15, జనవరి 2016, శుక్రవారం

నాది నాది అనుకున్నది నీది కాదురా...

అన్న నీతి సూత్రం చెబుతారు మనసుకవి ఆత్రేయ ఒక సినిమా పాటలో.


హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత నాదంటే నాదని పలు రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు వింటుంటే ఈ పాత పాట జ్ఞాపకం వచ్చింది. అలా గుర్తుకు రావడం నాదే పొరబాటనిఎవరయినా అంటే నేనేమీ అనుకోను.

NOTE: Courtesy Image Owner 

14, జనవరి 2016, గురువారం

ఎదిగినకొద్దీ ఒదగమని....



“మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”
కౌంటర్ లోని వ్యక్తీ అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన  సంతకంతో వున్న  రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.

ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.   



(NOTE: COURTESY IMAGE OWNER)

13, జనవరి 2016, బుధవారం

ఇంగ్లీష్ జోకులు ఇలాగే వుంటాయి


(నాదేంలేదు, అనువాదం చేయడం  తప్ప)
పనిమనిషి ఇంటి యజమానురాలిని అడిగింది జీతం పెంచమని. పెంచడానికి మూడు కారణాలు చెప్పమంది ఇంటావిడ.
“నేను మీకంటే బాగా బట్టలు ఇస్త్రీ చేస్తాను”
“అలానా! ఎవరు చెప్పారు నీతో అలా?”
“ఎవరో కాదు మన సారే ఆ మాట నాతో చాలా సార్లు చెప్పారు”
“అల్లానా! సరే! ఇంకో కారణం చెప్పు”
“నేను మీకంటే బాగా వంట చేస్తాను”
“అలానా తల్లీ ఇదెవరు చెప్పారు?”
“ఇంకెవరు? మన అయ్యగారే!”
“ఓహో! అలా కూడా చెప్పారా అయ్యగారు, అది సరే నీ జీతం ఎందుకు పెంచాలో మరో కారణం చెప్పు”
“అది చెప్పడం బాగుండదండీ! కానీ మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు, పడక గదిలో మీకంటే నేనే బాగుంటానుట”
“ఏమిటీ! ఇది కూడా అయ్యగారే చెప్పారా? ఇంటికి రానీ సంగతి తేలుస్తాను.”
“అయ్యో అలా అనుకున్నారా! ఈ సంగతి చెప్పింది అయ్యగారు కాదండీ  మీ కారు డ్రైవరు”
“సరే! ఇంతకీ యెంత పెంచమంటావు ముందది చెప్పు”



(కార్టూనిష్ట్ ‘చక్రవర్తి’ గారికి కృతజ్ఞతలతో )

మార్పు మంచిదే


సూటిగా......సుతిమెత్తగా.........

(TO BE PUBLISHED IN TELUGU DAILY "SURYA" ON 14-01-2016, THURSDAY)

