో ప్రధాని మన్మోహన్ సింగ్. కానీ ఎవ్వరూ ఈ మంచి పని చేసింది ఆయన అని ప్రచారం చేయలేదు. జనత ప్రభుత్వ హయాములో రైల్వే మంత్రి మధు దండావతే  స్లీపరు కోచీల్లో చెక్క బల్లల స్థానంలో మెత్తగా వుండే పరుపుల బెర్తులు వేయించారు. సాధారణ రైల్వే ప్రయాణీకులకు అదొక పెద్ద ఊరట. కానీ ఆయన ఎప్పుడూ తను ఈ పనిచేశానని చెప్పుకోలేదు. ఆయన అనుయాయులూ చెప్పలేదు. అలాగే రైల్వేలలో రిజర్వేషన్లు కంప్యూటరైజ్ చేసిన తరువాత ఒనగూరిన ప్రయోజనాలు చెప్పక్కర లేదు. కానీ ఏ ప్రభుత్వం వాటికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అలా ఒక్కొక్క ప్రభుత్వ హయాములో ఒక్కొక్క మంచి పని జరుగుతూనే వుంటుంది. అలా మంచి పనులు చేస్తూ పోవడం తమ బాధ్యతగా భావించాలి కానీ తామే అన్నీ చేస్తున్నాం అని పదేపదే చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం వల్ల ప్రజల దృష్టిలో పలచన పడే అవకాశం వుంటుంది.
కొన్ని ప్రధానమైన విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి సంబంధించి ప్రభుత్వాలు కానీ వాటి నేతలు కానీ, వారి అనుయాయులు, అభిమానులు కానీ  ప్రచారం చేసుకుంటే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు.
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఒక గేయంలో రాశాడు ఇలా:

“ప్రచారాల తెరలుడుల్చి ప్రతిభ చూపనోపకు!”                              

16, జనవరి 2017, సోమవారం

ఒక పూట కోటీశ్వరుడు

దాదాపు నలభయ్ ఏళ్ళయింది కోటు వేసుకుని. అదీ మాస్కో చలికోసం.


మళ్ళీ ఇన్నాల్టికి ఓ టీవీ పుణ్యమా అని కోటు వేసుకోవాల్సిన పని పడింది. బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ నిషిద్దం. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం వల్ల నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా  నచ్చలేదు. అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం విధికి తలవంచక తప్పలేదు.

అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి వ్యవహారం మా ఇంట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యేది. మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి చూడదు. అదన్నమాట. 

లాభ శాతమెంత? నష్ట శాతమెంత?


“నాలుగు పెంచు, మూడు తగ్గించు, మరో రెండు తగ్గించి అయిదు పెంచు. అలానే ఒకటి తగ్గించి ఇంకోటి పెంచు. ఆరు తగ్గించి అయిదు పెంచు.”
“ఏవిటీ లెక్క అర్ధం లేకుండా!”

“అర్ధం చేసుకోవాలి నాయనా! ఈ లెక్కల్ని తెలుగులో పెట్రో ధరలు అంటారుష”   

15, జనవరి 2017, ఆదివారం

వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య


నా రేడియో సహోద్యోగి నాగసూరి వేణుగోపాల్ ఈరోజు ఒక ఫోటో పోస్ట్ చేశారు. అది చూడగానే సంతోషం, విచారం ఏకకాలంలో ముప్పిరిగొన్నాయి.
మాస్కో రేడియోలో పనిచేయడానికి వెళ్ళే ముందు దుగ్గిరాల పూర్ణయ్య గారిని ఢిల్లీలో కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. గంభీరమైన స్వరం. వార్తలు విరిచినట్టు చదవడంలో ఒక ప్రత్యేకమైన బాణీ. రేడియో వార్తలు సగంలో విన్నా కూడా చప్పున చెప్పేయొచ్చు వార్తలు చదివేది పలానా అని. ఎందరో శ్రోతలు, ఎందరో అభిమానులు. అలా గడిచి పోయింది వారి రేడియో జీవితం.
ఇప్పుడు గుడివాడ దగ్గర అంగలూరులో శేష జీవితం గడుపుతున్నట్టు వేణుగోపాల్ వల్ల తెలుస్తోంది. వారి ఫోటో చూసినప్పుడే గుండె బరువెక్కింది.
కాలం తెచ్చే మార్పులు తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

(కింద ఫోటోలో: దుగ్గిరాల పూర్ణయ్య, కర్టెసీ: నాగసూరి వేణుగోపాల్, ఆలిండియా రేడియో)