“ఈ బుద్ది బుధవారం దాకా వుంటే బూరెలు వొండి పెడతా”  అన్నదట ఓ ఇల్లాలు.
ఎప్పుడూ చిటపటలాడే మొగుడు చిద్విలాసంగా నవ్వడం చూసి అబ్బురపోయిన భార్య వ్యక్తం చేసిన భావం  అది.
ఇప్పుడీ సామెతల ప్రస్తావన ఎందుకంటే దానికి కారణం వుంది. దయచేసి చిత్తగించండి.
“నాదీ హైదరాబాదు కాదు. సిద్ధిపేట నుంచి వచ్చా. ఆ మాటకొస్తే నేనూ సెటిలర్నే”
ఈమాటలన్నది ఎవరో కాదు, తెలంగాణా ఐ.టీ.శాఖామంత్రి, కేసీఆర్ తనయుడు కే. తారక రామారావు.
“రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు. ఈ రెండూ కలిసికట్టుగా అభివృద్ధిలో ముందుకు సాగాలి. ఏపీ లాగే తెలంగాణా కూడా వెనుకబడిన రాష్ట్రమే. దానికి కూడా వీలైనంత సాయం చేయాలని కేంద్ర మంత్రులకు చెబుతుంటా”  ఈమాటలు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
టీఆర్ ఎస్ అగ్రనాయకుడు కేటీఆర్,  టీడీపీ అధినాయకుడు చంద్రబాబు వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలపై మీడియాలో విస్తృత చర్చలు జరిగాయి.
కేటీఆర్ ఏమిటీ అలా మాట్లాడడమేమిటి అని కొందరు మెటికలు విరిచారు. హైదరాబాదులో వున్న  సెటిలర్లపై ఇంతటి అవ్యాజ ప్రేమ ఒలకబోయడానికి కారణం జీహెచ్ఎం సీ ఎన్నికలే అని ఆరోపించారు. గతంలో హైదరాబాదులోని సెటిలర్లను అననిమాట లేదు, ఇప్పుడు ఈ విధంగా మాట మార్చి మాట్లాడడం కేవలం రాజకీయ లబ్ది కోసమే అని ప్రత్యర్ధుల ఉవాచ.
మరోపక్క నాలుగు మంచి మాటలు చెప్పిన చంద్రబాబుకు కూడా విమర్శలే మిగిలాయి. తెలంగాణా మీద ఆయనకు ఎక్కడలేని అభిమానం వెల్లువెత్త డానికి కారణం ఎన్నికలు తప్ప వేరు కారణం కాదు పొమ్మన్నారు. అంతేకాదు, బహిరంగ సభ, అందులోనూ ఎన్నికల ప్రచార ప్రారంభసభలో పాలక పక్షం  టీఆర్ఎస్  పై కానీ, ఆపార్టీ అధినేత  కేసీఆర్ పై కాని పల్లెత్తు మాట అనకుండా, బాబు ప్రసంగం చప్పగా సాగడానికి నోటుకు ఓటు కేసే కారణమని అన్నవారుకూడా లేకపోలేదు.


కాసేపు, వారి వాదనతోనే ఏకీవభించి చూద్దాం. కేటీఆర్ చెప్పే మాటలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అనుకుందాం. కారణం ఏదైతేనేం ఆ మార్పునే కదా ఆయన ప్రత్యర్ధులు లోగడ కోరుకున్నది. హైదరాబాదులో స్థిరపడ్డ   సీమాంధ్రులను తెలంగాణా ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూడాలనే కదా వారు గతంలో కోరుకున్నది. మరి అటువంటి మార్పును టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ స్వయంగా  ప్రదర్శించి చూపుతున్నప్పుడు అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఎక్కడ వుంది.    అల్లాగే చంద్రబాబు నాయుడు,  టీఆర్ఎస్ అధినేతపై సూటిపోటి బాణాలు విసరకుండా తన ప్రసంగం ముగించి ఉండవచ్చు. గతంలో ఆయన ప్రత్యర్ధులు ఆయన నుంచి కోరుకున్న మార్పు అదే కదా! అయినా దాన్ని తప్పుపట్టడంలో అర్ధం ఏమిటి?
నిజానికి, నిప్పూ, ఉప్పూ లాంటి ఈ ఉభయ పార్టీలు గిల్లికజ్జాలు మానుకుని, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మంగళం పాడితే బాగుంటుందని లోగడ బలంగా కోరుకున్న వాళ్లకు కూడా వారిలో వచ్చిన ఈ సానుకూల మార్పు రుచించినట్టు లేదు. గతంలో టీఆర్ఎస్  నాయకులు సీమాంధ్రుల విషయంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ చేస్తున్న ప్రకటనలే ఇందుకు సాక్ష్యం. తెలంగాణా వ్యతిరేకి అని లోగడ చంద్రబాబుకు ముద్రవేసిన వాళ్ళు, ఇప్పుడు అదే బాబు తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడడం, టీఆర్ ఎస్ పై లోగడ మాదిరిగా ఒంటి కాలుమీద లేవకపోవడం చూసి, గతాన్ని తవ్వుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారే కానీ స్వభావంలో వచ్చిన సానుకూల మార్పును స్వాగతిస్తున్నట్టు లేదు. మానవ మనస్తత్వం లోని చమత్కారం ఇదే. మనకు ఇష్టం లేని మనుషులు మారాలని కోరుకుంటాం. మారితే, ఏదో వారి అవసరం కోసం మారారు కాని, అది నిజమైన మార్పు కాదని మరో తీర్పు ఇచ్చేస్తాం.
ఎన్నికల ప్రచారం అంటేనే మాటల ఈటెలు విసురుకోవడంగా మారిన ఈ రోజుల్లో, కారణాలు ఏవైనా ఇద్దరు నాయకులు సంయమనంతో ప్రసంగాలు చేయడం ఆహ్వానించతగ్గ  పరిణామం. అయితే అగ్రనాయకులు సంయమనం పాటించినంత మాత్రాన ద్వితీయ శ్రేణి నాయకులు నోరు కుట్టేసుకుంటారు అనుకోవడం కూడా భ్రమ. నిజాం కాలేజీ మైదానంలో టీడీపీ, బీజేపీ కలిసి నిర్వహించిన బహిరంగ సభలో ఇతర వక్తల ప్రసంగాలు సాగిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రచార పర్వం ప్రధమ అధ్యాయమే ఇంత ‘కసి’వత్తరంగా మొదలయిందంటే ఇక ముందు ముందు నాయకుల  ఎన్నికల  ప్రసంగాలు ఎంతటి వికృత పోకడలకు పోతాయో ఊహించడం కష్టం. ఒకరు ఒక మాట అంటే, ప్రత్యర్ధులు లెక్కపెట్టి మరో  పది అంటించే రోజుల్లో జీవిస్తున్నాము. తమలపాకుతో ఒకరు సున్నితంగా అంటే ఎదుటివాళ్ళు తలుపు చెక్కతో నాలుగు తగిలిస్తున్నారు. ఏతావాతా సమాజంపై  ఈ వికృత ప్రచార పోకడల ప్రభావం పడుతోంది. ప్రచార కాల  వ్యవధిని కుదిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, దానికి కారణాలు ఏవైనా, అందరూ దాన్ని స్వాగతించడానికి కారణం దూషణ పర్వానికి  కొంతయినా అడ్డుకట్ట పడుతుందనే ఆశతోనే. 
నాయకుల్లో వచ్చిన ఈ మార్పు తాత్కాలికమే కావచ్చు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలకోసమే కావచ్చు.  ఈ మార్పు వారికి తాత్కాలిక లాభాలు తెచ్చిపెట్టవచ్చు, కానీ ప్రజలకు మాత్రం శాశ్విత ప్రయోజనం కలిగిస్తుంది. వారి మనసులు కలుషితం కాకుండా చూస్తుంది.  
ఉద్యమ కాలంలో హైదరాబాదులో ఒక వర్గం వారు ఖేద పడే సంఘటనలు ఎన్నోజరిగాయి. మనసులకు తగిలిన ఆ గాయాలు ఇప్పుడిప్పుడే  మానుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కొందరి మనస్సుల్లో గూడుకట్టుకుని భయపెట్టిన సందేహాలు, ఈ ఇరవై మాసాల వ్యవధిలో పటాపంచలు అయ్యాయని చెప్పలేము కానీ, అవి నిజం కాలేదన్న ఊరట వారికి కలుగుతున్న మాటయితే వాస్తవం. రాష్ట్ర విభజనకు పూర్వం, తెలంగాణా రాష్ట్రము ఏర్పడ్డ తొలినాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడున్న వాతావరణం వేయి రెట్లు నయం. టీఆర్ ఎస్ లో అందరూ కోరుకున్న మార్పు ఇదే. ఆ మార్పు వచ్చినప్పుడు దాన్ని స్వాగతించడం కనీస ధర్మం.
ఈ మార్పు శాస్వితమా, పరమ తాత్కాలికమా అంటే దానికి జవాబు చెప్పాల్సింది కాలమే. కాలమే అన్ని సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు పాత సంగతులను గుర్తు చేసుకుంటూ వుంటే కాలం కూడా ఏమీ చేయలేదు. “బుద్ది బుధవారం దాకా  వుంటే......” అన్న సామెతను మొదట్లోనే ప్రస్తావించడానికి ఇదే కారణం.
అయితే సగటు మనిషి ఆశాజీవి. మనం ఎక్కాల్సిన రైలు టైముకు వస్తుందనీ, ఎదురు చూసే బస్సు వెంటనే వస్తుందనీ, ఆటోవాడు ఎగస్ట్రా డబ్బులు అడగకుండా వస్తాడని ఆశపడకపోతే సామాన్యుడు జీవితంలో నెగ్గుకు రావడం అతి కష్టం.
అల్లాగే, రాజకీయులు, వారి రాజకీయాలు మంచి దిక్కుగా మారతాయనీ, ఆ మార్పు కూడా మారిపోకుండా కలకాలం  నిలబడుతుందనీ ఆశ పడక తప్పదు. లేకుంటే, బతుకు బస్టాండు అంటారు చూసారు, అదే జరిగేది. అదే మిగిలేది.
ఉపశ్రుతి: ఓ సినిమా నిర్మాత రచయితను పిలిచి రెండర్ధాలు వచ్చేట్టు డైలాగులు రాయమని అడిగాడట. ఆ రచయిత చిద్విలాసంగా ఓ నవ్వు  నవ్వి, “ఇప్పుడలా రాసేవాళ్ళు ఫీల్డులో ఎవ్వరూ లేరు, అందరూ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు” అన్నాట్ట.
ఇది ఎన్నికల వేళ.  అలా పరోక్షంగా రెండర్ధాలు వచ్చేట్టు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. యెంత చండాలమయినా  ఏకంగా ప్రసంగాలలో కక్కేయవచ్చు.

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

12, జనవరి 2016, మంగళవారం

బంగారు తల్లి



‘ఇరవై మూడేళ్ళ క్రితం మాస్కో నుంచి తిరిగి వచ్చి మళ్ళీ హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో   నా  మునుపటి ఉద్యోగం- విలేకరిత్వం – (దుష్ట సమాసం కాదుకదా!) లోనే చేరాను. మిగిలిన సహోద్యోగులందరూ పాతవాళ్ళే. ఒక్క స్టెనో  మాత్రం కొత్తమ్మాయి. మొత్తం యూనిట్ లో చిన్నపిల్ల. అక్కడ పనిచేసే మా అందరికీ ఒక చిట్టి చెల్లెలు మాదిరి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రతి తల్లీ,  తండ్రీ  ఇలాటి అమ్మాయి వుంటే బాగుండు అనుకుంటారు. ప్రతి అత్తామామా ఇలాటి కోడలు పిల్ల వుంటే యెంత బాగుంటుందని శైలజను చూడగానే అనుకుంటారు. కానీ అందరికీ అలాటి అదృష్టం వుండదు కదా! అది శైలజ తలితండ్రులకి, శైలజను పెళ్ళాడిన రంగాచారి గారి కన్నవారికీ దక్కింది.  నేను రేడియో విడిచిపెట్టి పుష్కర కాలం గడిచిపోయింది. అయినా శైలజ నా పట్ల, మా ఆవిడ పట్ల చూపించే అభిమానంలో ఇసుమంత తేడా లేదు. పిల్లలు బాగా ఎదిగివచ్చారు. పెద్దవాడు  ఫస్ట్ క్లాస్ బీ టెక్. అమ్మాయి కూడా ఇంజినీరింగు రెండో ఏడాది. తను కూడా ఎం.ఫిల్. చేసిందట. భర్త రంగాచారి గారు,  సచివాలయంలో ఒక మంచి ఉద్యోగి ఎలా ఉంటాడు అన్నదానికి  నిదర్శనంగా వుంటున్నారు.  నిన్న ఎటో వెడుతూ కాసేపు రేడియో స్టేషన్ లో ఆగితే, శైలజ పట్టుబట్టి మా ఆవిడతో దిగిన ఫోటో. నిజానికి రేడియో స్టేషన్ ఆవరణలో ఫోటోగ్రఫీ నిషేధం. అయినా ఆ అమ్మాయి అభిమానం ముందు నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి.

    

11, జనవరి 2016, సోమవారం

కొత్త మనాది



పేర్లు అనవసరం అందుకే ప్రస్తావించడం లేదు. ఈ మధ్య ఓ మిత్రుడు తన అనుభవం పంచుకున్నారు. అమెరికా నుంచి, అక్కడే సెటిల్ అయిపోయిన, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసారు. హైదరాబాదులో వాళ్లకు వున్న పిత్రార్జితం తాలూకు ఇంటిని అమ్మేస్తున్నారట. అందులో  ఒక గది నిండా వాళ్ళ నాన్నగారు సేకరించి పెట్టుకున్న వేలాది పుస్తకాలు వున్నాయట. ఎవరయినా తెలిసినవాళ్ళు అడిగితే ఇవ్వమని  కోరారట. తీరా వెళ్లి చూస్తే వాటిల్లో చాలావరకు అపూర్వమైన గ్రంధాలుట.  ఈయన మనసుపడి వాటిని తన ఇంటికి తెచ్చుకున్నారట. అందుకోసం ఒక గదిని ఖాళీ చేసి మిగిలిన దాంట్లో సర్డుకున్నారట. మంచి పుస్తకాలు అయాచితంగా వచ్చిన మాట నిజమే కానీ, పుస్తకాల మీద తనకున్న ప్రేమ పిల్లలకు వుండకపోతే ఎల్లా అన్నది ఇప్పుడాయన్ని పట్టుకున్న కొత్త మనాది.



NOTE: Courtesy Image Owner

విభిన్న అనుభవం



మొన్న సాయంత్రం అనుకోకుండా ఒక ఆధ్యాత్మిక అనుగ్రహ భాషణ వినే యోగం కలిగింది.  జ్వాలా, ఆయన భార్య విజయలక్ష్మి, వనం రంగారావు భార్య గీత, మా ఆవిడ, ఆవిడతో నేనూ హైదరాబాదు సమీపంలోని  శ్రీ చిన జియ్యర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వుంది. చక్కటి రహదారి సౌకర్యం. మేము వెళ్ళే సరికే స్వామి వారి మంగళా శాసనం మొదలయింది. విశాలమైన ప్రార్ధనా మందిరం. ఆడా మగా అనేకమంది భక్తులు నిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని ఆలకిస్తున్నారు. మధ్యమధ్య సంస్కృత శ్లోకాలు వున్నప్పటికీ స్వామి అనుగ్రహభాషణ యావత్తూ తేట తేట తెలుగులో, తేలికయిన పదాలతో సాగిపోయింది. సుమారు రెండుగంటలకు పైగా ఆయన ప్రసంగించారు. తరువాత  వచ్చిన వారందరూ ఆశ్రమం వారు సమకూర్చిన ప్రమిదెల్లో దీపాలు వెలిగించారు. ఆ సన్నివేశం కనుల విందుగా వుంది. దీప ప్రజ్వలన చేస్తున్న వారిలో మా వాళ్ళు కూడా వున్నారు. ఓ ఆర్ ఆర్  మీదుగా తిరిగి వచ్చేసరికి పదిగంటలు దాటింది.